ఆంధ్రలో ప్రాణాలకు తెగిస్తున్న 7వేల మంది ‘సైనికు’లకు అన్యాయం

ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న ఒప్పంద పారా మెడికల్ సిబ్బంది కష్టాన్ని, ధైర్యాన్ని గుర్తించి ప్రభుత్వం తక్షణమే వారందరి ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని AP JAC అమరావతి నేతలు బొప్పరాజు, వైవీ రావు, VV మురళీకృష్ణ నాయుడు, ఆంధ్రపదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

దేశరక్షణకు సైన్యం నిరంతరం గస్తీ చేస్తే , దేశ ప్రజలందరి ఆరోగ్యం కాపాడడం కోసం  ప్రపంచ మహమ్మారి కరోనాతో పోరాటం  చేస్తున్న సైనికులు వైద్య ఆరోగ్య శాఖలోని పారా మెడికల్  సిబ్బంది అని, వారికి గుర్తింపు నీయాలని, న్యాయం చేయాలని వారు ముఖ్యమంత్రి జగన్ కు విజ్ఞప్తి చేశారు.

వాళ్లకి జీతాలు కూడా రెగ్యులర్ గా ఇవ్వడం లేదు. వారిసహకారం లేకుండా  కరోనాను మనం జయించనేలేం. ఇప్పటిదాకా 40 మంది దాకా ఈసేవలు చేస్తూ చనిపోతే పైసా కూడాసాయం చేయడంలేదు.

ఎవరీ పారామెడికల్ సైనికులు

రెండు దశాబ్దాలనుండి అనేక డియస్సిల ద్వారా  ఆర్డర్ ఆప్ మెరిట్,రూల్ ఆప్ రిజర్వేషన్ అన్ని నియమ నిబంధనలను అనుసరించి ఈ రాష్ట్రంలో వేలాదిమంది ఒప్పంద ఉద్యోగులు (contract employees) విద్య, వైద్య శాఖలో పనిచేస్తున్నారు.  ప్రత్యేకంగా వైద్య శాఖలో  మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు (మగ) ఏయన్ యంలు, పార్మసిష్టులు, ల్యాబ్ టెక్నియన్లు DSC ద్వారా దాదాపు 7000 మంది ఉద్యోగల్లో చేరటం జరిగింది.

నాడు ఉద్యోగ నియామక పత్రాల్లో, అమలులో వున్న పీఆర్సీ తో పాటు రెగ్యులర్ ఉద్యోగులకు వుండే అన్ని అలవెన్స్ లతో జీతాలు ఇస్తామని చెప్పిన నాటి ప్రభుత్వాలు ఆ హామీలు మర్చిపోయాయి. 2018 సంవత్సరంలో గత ప్రభుత్వం జారీ చేసిన జివో నెంబర్ 27 ఒప్పంద ఉద్యోగులకు శాపంగా మారింది.

అప్పటివరకు ఉన్న ప్రయోజనాలు కూడా తీసివేసి కాంట్రాక్టు పారా మెడికల్ ఉద్యోగులకు తీరని ద్రోహం చేసింది గత ప్రభుత్వం. ప్రస్తుత అతి ప్రమాదకరమైన కరోనా పరిస్థితుల్లో, ముందుండి వారి ప్రాణాలను సహితం లెక్క చేయకుండా కరోనాతో పోరాడుతున్న కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులకు కనీసవేతనాలు కూడా చెల్లించడం లేదంటే ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి. ఇది చాలా బాధాకరమైన విషయం.

2018 నాటికి దాదాపు 115 మంది ఒప్పంద పారా మెడికల్ సిబ్బంది చనిపోయినా ఎలాంటి బెనిఫిట్స్ లేవు…చివరికి ఎక్సగ్రేషియా కూడా లేదు..

2019లో GO No.25 ద్వారా ఒప్పంద ఉద్యోగులు సాధారణంగా చనిపోతే 2 లక్షల ఎక్సగ్రేషియా, ఆక్సిడెంట్ డెత్ అయితే 5 లక్షలు చెల్లించాలి.

GO వచ్చిన తర్వాత, ఇప్పటివరకు దాదాపు 40 మంది ఒప్పంద ఉద్యోగులు ఈ రాష్ట్రంలో చనిపోతే (ఎలాంటి ఇతర బెనిఫిట్స్ ఉండవు) ఒక్క రూపాయి కూడా వారి కుటుంబాలకు ఎక్సగ్రేషియా చెల్లించలేదంటే చాలా బాధగా, ఆవేదనగా ఉంది.

మనందరి ఆరోగ్యాన్ని చూసే వేలాదిమంది ఒప్పంద పారా మెడికల్ సిబ్బందికి కనీసం ఆరోగ్య కార్డు పొందటానికి కూడా అర్హత లేదంటే వారి దీన పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తున్న వైద్య శాఖలోని ఒప్పంద పారా మెడికల్ సిబ్బందికి జీతం కూడా సరైన సమయంలో రావడం లేదంటే అతిశయోక్తి లేదు.

ప్రతి సంవత్సరం కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వడం ఇబ్బందనుకుంటే… ఇప్పుడు ప్రతి 6 మసాలకొకసారి పోస్టుల కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వడం ఇంకా దారుణం. నేటి ప్రభుత్వం గత సంవత్సరం మళ్ళీ మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడంతో వెంటనే రెగ్యులర్ అవుతామని వారందరూ భావించారు.

అయితే ఉప సంఘము సాంకేతిక సలహాలు ఇవ్వడానికి రాష్ట్ర ఉన్నతాదికారుల కమిటీని నియమించింది. వారి నివేదిక ఏమైందో తెలియదు. నేటికి ఎలాంటి చర్యలు లేవు.

AP JAC అమరావతి రాష్ట్ర నాయకత్వం కాంటాక్ట్ మెడికల్ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలని, వారిని తక్షణమే క్రమబద్ధీకరణ చేయాలని కోరుతూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చాము.

ప్రభుత్వం  కమిటీ నివేదికల పేరుతో కాలయాపన చేయకుండా త్వరితగతిన మంత్రి వర్గ ఉపసంఘ నివేదికలు తెప్పించుకొని మొదటి వేవ్ మరియు సెకండ్ వేవ్ కరోనా కారణంగా వారి ప్రాణాలను సహితం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న ఒప్పంద ఉద్యోగులు ప్రత్యేకంగా పారా మెడికల్ సిబ్బందిని వెంటనే క్రమబద్దీకరించాలి.

కనుక వారి కష్టాన్ని, ధైర్యాన్ని గుర్తించి ముఖ్యమంత్రి గారు DSC ద్వారా, రోస్టర్ విధానంలో ఎంపికై, గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులను తక్షణమే క్రమబద్దీకరించడం ద్వారా రాబోయే అత్యంత ప్రమాదకరమైన కరోనా పరిస్థితులు కూడా ఎదుర్కొనేలా వారిలో ఆత్మ విశ్వాసం నింపాలి.

క్రమబద్ధీకరణ చేయడం ద్వారా ఇంకా మెరుగైన సేవలు మనకు, రాష్ట్ర ప్రజలకు అందించే ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని  ముఖ్యమంత్రి గారు వారికి కలుగచేయలని AP JAC అమరావతి పక్షాన కోరుకుంటున్నామని వారు చెప్పారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *