తెలంగాణ ప్రభుత్వోద్యోగులు మరచిపోతున్న విషయాలు…

(వడ్డేపల్లి మల్లేశము)

సాధారణంగా ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వ ఉద్యోగులు గ్రామీణ పట్టణ ప్రాంతాలలో కూడా పరస్పరం అభిప్రాయాలను పంచుకోవడమే కాకుండా ఒకరి గురించి మరొకరు అంచనా వేసుకుంటారు. వ్యవసాయం ,ఇతర కూలి పనుల మీద బ్రతికేటువంటి సామాన్య ప్రజానీకం జీవన స్థితిగతులను ఉద్యోగులు గమనిస్తారు.

మెరుగైన టువంటి వేతనాలు, ఉద్యోగుల యొక్క కుటుంబ పరిస్థితులు, విద్య తదితర రంగాలలో వారి కుటుంబ నేపథ్యాన్ని అంచనా వేసుకొని తాము కూడా ఆ స్థాయికి చేరుకుంటే బాగుంటుందని అనుకుంటారు. ఇక్కడే ఉద్యోగులు సామాన్య ప్రజల మధ్యన అంతరాలు ,బేధాభిప్రాయాలు, అసూయా ద్వేషాలకు బీజం పడుతుంది.

ఉద్యోగ యంత్రాంగము ప్రజలు:

ప్రజాస్వామిక సౌధానికి మూడు అంశాలలో ముఖ్యమైనటువంటి కార్యనిర్వాహక వర్గానికి ఉద్యోగులు చెందుతారు. చట్ట సభల ద్వారా చేసినటువంటి చట్టాలను అమలు చేసే క్రమంలో న్యాయవ్యవస్థకు ప్రతిబంధకము కాకుండా ప్రజా సేవలో ఉద్యోగులు పని చేస్తారు అందుకే వీరిది సేవారంగం అంటారు.

ప్రజల శ్రమ ద్వారా జరుగుతున్న ఉత్పత్తి, ప్రజలు చెల్లించే వివిధ పన్నుల నుండి ప్రభుత్వ0 ఉద్యోగులకు వేతనాలను చెల్లిస్తుంది. కనుక ఉద్యోగులు ప్రజలకు పూర్తి స్థాయిలో బాధ్యత వహించవలసిన అవసరం ఉంటుంది. సిద్ధాంతపరంగా ఈ విధంగా ఉన్నప్పటికీ ప్రజలకు ఉద్యోగులకు మధ్య అంత బలమైన సంబంధాలు లేకపోవడం విచారకరం. దీనికి ప్రధాన కారణం రాజకీయ యంత్రాంగమే ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు సంబంధించినటువంటి పనుల విషయం లోపల తాత్సారం చేయడం కానీ, సంబంధం లేనట్లుగా వ్యవహరించడం కానీ, ప్రజలను నిర్లక్ష్యం చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. కారణం పరస్పర సంబంధాన్ని గుర్తించకపోవడమే.

ఉద్యోగులు ప్రజలకు చేరువ కావాలంటే:-

ఉద్యోగులు ప్రజలకు చేరువ అయినట్లయితే విధి నిర్వహణలో ఉద్యోగులకు ప్రజల మద్దతు లభిస్తుంది. తద్వారా రాజకీయ యంత్రాంగం యొక్క ఒత్తిడిని నివారించవచ్చు. అందుకు ప్రజలను అక్కున చేర్చుకునే సంస్కారము ఉద్యోగులకు అలవడ వలసిన అవసరం ఉంది. ఇప్పటికీ ఆ రకమైనటువంటి పరివర్తన ఉద్యోగులలో రాకపోవడం విచారకరం.
ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే అవినీతిపరులు, లంచగొండితనం ఎక్కువగా ఉందనే అపోహ ప్రజల్లోనూ, సర్వత్రా ఉన్నది. ఒక m. r. o. కోటిపైన లంచం తీసుకున్నట్లు అప్పట్లో పత్రికలో వచ్చింది. ఒక m. r. o. ను కారణా లేమైనా
పెట్రోలుతో కాల్చినట్లు విన్నాం. ఏమైనా విచారకరమే. ఇలాంటి దురభి ప్రాయాలను తొలగించుకోవా లాంటినిజాయితీ, అంకిత భావంతో పని చేయవలసిన అవసరం ఉంది.

ఏ స్థాయి ఉద్యోగులైన తమ విధి నిర్వహణలో ప్రజల పట్ల సదభిప్రాయం గనుక ఉన్నట్లయితే శక్తికి మించి ప్రజలకు సేవ చేయవచ్చు. అధికారుల స్థాయిలో ఉన్నవారు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అద్భుత ఫలితాలు సాధించవచ్చు.

ఉదా: జనగామ జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న సతీష్ గారు గత సంవత్సరం ఈ సమయంలో పేద ప్రజానీకానికి ఉచితంగా ఎన్నో రకాల సేవలు అందించడమే కాకుండా పేద వృద్ధురాలికి ప్రజల సహకారంతో పాటు తను కూడా 80 వేల రూపాయలను. సమకూర్చి రేకుల షెడ్డు ఏర్పాటు చేసి గవర్నర్ గారి దృష్టికి పోవడంతో పతాక శీర్షికన రాష్ట్రస్థాయిలో ఎస్సై గారు గుర్తించబడ్డారు. ఇలాంటి అనేక ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు.

రుణ సౌకర్యం కల్పించడం, సబ్సిడీలు అందించడం, వైద్య సౌకర్యాలు కల్పించడం, ప్రభుత్వ సహాయాన్ని ప్రజలకు అందించడం
ఉచిత న్యాయ సౌకర్యము, గృహ సౌకర్యం ప్రభుత్వ
ప్రజలకు వర్తింపజేయడం వంటి అనేక సౌకర్యాలను ఉద్యోగులు కనుక తలుచుకుంటే ప్రజలకు ఇవ్వవచ్చు. మనసు లేకుంటే ప్రజల
సానుకూల వైఖరి కనపడకపోతే ప్రజలకు ఉద్యోగులు శత్రువులుగా మిగిలి పోవలసి వస్తున్నది.

రాజకీయ అవినీతి మూలాలు ప్రజలకు తెలియాలి:

ఉద్యోగ యంత్రాంగంలో ముఖ్యంగా అవినీతికి మూల కారణం రాజకీయ రంగంలో ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కనుక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులు ఉద్యోగుల్లో చాలామంది అవినీతిపరులు అనే అపోహను తొలగించుకోవడానికి ఉద్యోగులు ప్రతిన పూని తమ పైన ఒత్తిడి కలిగిస్తున్న టువంటి ఉన్నత అధికారులు గానీ రాజకీయ యంత్రాంగం మూలాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. తద్వారా ప్రజల మద్దతు ఉద్యోగులు పొందడమే కాకుడా ఉద్యోగులపై గల దురభిప్రాయం తొలగిపోతుంది. అందుకే ఉద్యోగులు అవినీతికి దూరంగా ఉండి ప్రజా సేవలో గడిపి రాజకీయ యంత్రాంగం యొక్క అవినీతిని సమైక్యంగా ప్రతిఘటించాలి .అది ఉద్యోగుల సామాజిక బాధ్యత.

ఉద్యోగులు ప్రజల మధ్య వైరుధ్యాలు సమైక్యత:

ఉద్యోగులకు నెల రాగానే భారీ వేతనం వస్తున్నదని తాము కష్టపడితే కానీ కడుపునిండదని ఉద్యోగుల పట్ల సామాన్య ప్రజలకు రైతులకు ద్వేష భావం ఉన్న మాట వాస్తవం. ఇది ఒక రకంగా ఆర్థికపరమైన వైరుధ్యం.
1982లో ఒక గ్రామంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నాకు కేవలం 450 రూపాయల వేతనం మాత్రమే వచ్చేది. నెలంతా పని చేసినా వంద రూపాయలు కూడా సంపా దించలేక పోతున్నామని రైతులు ,కూలీలు బాధపడుతూ అప్పుడప్పుడు ఆవేదన వ్యక్తం చేసేవారు.
ఈ విషయాన్ని రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ సంఘం నాయకుని దృష్టికి నేను తీసుకు వెళ్ళినప్పుడు “నిజమే !ఉద్యోగులుగా మమ్ములను పేద ప్రజలుగా మిమ్ములను ప్రభుత్వం రాజకీయ నాయకులు మభ్యపెట్టి కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు మనం ఇరువురం కలిసి ప్రభుత్వం పైన పోరాడవలసిన అవసరం ఉంది.” అని ఆ నాయకుడు జవాబిచ్చారు. ఈ జవాబును ఉద్యోగులు ప్రజలు కూడా గమనించవలసిన అవసరం ఉంది.
1989 -90 సంవత్సరం ప్రాంతంలో ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మిగతా ఉద్యోగులకు భిన్నంగా “జీతాలు పెంచడం కాదు ధరలు తగ్గించాలి” అనే నినాదంతో సామాన్య ప్రజల పక్షాన ఉపాధ్యాయ సంఘం నినదించిన విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను.
ఉద్యోగులు ,ఉపాధ్యాయులు, కార్మికులు గా నేడు విధి నిర్వహణలో కొత్త కోణాన్ని అమలు చేస్తూ ప్రజల పట్ల సేవా దృక్పథంతో సానుభూతితో వ్యవహరించకపోతే ముఖ్యంగా ఉద్యోగి వర్గాలకు చాలా నష్టం.
సామాన్య ప్రజలు పేదలు కార్మికులు రైతులు అట్టడుగు వర్గాల చెమట చుక్కలే తమకు నెల వేతనం రూపంలో ముడుతుందని తాము ప్రజలకే భాధ్యత వహిస్తామనే పరివర్తన ఉద్యోగ, ఉపాధ్యాయులలో రావాలని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, ప్రజాసంఘాలు కోరుకుంటున్నారు.

(వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు.  హుస్నాబాద్, సిద్దిపేట జిల్లా, తెలంగాణ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *