న్యాయవ్యవస్థ పతనానికి సాక్ష్యం ఆయన మరణం

 భారత్ లో “మిట్టమధ్యాహ్నం చిమ్మచీకటి’

 -అజిత్ ప్రకాశ్ షా, (ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, లా కమిషన్ మాజీ చైర్మన్)

అనువాదం : రాఘవ శర్మ

‘మిట్ట మధ్యాహ్నం చిమ్మచీకటి’ (Darkness at Noon) నవలను 81 సంవత్సరాల క్రితం ఆర్డర్ కేస్ట్ లర్  (Artheer Koestler) రచించాడు.

స్టాలిన్ నాయకత్వంలోని సోవియట్ యూనియన్లో, 1930 ప్రాంతంలో జరిగిన  ప్రక్షాళన దారుణాల నేపథ్యంగా ఈ నవల సాగుతుంది. రాజకీయ అణచివేత, పోలీసుల వ్యవహార సరళి, ప్రతిపక్షాలపై అనుమానం, శిక్షలు, ఉరితీతలు వంటి అనేక అంశాలకు గుర్తుగా ఆ కాలం మిగిలిపోయింది.

Koestler – Darkness At Noon

దశాబ్దాల తరువాత, ముంబయిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఫాదర్ స్టాన్ స్వామి మృతితో భారత దేశంలో కూడా ‘మిట్టమధ్యాహ్నం చిమ్మచీకటి’ అలుముకుంది. ఈ నవలలో కేస్ట్ లర్ సృష్టించిన భయంకరమైన పదాలను స్టాన్ స్వామి మరణం గుర్తుకు తెస్తుంది.

అధికసంఖ్యాక వర్గ ఆధిపత్యం సృష్టించిన దారుణాలు, సహజన్యాయం పట్ల గౌరవం లేని ఫలితమే స్టాన్ స్వామి మరణం. చాలా విషయాలకు ప్రేరణగా స్టాన్‌స్వామి గుర్తుకు వస్తాడు.

ఆయన  ఒక పరిత్యాగి అయిన మత బోధకుడు మాత్రమే కాదు, జార్ఖండ్ రాష్ట్రంలో పీడిత వర్గాలకు బాసటగా జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి. కేవలం ఒకే ఒక్క గదిలో నివసిస్తూ, దాదాపు 70 పుస్తకాలను రచించి ప్రజలకు ప్రేరణ కలిగించాడు. తన జీవితంలో ఎక్కువ భాగం ప్రజాసేవలోనే గడిపాడు.

పీడిత ప్రజల హక్కుల కోసం చట్టాన్ని ఆసరా చేసుకుని పోరాడాడు.విచారణలో ఉన్న ఖైదీలకు న్యాయం చూకూర్చడానికి జార్ఖండ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలను నడిపాడు. ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు తాను విశ్వసించిన వ్యవస్తే తన భవిష్యత్తును ఇలా నిర్ణయిస్తుందని ఊహించలేకపోయాడు.

పూనే పోలీసులు 2018 లోనే స్టాన్‌స్వామి గదిపై దాడి చేసి కంప్యూటర్‌ను, సెల్ ఫోన్ ను, పుస్తకాలను, శాస్త్రీయ సంగీత క్యాసెట్లను స్వాధీనం చేసుకున్నారు. మరొక సారి 2019లో కూడా దాడి చేశారు.

చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద చివరగా 2020 అక్టోబర్ 8వ తేదీన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ(ఎన్ఏఏ) ఆయన్ను అరెస్టు చేసింది. భీమా కోరేగాన్ కేసులో అరెస్టయిన 16 మంది ప్రొఫెసర్లు, రచయితలు, కార్యకర్తలు, మేధావుల జాబితాలో స్టాన్ స్వామి కూడా ఉన్నాడు.

ఎనభై సంవత్సరాలు దాటిన స్వామి మరణించేవరకు రిమాండు ఖైదీగానే ఉన్నాడు. ఆ వయసులో భారతదేశంలో తీవ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్నాడనే అసంబద్ధ ఆరోపణలతో ఆయనను అరెస్టు చేశారు.

ఆయన్ని నిర్బంధించడంలో పోలీసుల ద్వారా ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ ఎలా వ్యవహరించాయనేది ఒక విషాదం. ఈ కేసులో అరెస్టైన సుధా భరద్వాజ్, వరవరరావు లాగానే, కొన్ని ప్రచార సామాగ్రి ఆయన వద్ద లభించాయని, కొందరు కార్యకర్తలతో సంబంధాలున్నాయని నాటకీయ ఆరోపణలతో స్టాన్ స్వామి అరెస్టు ను సమర్థించు కున్నారు. వీరిపై ఆరోపణలకు ఆధారాలుగా చూపిస్తున్న డాక్యుమెంట్ల విశ్వసనీయతను అంతర్జాతీయ ఫోరెన్సిక్ డేటా నిపుణులు అనుమానిస్తున్నారు.

ఇలాంటి వన్నీ విచారణ సందర్భంగా తేల్చాలని, అప్పటి వరకు నిందితులైన స్టాన్ స్వామి తదితరులు జైలులోనే ఉండాలని ప్రభుత్వం వాదించింది. ఇది ‘వాటాలి’ తీర్పుతో వచ్చిన సమస్య. దీనిని తరువాత చర్చిస్తాను.

ఆరోగ్యం బాగుండలేదని స్టాన్ స్వామి అనేక మార్లు విజ్ఞప్తి చేసినా వాటిని పట్టించుకోకుండా తోసిపుచ్చారు. పార్కిన్సన్ వ్యాధితో స్టాన్ స్వామి ఆరోగ్యం క్షీణించిందని, కనీసం చెంచా కూడా పట్టుకోలేకపోతున్నాడని, రాయలేకపోతున్నాడని, నడవలేకపోతున్నాడని, స్నానం చేయలేకపోతున్నాడని ఆయన వైద్య నివేదికలు చెబుతున్నాయి.

వినికిడి సమస్య కూడా ఏర్పడిందని, శారీరకంగా చాలా బలహీనంగా ఉన్నాడని న్యాయస్థానం కూడా గుర్తించింది.

స్వామి న్యాయవాది బెయిల్ పిటీషన్ సమర్పించిన ప్రతి సారీ నిస్పందేహంగా తిరస్కరించారు. ఆరోగ్య ప్రాతిపదికగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడల్లా కేసును వాయిదా వేస్తూ, ఆయన్ని ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తున్నారు. నా దృష్టిలో ఇది న్యాయమూర్తుల కు సున్నిత హృదయం లేకపోవడం వల్ల జరిగింది.

ఇది చాలా విచారకరం.
న్యాయవ్యవస్థ క్షీణతకు సాక్ష్యం

స్టాన్ స్వామి విషాదాంతానికి దారితీసిన ఈ సంఘటనలన్నీ న్యాయ వ్యవస్థ క్షీణతకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఈ పోలికలన్నీ ప్రస్తుత భారత దేశ రాజకీయ వ్యవస్థ తీరుకు సహవ్యాపకంగా కనిపిస్తున్నాయి.

వ్యాస రచయిత, అజిత్ ప్రకాశ్ షా

ఉపా కింద ఆరోపణలను ఎదుర్కొంటున్న స్టాన్ స్వామి వంటి వారి కేసులలో రాజకీయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ ఎందుకిలా దూకుడుగా వ్యవహరిస్తున్నాయి? అనుమానం లేదు, అసలు కీలక విషయం ఏమిటంటే న్యాయవ్యవస్థ బలహీనంగా ఉండ‌డ‌మే.

దీనికి తోడు మన న్యాయవ్యవస్థలో అనేక లోపాలు, బలహీనతలు ఉన్నాయి. స్టాన్ స్వామి కేసులో న్యాయమూర్తులు ఉదాసీనతను ప్రదర్శించారు.

మనను కలవర పెడుతున్న విషయం ఏమిటంటే, వ్యక్తగత స్వేచ్చను, ప్రాథమిక హక్కులను కాపాడాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పైకి చాలా ఘనంగా చెపుతారు. న్యాయస్థానాలు మాత్రం ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తాయి.

క్రిమినల్ చట్టం, దాని విధానాల ప్రకారం ‘నిజమని భావించే అమాయకత్వం’ను సూచించడం నిస్సందేహంగా మనదేశంలో ఒక బలహీనమైన అడుగు.అది మనల్ని తీవ్ర ఆవేదనకు గురి చేస్తుంది. ఈ ఆవేదనకు కారణం భారత సుప్రీం కోర్టు.

ఎన్ ఐ ఏ కు, జహూర్ అహ్మద్ షా వాటాలికి మధ్య జరిగిన కేసులో ఉపా (Unlawfull Activities(Prevention) Act UAPA) చట్టం పైన చేసిన వ్యాఖ్యానం ఇలాంటి కేసులలో తీసుకునే నిర్ణయాలని ప్రభావితం చేసింది. కేసు విచారణ పూర్తయ్యేవరకు నిందితుడు జైలులోనే ఉండాలనే నూతన నిబంధనలకు దారితీసింది. నేరారోపణలు తిరస్కరించినప్పటికీ, నిందితులు శిక్షను అనుభవించాల్సి వ‌స్తోంది.

ఉపా కింద కేసు న‌మోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో ఉన్న ప్ర‌తి ఆరోప‌ణ‌ను న్యాయ‌స్థానం నిజమని భావిస్తోంది. ప్రాసిక్యూషన్ చేసే వాదనలు తప్పని ఆధారాలు చూపిస్తే తప్ప బెయిల్ మంజూరు కాదు. ఆరోపణలు తప్పని నిందితుడే నిరూపించుకోవలసి వస్తోంది. చాలా కేసుల్లో ఇది సాధ్యం కాదు.

బెయిల్ ఇచ్చే సమయంలో సాక్ష్యాలను అంగీకరించాలనే నిబంధనను మినహాయించాలి. ఇలా చేయడం వల్ల సాక్ష్యాల చట్టాన్ని మినహాయించవచ్చు. కానీ, ఆ నిర్ణయం నిస్సందేహంగా రాజ్యాంగ వ్యతిరేకం.

ఉపా కింద బెయిల్ దొరకడమనేది ఒక ప్రహసనం. ఇలాంటి కఠినమైన సాక్ష్యాల ఆటంకాల వల్ల ఒక నిందితుడికి బెయిల్ రావడం అసాధ్యం. నిందితుడిని నిరవధికంగా జైలులో పెట్టడానికి ఇదొక ఆయుధంగా పనిచేస్తోంది. దుర్వినియోగం అవుతున్న ఈ విధానం అంతా ఏమిటంటే, ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ, ప్రాసిక్యూషన్ కలిసి చివరికి అవమానిండమే:

అసమ్మతి తెలిపే వారందరిపైన దేశద్రోహ నేరం, నేరపూరితమైన కుట్ర, ఉపా కింద కేసులు నమోదు చేస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పు వల్ల హైకోర్టులకు చేతులు కట్టేసినట్టయింది. ఫలితంగా ఈ కేసులలో చేసిన ఆరోపణలు తప్పని నిరూపించడం అసాధ్యం కనుక బెయిల్ ఇవ్వలే క పోతున్నారు.

ఈ నిర్ణయం వల్ల, నిజానికి హైకోర్టు కేసులో తీర్పులు చెప్పడానికి ఉన్న సాక్ష్యాలను అంచనా వేయలేకపోతోంది. ఈ విధానం వల్ల ఈ రకమైన అన్ని కేసులలో బెయిల్ తిరస్కరించాల్సి వస్తోంది.

న్యాయవ్యవస్థ ద్వారా ఉపశమనం పొందాలనుకునే ప్రజలకు ఇవ్వన్నీ ఎమర్జెన్సీలో అమలు చేసిన ముందస్తు నిర్బంధ క్రూర చట్టాలను పోలి ఉన్నాయి. ఎమర్జెన్సీ కాలపు విపత్తును ఇప్పుడు నిలుపుదల చేయాలంటే, సుప్రీం కోర్టు నిర్ణయాన్ని మార్చాలి.

లేదంటే వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడడంలో మనం తేలిగ్గా రాజీపడక తప్పదు. బెయిల్ దరఖాస్తును నిరాకరించడం, స్టాన్ స్వామీ కేసుతోపాటు బీమా కోరేగాన్ కేసులో, పౌరసత్వ సవరణ చట్టానికి నిరసన తెలిపిన కేసులో నిరసన గళాల పట్ల నోరుమూసుకుని ఉండడమంటే ఉపాను బాగా దుర్వినియోగం చేయడమే.

ఈ కేసుల్లో ఆలోచించడమే నేరమైపోతోంది.పలు కేసుల్లో సాక్ష్యాధారం సాధ్యం కాదు.కొన్ని సార్లు సాక్ష్యా లన్నీ కల్పితాలే. మొత్తానికవి బలహీనంగా ఉంటాయి. ఉపా కింద కేసునమోదు చేసినట్టయితే నిందితుడికి బెయిల్ సాధ్యం కాదు.

సుప్రీంకోర్టు తీర్పు వల్ల కేసు పూర్వాపరాల లోకి వెళ్ళలేరు. ఢిల్లీలో 2020లో జరిగిన అల్లర్లకు సంబంధించిన కుట్ర కేసులో నిందితులైన ముగ్గురు యువ కార్యకర్తలకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం పట్ల సుప్రీంకోర్టు ‘ఆశ్చర్యం’ వ్యక్తం చేయడమే కాకుండా అసంతృప్తి కూడా వ్యక్తం చేసింది.

ఢిల్లీ హైకోర్టు తీసుకున్న నిర్ణయాలను అనుసరించి మిగతా కోర్టులు ముందుకు పోకూడదని కూడా స్పష్టం చేసింది. ‘ఒక బెయిల్ అప్లికేషన్ పైన చట్టాలకు సంబంధించి 100 పేజీల చర్చ జరపడం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

బెయిల్ మంజూరు చేసే కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన ‘వాటాలి’ తీర్పులో ఉన్న విషయాలను అది మరచినట్టుంది. చట్టబద్ధమైన విషయాల పైన భాష్యం చెప్పాలంటే సుప్రీం కోర్టు మాత్రమే ముందుకు వెళ్ళాలని, రాజ్యాంగపరంగా ఏర్పడిన హైకోర్టులకు ఆ హక్కులేదని దీని వల్ల అర్థమవుతోంది.

ఒక వేళ చట్టాలను పరిశీలించే హక్కు హైకోర్టుకు లేకపోతే, అరెస్టైన నిందితులు దీర్ఘకాలం జైలులోనే ఉండాలన్నది దీని అర్థమైతే, ఏ చట్టాల ప్రకారమైతే అరెస్టయ్యారో, వాటి రాజ్యాంగ ప్రామాణికత ఏమిటి?

తప్పకుండా ఇదంతా అహేతుకమవుతుంది. ఊహించని స్టాన్ స్వామి మృతి, ఆయన అనుభవించిన జైలు శిక్ష, చాలా మంది జైలులోనే మగ్గడం వంటివి న్యాయవ్యవస్థకు ఒక మాయని మచ్చగా మిగిలిపోతుంది.  కానీ నిరసన తెలపడానికి గొంతులు మోగుతూనే ఉండాలి.

స్టాన్ స్వామి అన్నట్టు..’బృందగానంలో మేం పాడుతూనే ఉంటాం. పంజరంలో పక్షులుపాడుతూనే ఉంటాయి”

(ద వైర్ సౌజన్యంతో)

(*ఆలూరు రాఘవశర్మ, సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *