మృతదేహంతో ఆ రోజు స్మశానానికి ఎవరూ రాలేని ఓ దీనగాధ

ధనబలం ఉంది,
బంధుబలగం ఉంది,
కులబలమూ ఉంది,

కానీ, మృతదేహంతో ఆరోజు స్మశానానికి వచ్చే మనుషులు లేని ఓ దీనగాధ!

ఇఫ్టూ ప్రసాద్ (పిపి)

ఇవి ఊరూరా విషాద గాధలే. అందరికీ ఎదురయ్యేవే. నాకూ ఎదురైన ఓ స్వానుభవమిది.

విజయవాడలో మా ప్రక్కింటి 67 ఏళ్ల వృద్ధురాలు మూడు రోజుల క్రితం (26-4-2021న) కోవిడ్ తో మృతి చెందారు. మూడు వారాల క్రితం ఆమెకి వాక్సిన్ కూడా వేయించారు. మూడు రోజుల ముందు జ్వరం ప్రారంభమై గత సోమవారం శ్వాసక్రియ సమస్య ఏర్పడింది. సకాలంలో అంబులెన్స్ రాలేదు. తనకారులో ఆమెని కన్నకొడుకే ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అడ్మిట్ చేసుకునే లోపు మృతి చెందారు. అదే కారులో ఇంటికి మృతదేహాన్ని తెచ్చి, క్రిందికి దింపకుండానే దహన క్రియకి ఏర్పాటు చేసుకొని, అదే కారు లో స్మశానానికి తీసుకెళ్లారు.

మృతురాలికి ఇద్దరు బిడ్డల తో పాటు సమీప బంధువులు వున్నారు. కడచూపుకు స్థానిక బంధువులు సైతం రాలేదు. ఒకరిద్దరు వచ్చి కూడా వెంటనే వెళ్లారు. ఎవరి భయం వారిదే. ఎవరి కోసం వేచి చూడకుండా తన కన్నతల్లి అంత్యక్రియలకు కన్నకొడుకు పూనుకున్నారు.

మా వీధిలో డజనుకు పైగా ఇళ్ళు, ఇరవైపైగా కుటుంబాలు ఉంటాయి. మృతురాలు వీధి జనంతో సరదాగా, స్నేహంగా వుంటారు. ఆమెపై అభిమానం ఉంది. ఆమె మృతి అందరికీ బాధ కలిగించేదే. మృతదేహం వద్ద పట్టుమని పదిమంది లేరు. ఎవరూ పదినిమిషాలు లేరు. కోవిడ్ వ్యాధి మానవతని ఎలా దెబ్బతీస్తుందో ఓ ఉదాహరణ!

ఆమె షుగర్ పేషెంట్. హార్ట్ పేషెంట్ కూడా. ఐనా జ్వరం వచ్చాక టెస్ట్ చేయించక పోవడానికి ఓ కారణం ఉంది. వాక్సిన్ వేసుకుంటే కోవిడ్ రాదని వారి బలమైన నమ్మకం. వాక్సిన్ సమగ్ర వ్యాధి నివారిణి గా జరిగే పబ్లిసిటీ కూడా ఈ మరణానికి ఓ కారణమే.

మృతురాలి వ్యాధి లక్షణాలు కోవిడ్ ని పొలినవే. ఐతే ఆమెకి హాస్పిటల్ లో టెస్ట్ చేయక ముందే మరణించారు.

మనుషుల ప్రాణాల పట్ల ప్రభుత్వాల తప్పుడు విధానం తాజా మృత్యుఘోషకు ప్రధమ & ప్రధాన కారణం. ఇవి సహజ మరణాలు కాదు, ప్రభుత్వాలు చేసే రాజకీయ హత్యలే!

బాధిత ప్రజల వైపు నుండి కూడా కొన్ని స్వల్ప కారణాలు ఉంటే ఉండొచ్చు. ఐతే ఈ ప్రాణ నష్టాలకు అవి ముఖ్యం కాదు. మాపక్కింటి వృద్ధురాలి మృతికి బయటకు కనిపించే కారణాల్లో కొన్ని వారి నుండి జరిగాయని అనిపిస్తుంది. వాటికీ ప్రభుత్వ విధానాలే మూల కారణం. ఈ వ్యాధి పట్ల ప్రభుత్వాలు, బడా కార్పొరేట్ మీడియా సృష్టించిన హంగామా వల్ల వ్యాధి సోకితే బ్రతకమేమో అనే భయం ఓ కారణం. వాక్సిన్ వేసుకుంటే, కరోనా వ్యాధి సోకదనే ప్రభుత్వ పబ్లిసిటీని నమ్మడం మరో కారణం. ఈ వ్యాధి పట్ల ప్రజల్లో తగు అవగాహనని ప్రభుత్వాలు కల్పించకపోవడం వల్ల ప్రజలు ప్రదర్శించే అశ్రద్ధ, నిర్లక్ష్యాలకు కూడా వాళ్ళు వాస్తవ దోషులు కాదు. మా పక్కింటి ముసలమ్మ మృతికి వాళ్ళనుండి పొరపాట్ల కి కూడా వాళ్ళది బాధ్యత కాదు. ప్రభుత్వాలదే బాధ్యత!

మృతదేహాన్ని అదే కారులో స్మశానానికి తీసుకెళ్లారు. ఆ ఇంట్లో నలుగురున్నారు. ఆమె మృతి చెందగా మిగిలింది ముగ్గురే! ఆమెకొడుకు, కోడలు, మనుమడు. అంత్యక్రియలకి ఆ ముగ్గురే పూనుకున్నారు. వారి వెంట నాలుగో మనిషిగా నేను తప్ప వీధిలో ఎవరూ వెళ్లలేదు. వారి తప్పు కాదని పైన చెప్పా. ఎవరి ప్రాణభయం వారిదే కదా! ఇదీ ప్రజల్లో కోవిడ్ సృష్టించిన భీతావహ పరిస్థితి!

వారు వైశ్యులు. అదే వైశ్య కుటుంబాలు మావీధిలోనూ ఒకట్రెండు ఉన్నాయి. వారు కూడా మృతదేహంతో రాలేదు.

ఆర్ధికంగా వెసులుబాటు ఉంది. కులబలం ఉంది. వీధిలో సోషల్ బలగం ఉంది. కోవిడ్ నుండి డబ్బు ఆమె ప్రాణాన్ని కాపాడలేదు. బంధు గణాలు సంతాప సూచకంగా నిలబడ లేదు. కులజనాలు కాటికి రాలేదు. ఈ ఆపద కాలంలో ధన, కుల, మత, ప్రాంత వంటి బంధాలు మనుషులతో స్థిరంగా నిలిచేవి కాదని వెళ్లాడవుతోంది. ఈ బంధాల్ని అధిగమించిన మానవీయ బంధమే ఇలాంటి కాలాలలో నిలుస్తుంది.

కోవిడ్ ని అడ్డం పెట్టుకొని అమానుష హంతక రాజకీయ వ్యవస్థను నెలకొల్పే లక్ష్యంతో ఫాసిస్టు పాలకవర్గాలు పావులు కదుపుతున్నాయి. ఈ హంతక రాజ్యవ్యవస్థని రాజకీయంగా అంతం చేయకుండా, ప్రజల ఆరోగ్యానికి గారంటీ లేదని ఈ ప్రాణాంతక కోవిడ్ వ్యాధి నేడు మరోసారి నిరూపించింది.

స్మశానంలో ఉండగా మరో ఒకట్రెండు మృతదేహాలు కూడా వచ్చాయి. ఏ మృతదేహంవెంట పదిమంది లేరు. ఐదారుగురు వస్తే ఎక్కువే! కోవిడ్ లో భౌతిక వాస్తవం ఎంత ఉందొ, దాన్ని చూపించి సృష్టించబడ్డ భయ భీతులెన్నో మరో సందర్భంలో చర్చిద్దాం. మనుషుల మధ్య బంధాలు,సంబంధాల్ని తెంచి వేయడం ఓ భౌతిక వాస్తవం.

ప్రాచీన, మధ్య యుగాలలో మానవజాతి ఇంతకంటే ఎన్నో రెట్ల ప్రాణాంతక వ్యాధుల్ని భరించి, అధిగమించింది. ప్లేగు, కలరా, మశూచి, స్వైన్ ఫ్లూ, కుష్టువ్యాధి వంటి ప్రాణాంతక వ్యాధులు భూమండలంపై కోట్ల మందిని బలితీసుకున్నాయి. మానవ శవాలను స్మశానాలకి మోసుకెళ్లే మనుషులు లేని ఘోర కాలాలవి. జనావాసాలు శవాల దిబ్బలుగా మారాయి. మిగిలిన జీవచ్చవాల వంటి మనుషులు తమవాళ్ళ భౌతిక కాయాల్ని రాబందు గుంపులకి అప్పగించి, తమ స్వంతఊర్లని వదిలి, తెలియని ప్రాంతాలకి కట్టుబట్టలతో తరలివెళ్లిన కాలాలవి. ఆధునిక యుగం యిది. ప్రాణాంతక వ్యాధుల వల్ల ఆనాడుకోటి మరణాలతో ఈ ఆధునిక యుగంలో ఒక్క మనిషి మరణంకూడా సమమే.

ప్రజల పన్నులతో మనుగడ సాగించే పరాన్నజీవి వంటి ప్రభుత్వాలు నేడు ప్రజల్ని పాలిస్తున్నాయి. ప్రజల క్షేమాన్ని గాలికి వదిలేసి, బడా కార్పొరేట్ల కోసం ప్రజలకు క్షామకాలాన్ని సృష్టించిన ఫలితమిది.

గత 15 నెలలుగా కోవిడ్ ప్రమాదం తెలిసినా, తగిన ముందస్తు జాగ్రత్తలు ఆయా ప్రభుత్వాలు తీసుకోకుండా దేశప్రజల్ని గాలికి వదిలేసిన ఫలితమిది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ బాధ్యత ప్రధానం. ఇది ఒక్క మా పక్కింటి ముసలమ్మ మరణం మాటకాదు, రాష్ట్రంలో దేశంలో ఊరూరా, వీధివీధినా, పురాలు, పేటలు, బస్తీలు, గూడేలు, గల్లీలు, సందులు, గొందుల్లో ఇంటింటా నేటి మృత్యుఘోషకి బలయ్యే ప్రతిబలిపశువు మాటే ఇది! ఈ హత్యాకాండకి నేటి హంతక రాజ్య వ్యవస్థే మూల కారణం.

బడా కార్పొరేట్ వ్యవస్థకు సేవచేసే ఘరానా రాజకీయ నేరస్తులతో కూడిన ఈ హంతక రాజ్య వ్యవస్థ కొనసాగినంత కాలం ప్రజల ఆరోగ్యానికే కాదు, ప్రాణాలకు కూడా రక్షణ లేదని మరోసారి ఋజువైనది. దీన్ని ఒకవైపు రాజకీయంగా అంతం చేస్తామని ప్రతిన పూనుతూనే, మరోవైపు ప్రజల తాత్కాలిక ప్రయోజనాల కోసం తక్షణ డిమాండ్లపై ఉద్యమించడం తక్షణ కర్తవ్యం. ప్రతి మనిషి మరణం మనలో రాజకీయ క్రోధాన్ని ప్రేరేపించే విధంగా మలుచు కుందాం. ప్రతి కోవిడ్ రోగి అనుభవించే హృదయ వేదనను రాజకీయ ప్రళయ ఘోషని సృష్టించే లక్ష్యం కోసం మార్చుకుందాం. భూమి, భుక్తి, విముక్తి, కూడు, గూడు, గుడ్డ వంటి డిమాండ్లు రేపటి మాట! మనుషుల ప్రాణాలని నిలబెట్టే ప్రాణవాయువు నిత్య సరఫరా, ఉచిత వైద్య చికిత్స, ఉచిత వాక్సిన్ వంటివి తక్షణ కోర్కెలు గా మారాయి. 74 ఏళ్ల చరిత్ర గల స్వాహాతంత్య్ర భారత్ లో మరో పదేళ్లు, పాతికేళ్ళ, యాబై ఏళ్ళు బ్రతికే మనుషుల్ని కూడా  స్మశానానికి పంపే అమానుష హంతక రాజ్య నీతిని ప్రశ్నిద్దాం. ఈమానవీయ డిమాండ్ల సాధన కై దీక్ష వహిద్దాం.

మనఊరిలో, పేటలో, బస్తీలో, వీధిలో, మన ఇరుగు పొరుగు ఇళ్లల్లో, మన ఇళ్ళల్లోనే మన ఆప్తుల్ని, ఆత్మీయుల్ని, తుదకు పేగుబంధాల్ని తెంచే దుస్థితిని రానివ్వకుండా మనల్ని మనం మనుషులుగా చాటుకుందాం.

 

(ఇఫ్టూ ప్రసాద్, రచయిత, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియర్ (IFTU) జాతీయ నాయకుడు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *