జగన్ జాబ్ క్యాలెండర్ పచ్చి మోసం: లోకేష్

జాబ్ లెస్ క్యాలెండర్ తో నిరుద్యోగ యువతకు జరిగిన అన్యాయం-భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ పై నిరుద్యోగ యువతతో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చర్చా కార్యక్రమం. విశేషాలు క్లుప్తంగా…

నారా లోకేష్ :
జగన్ రెడ్డి గారు విడుదల చేసింది జాబ్ క్యాలెండర్ కాదు జాదూ క్యాలెండర్. గ్రూప్‌1, 2 లో కేవలం 36 పోస్టులా? సిగ్గు సిగ్గు. అందుకే ఆయన జగన్ రెడ్డి కాదు జాదూ రెడ్డి. మైసూర్ బోండా లో మైసూర్ ఉండదు.

జాదూ రెడ్డి జాబ్ క్యాలెండర్లో జాబ్స్ ఉండవు. పాదయాత్రలో 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చారు. అధికారం వచ్చిన రెండేళ్లకి 10 వేల ఉద్యోగాలు ముష్టి వేసి నిరుద్యోగులను పండగ చేసుకోమంటున్నారు.

అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడటం ఆపి అంతరాత్మతో మాట్లాడితే ఇచ్చిన హామీలు గుర్తొస్తాయి. పాదయత్రలో ప్రచారానికి పనికొచ్చిన నిరుద్యోగులు ఇప్పుడు పనికిరారా? క్యాలెండర్ విడుదల చేసే ముందు కనీసం నిరుద్యోగ యువతతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకునే సమయం కూడా జాదూ రెడ్డి గారికి లేదు.

రెండేళ్ల పాలన లో జే – ట్యాక్స్ ఫుల్లు, ఉద్యోగాలు నిల్లు. జాదూ రెడ్డి మొహం చూసి రాష్ట్రానికి కొత్తగా ఒక్క కంపెనీ రాలేదు. బెదిరింపులు, జే ట్యాక్స్ దెబ్బకి రాష్ట్రంలో ఉన్న కంపెనీలు ఇతర రాష్ట్రాలకి క్యూ కడుతున్నాయి.

రిలయన్స్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ట్రైటాన్, లులూ, అదానీ ఇలా అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కి బై బై చెప్పేసాయి. ఎన్నికల ముందు వైకాపా నాయకులు బైబై బాబు అన్నారు. ఇప్పుడు కంపెనీలు అన్నీ బైబై జగన్ అంటున్నాయి. జాదూ క్యాలెండర్ విడుదల చేస్తూ రెండేళ్ల లో 6 లక్షల ఉద్యోగాలు కల్పించామంటూ బోగస్ ప్రకటన చేసారు జాదూ రెడ్డి.

రెండేళ్ల పాలనపై విడుదల చేసిన పుస్తకంలో 4.77 లక్షల ఉద్యోగాలు కల్పించామని బోగస్ లెక్కలు రాసారు. అది అయ్యిన 15 రోజులకే జాదూ క్యాలెండర్ విడుదల చేస్తూ మరో 1.25 లక్షల ఉద్యోగాలు కలిపి దొంగ లెక్కలు రాసి 6 లక్షల ఉద్యోగాలు అని ప్రకటించారు. కార్యకర్తలకు ఇచ్చిన వాలంటీర్ పోస్టులు, పేపర్ లీక్ చేసి అమ్ముకున్న సచివాలయ పోస్టులు, దశాబ్దాలుగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగాలు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ కలిపి దొంగ లెక్కలు చెప్పారు.

వాలంటీర్లు – 2.6 లక్షల మంది.‘వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా సేవ చెయ్యడం. ఇది ఉద్యోగం కాదన్నది జాదూ రెడ్డి గారే. మరి ఇప్పుడు ఉద్యోగాల లిస్టులో కలపడానికి సిగ్గు వెయ్యలేదా? 90 శాతం వాలంటీర్ పోస్టులు కార్యకర్తలకే ఇచ్చాం అని ఏ2 రెడ్డి ప్రకటించారు. గ్రామ,వార్డు సచివాలయం – 1.21 లక్షలు.పేపర్ లీక్ చేసి, వైకాపా కార్యకర్తలకు అమ్ముకున్నారు.

ఆర్టీసి ఉద్యోగులు 58 వేల మంది వీరంతా దశాబ్దాలుగా ఉద్యోగం చేస్తున్నారు. కోవిడ్ సమయంలో నియమించిన 26 వేల తాత్కాలిక ఉద్యోగాలను కూడా ఉద్యోగాలుగా చెబుతున్నారు. ఆప్కోస్ – 95 వేల మంది ఇందులో అత్యధికం మద్యం షాపుల్లో పని చేసే వారు.

ఇవన్నీ తీసేస్తే నిజమైన అర్హులకు వచ్చిన ఉద్యోగాలు 15 వేల లోపే. అవి కూడా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కలిపి. ఉద్యోగాలు ఇచ్చింది లేకపోగా టిడిపి హయాంలో ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రి యువనేస్తం 2వేల నిరుద్యోగ భృతి పథకాన్ని రద్దు చేసారు.

2.30 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తారని ఆశ పెట్టుకున్న నిరుద్యోగులు ఇళ్ళకు దూరంగా ఉంటూ,చాలీ చాలని డబ్బులతో, అర్దాకలితో, రూమ్స్ లో, హాస్టల్స్ లో ఉంటూ పోటీ పరీక్షల కోసం కోచింగ్ తీసుకున్నారు. నిరుద్యోగ యువతని జాదూ రెడ్డి నట్టేట ముంచేశారు. వారు ఇప్పుడు ఇళ్ళకు వెళ్లి మొహం చూపించలేరు. ఇక్కడేమో ఉద్యోగాలు లేవు. జాదూ రెడ్డి మోసం చేసింది యువతనే కాదు, ఆ పిల్లలను నమ్ముకున్న కుటుంబాలను కూడా.

ఎంత మనోవేదనతో ఉన్నారో జాదూ రెడ్డికి తెలుస్తుందా ? రెండేళ్ల జాదూ రెడ్డి పాలనలో నిరుద్యోగం పెరిగిపోయింది.ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ ఉద్యోగాలు రాక 300 మంది నిరుద్యోగ యువ‌త ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్పడ్డారు.

సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఈ) తాజా నివేదిక ప్రకారం చదువుకున్న వారిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ నిరుద్యోగ రేటు 38% ఉంది.దక్షిణాది రాష్ట్రాల‌తో పోల్చుకుంటే మన రాష్ట్ర నిరుద్యోగ రేటు ఎక్కువ. దేశంలోనే నిరుద్యోగ రేటు ఎక్కువుగా ఉన్న రాష్ట్రాల‌లో ఏపీ 4వ స్థానంలోఉంది.

సిఎంఐఈ సర్వే ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్య రాష్ట్రంలో 7 లక్షలకు పైగా నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు ఉన్నారని తేలిందంటే ఎంత ప్రమాదకరమైన పరిస్థితి ఉందో అర్ధమవుతుంది.

చంద్రబాబు గారి ప్రభుత్వం 15.45లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి 32లక్షల ఉద్యోగాల కల్పనకు ఎంఓయూలు చేసుకుంది. టిడిపి హయాంలో 5లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపించి, 5.13లక్షల మందికి ప్రైవేటు రంగంలో ఉపాథి కల్పించారని వైకాపా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. చంద్రబాబు గారి పాలన లో కియా, హీరో, అపోలో టైర్స్, ఫ్యాక్స్ కాన్, డిక్సన్, సెల్ కాన్, టీసీఎల్ లాంటి అనేక కంపెనీలు వచ్చాయి. జాదూ రెడ్డి పాలనలో ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రా గోల్డ్, స్పెషల్ స్టేటస్ లాంటి దొంగ లిక్కర్ బ్రాండ్లు వచ్చాయి. ఊరూరూ తిరిగి ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాల వరద అన్నారు. మోదీ మెడలు వంచి హోదా సాధిస్తా అన్న జాదూ రెడ్డి ఇప్పుడు హోదా ఊసే ఎత్తడం లేదు. ఉద్యోగాలు ఇవ్వరు, ఉద్యమాలు చెయ్యనివ్వరు. రాజారెడ్డి రాజ్యాంగంలో కనీసం నిరసన తెలిపే హక్కు కూడా లేకపోవడం దారుణం. ఇచ్చిన హామీ నిలబెట్టుకోమని అడుగుతున్న నిరుద్యోగ యువత ని అరెస్టులు చేస్తారా? కేసులు పెడతారా? ఎంత మందిని అరెస్ట్ చేస్తారు? ఎన్ని కేసులు పెడతారు? నిరుద్యోగ యువత తలచుకుంటే నీ ప్రభుత్వం మాడి మసై పోతుంది. నిరుద్యోగ యువతని అరెస్ట్ చెయ్యడం, కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నిరుద్యోగులపై పెడుతున్న కేసులు తక్షణమే ఉపసంహరించుకోవాలి.

తక్షణమే జాదూ క్యాలెండర్ రద్దు చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చెయ్యాలి. పాదయాత్రలో మీరు వాగ్దానం చేసినట్లుగా 2,30,000 ఉద్యోగాలతో కొత్త ఉద్యోగ క్యాలెండర్‌ను విడుదల చేయాలి. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది 6500 ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయాలి. గ్రూప్ 1 & గ్రూప్ 2 విభాగాల్లో 2 వేల పోస్టుల‌తో జాబ్ క్యాలెండర్ కొత్త‌గా విడుద‌ల చేయాలి. 25 వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భ‌ర్తీకి మెగా డిఎస్‌సి నోటిఫికేష‌న్ ఇవ్వాలి. ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాల్లో 20,000 వేల‌కు పైగా ఖాళీలకు నియామ‌కాలు చేప‌ట్టాలి. రెవెన్యూ శాఖలో 740 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భ‌ర్తీ చేయాలి. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువత కుటుంబానికి రూ.25 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. టిడిపి ప్రభుత్వ హ‌యాంలో ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద నిరుద్యోగుల‌కిచ్చిన 2000 నిరుద్యోగ భృతిని తక్షణమే అందించాలి.

అర్ధరాత్రి ఆత్మలతో మీటింగ్లు ఆపి ఉదయం నిరుద్యోగుల సమస్యల పై సమీక్షా సమావేశం పెట్టాలి. జూన్ 28 న నెల రోజుల గడువు ఇస్తూ డిమాండ్లు పరిష్కరించాలి అని ముఖ్యమంత్రికి లేఖ రాసాను. ఇచ్చిన గడువులోపు డిమాండ్స్ అన్ని పరిష్కరించాలి. లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. నిరుద్యోగులు, ప్రజా సంఘాల డిమాండ్ మేరకు తక్షణమే జాబ్ క్యాలెండర్ విషయంలో ఆలోచించండి. జాదూ రెడ్డి గా మిగిలిపోతారో పాదయాత్రలో హామీ ఇచ్చిన విధంగా జాబు రెడ్డిగా నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

బలివేముల శ్రీనివాస్ రెడ్డి, నిరుద్యోగ పోరాట కమిటీ కన్వీనర్ :

జాబ్ క్యాలెండర్ చూసి రాష్ట్రంలోని యువత మొత్తం నిరుత్సాహానికి గురయ్యారు. పాదయాత్రలో ప్రతి రోజూ ఉద్యోగాల గురించి మాట్లాడారు. రెండేళ్లలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. నాటి హామీలపై.. జగన్ రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసే యువతపై తప్పుడు కేసులు పెడుతున్నారు. విద్యార్ధి సంఘాల నాయకుల ఇళ్లకు వెళ్లి అరెస్టులు చేస్తున్నారు. అరెస్టు చేసినంత మాత్రాన ఉద్యమం ఆగదు. అరెస్టు చేయడంలో పట్టుదలకు పోయే బదులు.. ఉద్యోగాలివ్వడంలో పట్టుదలగా ఉండాలి.

ఆర్.కె.మహేశ్, స్టూడెంట్ జేఏసీ :

మోసపూరిత, అసాధ్యమైన హామీలిచ్చి ప్రజల్ని జగన్ రెడ్డి మోసం చేశారు. 2.30 లక్షల ఉద్యోగాలను వివిద రిక్రూట్ మెంట్ బోర్డుల ద్వారా నియమిస్తామని.. అధికారంలోకి వచ్చాక తూచ్ అంటూ చేతులెత్తేశారు. మొన్నటికి మొన్న.. వాలంటీర్లు జీతాలు పెంచమంటే స్వచ్ఛంద సేవకులు అంటూ చెప్పి.. ఇప్పడు ఉద్యోగులుగా చెప్పారు. రాజ్యాంగ బద్దంగా బానిసత్వం నేరం అయినప్పటికీ.. కనీస వేతనాలివ్వకుండా వాలంటీర్లను బానిసత్వంలోకి నెట్టేశారు.

ప్రాణాలు పోతున్నాయి.. కాపాడండి అంటున్న వారిని అరెస్టు చేస్తున్నారు. డిజిటల్ వేల్యుయేషన్ పేరుతో గ్రూప్ 1 క్వాలిఫై అయిన వారిని వేధించారు. ఆర్టీఐ ద్వారా సమాచారం కూడా ఇవ్వడం లేదు. సంక్షేమ ప్రభుత్వం కాదు.. సన్నాసి ప్రభుత్వం. ముఖ్యమంత్రి దున్నపోతుపై వర్షం కురిసన చందంగా వ్యవహరిస్తున్నారు. జగన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చింది పాలించడానికో.. మద్యం వ్యాపారం చేయడానికో అర్ధం కావడం లేదు. ఓట్ల కోసం డబ్బులు పంచడమే పనిగా పెట్టుకున్నారు. ఆత్మహత్యలే శరణ్యం అనే పరిస్థితుల్లో నిరుద్యోగులున్నారు. ఆరోజు 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి.. నేడు ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకోవద్దు అంటూ మోసం చేశారు. రీ నోటిఫికేషన్ ఇచ్చే వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గణేష్, గ్రామీణ ప్రాంత నిరుద్యోగ జేఏసీ అధ్యక్షులు :

జగన్ రెడ్డి.. 25 నెలల పాటు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా.. ఇప్పుడు ఉద్యోగాలు లేని క్యాలెండర్ ఇచ్చారు. 90% మేనేజ్ చేసుకునేలా ప్లాన్ చేశారు. పోలీస్ డిపార్ట్ మెంట్ లో 450, గ్రూప్స్ 36 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ పచ్చి మోసం. మండలానికో ఉద్యోగం కూడాలేదు.

అంగన్వాడీలను ప్రాథమిక పాఠశాలల్లో కలిపి.. అంగన్వాడీ టీచర్లను జూనియర్ టీచర్లుగా ప్రమోట్ చేస్తామనడాన్ని ఖండిస్తున్నాం. సచివాలయ ఉద్యోగుల్లో ఒకరికి రాష్ట్ర పోలీసులుగా గుర్తిస్తామంటూ జీవో నెం.59 ఇవ్వడం ప్రభుత్వ అవగాహనాలోపానికి నిదర్శనం. రాష్ట్రంలో 25వేల పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయని పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ప్రకటించి.. ఈ రోజు 450 పోస్టులంటే.. అమర వీరుల ఆత్మ ఘోషించేలా చేశారు.

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పూర్తైన తర్వాత డీఎస్సీ ఇస్తామంటున్న సజ్జలకు బుర్ర పనిచేస్తుందో లేదో అర్ధం కావడం లేదు. ఆ మాట ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు.? రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. 6500 పోలీస్ ఉద్యోగాలిస్తామన్న హోం మంత్రి ఇప్పుడు ఎక్కడున్నారు.? మెగా డీఎస్సీ, 6500 పోలీస్ ఉద్యోగాలు, 2000 గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు, 5000 గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలు, లైబ్రరీ సైన్సెస్, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ తో కలిపి మొత్తంగా.. 50వేల ఉద్యోగాలతో రీ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.

అడపాక చిన్నారావు, ఆంధ్రాయూనివర్శిటీ నిరుద్యోగ జేఏసీ :

గతంలో ఏటా 2వేల నుండి 3వేల వరకు కానిస్టేబుల్ పోస్టులుంటే.. ఇప్పుడు ఎస్సై, కానిస్టేబుల్ కలిపి 450 పోస్టులా.? ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇవ్వని విధంగా 2018లో 900గ్రూప్ 2 పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే.. ఈ రోజు గ్రూప్ 1, గ్రూప్ 2 కలిపి 36 పోస్టులా.? జిల్లాకి ఒకటి కూడా లేదన్నది నిజం కాదా.? ఉద్యోగాలివ్వమంటే అరెస్టు చేస్తున్నారు. రాష్ట్రంలో 20లక్షల నిరుద్యోగులు ఉన్నారు. విద్యార్ధుల కోసం చేసిన పోరాట స్పూర్తితో.. నిరుద్యోగ యువత కోసం పోరాటం చేస్తామని మీరు ముందుకొస్తే.. మేం తోడుగా నిలబడతాం.

ఎం.సుబ్బారావు, ఏఐఎస్ఎఫ్ :

ప్రతి సంవత్సరం జనవరిలోనే జాబ్ క్యాలెండర్ ఇస్తామని, ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చి.. మూడో ఏడాది 10వేల ఉద్యోగాలతో మోసం చేశారు. క్యాలెండర్ లో పేర్కొన్న ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ప్రకారం ఎన్ని వస్తాయో ఏ రోజైనా ఆలోచించారా.? ఉద్యోగాల పేరుతో హామీ ఇచ్చి.. రూ.5వేల వేతనాలతో వాలంటీర్ ఉద్యోగాలిచ్చి అదే మహాభాగ్యం అనుకోమంటున్నారు. మెగా డీఎస్సీ ఇస్తామని విద్యాశాఖ మంత్రి, 6500 పోలీస్ ఉద్యోగాలిస్తామని హోం మంత్రి ప్రకటించి.. ఇప్పుడు నోరెత్తడమే మానేశారు.

కొచ్చర్ల శ్రీనివాసులు :

గతంలో యూనివర్శిటీల్లోని ఖాళీల భర్తికి హైపవర్ కమిటీ ఏర్పాటు చేసి.. 3200 పోస్టులు ఖాళీలు ఉన్నట్లు గుర్తించి 1711 భర్తీకి 2015లో నిర్ణయించారు. గతంలో రాజకీయ ప్రమేయంతో పోస్టుల భర్తీ జరిగితే.. తర్వాత న్యాయబద్దంగా భర్తీ అయ్యాయి. ఏపీపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించి భర్తీ చేశారు. సొంత వారిని అడ్డదారిలో రిక్రూట్ చేసుకోవడం కోసం కోర్టుల్లో కేసులు వేసి న్యాయంగా జరగాల్సిన రిక్రూట్ మెంట్ అడ్డుకున్నారు.

లక్ష్మణరావు :

పోలీస్, డీఎస్సీ సహా అనేక పోస్టుల విషయంలో ఇచ్చిన హామీ అమలు చేయమని మాత్రమే నిరుద్యోగులు కోరుతున్నారు. కానీ.. అలా చేయకుండా అడిగిన వారిని అరెస్టు చేస్తున్నారు. పరీక్షల విషయంలో చూపిన పోరాట స్ఫూర్తి.. ఉద్యోగ క్యాలెండర్ విషయంలో చూపాలి. అప్పులు చేసి కోచింగ్ తీసుకున్నవారంతా.. ప్రభుత్వ నిర్ణయంతో మోసపోయామని బాధపడుతున్నారు. రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తే.. రాష్ట్రంలోని నిరుద్యోగులంతా అండగా నిలుస్తారు.

బాలాజీ :

జగన్ రెడ్డి.. తాజాగా ఇచ్చిన క్యాలెండర్ తో నిరుద్యోగులందరినీ మోసం చేశారు. పోలీస్ డిపార్ట్ మెంట్ లో 2018లో 2700, 2016లో 5వేల పోస్టులతో నోటిఫికేషన్లు వచ్చాయి. కానీ ఇప్పుడు 450 పోస్టులతో నోటిఫికేషన్ అంటే నిరుద్యోగుల్ని వంచించడమే. విజయనగరం, కాకినాడ, కర్నూలు వంటి ప్రాంతాల్లో లక్షల మంది నిరుద్యోగులు శిక్షణ తీసుకుంటున్నారు. వారితో మాట్లాడి.. ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సాయికుమార్, ఎంటూరు :

జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నాం. తల్లిదండ్రులు కూలి పనులు చేసి కోచింగ్ ఇప్పిస్తున్నారు. పోలీస్ అవ్వాలనే లక్ష్యంతో నాలుగేళ్లుగా ఇంటికి కూడా వెళ్లకుండా చదువుతుంటే.. 450 పోస్టులు చూసి ఏడుపు ఆగలేదు. 7లక్షల మంది అప్లై చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. త్వరలో 6500 పోస్టులిస్తామంటూ హోం మంత్రి, ముఖ్యమంత్రి ఆశలు రేకెత్తించారు. ప్రజలకు చిల్లర విదుల్చుతూ.. వారి పిల్లలకు రావాల్సిన ఉద్యోగాలను నిర్వీర్యం చేస్తున్నారు. జీవో నెం.59తో సచివాలయ సిబ్బందిని.. పోలీస్ డిపార్ట్ మెంట్లో విలీనం చేస్తామంటే.. ఏళ్లుగా ప్రిపేర్ అవుతున్నవారి పరిస్థితి ఏంటి.?

మంచులాల్ నాయక్ :

వెటర్నరీ అసిస్టెంట్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకున్నా.. హాల్ టికెట్లు రాలేదు. ప్రత్యేక నోటిఫికేషన్ ఇస్తామంటూ మంత్రి చెప్పారు. రాష్ట్రంలో 6వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉంటే.. భర్తీ అనే మాటే లేకుండా మోసం చేశారు.

మౌనిక :

గ్రూప్ 1, గ్రూప్ 2 కోసం గత మూడు సంవత్సరాలుగా కోచింగ్ తీసుకుంటున్నాం. కానీ.. జగన్ రెడ్డి ప్రకటించిన 36 పోస్టులు చూశాక అసలు ఉద్యోగం వచ్చేదేనా అనిపిస్తోంది. పోలీస్ ఉద్యోగాల కోసం ఒక్కో జిల్లా నుండి వేలాది మంది కోచింగ్ తీసుకుంటుంటే.. 450 పోస్టులు ప్రకటించడం దుర్మార్గం. ఈ పోస్టుల్ని చూసి.. పెళ్లి చేసేస్తామని ఇంట్లో అంటుంటే ఏం చేయాలో అర్ధం కావడం లేదు.

సాయి కృష్ణ, కడప :

రాష్ట్రంలో సుమారు 30 లక్షల మందికి పైగా నిరుద్యోగులున్నారు. ప్రభుత్వం ప్రకటించిన పోస్టులు జిల్లాల వారీగా చూస్తే.. ఏ జిల్లాకు ఎన్ని పోస్టులో ఆలోచించాలి. ప్రభుత్వ క్యాలెండర్ చూసి చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. కొంత మందికి ఇదే చివరి సంవత్సరం అయిన వారి పరిస్థితి ఏమిటి.? చాలా మంది ఆర్ధిక కష్టాలతో పగటి పూట కూలి పనులు చేసుకుంటూ.. రాత్రి ప్రిపేర్ అవుతున్నారు. జగన్ రెడ్డి వెంట జెండా పట్టుకుని తిరిగిన నాకే చిరాకొచ్చింది. సచివాలయ ఉద్యోగాలను కార్యకర్తలతో నింపుకున్నారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *