భాషా శాస్త్రవేత్త జీఎన్ రెడ్డికి నివాళి, నేడు ఆయన 32వ వర్ధంతి

(రాఘ‌వ శ‌ర్మ‌)

ఆచార్య జిఎన్ రెడ్డి  తెలుగు భాష‌కు మ‌రిచిపోలేని ఒక మంద‌హాసం. నిఘంటువుల‌ను నిర్మించారు. పీఠిక‌ల‌ను రాశారు.
ప‌రిశోధ‌న‌లు చేశారు. తెలుగు భాష‌కు ఆధునిక‌త‌ను అద్ది ప్రాణ‌ప్ర‌తిష్ట చేశారు.

విశ్వ‌విద్యాల‌యాల్లో వ్య‌వ‌హారిక భాష‌ను భుజానికెత్తుకు తిరిగారు. అయినా ఆయ‌న ఒక మిత భాషి. స‌న్న‌గా, పొట్టిగా ఉన్నా భాష విష‌యంలో  చాలా గ‌ట్టి  మ‌నిషి.

ఆ మ‌హానుభావుడు 1989 జూన్ 13వ తేదీన ఈ లోకాన్ని వీడి వెళ్ళి పోయారు.వీసీ అయిన తొలి తెలుగు అధ్యాప‌కుడు జీఎన్ రెడ్డి. ఎస్వీ యూనివ‌ర్సిటీకి 1984-87 మ‌ధ్య వైస్ చాన్స్‌ల‌ర్‌గా ప‌నిచేశారు.

ఆ త‌రువాతే సి.నారాయ‌ణ రెడ్డి వైస్ చాన్స‌ల‌ర్ అయ్యారు. పింగ‌ళి ల‌క్ష్మీ కాంతం, రాయ‌ప్రోలు  సుబ్బారావు, భూప‌తి ల‌క్ష్మినారాయ‌ణ వంటి మ‌హామ‌హులు ప‌నిచేసిన ఎస్వీ  యూనివ‌ర్సిటీ తెలుగు శాఖ బాధ్య‌త‌ను జీఎన్‌రెడ్డి తీసుకున్నారు.

తెలుగు భాషాభివృద్ధికి జీవ‌ధాతువుగా ప‌నిచేశారు.ఇర‌వ‌య్య‌వ శ‌తాబ్దం తొలి నాళ్ళ‌లో గిడుగు రామ్మూర్తి పంతులు  వ్య‌వ‌హారికా భాషా ఉద్య‌మానికి శ్రీ‌కారం చుట్టారు. కానీ,  ఆ ఉద్య‌మ స్పూర్తి విశ్వ‌విద్యాల‌యాల‌ త‌ల‌కు ఎక్క‌లేదు.

తెలుగు ప‌రిశోధ‌నా వ్యాసాల‌న్నీ 1980వ ద‌శ‌కం వ‌ర‌కు  గ్రాంథిక భాష‌లోనే సాగేవి. వాటిని ఆధునిక ప్రామాణిక భాష‌లో రాయ‌డానికి అనుమ‌తించాల‌ని జీఎన్ రెడ్డి పోరాడి సాధించారు.

ఆయ‌న మార్గ ద‌ర్శ‌క‌త్వంలోనే మ‌ద్దూరు సుబ్బారెడ్డి 1982లో ‘తెలుగు జాతీయోద్య‌మ క‌విత్వం’ పైన ఆధునిక ప్రామాణిక భాష‌లో ప‌రిశోధ‌నా వ్యాసం స‌మ‌ర్పించారు. ఆధునిక ప్రామాణిక భాష‌లో వ‌చ్చిన తొలి తెలుగు ప‌రిశోధ‌నా వ్యాసంగా అది నిలిచిపోయింది. మిగ‌తా విశ్వ‌విద్యాల‌యాల‌కు కూడా అది మార్గ‌ద‌ర్శ‌క‌మైంది.

‘మ‌న ఆలోచ‌న‌లు, అభిప్రాయాలు ఆధునిక‌మైన‌ప్పుడు మ‌నం మాట్లాడే భాష కూడా ఆధునీక‌ర‌ణ పొంద‌క త‌ప్ప‌దు’ అంటారు జీఎన్ రెడ్డి. తెలుగు శాఖ ఆరోజుల్లో ప్రాచీన కావ్య ప్ర‌బంధాలు, చంద‌స్సు, వ్యాక‌ర‌ణం బోధించ‌డానికి ప‌రిమిత‌మైంది.

ఆధునిక అవ‌స‌రాల‌కు అనుగుణంగా 1981లో  తెలుగు అధ్య‌య‌న శాఖ‌గా దాన్నిమార్చారు. పాఠ్యాంశాల‌లో క‌థ‌, న‌వ‌ల‌, జాన‌ప‌ద సాహిత్యం,  ప్ర‌తికా ర‌చ‌న‌, అనువాదం, సామాజిక, సాంస్కృతిక‌ చ‌రిత్ర‌ను ప్ర‌వేశ పెట్టారు.

ఇది మిగ‌తా విశ్వ‌విద్యాల‌యాల‌కు మార్గ‌ద‌ర్శ‌క‌మైంది. వ‌ర్త‌మాన స‌మాజ అవ‌స‌రాల‌కు అనుగుణ‌మైన నూత‌న ప‌రిశోధ‌నామార్గాలను జీఎన్ రెడ్డి అన్వేషించారు. ఆయ‌న త‌యారు చేసిన తెలుగు-తెలుగు నిఘంటువు, ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు, ప‌ర్యాయ‌ప‌ద నిఘంటువు ఇప్పటికీ ప్ర‌మాణిక‌మైన‌వే. మాండ‌లిక వృత్తి ప‌ద‌కోశాల‌కు శ్రీ‌కారం చుట్టారు.

తొలి తెలుగు పత్రికా భాష‌పైన కూడా వీరు ప‌రిశోధ‌న చేయించారు. తెలుగులో తొలిత‌రం పీఠికా ర‌చ‌యిత‌లుగా క‌ట్ట‌మంచి రామ‌లింగారెడ్డి, రాళ్ళ‌ప‌ల్లి అనంత కృష్ణ శ‌ర్మ ప్ర‌సిద్ధులు. రెండ‌వ త‌రంలో శ్రీ‌శ్రీ‌,  కుందుర్తి, రారా కాగా, మూడ‌వ త‌రంలో జీఎన్ రెడ్డి వ‌స్తారు.

సంప్ర‌దాయ భాషా సాహిత్యాల పైన వీరికి ఎంత ప‌ట్టు ఉందో, ఆధునిక భాషా సాహిత్యాల‌పైన కూడా అంత ప‌ట్టుఉంది.  ప‌ద‌హార‌వ శ‌తాబ్దంలో అన్న‌మ‌య్య కుమారుడు పెద‌ తిరుమ‌లాచార్యులు వ్య‌వ‌హారిక భాష‌లో రాసిన ‘శ్రీ‌భ‌గ‌వ‌ద్గీత ‘ వ్యాఖ్యానాన్ని జీఎన్ రెడ్డి ప‌రిష్క‌రించారు.

ఇది భ‌గ‌వ‌ద్గీతకు తొలి తెలుగు వ్య‌ఖ్యాన గ్రంథమే కాకుండా, తొలి వేదాంత గ్రంథం కూడా. ఈ గ్రంథానికి ఉన్న‌ ఎనిమిది తాళ‌ప‌త్ర ప్ర‌తుల‌ను సేక‌రించి ప‌రిష్క‌రించారు.

ప‌ద‌హార‌వ శ‌తాబ్దంనాటి వ్య‌వ‌హారికా భాషా స్వ‌రూపాన్ని తెలుసుకోడానికి ఈ గ్రంథం ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ గ్రంథానికి జీఎన్ రెడ్డి రాసిన సుదీర్ఘ పీటిక‌లో అనేక భాషా విష‌యాల‌ను చ‌ర్చించారు.

ప్రాచీన‌, ఆధునిక భాష‌, సాహిత్యం రెంటిలోనూ పాండిత్య‌మున్నందునే జీఎన్ రెడ్డి ఈ గ్రంథాన్ని ప‌రిష్క‌రించ‌గ‌లిగారు. జిఎన్ రెడ్డి ఉన్న‌త  చ‌దువంతా మద్రాసులోనే సాగింది.

అక్క‌డ గిడుగు సీతాప‌తి, మ‌ల్లంప‌ల్లి సోమ‌శేఖ‌ర శ‌ర్మ‌, ఖాసా సుబ్బారావు వంటి మ‌హామ‌హుల‌తో ఏర్ప‌డిన ప‌రిచ‌యాలు ఆయ‌న వ్య‌క్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. పాండిత్యం క‌న్నా ప్ర‌వ‌ర్త‌న‌, స‌హృద‌య‌త‌, నిరాడంబ‌ర‌త‌, మాన‌వ‌త ముఖ్య‌మంటారాయ‌న‌. వివిధ దృక్ప‌థాల‌కు చెందిన క‌వులు, ర‌చ‌యిత‌ల‌ను ఆహ్వానించి, తెలుగు అధ్య‌య‌న శాఖ‌ను వారికొక వేదిక‌గా చేశారు.

స‌మాజానికి ఒక షాక్‌ట్రీట్‌మెంట్ ఇచ్చి వెళ్ళిపోయినా దిగంబ‌ర క‌వుల‌ను కూడా తొలిసారిగా విశ్వ‌విద్యాల‌యానికి పిలిపించి వారి చేత ఉప‌న్యాసాలిప్పించిన సాహ‌సి.

జీఎన్ రెడ్డి ఏది చెప్పినా కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్ప‌డం ఆయ‌న‌లోని వాస్త‌విక‌త‌కు నిద‌ర్శ‌నం. ఇదే ఆయ‌న ప‌రిశోధ‌న‌లకు పునాది వేసింది. జీఎన్ రెడ్డి శిష్యులు అనేక మంది భాషా సాహిత్య రంగాల‌లో ప్ర‌సిద్ధులు. కానీ, ఆయ‌న‌ శిష్యులు ఎంత‌టి వారైనా వారిని త‌న‌ శిష్యులుగా చెప్పుకునే వారు కాదు.

జీఎన్ రెడ్డికి 60 ఏళ్ళు నిండిన సంద‌ర్భంగా ఎస్వీయూనివ‌ర్సిటీ ఆడిటోరియంలో  ష‌ష్ట్య‌బ్ది స‌భ జ‌రిగింది. ఈ స‌భ‌లో మిల్టానియ‌న్ అవార్డు గ్ర‌హీత‌, ఇంగ్లీషు ప్రొఫెస‌ర్ రామ శ‌ర్మ మాట్లాడారు. చాలా మంది ఇంగ్లీషు ప్రొఫెస‌ర్ల‌కంటే జీఎన్ రెడ్డి మంచి ఇంగ్లీషు మాట్లాడ‌తారు, మంచి  ఇంగ్లీషు రాస్తారు అన్నారు.

జీఎన్ రెడ్డికున్న ఇంగ్లీషు భాషా పాండిత్యాన్ని ప‌ట్టిచ్చిన మాట‌లివి. జీఎన్ రెడ్డి మంచి స్నేహశీలి. వ‌యో బేధం లేకుండా చాలా స‌ర‌దాగా, హాయిగా మాట్లాడేవారు.

వారు పోయి మంగ‌ళ‌వారానికి అప్పుడే 32 ఏళ్ళు పూర్తి అవుతోంది. వారితో ఇంకా నిన్న‌గాక మొన్న మాట్టాడిన‌ట్టే ఉంది.

ప్రొఫెసర్ జిఎన్ రెడ్డిగాని అందరికి పరిచమయినా ఆయన  పూర్తి పేరు చాలామందికి తెలియదు. పూర్తి పేరు గోళ్ళ నారాయణ స్వామి రెడ్డి.

(ఆలూరు రాఘవ శర్మ, సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *