“రివర్ బోర్డ్స్ నోటిఫికేషన్ ఒకె, లోపాలు సరిదిద్దితే చాలు”

“కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డుల పరిధి – కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ – పర్యవసానాలు” అంశంపై ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక ఆధ్వర్యంలో నేడు విజయవాడ ప్రెస్ క్లబ్ లో శ్రీ టి.లక్ష్మీనారాయణ అధ్యక్షతన చర్చా వేదిక నిర్వహించబడింది.

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ను వక్తలు స్థూలంగా స్వాగతిస్తూ, ఉన్న లోపాలను సరిదిద్దాలని చర్చల్లో పాల్గొన్న వక్తలు డిమాండ్ చేశారు.

వెలుగొండ ప్రాజెక్టును విభజన చట్టంలోని షెడ్యూల్ 11 జాబితాలో ఉన్న విషయాన్ని సవరణ ద్వారా సరిచేయాలని, బోర్డు ప్రత్యక్ష నియంత్రణ అవసరంలేని వాటిని షెడ్యూల్ -2 నుండి తొలగించాలని, దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేయాలని అభిప్రాయపడ్డారు.

అమలులో ఉన్న బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు అనుగుణంగా నీటి పంపిణీ జరిగేలా యాజమాన్య బోర్డులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, అనుమతులు లేని ప్రాజెక్టులకు అపెక్స్ కౌన్సిల్ అనుమతి తర్వాతే నిర్మాణాలను కొనసాగించేలా కఠినంగా వ్యవహరించాలని, విభజన చట్టం షెడ్యూల్ 11(10)లో పొందు పరచిన జాబితాలోని తెలుగు గంగ, గాలేరు – నగరి, హంద్రీ – నీవా, వెలుగొండ, కల్వకుర్తి, నెట్టంపాడు, అలాగే ఎస్.ఎల్.బి.సి. ప్రాజెక్టులకు నీటిని కేటాయించాలని వక్తలు డిమాండ్ చేశారు.

నాగార్జునసాగర్ కుడి కాలువ పరిధిలోని ప్రకాశం జిల్లా చివరి ఆయకట్టుకు, ఎడమ కాలువ పరిధిలో ఉన్న కృష్ణా మరియు పశ్చిమగోదావరి జిల్లాల్లోని ఆయకట్టుకు, తుంగభద్ర ఎగువ మరియు దిగువ కాలువలకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు అనుగుణంగా నిరందేలా గట్టి చర్యలు తీసుకోవాలని బోర్డును డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను అవకాశంగా తీసుకొని రాజకీయ లబ్ధిపొందే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయకుండా సమస్యల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్ ను సమర్థవంతంగా పని చేయించాలని విజ్ఞప్తి చేశారు.

బచావత్ ట్రిబ్యునల్ తీర్పు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996 జూన్ 16న జారీ చేసిన జీ. ఓ.నెం.69లకు లోబడి, అపెక్స్ కౌన్సిల్ మరియు యాజమాన్య బోర్డుల ఆదేశాలకు కట్టుబడి వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు హితవు పలికారు.

మాజీ మంత్రివర్యులు శ్రీ వడ్డే శోభనాద్రేశ్వరరావు, అంతర్రాష్ట్ర నదీ జలాల సలహాదారు శ్రీ రామకృష్ణ, నాగార్జునసాగర్ ప్రాజెక్టు విశ్రాంత ఎస్.ఈ. శ్రీ యం. వి.కృష్ణారావు, ఏ.ఐ.కె.ఎస్. ఉపాధ్యక్షులు శ్రీ ఆర్.వెంకయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, అధ్యక్షులు శ్రీ కేశవరావు, ప్రధాన కార్యదర్శి శ్రీ సూర్యనారాయణ, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మార్రెడ్డి శ్రీనివాసరెడ్డి, సాగునీటి సంఘాల సమాఖ్య అధ్యక్షులు శ్రీ ఆళ్ల వెంకట గోపాల కృష్ణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ప్రధాన కార్యదర్శి శ్రీ కె.వి.వి.ప్రసాద్, రైతు సంఘాల సమాఖ్య, అధ్యక్షులు శ్రీ ఎర్నేని నాద్రనాథ్, ఎఐటియుసి, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్.రవింద్రనాథ్, ప్రధాన కార్యదర్శి శ్రీ జి.ఓబులేసు, సిపిఐ(యం) రాష్ట్ర నాయకులు శ్రీ వి.కృష్ణయ్య, సిపిఐ, కృష్ణా జిల్లా కార్యదర్శి శ్రీమతి వనజ, సీపీఐ(యం. ఎల్. లిబరేషన్) నాయకులు శ్రీ హరినాథ్, ప్రోగ్రెసివ్ ఫోరమ్, రాష్ట్ర నాయకులు శ్రీ మల్లిఖార్జునరావు, కృష్ణా జిల్లా రైతు సంఘం, అధ్యక్షులు శ్రీ వెలగపూడి ఆజాద్, తదితరులు పాల్గొన్నారు.

(టి.లక్ష్మీనారాయణ,కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *