తెలంగాణ దేశంలో నెంబర్ 1…

తెలంగాణకు  మరొక జాతీయ గుర్తింపు వచ్చింది.

మద్యం సేవించడంలో దేశంలో నెంబర్ వన్ తెలంగాణ మొగోళ్లు.  తెలంగాణ పురుషులే ఇతర రాష్ట్రాల పురుషుల కంటే ఎక్కువ సంఖ్యలో  మందు తాగుతున్నారని  నేషనల్ ఫామిలీ హెల్త్ సర్వే 5 వెల్లడించింది.

రాష్ట్రంలో 15 సంవత్సరాలు పైబడిన  పురుషుల్లో 43.3 శాతం మంది మందు ప్రియులే. ఈ విషయంలో ఏ రాష్ట్రం తెలంగాణకు సాటి లేదు. రెండో స్థానంలో ఉన్నది,  బుడ్డ రాష్ట్రం, సిక్కిం. ఆ రాష్ట్రంలో 41.1శాతం పురుషులు మందు కొడతారు.

మరొక విశేషమేమిటంటే,  తెలంగాణ రాష్ట్రంలో 50.40 లక్షల మంది మందు బాబులున్నారు.  అంటే రాష్ట్రం జనాభాలో 19 శాతం మద్య ప్రియులున్నారన్న మాట. జాతీయ స్థాయి సగటు  కేవలం 17.3 శాతమే.  జాతీయ హోదాకంటే తెలంగాణ ముందుంది. దేశం మొత్తంగా 15.5 కోట్ల మంది మద్యం సేవిస్తారు.

దక్షిణాది  రాష్ట్రాలలో ఏ రాష్ట్రామూ ఈ కొత్త రాష్ట్రానికి ధీటు కాదు.

తమిళనాడులో మందుల బాబులు 15.5 శాతమే. కేరళలో 13.5 శాతం మందు బాబులుంటే, కర్నాటకలో, విచిత్రం, చాలా పూర్. కన్నడిగుల్లో మందుకొట్టే వాళ్లు కేవలం  7.1 శాతమే.

ఇక మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో 65,09,000  మంది మందు బాబులున్నారు. ఇది 17.3 శాతంతో సమానం. ఈ లెక్కన ఆంధ్రోళ్లు తెలంగాణకంటే బాగా వెనకబడినట్లే లెక్క.

ఈ విషయం కేంద్ర సామాజిక న్యాయం సాధికారీకరణ మంత్రిత్వ శాఖ చేసిన సర్వేలో వెల్లడయింది.

అయితే, తెలంగాణా ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఎందుకంటే, దేశంలో లోని పెద్ద పేద రాష్ట్రాలకంటే రిచ్ తెలంగాణ  బాగా వెనకబడి ఉంది,

ఉదాహరణకు మరొక కొత్త రాష్ట్రం చత్తీష్ గడ్ లో మద్య ప్రియులు 43.5శాతం మంది ఉన్నారు.

ఇక ఇతర పెద్ద రాష్ట్రాలలో ఉత్తర ప్రదేశ్ లో 29.5 శాతం, పంజాబ్ లో 25.2 శాతం, ఢిల్లీలో  25 శాతం, గోవాలో 28 శాతం, మధ్య ప్రదేశ్ లో 21.4 శాతం, ఒదిశాలో 18.9 శాతం, పశ్చిమబెంగాల్ లో 18.2 శాతం మంది మద్యం సేవిస్తున్నారు.

పెద్ద రాష్ట్రాలకు సంబంధించి బీహార్ లో మాత్రమే మద్యం సేవించడం బాగా తక్కువ. అక్కడ ఒక శాతం ప్రజలే మందు సేవిస్తారు.

కేంద్ర సామాజిక న్యాయ శాఖ 18-70 సంవత్సరాల మధ్య జనాభాను పరిగణనలోనికి తీసుకుని ఈ సర్వే చేసింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *