ఒలింపిక్ చోద్యం: బాతులను నొప్పించని రోవర్

(సలీమ్ బాషా)

“ఒలింపిక్ క్రీడలలో చాలా ముఖ్యమైన విషయం గెలవడం కాదు, పాల్గొనడం; జీవితంలో ముఖ్యమైన విషయం జయించడమే కాదు, బాగా పోరాడటం”
-పియరీ డి ఫ్రెడి, బారన్ డి కూబెర్టిన్, ఒలింపిక్ కమిటీ వ్యవస్థాపకులు

1928లో ఆమ్ స్టర్ ర్డామ్ లో లో సమ్మర్ ఒలింపిక్స్ జరిగాయి. క్వార్టర్ ఫైనల్ ఈవెంట్లో బోట్ రేసింగ్ జరిగేటప్పుడు ఒక వింత జరిగింది.హెన్రీ రాబర్ట్ పియర్స్ అనే బోట్ రేసర్ రేసులో ఉండగా బాతుల గుంపు ఒకటి స్టోటెన్ కాలువను దాటుతూ ఉంది. అతను వాటిని దాటుకుని వెళ్లి ఉండొచ్చు అయితే ఆ గుంపు దాటేంత వరకు అతను అక్కడే వేచి ఉన్నాడు. అతని పోటీదారు సౌరిన్, మూడు యూరోపియన్ ఛాంపియన్షిప్ కప్ లలో తొమ్మిది జాతీయ టైటిళ్లు గెలుచుకున్న శక్తివంతమైన రోవర్, తన ప్రత్యర్థి పరిస్థితిని అదునుగా తీసుకుని ఐదు అధిక్యత సాధించాడు. అయితే, రేసు  చివరి 1,000 మీటర్లలో అద్భుతమైన నైపుణ్యం ప్రదర్శించిన పియర్స్, 30 సెకండ్ల లీడ్ తో ఫినిష్ లైన్ సాధించాడు.

అతను రేసును గెలవడమే కాదు, ఫైనల్ కూడా గెలిచాడు. అలా ఒక కొత్త రికార్డు సృష్టించాడు. అతను చూపించిన కరుణ, జాలినీ ప్రపంచం మర్చిపోలేదు. అలా అతను అందరి దృష్టిలో హీరో అయ్యాడు.

అలా పియర్స్ తర్వాత ఎన్నో మెడల్స్ సాధించాడు, 1932 లో లాస్ ఏంజిల్స్లో మళ్లీ ఒలింపిక్ టైటిల్ను గెలుచుకున్నాడు, తరువాత 1933 నుండి ప్రపంచ ప్రొఫెషనల్ ఛాంపియన్గా 12 సంవత్సరాలు రోయింగ్ ఛాంపియన్ గా నిలిచాడు.

పియర్స్ ఒలంపిక్ చరిత్రలోనే బ్యాక్ టు బ్యాక్ ఒలంపిక్ గోల్డ్ మెడల్ సాధించిన ఏకైక సింగిల్ బోట్ రేసర్. అయితే వాటన్నిటిలో కి 1928 ఒలంపిక్స్ లో సాధించిన గోల్డ్ మెడల్ అతనికి చాలా పేరు తెచ్చిపెట్టింది. అయితే అది అతను సాధించింది కండబలంతో కాదు, ప్రేమ,కరుణతో. ఆ ఒక్క రేస్ అతన్ని గొప్పవాడిని చేసింది. అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టింది. ప్రజల హృదయాల్లో అతను అజరామరంగా నిలిచి పోయాడు.

Saleem Basha

(సలీమ్ బాషా, స్పోర్ట్స్ జర్నలిస్టు, హోమియో వైద్యుడు. ఫోన్ 9393737937)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *