పరిశ్రమలొచ్చాయనేది పచ్చి అబద్ధం: యనమల

(యనమల రామకృష్ణుడు)

రాష్ట్రంలో గత రెండేళ్లలో జరిగిన పారిశ్రామిక ప్రగతి శూన్యం. కొత్తగా ఒక పరిశ్రమ రాలేదు, ఒక ఉద్యోగం కల్పించలేదు.

పారిశ్రామికాభివృద్ధిపై మంత్రి గౌతమ్ రెడ్డి చెబుతున్నవన్నీ అవాస్తవాలే. రాష్ట్రంలోని వివిధ పరిశ్రమల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఎంఎస్ఎంఇలకు మీరు ఇచ్చిన హామీలు ఎంత వరకు అమలు చేశారు?

మత్స్యకారుల పేరుతో షిప్పింగ్ యార్డులను మీ బినామీలకు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎస్.ఇ.జెడ్ లను కూడా మీ అనుయాయులకు అప్పగించుకున్నారు.

రాష్ట్రంలో అంతా బాగుంటే పారిశ్రామిక వృద్ధిరేటు -3.26 కిఎందుకు విడిపోయింది? రాష్ట్రంలో జిఎస్ డిపి రేటు 1.58గా నమోదైనట్లు మంత్రి తప్పుదారి పట్టిస్తున్నారు. 2011-12 స్థిరీకరించిన ధరల ప్రకారం జిఎస్ డిపి రేటు -2.58గా నమోదైంది. దేశవ్యాప్తంగా జిఎస్ డిపి కి ఈ లెక్కలనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు.

గత ఏడాదితో పోల్చినా ఈ ఏడాది గణనీయంగా పడిపోయింది. సేవల రంగం వృద్ధి రేటు -6.71కి పడిపోయింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మూడు సార్లు పారిశ్రామిక సదస్సులు నిర్వహించి 15.45 లక్షల కోట్లరూపాయల పెట్టుబడులు, 32లక్షల రూపాయాలు ఉద్యోగాలు కల్పించేవిధంగా ప్రణాళికలు రూపొందించాం. ఇప్పుడు ఆ పరిశ్రమలన్నీ ఏమైపోయాయి?

రాష్ట్రంలో గత రెండేళ్లలో 17లక్షల కోట్లరూపాయల విలువైన భారీ పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. కియా అనుబంధ పరిశ్రమలు, లులూ గ్రూప్, ఆసియా పేపర్ మిల్, అదానీ డాటా సెంటర్, హెచ్ ఎస్ బిసి వంటి ఎన్నో ప్రఖ్యాత సంస్థలు రాష్ట్రం నుంచి తరలిపోయాయి.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 39,450 పరిశ్రమలు ఏర్పాటై 5,13,351 ఉద్యోగాలు వచ్చాయని అసెంబ్లీ సాక్షిగా పరిశ్రమలమంత్రి ప్రకటించిన మాట వాస్తవం కాదా? రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి ద్వారా లక్షలాది మందికి ఉపాథి అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించగా, ఆయా కారిడార్ల పరిధిలో కనీసం భూసేకరణకు కూడా సరిపడా నిధులు కేటాయించడం లేదు. రాష్రవ్యాప్తంగా ఇండస్ట్రియల్ కారిడార్ల పరిధిలో ఇప్పటివరకు 20శాతం భూసేకరణ కూడా పూర్తికాలేదు.

భూసేకరణకు 50వేల కోట్లరూపాయలు అవసరం కాగా, ఈ ఏడాది బడ్జెట్ లో కేవలం వెయ్యికోట్ల రూపాయలు కేటాయించారు. మూడేళ్లలో కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ లో మౌలిక సదుపాయాల కోసం కేవలం 250 కోట్లు కేటాయించారు. దీనినిబట్టి స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై వారికున్న శ్రద్ధ ఏపాటిదో అర్థమవుతోంది.

ఎస్ఎస్ఎంఇ లకోసం గతంలో కేటాయించిన భూములకు రెట్టింపు ధరలు చెల్లించాలని వత్తిడి తెస్తుండటంతో వారంతా పారిపోతున్నారు. కొన్నిచోట్ల ఎంఎస్ఎంఇలకు కేటాయించిన భూములను ఇళ్లస్థలాలకోసం లాక్కున్నారు. దీనినిబట్టే పారిశ్రామికాభివృద్ధిపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థమవుతుంది.

కరోనా కారణంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో లక్షకు పైగా ఎంఎస్ఎంఇ లు ఉండగా, కేవలం 12వేల ఎంఎస్ఎంఇలకు మాత్రమే రూ. 905 కోట్ల రీస్టార్ట్ ప్యాకేజి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. రాష్ట్రంలోని పరిశ్రమలకు చెల్లించాల్సిన పారిశ్రామిక ప్రోత్సాహకాలు సుమారు 5వేల కోట్లరూపాయలు ఉండగా, గత రెండేళ్లలో ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు.

ఇవన్నీ పరిశీలిస్తే రాష్ట్రంలో పారిశ్రామిక రంగం తిరోగమనంలో పయనిస్తున్నట్లు స్పష్టమవుతుండగా పరిశ్రమల మంత్రి మాత్రం పెద్దఎత్తున పారిశ్రామికాభివృద్ధి జరుగుతున్నట్లు కాకిలెక్కలు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. గత రెండేళ్లలో రాష్ట్రంలో సాధించిన పారిశ్రామిక ప్రగతి, కల్పించిన ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.

(యనమల రామకృష్ణుడు, శాసనమండలి ప్రతిపక్ష నేత)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *