ఆంధ్ర, తెలంగాణ తాజా జలవివాదం మీద తెలంగాణ మేధావుల వాదన

ఒక వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణ జల వివాదం మొదలయింది. తెలంగాణ మంత్రులు ఆంధ్ర ముఖ్యమంత్రిని గజదొంగ అన్నారు. ఆయన తండ్రి ఒక నాటి ఉమ్మడి ఆంధ్ర సిఎం వైఎస్ ఆర్ నీటి దొంగ అన్నారు. దీనినొక క్యాంపెయిన్ గా మార్చారు.  సరిగ్గా ఇపుడే   ఎందుకు మొదలయిందో కొందరికి అర్థమయింది. కొందరికి అర్థం కాలేదు. చాలా మంది హూజూరాబాద్ ఉప ఎన్నికలు కారణమంటున్నారు. ఇంతవరకు జరిగిన ఉప ఎన్నికలు వేరు. రెబెల్ ఈటెల రాజేందర్ రాజీనామా తో జరుగుతున్న ఈ ఉప ఎన్నిక వేరు. హూజూరాబాద్ కోసం ఈ అంధ్ర వ్యతిరేకత రెచ్చగొడుతున్నారని మీడియాలో వస్తున్నది. ఈ వాదనఎలా ఉన్నా, తెలంగాణ మేధావులు ఈ వివాదం గురించి ఏమంటున్నారు?

ప్రొఫెసర్ జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం, పాలమూరు అధ్యయన వేదిక, తెలంగాణ విద్యావంతుల వేదిక సంయుక్తంగా ఒక వెబినార్ నిర్వహించాయి.  కృష్ణా నదీ జలాలు – తెలంగాణ ప్రభుత్వ విధానం అనే అంశం మీద జరిగిన వెబినార్ పలువురు మేధావులు పాల్గొన్నారు.వారి వాదన చదవండి.

ప్రొఫెసర్ కోదండరాం

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం జల సాధన ఉద్యమానికి కొనసాగింపు. ఈ రెండూ వేర్వేరు కాదు. ఉద్యమ లక్ష్యాలు పక్కన పెట్టి, కేవలం కాంట్రాక్టర్ల ప్రయోజనాలు; వారి ద్వారా తనకూ జగన్ కూ నెరవేరే ప్రయోజనాలు తప్ప కేసీఆర్ తెలంగాణ ప్రజలకు బాధ్యత పడడం లేదు. కృష్ణా మీద పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ప్రజాద్రోహానికి పాల్పడింది కేసీఆర్ ప్రభుత్వం. మొత్తం 811 టీఎంసీలలో మనకు కేవలం 299 టీఎంసీలు (37%) మాత్రమే చాలు అని స్వయంగా ముఖ్యమంత్రి అనడం శోచనీయం. మన న్యాయమైన వాటా మనకు దక్కాలి. అది మనం సాధించుకోవాలి.

డిమాండ్స్:
1. కృష్ణాలో న్యాయసమ్మతమైన వాటా దక్కించుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేయాలి.
2. కృష్ణా నదిపై పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి. వాటికి అవసరమైన కేటాయింపులు చేయాలి.
౩. జూరాలపై మరొక ఎత్తిపోతల ప్రాజెక్టు కట్టాలి. త్వరితగతిన ముగించాలి.
4. తెలంగాణ ఒచ్చినంక నీటిపారుదల ప్రాజెక్టుల మీద ఇప్పటికి పెట్టిన మొత్తం ఖర్చు యెంత, సాగులోకి వచ్చిన ఆయకట్టు యెంత స్పష్టం చేయాలి.

కృష్ణా నదీ జలాలలో మనకు జరుగుతున్న అన్యాయంపై ఎన్నో అధ్యయనాలు జరిగినాయి. వాటి నేపథ్యంలో ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలి. కోవిడ్ నెమ్మదించగానే క్షేత్రస్థాయి ఉద్యమాలు చేద్దాం. పై డిమాండ్లు నెరవేర్చకుండా, భావోద్వేగాలు రెచ్చగొట్టేలా కేసేఆర్, ఆయన మంత్రులు మాట్లాడితే ప్రజలకు ఎట్లాంటి లాభం లేదు. ఉమ్మడి అవగాహనతో బయల్దేరుదాం, ఉమ్మడి కార్యాచరణ చేద్దాం.

నేటి తెలంగాణ రాజకీయాలకు వైఎస్సార్ కు సంబంధం లేదు. 2004 సందర్భం వేరు. సరళీకరణ ద్వారా పోగుపడిన సంపద, ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు దక్కాల్సిన ప్రయోజనాల వరకే ఆయన రిలవెన్స్ ఉండింది. స్వరాష్ట్ర సాధన కోసం అమరుల త్యాగాలు తప్ప ఇపుడు ఏదీ రిలవెన్స్ కాదు. వాటి సాధన తప్ప వేరే ఏదీ ఇక్కడి రాజకీయ పార్టీల లక్ష్యంగా ఉండకూడదు.

కాబట్టి పై డిమాండ్ల సాధన కోసం, కార్యాచరణ కోసం త్వరలో సమావేశం అవుదాం. క్షేత్రంలో తిరుగుదాం. రాజోలి బండ నుంచి జూరాల మీదుగా శ్రీశైలం వరకు యాత్ర చేద్దాం. కృష్ణాలో నీటి పరిస్థితి తెలుసుకుందాం. సకల జనుల సమ్మె స్ఫూర్తితో సాగుదాం. కృష్ణా నీటిలో మన వాటా మనం దక్కించుకుందాం.

ఎం. రాఘవాచారి, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్

వైఎస్సార్ బతికి వున్నపుడు మేము కలిస్తే ‘కృష్ణా నది closed question’ అన్నారు. అపుడు మేము ‘కృష్ణా ముగిసిన అధ్యాయం అయితే మీ పాదయాత్ర open question యెట్లా అవుతుంది’? అని వైఎస్సార్ ను ప్రశ్నించినం. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా జూరాల కోసం కొట్లాడినం. షాద్ నగర్ ఎత్తిపోతల కోసం ఆరు సంవత్సరాలు కొట్లాడినం. జీవో 72 రావడానికి మరో నాలుగు ఏండ్లు పట్టింది. నిజాం స్టేట్ లో, ఆంధ్రలో ఏమీ ఒరగలేదు మనకు. ఇపుడు స్వంత రాష్ట్రంలో కూడా ప్రజల కేంద్రంగా, రైతుల కేంద్రంగా నిర్ణయాలు జరగడం లేదు.

మూసీ, దిండి పారుతున్నా రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎండిపోతున్నాయి. ఈ ఏడేండ్లు తెలంగాణలో కృష్ణా, తుంగభద్రా నదులకు ఎడమ వైపున ప్రాజెక్టులు కట్టకుండా ప్రయత్నాలు జరిగినాయా? జరిగితే వాటిని మేము ఆపినమా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిలాగా, రాయలసీమ ముఖ్యమంత్రి లాగా కేసీఆర్ మాట్లాడడం కరెక్ట్ కాదు.

కృష్ణానదిలో న్యాయమైన వాటాకోసం ఉద్యమం చేద్దాం. రైతులు, నిర్వాసితుల కేంద్రంగా ఆలోచించాలి. వరద జలాలను ఆంద్ర రాయలసీమలు వాడుకోవచ్చు. కృష్ణా గోదావరి నదులు మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు న్యాయమైన వాటా దక్కాలి. భావోద్వేగాలు రెచ్చగొట్టడం మాని సమగ్ర జల విధానం రూపొందించాలి. పాత ప్రాజెక్టులు ముగించండి. నిర్వాసితులకు న్యాయం చేయండి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం విడనాడాలి.

నాగం జనార్ధన రెడ్డి

కృష్ణా బేసిన్ లో రాయలసీమ వాడుకుంటున్న వాటా రెండో క్రాప్ కు కూడా తీసుకుంటున్నారు. 512 TMC ఆంధ్రాకు యిచ్చి, మనకు 299 ఇవ్వడం తప్పు. సంగమేశ్వర లిఫ్ట్ ఆలోచన జగన్ కు లేదు. కేసీఆర్ తో ప్రగతి భవన్ లో భోజనం చేస్తున్నపుడు పుట్టిన ఆలోచన సంగమేశ్వర లిఫ్ట్.

ఎన్.డి . గులాటి స్పష్టంగా చెప్పారు – పేరెంట్ బేసిన్ అవసరాలు తీర్చకుండా వేరే బేసిన్ కు తీసుకుపోరాదు అని. రంగారెడ్డి-మహబూబ్ నగర్-నల్గొండ కొంత ఖమ్మం వరంగల్ కూడా ఈ బేసిన్ లోవి. నీటి పారుదల ఈ జిల్లాలకు పదిశాతం కూడా అందడం లేదు. ఈ మూడు జిల్లాల్లో దాదాపు 70 లక్షల ఎకరాలు నీటి కోసం అల్లాడుతున్నాయి.

కేసీఆర్ దుర్మార్గాన్ని నిలవరించకపోతే మన రిజర్వాయర్ లు కూడా తాకట్టు పెడుతారు. ఇప్పటికే 5 లక్షల అప్పు మన నెత్తి మీద పెట్టినారు. ఏ ఆంధ్రా ముఖ్యమంత్రి చేయని ద్రోహం ఇది. ఇపుడు తన మంత్రులతో ఉత్తుత్తి మాటలు మాట్లాడిస్తున్నారు. గత ప్రభుత్వాల ప్రాజెక్టుకు కనీసం మీరు కాలువలు కూడా కట్టలేదు. తెలంగాణ ప్రజల కోసం కొట్లాడలేదు కేసీఆర్, స్వార్థంతో కొట్లాడిండు. ఇపుడు నీళ్ళ గురించి కూడా రాజకీయ స్వార్థ ప్రకటనలు తప్ప మరేమీ లేదు. కాళేశ్వరం కేవలం కొన్ని జిల్లాలకు పరిమితం. దక్షిణ తెలంగాణకు ఏమీ ఒరిగేది లేదు. ఈ దుర్మార్గాన్ని ఆడుకుందాం.

నిజంగా చిత్తశుద్ది ఉంటే, కృష్ణా నీటి దోపిడీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో కేసు వేయాలని ముఖ్యమంత్రి గారికి నా డిమాండ్.

దొంతుల లక్ష్మీనారాయణ, రిటైర్డ్ ఇంజనీర్

రంగారెడ్డి-నల్గొండ-మహబూబ్ నగర్ వర్షాభావ ప్రాంతాలు. 65% కృష్ణా బేసిన్ లో మన పరీవాహక ప్రాంతం. ఆంధ్రప్రదేశ్ ది కేవలం 35%. వారికి కేటాయించిన దానికంటే 105 టీఎంసీలు అదనంగా వాడుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చేనాటికే మన నికర జలాలు వినియోగించుకునే స్థాయిలో లేము. అసలు అందుకే తెలంగాణ తెచ్చుకున్నాం. ఈ ప్రభుత్వం దక్షిణ తెలంగాణను మోసం చేస్తున్నది. పాలమూరు రంగారెడ్డి తర్వాత తలపెట్టిన కాళేశ్వరం ఇప్పటికే 70 వేల కోట్లు ఖర్చు చేసి, పాలమూరు-రంగారెడ్డిని మాత్రం గాలికి ఒదిలేసిన్రు. కేవలం 11 వేల కోట్లు ఖర్చు పెడితే మన రైతుల కళ్ళల్లో ఆనందం కనబడేది.

కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్.ఎల్.బి.సి కి కేటాయింపులు లేక తెలంగాణ రైతులు ఎండిపోతున్నారు. రోజూ 11 టీఎంసీలు వాళ్ళు దోచుకుపోతా వుంటే, కేసీఆర్ చేష్టలు ఉడిగి కూచున్నారు. వైఎస్సార్ 14 గేట్లు కట్టిన్రు, ఇపుడు జగన్ మరొక 14 గేట్లు కడుతున్నారు. రాయల సీమ పెన్నా బేసిన్ లోది. మన బేసిన్ లో హక్కులు లేవు. ఇట్లా 116 ప్రాజెక్టులు అనుమతి లేకుండా ఆంద్ర ప్రభుత్వం కడుతూ వుంటే, రోజాతో రొయ్యల పులుసు తింటూ, జగన్ తో ఇచ్చకాలు ఆడుతూ కాలం గడుపుతున్నారు. ఇపుడు రాజకీయాల కోసం తన మంత్రులతో మాట్లాడిస్తున్నారు.

ఆంధ్రా నాయకులకు, ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచిపెట్టే కేసీఆర్ ప్రయత్నాలను అడ్డుకుందాం.

ప్రొఫెసర్ హరగోపాల్, పౌరహక్కుల నాయకుడు

భూగర్భ జలాలు ఇంకిపోయి, నదీజలాలు అందక తెలంగాణ ప్రజల జీవితాలు అస్తవ్యస్తం అయింది. ఇది ప్రజల జీవించే హక్కుకు సంబంధించిన రాజ్యంగ విషయం. మొదటి దశ ఉద్యమం నిరుద్యోగం ప్రధానంగా సాగితే, మలిదశ ఉద్యమం నీటి చుట్టూ తిరిగింది. విద్యాసాగర్ రావు గారు జలవనరుల నిపుణుడిగా విస్తృతమైన భావవ్యాప్తి చేసారు.

కృష్ణా నీటి మీద మనం వాటా కోల్పోవడానికి ప్రధాన కారణం కేసీఆర్ కావడం నాకు ఆశ్చర్యం. మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా కూడా ఉన్న కేసేఆర్ పట్టించుకోకపోవడం…. కాళేశ్వరం మీద విపరీతమైన ఖర్చు పెట్టి నేడు ఉత్తర-దక్షిణ తెలంగాణ మధ్య వైషమ్యాలు కల్పించడం దురదృష్టకరం. మాఫియా లాగా ఆంధ్రా కాంట్రాక్టర్లు తయారు కావడం; ప్రాజెక్టుల డిజైనింగ్ లో ఉద్యమ నాయకులకు; పౌర హక్కుల సంస్థలకు, అఖిల పక్షాలకు చోటు లేకుండా ముఖ్యమంత్రి నేరుగా కాంట్రాక్టర్ లతో కూచుని ప్రాజెక్టులు కట్టడం దుర్మార్గం. ఆయన చుట్టూ ఉండే ఇంజనీర్లు, అధికారులు, నిపుణులు గంగిరెద్దులలా తలలు ఆడించడం తప్ప ప్రజలకు ఏది ప్రయోజనమో చెప్పడం లేదు.

తెలంగాణ ఉద్యమం సమయంలో ఒక ఆంధ్రా మిత్రుడు నాతో అన్నాడు – “తెలంగాణ ఒచ్చినంక మీ పాలకులు మిమ్మల్ని పట్టించుకోరు. ఆంధ్రా నాయకుల చుట్టూ తిరగాలి. రెండు రాష్ట్రాలు ఒకటి కావాలి అనే ఆర్గ్యుమెంట్ కూడా వస్తుంది” అని. నేడు షర్మిల ఇక్కడ పార్టీ పెట్టడం ఈ కోణంలో చూడాలి. ఇది మన అస్తిత్వ సమస్యగా చూడాలి.

నీళ్ళు నిధులు నియామకాలు ఆత్మగౌరవం నేటి నినాదాలు. మళ్ళీ ఉద్యమం జరగాలి. హైదరాబాద్ నిండా జగన్ ఫ్లెక్సీలు, విజయవాడ నిండా కేసీఆర్ ఫ్లేక్సీల కాలం పోవాలి. నీళ్లు పల్లానికే కాదు, అధికారం వైపు కూడా పయనిస్తాయి. తెలంగాణ ప్రజల చైతన్యం ఇంకా పెరగాలి. వారికి అధికారం రావాలి. అపుడు నీరు అభివృద్ధి వైపు పల్లవిస్తుంది. ఈ మొత్తంలో జేఏసీ పాత్ర, విద్యావంతుల పాత్ర, మేధావుల పాత్ర, పౌర సంఘాల పాత్ర ఎంతో ఉంది. మనమంతా సమిష్టిగా పనిచేద్దాం.

అంబటి నాగయ్య, తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు

తెలంగాణ భూముల్లో కాళేశ్వరం నీళ్ళు ప్రవేశించడం కంటే కూడా తెలంగాణ ఎన్నికల్లో కాళేశ్వరం డబ్బులు పారుతున్నాయి అనడం నిజం.

 

గతంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేసీఆర్ ఎదురుగా ఉండగానే జగన్ 600 టీఎంసిల నీరు కావాలని కోరితే, కేసీఆర్ కిక్కురుమనలేదు. కేసీఆర్-జగన్ అన్యోన్య బంధం కారణంగా, వారిద్దరి మధ్యవర్తులు అయిన కాంట్రాక్టర్ ల కారణంగా, రాజకీయ లాలూచీల వల్ల దక్షిణ తెలంగాణ రైతులు నష్టపోతున్నారు. తెలంగాణ భూముల్లో కాళేశ్వరం నీళ్ళు ప్రవేశించడం కంటే కూడా తెలంగాణ ఎన్నికల్లో కాళేశ్వరం డబ్బులు పారుతున్నాయి అనడం నిజం. పునర్విభజన చట్టానికి సంబంధించిన అంశాలు ఏవీ పట్టించుకోని కేసీఆర్ జగన్ కు మాత్రం అన్నిరకాల సహాయ సహకారాలు ఇస్తున్నారు. గోదావరి మనకు ఉంది, కృష్ణా వాళ్లకు ఇద్దాం అనే ధోరణి రాయలసీమ ప్రజల మీద ప్రేమతో కాదు, కాంట్రాక్టర్లు ఇచ్చే ముడుపుల మీద. వీరికోసం త్యాగాలు చేయాల్సిన అవసరం రంగారెడ్డి-మహబూబ్ నగర్-నల్గొండ రైతులకు లేదు.

మహబూబ్ నగర్ ను దత్తత తీసుకుని ఏమి చేసిండో తెలుసు, ఇపడు వాసాలమర్రి గతీ అంతే అవుతుంది. ఈ మోసాలు గ్రహించాలి. ఉద్యమించాలి. ఈ ప్రభుత్వం మీద విశ్వాసం లేదు. మంత్రుల మీద విశ్వాసం లేదు. తెలంగాణ శాసనకర్తలు, పాలనా విధానాలు నిర్ణయించే వారిపై ఒత్తిడి తేకపోతే మనం ఎడారిగా మిగిలిపోతాం. ఆంధ్రా ప్రాజెక్టులను ఆపకపోతే జంటనగరాలు కూడా ఎండిపోతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *