మండుటెండల ‘థార్’ లో పూచిన శీతల పుష్పం? ఇదేంటో తెలుసా?

ఇది థార్ ఎడారి మధ్యలో వికసించిన ఎడారి పూవు.

జై సల్మేర్ శామ్ డ్యూన్స్ లో ఉండే కనోయ్ గ్రామ సమీపాన థార్ అగ్నిగుండం లో పుట్టిన శీతల పుష్పం.

ఇదొక ఇంజనీరింగ్ అద్భుతం.

దూరాన్నుంచి చూసినా, డ్రోన్ ఫోటోలు చూసినా  గ్రహాంతర శక్తి ఏదో  వచ్చి మంత్రించి రాత్రికి రాత్రి ఈ భవనాన్ని నిలబెట్టిందా అనిపిస్తుంది.

దగ్గరి కొచ్చి జాగ్రత్తగా చూస్తే ఏదో  పాశ్చాత్య దేశపు కార్పొరేట్ కార్యాలయంలాగా కనిపిస్తుంది.

కనీసం  ఇళ్లకు బాల్కనీ కూడా లేకుండా కాంపాక్ట్ బిల్డింగ్ డిజైన్లకు అలవాటు పడిన భారతీయులకు  ఇంత  చిత్ర విచిత్రమయిన అర్కిటెక్చర్ తో కట్టిన భవనాలు అవసరం లేదు.

మనకు అన్నింటిని కూల్చి పడేసే  వాస్తు శాపముంది తప్ప వాస్తుశైలి స్పృహ లేదు.  జాగాను డబ్బుల్లో కొలిచి స్కూళ్లు, ఆసుపత్రులు, కార్యాలయాలు, విశ్వవిద్యాలయాలు కట్టే చోట వాస్తుశైలి వికసించదు.

అందుకే  ఇలాంటి అర్కిటెక్చరల్  అద్భుతాలు ఎక్కడా కనిపించవు, ‘సిలికాన్ వ్యాలీ’లనే వాటిలో  తప్ప. ఇటీవల సాఫ్ట్ వేర్ కంపెనీల కార్పొరేట్ కార్యాలయాలు మాత్రమే ఇలా విలాసవంతంగా కనిపించడం మొదలయింది.

మన కట్టుకునే ప్రభుత్వ కార్యాలయాలు, యూనివర్శిటీ భవనాలు, ఆసుపత్రులు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా  పుడతాయి తప్ప, కళాఖండాలుగా కాదు.

వాటిలో జీవం ఉండదు.  కళ కనిపించదు. అక్కడ పనిచేసినా మనసులో కొత్త దనం పుట్టదు.

ఈ కాని ఈ ఫోటోలో ఉన్న భవనం …  ప్రభుత్వ కార్యాలయాలకంటే, ముఖ్యమంత్రుల నివాసాలకంటే, ప్రభుత్వ ఆసుపత్రుల డిజైన్ల కంటే, విశ్వవిద్యాలయాల భవన రీతి కంటే భిన్నంగా ఉంది. విలాసం వంతంగా ఉంది. కంటికి ఇంపుగా ఉంది. మనుసుకు ఆహ్లాదకరంగా ఉంది. ఆరోగ్య కరంగా ఉంది. ఈ భవనం చూస్తూనే ఏదో ఉల్లాసం తారట్లాడుతుంది అంతరాళంలో.

credits: Diana Kellog

 

భారత  పార్లమెంటు భవనం నిర్మించిన రాతి (శాండ్ స్టోన్)తోనే ముచ్చటమయిన ఈ భవనమూ తయారయింది. ఈ భవనం గుండ్రంగా కాకుండా అండాకారంలో ఉంటుంది. ఎందుకుంది? గాలి వెలుతురు సమృద్ధిగా ప్రసరించేందుకు ఏర్పాట్లున్నాయి. ఎడారి మధ్యలో ఉన్నా చల్లగా హాయిగా ఉండటం ఈ భవనం ప్రత్యేకత. ఆందులో ఉంటే థార్ ఎడారి కాక మనదాకా రానేరాదు.

ఎడారిలో మధ్యలో ఇసుక తిన్నెళ్లో ఎండలెలా మండుతుంటాయో బయటి ప్రపంచానికి తెలియదు. మట్ట మధ్యాహ్నపు టెండ ఎంత తీక్షణంగా ఉంటుందో అంతా  వూహించలేరు. అక్కడ ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెంటిగ్రేడ్  దాకా ఉంటుందంటే కొద్దిగా అర్థమవుతుంది. ఆ ఎండలో వడగాడ్పులు వొంటిని కాల్చుసేలా ఉంటాయి.

అక్కడొక స్కూలో, కార్యాలయమో, విశ్వవిద్యాలయమో, ఆసుపత్రో కట్టాలనుకోండి, అది చల్లగా, ఆహ్లాదకరంగా ఉండాలని కోరుకోండి. ఇదెలా సాధ్యం?

మనకయితే, ఎసి రూములు గుర్తుకొస్తాయి. ఆ ఎడారిలో  కట్టే బిల్డింగ్ చల్లగా ఆహ్లాదకరంగా ఉండాలంటే ఎవరికైనా ఎయిర్ కండిషన్డ్ గదులే కావాలి.మనకు సెంట్రలైజ్డు ఎసి గుర్తుకొస్తుంది.

అయితే,  భారతదేశంలోనే విశిష్టయమయిన వాస్తుశైలితో, అందంగా, ఎసిల అవసరం లేకుండానే ఎపుడూ చల్లగా ఉండేలా ఈ భవనం కట్టారు. భారరతదేశంలో చల్లటి విశాలమయిన నాన్ ఎసి బిల్డింగ్ ఇదేనేమో… భవన అండకారంలో కూడా తాత్వితక చొప్పించారు. అండాకార మాతృత్వానికి ప్రతీకగా వాడారు.  ప్రపంచంలో అత్యుత్తమ వాస్తు శైలికి గుర్తింపుగా నిలిచిన ‘AD-100 Building of the year’ గా ఈ భవనానికి గుర్తింపు వచ్చింది (కింది వీడియో).


ఇంతకీ ఈ భవనం ఏమిటో తెలుసా?

credit: citta.org

ఇది పేదల పిల్లలకోసం కట్టిన పాఠశాల అంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదూ?

అవును నిజం, ఇది దారిద్య్రంలో మగ్గిపోతున్న కుటుంబాల బాలికలకోసం  అక్షరాలు నేర్పించేందుకు, తల్లులకు జీవనోపాధి విద్యలు నేర్పేందుకు కట్టిన స్కూలు.

credit: citta.org

దీని పేరు రాజకుమారి రత్నావతి బాలికల పాఠశాల (Rajakumari Ratnavati Girls’ High School). భవనం మీద ఏర్పాటు చేసిన సోలార్ పానెల్స్, భవనం చుట్టూర ఏర్పాటు చేసి మెష్ గోడలు ఎసి వాతావరణ కల్పిస్తాయి. ఈ రెండింటితో స్కూల్లోని తరగతి గదులే కాదు, లోగిలి కూడా చల్లగా ఉంటుంది. పిల్లలు ఎండను లెక్క చేయకుండా ఆడుకోవచ్చు.

 

credit: citta.org

 

ఈ కాంప్లెక్స్ లో మొత్తం మూడు భవనాలున్నాయి. సమిష్టిగా ఈమూడింటిని జ్ఞాన కేంద్రం (Gyaan Centre)అని పిలుస్తారు.  స్కూల్లో కిండర్ గార్టెన్ నుంచి పదో తరగతి వరకు 400 మంది విద్యార్థులు ఇందులో చదవుకోవచ్చు.

స్కూలు కాంప్లెక్స్ లో ఒక జౌళి మ్యూజియం, ఒక కళా ప్రదర్శన శాల, ఆ ప్రాంత గ్రామీణ కళాకారులు ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించుకునేందుకు వీలుగా ఒక  ప్రదర్శన శాల కూడా ఉన్నాయి. ఈ పాఠశాల మరొక విశేషం, ఇక్కడ చదువుకునే బాలికల తల్లుల జీవనోపాధి క్పలన కోసం కొన్ని రకాల చేతి వృత్తులలో ముఖ్యంగా చేనేత, అల్లికలు, రంగులద్దడం వంటి వృత్తులలో  శిక్షణనీయడం. దీనికోసం ప్రత్యేకంగా ఒక భవనం కేటాయించారు.

credit: citta.org

 

ఇందులోనే ఒక లైబ్రరీ, ఆడియో విజువల్ లెక్చర్ హాల్ కూడా ఉన్నాయి. అమెరికా న్యూయార్క్  స్టేట్ లో రిజిస్టరయిని నాన్ ప్రాఫిట్ సంస్థ సిట్టా (CITTTA)ఈ పాఠశాలను స్థాపించింది. ఈ పాఠశాలను ఎలా ఉండాలని, ఎలా నడపాలి, భవనం ఎలా ఉండాలని అనే ఆలోచన చేసేందుకు, ఆ భావానికి ఆకారం ఇచ్చేందుకు  దాదాపు పదేళ్లు పట్లిందని సిట్టా సంస్థాపకుడు మైఖేర్ డాబ్ చెప్పారు. సిట్టా  ఇండియా, నేపాల్ లలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి  కార్యక్రమాలు చేపడుతూ ఉంది. ఇండియాలో థార్ ఎడారి ప్రాంతంలో ఉన్న పేద వర్గాల మహిళ సాధికారీకరణ కు పాటుపడాలని ఈ ప్రాంతంలో పాఠశాల నిర్మించారు. ఈ భవనం డిజైన్ అమెరికా కు చెందిన డయానా కెల్లాగ్ రూపొందించారు. ఇక్కడి విద్యార్థుల యూనిఫామ్  ని ప్రఖ్యాత భారతీయ ఫాషన్ డిజైనర్  సబ్యసాచి ముఖర్జీ రూపొందించారు. పాఠశాల ఏర్పాటుకు జైసల్మేర్ ఫౌండేషన్ ప్రెశిడెంట్ మానవేంద్ర  సింగ్ రాజమాత రాజేశ్వరి దేవీకి  అందించారు. పాఠశాల నిర్మాణానికి కొంత నిధిని కూడా ఆయన సమకూర్చారు.

Michael Danube (credit: citta.org)

ఈ పాఠశాలను  రెండెేళ్లకిందటే ప్రారంభించాలనుకున్నారు. అయితే, కోవిడ్ వల్ల అది వాయిదా పడింది. ఇపుడు పరిస్థితి చక్కబడుతున్నందునే తొంబదర్లోనే  మొదటి విడత అయిదో తరగతి వరకు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాఠశాలలో పిల్లలకోసం ఆరోగ్య కరమయిన మధ్యాహ్నం భోజనం కూడా అందిస్తారు.

credit: citta.org

ఇలాంటి పాఠశాలలను ప్రోత్సహించాలనుకునే వారు క్లాస్ రూమ్ లను, విద్యార్థులను స్పాన్సర్ చేయవచ్చు. క్లాస్ రూమ్ స్పాన్సర్ చేస్తే 10 వేల డాలర్లు విరాళమీయాలి. అది ఒక ఏడాదికి తరగతి నిర్వహణకు వర్తిస్తుంది.  ఈ స్కూలులో చదువుకునే పిల్లలంతా దారిద్య్రంలో ఉన్న కుటుంబాల నుంచి వచ్చారు. కాబట్టి ఈ విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తారు. ఈ ఖర్చంతా సిట్టా యే భరిస్తుంది. అయితే, విద్యార్థులను దత్తత తీసుకుని కొంత విరాళమీయవచ్చు. ఇలా విరాళమిచ్చిన దాతలకు తరగతి కార్యకలపాల మీద, విద్యార్థుల విద్యా ప్రగతి మీద ప్రతిమూడునెలలకొకసారి రిపోర్టులను పంపిస్తూ ఉంటారు. వారు తమ నిధులు ఎలా ఖర్చవుతున్నాయో  కూడా పర్యవేక్షించవచ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *