తెలంగాణ నైట్ కర్ఫ్యూ వేస్ట్: భట్టి విక్రమార్క

(భట్టివిక్రమార్క మల్లు, MLA, సీఎల్పీ నాయ‌కులు)

కోవిడ్ మహ్మమారి తీవ్రత నేపధ్యంలో రాత్రి 9 గం. నుంచి ఉదయం 5 గం. వరకూ.. రాత్రి కర్ఫ్యూను విధిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు తీసుకున్న నిర్ణయం నిష్ప్ర‌యోజ‌న‌క‌ర‌మైన చర్య అని చెప్పక తప్పదు.

ఇటువంటి రాత్రి కర్ఫ్యూ వ‌ల్ల ఎటువంటి ఉపయోగం లేదు.

జన సంచారం స్వ‌ల్పంగా ఉండే రాత్రి సమయంలో కర్ఫ్యూను  పెట్ట‌డంలో ఔచిత్యం ఏమిటో అర్థం కావ‌డం లేదు. ఈ విధమైన చర్యలు కరోనా వ్యాప్తిని ఏ విధంగా నిలువరిస్తుందో అర్ధం కావడం లేదు. నిర్మోహ‌మాటంగా చెప్పాలంటే చేతులుకాలాక ఆకులు పట్టుకున్న చందాన ఉంది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్య.

గత ఆసెంబ్లీ సమావేశాలలోనే కాంగ్రెస్ శాసనసభ పక్షం తరఫున మేము ప్రభుత్వానికి హెచ్చరించడం జరిగింది. కరోనా వ్యాప్తి ఎక్కువగా పబ్ లు, నైట్ క్లబ్ లు, లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులు, మాల్స్ మరియు సినిమా హాల్సు, ఫంక్షన్ హాల్స్ ద్వారా ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహారించాల్సిన అవసరం ఉందని సదరు ఆసెంబ్లీ సమావేశాలలో తెలియచేయడం జరిగింది.

ఆ విషయాన్ని ప్రభుత్వం అప్పుడు పెడచెవిన పెట్టడమే కాకుండా అయా చోట్ల నిబంధనలను ఉల్లంఘిస్తూ జరుగుతున్న కార్యకలాపాల విషయంలో నిమ్మకుండిపోయింది.

ప్రస్ధుతం పరిస్ధితులు విషమిస్తూ ఉండటంతో కంటితుడుపు చర్యలుగా జన సంచారం ఎక్కువగా లేని రాత్రి వేళల్లో నైట్ కర్ఫూను విధించడం కారణంగా ప్రభుత్వం అసమర్ధతను ప్రశ్నించాల్సి వస్తోంది.

కావున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మెల్కోని అందరి సలహా సూచనల మేరకు కరోనా నియంత్రణలో తగిన చర్యలను తీసుకోవాలని అలాగే రాత్రీ పుట కాకుండా పగలు కర్ఫ్యూ విధించాలి లేదా 144 సెక్షన్ పెట్టి నియంత్రణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.

అదే విధంగా ప్రైవేట్ ఆసుపత్రిలో COVID చికిత్సకోసం అధికమొతంలో డబ్బులు గుంజుతున్నారు. దీనిని అరికట్టేందుకు గత శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని వేశారు. కానీ ఆ టాస్క్ ఫోర్స్ కమిటీ సరిగ్గా పని చేయటంలేదని అర్ధమౌతుంది. ఆ కమిటీ సరిగ్గా పనిచేసేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.

అదే విధంగా కరోనా బారినపడిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖరరావు గారికి త్వరితగతిన సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని అకాంక్షిస్తున్నాను.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *