‘పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ చట్టవ్యతిరేకం కాదని తేలిపోయింది’

(టి లక్ష్మినారాయణ)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగానికి సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులకు అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టబడ్డాయి. బచావత్ ట్రిబ్యునల్ 811 టీఎంసీ కృష్ణా నది నికర జలాలను ప్రాజెక్టుల వారిగా కేటాయించింది. మిగులు జలాలను వినియోగించుకొనే స్వేచ్ఛను బచావత్ ట్రిబ్యునల్ కల్పించడంతో తెలుగు గంగ, గాలేరు – నగరి, హంద్రీ – నీవా, వెలుగొండ, ఎస్.ఎల్.బి.సి., కల్వకుర్తి, నెట్టంపాడు ప్రాజెక్టులు దశాబ్దాలుగా నిర్మాణంలో ఉన్నాయి.

ఈ పూర్వరంగంలో రాష్ట్రం విడిపోయింది. నేడు నదీ జలాల వినియోగంలో రెండు రాష్ట్రాలు వారి వారి హక్కుల పరిరక్షణ కోసం రాజలేని పోరాటం చేయడం సహజం. నేడు అమలులో ఉన్న బచావత్ ట్రిబ్యునల్ తీర్పు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996 జూన్ 16న జారీ చేసిన జీ. ఓ.నెం.69 అమలుకు సహకరిస్తూ, చట్టబద్ధంగా న్యాయ పోరాటం చేసుకొంటే అభ్యంతరం లేదు.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014, విభాగం – 9: నీటి వనరుల నిర్వహణ మరియు అభివృద్ధి. సెక్షన్ – 84 మేరకు గోదావరి మరియు కృష్ణా నదుల నీటి వనరులు మరియు వాటి నిర్వాహణ కోసం యాజమాన్య బోర్డులను, బోర్డుల పనితీరును పర్యవేక్షించడానికి కేంద్ర జలశక్తి మంత్రి చేర్మన్ గా, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ముఖ్యమంత్రులు సభ్యులుగా అపెక్స్ కౌన్సిల్ ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

 అపెక్స్ కౌన్సిల్ బాధ్యతలు: (ఏ) నూతన ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి రాష్ట్రాల నుండి అందిన ప్రతిపాదనలపై యాజమాన్య బోర్డులు నీటి లభ్యతను అధ్యయనం చేసిన మీదట సిఫార్సు చేసిన మరియు కేంద్ర జల సంఘం సిఫార్సు చేసిన ప్రాజెక్టులపై విధాన నిర్ణయం తీసుకోవడం, (బి) నదీ జలాల వినియోగంలో రాష్టాల మధ్య వివాదాలు తలెత్తితే చర్చల ద్వారా పరిష్కారానికి కృషి చేయడం, (సి) కృష్ణా నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ పరిథిలో లేని ఏవైనా వివాదాలను అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కార చట్టం – 1956 మేరకు ఏర్పాటైన ట్రిబ్యునల్ కు అప్పగించడం అపెక్స్ కౌన్సిల్ కర్తవ్యం.

రెండు రాష్ట్రాల ఫిర్యాదుల నేపథ్యంలో అపెక్స్ కౌన్సిల్ రెండు సార్లు; 2016 సెప్టెంబరు 21 మరియు 2020 అక్టోబరు 6న సమావేశమయ్యింది. ఫిర్యాదులపై చర్చించి, కొన్ని నిర్ణయాలు తీసుకున్నది.

కేంద్ర జల వనరుల శాఖ అదనపు కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నీటి పారుదల శాఖల ముఖ్యకార్యదర్శులు 2015 జూన్ 18 & 19 తేదీలలో సమావేశమై బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా కేటాయించిన మరియు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం చేసిన రెండు సర్దుబాట్లు, (1) భీమాకు 20 టీఎంసీ, (2) శ్రీశైలం కుడి బ్రాంచి కాలువకు 19 టీఎంసీలను పరిగణనలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ 512 టీఎంసీ, తెలంగాణ 299 టీఎంసీలు వినియోగించుకోవాలన్న నిర్ణయం తీసుకున్నది. ప్రాజెక్టుల వారిగా నీటి కేటాయింపుల జాబితాను కూడా మినిట్స్ కు జత చేయడం జరిగింది.


2021 జులై 26 న విజయవాడ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక చర్చా వేదికలో ప్రవేశ పెట్టిన పత్రం


ఆ నిర్ణయం సముచితమైనది. కానీ, తెలంగాణ ప్రభుత్వం, అది తాత్కాలికమైనదని వక్రీకరిస్తున్నది. కృష్ణా డెల్టా ఆధునికీకరణ ద్వారా ఆదా అయ్యే 29 టీఎంసీలలో 20 టీఎంసీలను భీమా ప్రాజెక్టుకు సర్దుబాటు చేశారని, కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనులు ఇంకా పూర్తి కాకుండానే ఆ 20 టీఎంసీలను తెలంగాణ ఖాతాలో జమ చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకిస్తే, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చే వరకే కదా! అన్న ఉద్దేశ్యంతో ఒక ఏడాదికే అన్న మాటలను పట్టుకొని “తాత్కాలికం” అంటూ తెలంగాణ ప్రభుత్వం వక్రీకరిస్తూ, ప్రాజెక్టుల వారిగా కేటాయింపులు జరగలేదని, ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసిన మీదటనే యాజమాన్య బోర్డుల పరిధులను నిర్ణయించి, నోటిఫికేషన్ జారీ చేయాలని అడ్డగోలుగా వాదిస్తున్నది.

అమలులో ఉన్న బచావత్ ట్రిబ్యునల్ తీర్పును, రెండు రాష్ట్రాల మధ్య 2015 జూన్ 18 &19 తేదీలలో జరిగిన సమావేశం నిర్ణయాన్ని అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అవరోధాలు కల్పిస్తున్నది. కొత్త ట్రిబ్యునల్ ను నియమించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

ఒకవైపున బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు సుప్రీంకోర్టు ముందు పెండింగ్ లో ఉన్నది. ఈ నేపథ్యంలో కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుకు అంతర్రాష్ట్ర నది జలాల వివాదాల చట్టం – 1956 అనుమతిస్తుందా? అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం -1956కు చేసిన సవరణ అనుమతిస్తుందా? కృష్ణా నది పరివాహక ప్రాంతంలో నాలుగు రాష్ట్రాలున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అంగీకరిస్తాయా? రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మాత్రమే ట్రిబ్యునల్ వేయడం సాధ్యమా? అందుకే, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విజ్ఞప్తిపై కేంద్ర న్యాయ శాఖ అభిప్రాయాన్ని కోరినట్లు సమాచారం.

తెలంగాణ ప్రభుత్వం మరొకవైపు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలను 50:50 నిష్పత్తిలో కేటాయించాలంటూ అసంబద్ధమైన డిమాండ్ చేస్తూ కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఉత్తరం వ్రాసింది. నీళ్లను కేటాయించేది ట్రిబ్యునల్ మాత్రమే. కేంద్ర ప్రభుత్వం/అపెక్స్ కౌన్సిల్ /యాజమాన్య బోర్డు కాదు.

కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) అనుమతులు లేని, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – షెడ్యూల్ 11లో పొందుపరచని ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డిపిఆర్)లను సమర్పించాలని రెండవ అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్ణయం చేసింది. వాటిలో పాలమూరు – రంగరెడ్డి, రాయలసీమ ఎత్తిపోతల పథకాలతో పాటు కృష్ణా, గోదావరి నదులపై నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదిత ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ నిర్ణయాన్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయలేదు.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 సెక్షన్ 85(2) ప్రకారం గోదావరి నది యాజమాన్య బోర్డు కార్యాలయం తెలంగాణలో, కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలి. యాజమాన్య బోర్డులను ఏర్పాటు చేసి ఆరేళ్ళు గడిచిపోయినా కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల కార్యాలయాలు రెండు కూడా హైదరాబాదు నుండే పని చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ అలసత్వానికి ఇది ప్రబల నిదర్శనం. కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నానికి తరలించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు చేయడం అత్యంత గర్హనీయం. తక్షణం కర్నూలుకు బోర్డు కార్యాలయాన్ని తరలించాలి.

సెక్షన్ 85(3) ప్రకారం కేంద్ర ప్రభుత్వం యొక్క పరిపాలనా నియంత్రణలో, కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఆదేశాలకు అనుగుణంగా, యాజమాన్య బోర్డులు స్వయం ప్రతిపత్తితో పని చేస్తాయి.

సెక్షన్ 85(7) ప్రకారం ప్రతి బోర్డుకు జలాశయాల రోజు వారి నిర్వహణకు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాల చట్టం – 1968 క్రింద ఏర్పాటు చేసిన భద్రతా దళాలు సహాయపడతాయి.

సెక్షన్ 87 – బోర్డుల పరిధి:

గోదావరి మరియు కృష్ణా నదులకు సంబంధించిన ప్రాజెక్టుల హెడ్ వర్క్స్( బ్యారేజీలు, డ్యామ్స్, జలాశయాలు, నియంత్రణ నిర్మాణాలు), కెనాల్ నెట్ వర్క్ లోని భాగం మరియు సంబంధిత రాష్ట్రాలకు నీటిని, విద్యుత్తును సరఫరా చేసే మార్గాలను, అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం – 1956 మేరకు ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్స్ ఇచ్చిన తీర్పులకు లోబడి కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన మేరకు కర్తవ్య నిర్వహణ చేయాలి.

(1) 2021 జులై 15న కేంద్ర ప్రభుత్వం గజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబరు 14 నుండి అమలులోకి వస్తుందని ప్రకటించింది. కృష్ణా, గోదావరి నదీ జలాలపై బచావత్ ట్రిబ్యునల్స్ ఇచ్చిన తీర్పుల మేరకు నికర జలాలను కేటాయించిన భారీ, మధ్య తరహా ప్రాజెక్టులన్నింటినీ యాజమాన్య బోర్డు పరిధిలోకి తెస్తూ షెడ్యూల్ -1లో పొందుపరచింది. అలాగే , ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014 షెడ్యూల్ – 11 లో పొందుపరచిన ప్రాజెక్టులు పేర్కొనబడ్డాయి. ఆ విషయాన్ని కూడా ప్రస్తావించారు. మెరుగైన నిర్వహణ సౌలభ్యం కోసమేనంటూ బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్, అవుక్ రిజర్వాయరు వరకు శ్రీశైలం కుడి బ్రాంచి ప్రధాన కాలువ, తెలుగు గంగలో అంతర్భాగమైన వెలుగోడు రిజర్వాయరు, నిప్పులవాగు సంతజూటూరు ఆనకట్ట వరకు బోర్డు పరిధిలోకి తెచ్చారు. అనుమతిలేని, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను జాబితాలో చేర్చారు.

(2) కేంద్ర ప్రభుత్వం ఆరేళ్ళు జాప్యం చేసి గజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పర్యవసానంగా రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. నాగార్జునసాగర్ వద్ద రెండు రాష్ట్రాల పోలీసులు ఘర్షణపడ్డారు. శ్రీశైలం వద్ద అలాంటి ఘర్షణ వాతావరణం నెలకొన్నది. కృష్ణా నది యాజమాన్య బోర్డు ఆదేశాలను ఖాతరు చేయకుండా శ్రీశైలం జలాశయం కనీస నీటి మట్టం 834 అడుగులకు నీరు చేరక ముందే 800 అడుగులకు లోపు నీరున్నప్పుడే తెలంగాణ ప్రభుత్వం జలవిద్యుదుత్పత్తి చేసింది. పోలీసులను మోహరించి శ్రీశైలంతో పాటు నాగార్జునసాగర్, పులిచింతల వద్ద కూడా విద్యుదుత్పత్తిని కొనసాగించింది.

అమలులో ఉన్న బచావత్ ట్రిబ్యునల్ తీర్పును, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996 జూన్ 16న జారీ చేసిన జి.ఓ.నెం.69, అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాలను, బోర్డు ఆదేశాలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధమైన వైఖరి పూర్వరంగంలో గజిట్ నోటిఫికేషన్ సమర్థనీయం.

(3) వెలుగొండ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, షెడ్యూల్ – 11(10) జాబితాలో ఉన్న విషయాన్ని ప్రస్తావించక పోవడం గజిట్ నోటిఫికేషన్ రూపొందించడంలో కేంద్ర జలశక్తి శాఖ అధికారులు బాధ్యతారాహిత్యం కొట్టొచ్చినట్లు కనబడుతున్నది. ఆ పొరపాటును తక్షణం సరిదిద్దుతూ గజిట్ నోటిఫికేషన్ కు సవరణ చేయాలి.

(4) చెన్నయ్ నగరానికి త్రాగునీరు, ఎస్.ఆర్.బి.సి., కె.సి.కెనాల్(నిప్పులవాగు), తెలుగు గంగ, గాలేరు – నగరి ప్రాజెక్టులకు సాగునీటిని శ్రీశైలం జలాశయం నుండి తరలించే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరును బోర్డు పరిధిలో ఉంచితే సరిపోతుంది. “బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్, అవుక్ వరకు ఎస్.ఆర్.బి.సి. ప్రధాన కాలువ, వెలుగోడు జలాశయం, నిప్పులవాగు సంతజూటూరు ఆనకట్ట వరకు” భాగాలను మినహాయిస్తూ గజిట్ నోటిఫికేషన్ కు సవరణ చేయాలి.

(5) ట్రిబ్యునల్ కేటాయింపులు లేని, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, షెడ్యూల్ – 11(10) జాబితాలో లేని, అనుమతులులేని ప్రాజెక్టులను/ పథకాలను కూడా జాబితాలో చేర్చారు. అనుమతులు లేని ప్రాజెక్టులకు ఆరు నెలల్లో డిపిఆర్ లు సమర్పించి, అనుమతులు పొందాలి లేదా నిర్మాణాలను ఆపేయాలని షరతు విధించబడింది. గజిట్ నోటిఫికేషన్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం కృష్ణా మరియు గోదావరి నదులు మరియు వాటి ఉప నదులపై నిర్మిస్తున్న పాలమూరు – రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ళ, భక్తరామదాసు, నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచుతున్న కాల్వకుర్తి, నెట్టంపాడు, ఎస్.ఎల్.బి.సి., కాళేశ్వరం (రోజుకు అదనంగా ఒక టియంసిని తరలించే ఎత్తిపోతల పథకం), రామప్ప లేక్, కాంతానపల్లి బ్యారేజీ, తుపాకులగూడెం బ్యారేజీ, సీతారామ ఎత్తిపోతల, ప్రాణహిత ఎత్తిపోతల, తదితర ప్రాజెక్టులకు డిపిఆర్ లు సమర్పించి, అనుమతులు పొందిన తర్వాతే నిర్మాణ పనులను కొనసాగించుకోవాలి.

అలాగే, ఆంధ్రప్రదేశ్ లో వినియోగంలో ఉన్న ముచ్చుమర్రి, నిర్మాణంలో ఉన్న చింతలపూడి ఎత్తిపోతల, వెంకటానగరం పథకానికి డిపిఆర్ లు సమర్పించి, అనుమతులు పొందాలి. పట్టిసీమ మరియు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలకు అనుమతులు లేవని పేర్కొంటూనే పోలవరం ప్రాజెక్టు ఆపరేషన్ లోకి రాగానే మూసివేయడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని కూడా పేర్కొన్నారు. ఇవన్నీ సమర్థనీయమే! దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నీటి హక్కుల రక్షణకు దోహదపడే చర్యలే.

(6) ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, షెడ్యూల్ -11(10) జాబితాలో చేర్చిన ప్రాజెక్టులకు రక్షణ ఉన్నది. వాటిని మిగులు జలాల ఆధారంగా, బచావత్ ట్రిబ్యునల్ కల్పించిన స్వేచ్ఛను ఉపయోగించుకొని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మాణం చేపట్టింది. వాటి నిర్మాణాలను పూర్తి చేయాలని విభజన చట్టంలో విస్పష్టంగా పేర్కొనబడింది. ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టుల సమస్యను పరిష్కరించాలని బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ గడువును పెంచి కేంద్ర ప్రభుత్వం బాధ్యతను అప్పగించింది. ఆ అంశం ప్రస్తుతం బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు విచారణలో ఉన్నది.

మిగులు జలాల ఆధారంగా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టులకు పర్యావరణ మరియు అటవీ అనుమతులు కూడా మంజూరు చేయబడ్డాయి. నికర జలాల కేటాయింపు లేదు కాబట్టి కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) అనుమతి లేదు. అందువల్లనే అనుమతిలేని ప్రాజెక్టుల జాబితాలో గెజిట్ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అంతే కానీ, ఆ ఆరు ప్రాజెక్టులకు ఎలాంటి ప్రమాదం లేదు. నిర్మాణాలను కొనసాగించవచ్చు. ఆ విషయాన్ని విభజన చట్టంలోనే పేర్కొన్నారు. గజిట్ నోటిఫికేషన్ విభజన చట్టానికి లోబడే అమలు చేయబడుతుంది.

(7) యాజమాన్య బోర్డుల ప్రత్యక్ష నియంత్రణలో ఉండే భారీ నీటి పారుదల ప్రాజెక్టుల హెడ్ వర్క్స్( బ్యారేజీలు, డ్యామ్స్, జలాశయాలు, నియంత్రణ నిర్మాణాలు), కెనాల్ నెట్ వర్క్ లోని భాగం మరియు సంబంధిత రాష్ట్రాలకు నీటిని, విద్యుత్తును సరఫరా చేసే మార్గాల జాబితా షెడ్యూల్ – 2లో పొందుపరచబడింది. ఇందులో జూరాల, శ్రీశైలం, శ్రీశైలం జలాశయం ఆధారంగా నిర్మించబడిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ – నీవా, వెలుగొండ, ముచ్చుమర్రి, కల్వకుర్తి, శ్రీశైలం ఎడమ బ్రాంచి కాలువ(ఎస్.ఎల్.బి.సి.), నాగార్జునసాగర్ జలాశయం, నాగార్జునసాగర్ ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఆంద్రప్రదేశ్ లోని కృష్ణా మరియు పశ్చిమగోదావరి జిల్లాలలోని ఆయకట్టుకు నీటిని విడుదల చేసే నిర్మాణాలను, నాగార్జునసాగర్ జలాశయం ఆధారంగా నిర్మించబడిన మాధవరెడ్డి ఎత్తిపోతల పధకం, పులిచింతల జలాశయం మరియు ప్రకాశం బ్యారేజీ, తుంగభద్ర ఎగువ కాలువ మరియు దిగువ కాలువ, రాజోలు బండ మల్లింపు పథకం(ఆర్డీఎస్), సుంకేసుల ఆనకట్ట(కె.సి.కెనాల్) ఉన్నాయి.

తుంగభద్ర డ్యాం నుండి తుంగభద్ర ఎగువ కాలువ(హెచ్.ఎల్.సి.), దిగువ కాలువ(ఎల్.ఎల్.సి.), నాగార్జునసాగర్ కుడి కాలువ పరిధిలోని ప్రకాశం జిల్లా ఆయకట్టుకు, ఎడమ కాలువ పరిధిలోని కృష్ణా మరియు పశ్చిమ గోదావరి జిల్లాలలోని ఆయకట్టుకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు అనుగుణంగా నీరు అందుతున్నాదో! లేదో! బోర్డుకు ఇకపై పూర్తి సమాచారం నేరుగా అందే అవకాశం ఉంటుంది.

(8) షెడ్యూల్ – 3లో పొందుపరచిన ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణ, నియంత్రణలోనే ఉంటాయి. యాజమాన్య బోర్డులు పర్యవేక్షణ మాత్రమే చేస్తాయని పేర్కొనబడింది.

(9) పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను ఆమోదించిన(అప్రూవ్డ్) జాబితాలో చేర్చారు. తద్వారా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ చట్టవ్యతిరేకమైనదని, అక్రమ నిర్మాణమని దుష్ప్రచారం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, రాజకీయ పార్టీలకు, వ్యక్తుల నోళ్ళకు తాళం వేసినట్లుగా భావించాలి.

(10) గోదావరి నది, దాని ఉపనదులపై నిర్మించబడి వినియోగంలో ఉన్న మరియు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను/ఎత్తిపోతల పథకాలను, ఆనకట్టలను గజిట్ నోటిఫికేషన్ లోని షెడ్యూల్ – 1లో పొందుపరచారు. షెడ్యూల్ – 2లో బోర్డు నిర్వహణ మరియు నియంత్రణ పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులను పేర్కొన్నారు. షెడ్యూల్ -3లో రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ మరియు నిర్వహణలోను, బోర్డు పర్యవేక్షణ మాత్రమే చేసే ప్రాజెక్టుల జాబితాను పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ కు మేలు చేకూర్చే రెండు ప్రధానమైన సానుకూల అంశాలు అందులో ఉన్నాయి. (1) అనుమతులు లేకుండా ప్రాజెక్టులను నిర్మించి, వందలాది టీఎంసీల నీటిని వాడుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట పడుతుంది. (2) పట్టిసీమ ద్వారా తరలిస్తున్న నీటిలో వాటా ఇవ్వాలంటూ తెలంగాణ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల పథకాల ద్వారా గోదావరి బేసిన్ నుండి కృష్ణా బేసిన్ కు నీటిని తరలించే అంశాన్ని పేర్కొనడం సానుకూలాంశం. పట్టిసీమ, పురుషోత్తపట్నం తాత్కాలికమని గెజిట్ నోటిఫికేషన్లోనే పేర్కొన్నారు. కానీ, తెలంగాణ ప్రాజెక్టుల ద్వారా నీటి తరలింపు శాశ్వత ప్రాతిపధికన జరుగుతుంది. భవిష్యత్తులో పోలవరం, చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తరలించినప్పుడు ఈ అంశాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. గోదావరి నది జలాల పంపిణీ అంశంపై ట్రిబ్యునల్ ను నియమించడానికి రెండు రాష్ట్రాలు అపెక్స్ కౌన్సిల్ లో అంగీకరించిన విషయం అందరికీ విధితమే.

X. స్థూలంగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గజిట్ నోటిఫికేషన్ ఎగువ రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వం దూకుడుకుగా వ్యవహరించకుండా, దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులకు రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది. యాజమాన్య బోర్డులు ఎంత సమర్థవంతంగా భవిష్యత్తులో పని చేస్తాయన్న దానిపై సమస్యల పరిష్కారం ఆధారపడి ఉంటుంది.


(టి. లక్ష్మీనారాయణ, కన్వీనర్,
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక )

One thought on “‘పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ చట్టవ్యతిరేకం కాదని తేలిపోయింది’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *