దిలీప్ కుమార్ ఒక శకం…. అది ముగిసింది…

(సలీమ్ బాషా)

“ట్రాజెడీ కింగ్” దిలీప్ కుమార్(98) చివరికి నిజంగానే మనల్ని వదిలేసి వెళ్లిపోయాడు.

గత కొద్ది సంవత్సరాలుగా శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న దిలీప్ కుమార్, సినిమా ఇండస్ట్రీ దిలీప్ సాబ్ అని పిలిచే యూసుఫ్ ఖాన్ తన యాత్రను, పాత్రను ఈరోజు ముగించేశాడు.

మొఘల్- ఎ- ఆజం సినిమాలో తండ్రితో దిలీప్ కుమార్ చెప్పిన డైలాగ్

“Mera dil bhi aapka koi Hindustan nahi, jispar aap hukumat karein”

(” నా మనసు నీ హిందుస్థాన్ రాజ్యం కాదు, నువ్వు దాన్ని ఏలడానికి”)
ఆయన మనస్తత్వానికి దగ్గరగా ఉంటుంది. ఎవరికీ దేనికీ భయపడని , ఎవరి మాట వినని దిలీప్ సాబ్ కేవలం తన మనస్సు మాట మాత్రమే విన్నాడు. చివరి వరకు అలాగే ఉన్నాడు. అందుకే ఆ కాలంలో అందరూ నివ్వెరపోయే పని చేశాడు. తన కన్నా బాగా చిన్నదైనా ” సైరాభాను” ని పెళ్లి చేసుకున్నాడు.

దిలీప్ కుమార్ ఒక శకం. ఆయన యాక్టరే కాదు, స్టార్ కూడా.
అయితే 60 ఏళ్ల తన సినీ కెరీర్ లో కేవలం 60కి పైగా సినిమాలు మాత్రమే చేశాడు. అయినా కొన్ని సినిమాలు దిలీప్ కుమార్ మాత్రమే చేయగలడు, మరికొన్ని సినిమాలు దిలీప్ కుమార్ ఏం చేశాడు, ఒకటి రెండు సినిమాలు, దిలీప్ కుమార్ అంటే ఏమనుకున్నారు అని అభిమానులు, ప్రేక్షకులు చేత అనిపించేలా చేసిన దిలీప్ కుమార్ 98 ఏళ్ళ వయసులో తన సుదీర్ఘ సినిమా, జీవిత ప్రస్థానాన్ని ముగించాడు.

మధుమతి, నయా దౌర్, ఆద్మీ, గంగా జమున వంటివి దిలీప్ కుమార్ మాత్రమే చేయగలిగిన సినిమాలు ఇక మొఘల్ ఎ ఆజం గురించి చెప్పాల్సిన అవసరం లేదు.

దిలీప్ కుమార్ అంటే మెథడ్ యాక్టింగ్ (Method Acting) కు పెట్టింది పేరు. (మెథడ్ యాక్టింగ్ అంటే ఒక పద్ధతిగా ఎన్నో రిహార్సల్స్ చేసి పాత్రను, దాని స్వభావాన్ని అర్థం చేసుకొని ఆ పాత్ర లో లీనమై, ఒక విధంగా చెప్పాలంటే ఆ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్ర యొక్క భావోద్వేగాలను, అంతరంగాన్ని తెరమీద ఆవిష్కరింప చేయడమే) ఈ పాత్రకు ఆద్యుడు రష్యన్ నటుడు దర్శకుడు “కాన్స్ టాంటిన్ స్టానిస్లవ్ స్కీ” ఈ తరహా నటనను వంట పట్టించుకుని తెరమీద తనదైన డైలాగ్ డెలివరీతో రక్తి కట్టించిన ఒక ప్రత్యేక తరహా నటుడు దిలీప్ కుమార్.

మొఘల్- ఎ- ఆజం సినిమా చూడని వాళ్ళు ఉండొచ్చు కానీ ఈ సినిమా గురించి వినని వారు ఉండరు. దిలీప్ కుమార్ విశ్వరూపం చూపిన సినిమాల్లో అతి ముఖ్యమైనది. డైలాగుల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టే, బాగా ఒత్తి పలికే ప్రత్యేకత దిలీప్ కుమార్. అందులో బాగా ఫేమస్ అయిన ఒక డైలాగ్ చూద్దాం
“Taqdeerein badal jaati hain, zamana badal jaata hai, mulkon ki taarikh badal jaati hai, shahenshah badal jaate hain, magar iss badalti hui duniya mein mohabbat jis insaan ka daaman thaam leti hai, woh insaan nahi badalta”
(విధి రాతలు మారిపోతాయి, కాలం మారిపోతుంది, రాజ్యాల చరిత్ర మారిపోతుంది, రాజులు మారిపోతారు, కానీ ఇలా మారిపోతున్న కాలంలో ఎవరినైతే ప్రేమ ఒడిసి పట్టుకుంటుందో అటువంటి వ్యక్తి ఎప్పటికీ మారిపోడు)

Dilip Kumar in Devdas/ Wikimedia Commons

ఇది దిలీప్ సాబ్ జీవితానికి సరిగ్గా సరిపోతుంది. ఎప్పుడైతే సైరాబాను ప్రేమతో అతని దగ్గరికి చేరిందో, అప్పటి నుండి ఆయన మారిపోకుండా అలాగే ఉన్నాడు. వారిద్దరి మధ్య 22 సంవత్సరాల దూరం ఉన్నప్పటికీ, వారిద్దరి మధ్య దూరం ఎప్పటికీ లేదు వారి మనసుల మధ్య దూరం అసలే లేదు. చివరి వరకు సైరాబాను దిలీప్ కుమార్ తోనే ఉంది.

దిలీప్ కుమార్ తన జీవిత కాలంలో అందుకున్న అవార్డులు గురించి రాయాలంటే చాలా కష్టం. ఎక్కువ అవార్డు సాధించిన నటుడిగా ఆయన పేరు గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దిలీప్ కుమార్ కి కాకుండా ఎవరికి వస్తుంది. ఏ అవార్డు కైనా సరే హుందాతనాన్ని, గౌరవాన్ని కలిగించిన ఆయనకి రాజ్యసభ సభ్యత్వం కూడా చిన్నదే అనిపిస్తుంది. భారతదేశపు రెండవ ఉన్నత పౌర అవార్డు ” పద్మవిభూషణ్ కూడా” ఆయనను వరించింది.

ఆయన అవార్డుల కే గౌరవం ఇచ్చాడు. ఆయన కు గౌరవం ఇవ్వగలిగే అవార్డు ” భారతరత్న” అని అభిమానులు, ప్రేక్షకులు భావించడం సమంజసమే!.

పాకిస్తాన్ కు చెందిన అత్యున్నత అవార్డ నిషాన్ ఇ ఇంతియాజ్ (Nishan-e-Imtiaz) అందుకున్న ఏకైక భారతీయ నటుడీయనే.

(సలీమ్ బాషా, మూవీ క్రిటిక్, స్పోర్ట్స్ జర్నలిస్టు, హోమియో ప్రాకిషనర్)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *