తిరుపతి పక్కనే మరొక ట్రెకర్స్ స్వర్గం… కాలభైరవ గుట్ట

(భూమన్)

ఈ  ఆదివారం సూర్యోదయం ట్రెకింగ్ కు కాలభైరవ గుట్టను ఎంచుకున్నాం. ఈ గుట్టని దాదాపు పదహారు సార్లు వెళ్లాను. ఇంకా తనివి తీరలేదు. అవకాశమొచ్చినపుడల్లా వెళ్లుతుంటాను.

అందుకే ఈ ఆదివారం మరొక సారి కాలభౌరవ గుట్టకు ట్రెక్ చేయాలనుకున్నాను. ఇది పదిహేడవ సారి. నా ట్రెకింగ్ సహచరుడు  ఆలూరు రాఘవ శర్మ అభిలాష మేరకు ఈ కార్యక్రమాన్ని  చేపడుతున్నాను.

ఈ కాలభైరవ గుట్ట చంద్రగిరి సమీపంలోని డోర్నకంబాలకు వెళ్లే దారిలో ఉండే ఒక కొండ మీద ఉంటుంది. తిరుపతికి 15 కిమీ దూరాన ఉంటుంది.

దీనినే మళ్లేశ్వర స్వామి  గుట్ట లేదా మల్లికార్జున దేవరగుట్టగా కూడా పిలుస్తారు. ఇదే కొన్నాళ్ల తర్వాత కాలభైరవ గుట్టగా పేరుబడింది. ఇపుడిక్కడి ప్రజలు దీనిని కాలభైరవ గుట్ట అనే పిలుస్తుంటారు.

ఈ రోజు  నాలుగు బృందాలు ఒకే సమయంలోనే కాలభైరవ గుట్టను చేరకున్నాయి. ఇలా ఒకేసయంలో అంతా  బయలుదేరి గుట్ట మీదకు  రావడం సందడి సృష్టించింది. చాలా బాగుంది.

కరోనా కలంలో మేం జరిపిన ట్రెకింగ్ లకు ఎనలేని స్పందన వచ్చింది. దానిని స్ఫూర్తిగా తీసుకుని అనేక మంది ట్రెక్ చేస్తూ ప్రకృతికి సన్నిహితంగా జరిగి, ప్రకృతిలో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక్కడికి వచ్చిన మిగతా బృందాలెవరో తెలియదు. అయితే, నన్ను ముగ్ధుణ్ని చేసిన విషయం ఏంటంటే వీరంతా నా ట్రెకింగ్ తో స్ఫూర్తి పొందినవారే కావడం.

ఈ గుట్ట ఎక్కడానికి 50నిమిషాలు పడుతుంది. గుట్టమీద ఉన్న చిన్న గుడి, ఆ పరిసరాలలో ఈ పురాతన ఆలయం ఎంతో సౌందర్యంగా కనిపిస్తుంది. చూపరులను అబ్బుర పరుస్తుంది. ఎన్ని సార్లు సందర్శించినా తనివి తీరకపోవడానికి కారణమిదే. నేనెపుడో కంబోడియాలోని అంగ్ కోర్ వాట్ సందర్శించాను. అది మహాద్భుతం.

పరిమాణంలో కాలభైరవగుట్ట దేవాలయం అంగ్ కోర్ వాట్ కంటే  చాలా చిన్నది. అయితే, ఈ పురాతన శైధిల్యాలు మళ్లీ ఆ అనుభూతిని కల్గించాయి. ఒకపుడు ఈ గుడి చాలా ప్రాభవంలో  ఉండింది.

ఇపుడయితే శిధిలాయం. ఇక్కడి ఆలయ స్తంభాలు, శిల్పాలు చెల్లాచెదురుగా పడిపోయి జీవశ్చవాల్లాగా కనిపిస్తాయి. ఇలా మెల్లిగా కనుమరుగువుతూ ఉండటం బాధ కల్గిస్తుంది.

ఎపుడో చోళ చక్రవర్తులు దక్షిణ భారతదేశన్నాంతా ఏలుబడిలోకి తెచ్చుకున్నపుడు ఇలాంటి ఆలయాలకు  స్వర్ణయుగంగా ఉండింది. వాళ్ల ప్రోత్సాహాంతో ఇలాంటి అద్భుత ఆలయాలు వెలిశాయి.

నాటి శిల్ప వైచిత్రి ఇక్కడి కాలభౌరవ ఆలయంలో చూడవచ్చు. ఇక్కడి శిల్ప సౌందర్యం చాలా ఆశ్చర్య పరుస్తుంది. ఇది క్రీశ 1375 నాటికి కూడా భద్రంగా ఉండిందని చరిత్ర చెబుతూ ఉంది.

ఈ గుట్ట  మీది ఆలయానికి  ఎక్కి దిగేందుకు చక్కటి మెట్ల మార్గం నిర్మించారు. ఇంత చక్కటి మెట్ల మార్గం నిర్మించారంటే, ఆ రోజల్లో ఇది వైభవంతో విరాజిల్లిందని అనిపిస్తుంది.  ఇలాంటి  కట్టుదిట్టమయిన దారి నిర్మించారంటే, నాటి ప్రముఖలు అంటే రాజులు, రాణులు ఈ గుడి సందర్శించేవారని అనుకోవలసి వస్తుంది.

వాళ్లు మెట్ల మార్గంలో కాలినడకవన వెళ్లి ఉంటారా లేక పల్లకిలో వెళ్లిఉంటారా అనే అనుమానం నాకు ఎపుడూ కలుగుతూ ఉంటుంది. ఈ విషయాలను వూహించుకుంటూ, నాటి రాజులు,రాణులు వేసిన అడుగుల్లో అడుగేసుకుంటూ వెళ్లే భాగ్యం మాకు కలిగిందని గర్వపడుతూ మేం మెట్లెక్కుతూ వెళ్లాం.

తమాషా ఏంటంటే, దూరాన్నుంచి ఏదో చిన్న గుడిలాగా కనిపిస్తున్నా,కొండ ఎక్కి పైకి చేరకుని గుడిని సమీపించే దాకా అక్కడొక అద్భుత శిల్పసంపద దాగి ఉందన్న విషయం  ఎవరికీ తెలియదు.

దారి పొడుగునా పెద్ద పెద్ద గుండ్లు, చిన్న గుండ్ల మీద నిలబడిన పెద్ద పెద్ద గుండ్లు, కొండరాళ్ల మధ్య సందుల్లోనుంచి పొడుచుకుని వచ్చిన మర్రిచెట్లు ట్రెకర్స్ ను ఆశ్చర్యపరుస్తుంటాయి.

కొండ ఎక్కిన తర్వాత ఆ ప్రదేశమంతా కలియ తిరగడం ఒక గొప్ప అనుభవం. అక్కడి నుంచి  చంద్రగిరి కోట ఎంతో అందంగా సుదూరాన కనబడుతుంది. చంద్రగిరి కోటతో పాటు ఉరికంబం, ఉప్పు సట్టి పప్పుసట్టి, నాటి విజయనగర రాజులు ఏర్పాటు చేసుకున్న ఆయుధాగారం కూడా  కనబడతాయి. కొండ ఎక్కిన తర్వాత జాగ్రత్తగా చూస్తే  దూరాన  పాండవ గుళ్లు కూడా కనిపించాయి. స్వర్ణ ముఖీ నది పరీవాహక ప్రదేశమంతా అందంగా కనబడుతుంది. వీటి వెనక కనిపించే శేషాచల శిఖరాల నేపథ్యం కనువిందు చేస్తుంది.

మల్లేశం గుట్టను ఎక్కేటపుడు దారి మధ్యలో కూడా ఎన్నో చిన్న విచిత్రాలు కనిపిస్తాయి. మా కొక వినాయకుడి బొమ్మ కనిపించింది. నాగసర్ప  శిల్పాలు, ప్రాచీన కాలంలో నిర్మించిన మెట్ల వరసలు కనిపిస్తాయి.

పైన మల్లికార్జున దేవాలయం గుర్భగుడిలోని విగ్రహం గురించి ఒక మాట. ఇది ప్రాచీన విగ్రహంలాగా కనిపించడంలేదు. ఎవరో తమకు తోచిన విగ్రహాన్ని  ఏర్పాటుచేసినట్లు అనిపిస్తుంది.

గర్భ గృహం ఆనుకుని అంతరాళం ఉంది, అర్థమండపం ఉంది. నంది మండపం ఉంది. ముఖ మండపం ఉంది.గుడికి కొంచెం ఉత్తర దిక్కుకు వెళ్లనట్లయితే, ప్రధాన ప్రవేశద్వారం ఉంది. గర్భ గుడి వెనక కోనేరు కూడా ఉంది. కోనేరుకు ఆనుకుని ఒక ప్రాచీన కట్టడముంది.ఇందులో తమిళ శాసనాలున్నాయి.

గర్భ గుడి శిఖరం మీద రకరకాల ఆకృతుల్లో కట్టడాలు ఉన్నాయి. వీటి మీద ఎవరూ శ్రద్ధ పెట్టినట్లు లేదు. వీటిని  కాపాడుకుందామనే ధ్యాస లేదు. అందుకే చెల్లాచెదురుగా పడివున్న శిల్పసంపద చుట్టు కంప చెట్లు మొలిచి శిధిలాలు కనిపించకుండా కప్పేస్తున్నాయి. ఇది ప్రాచీన సంపదకు మనమిచ్చే గౌరవం.

మొన్న మొన్న శివరాత్రి రోజున చుట్టు పక్కల గ్రామాల ప్రజలు చొరవ తీసుకుని కంప చెట్లను కొట్టేసి దారిని ఏర్పాటు చేశారు.అందుకే ఇపుడు ఇక్కడి చేరుకోవడం సులువుయింది.  దేవాలయ పరిసరాలను శుభ్రం చేశారు. అయితే, అందంగా కనిపించాలని విగ్రహాలకు రంగులు పూశారు.

దారి పొడుగునా అనేక చోట్ల గోతులు కనిపిస్తాయి. ఇవేమిటని విచారిస్తే, నిధులకోసం తవ్విన గోతులని తెలిసింది. ఎపుడో ప్రాచీన కాలంలో రాజులేమయినా  సంపదను ఇక్కడ దాచారనుకుని వాటికోసం తవ్విన గోతులు. ఈ నిధి తవ్వకాల గోతులు ఎక్కడ చూసినా కనిపిస్తాయి.గుడిలో కనిపిస్తాయి. మండపంలో కనిపిస్తాయి. గుడి పరిసరాల్లో కనిపిస్తాయి. ఈ గోతులన్నీ చూస్తే బాధ వేస్తుంది. ఎందుకంటే మనకొక ప్రభుత్వం ఉంది.అందులో సాంస్కృతిక విభాగం ఉంది. ఇలాంటి ప్రాచీన వారసత్వ సంపదను కాపాడుకునేందుకు పురాతత్వ శాఖ ఉంది. వీళ్లందరి  నిర్లక్ష్యం కారణంగానే ఎంతో విలువయిన చారిత్రక సంపదకు చివరకు దిక్కుదివాణం లేకుండా ఇలా నిధి అన్వేషకుల బారినపడిన నాశనమవుతూ ఉంది. ఆలనా పాలనా లేకపోవడంతో ఇపుడిది పశువులు కాసుకునే వారికి విడిది అయిందని మాకు అనిపించింది.

ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు ఇక్కడ పెద్ద పండగ జరుగుతుంది. ఈ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున కాలభౌరవుడిని దర్శించుకునుందకు వస్తారు. అపుడు పెద్ద ఎత్తున విందులు వినోదాలు జరుగుతాయి. నేనెపుడే శివరాత్రి రోజున రాలేదుగాని, ఆ విందుల వినోదాల  ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పండగ చేసుకోవడం బాగుంది కాని, దాని వల్ల చాలా నష్టం జరగుతూ ఉంది. ఎందుకంటే, వాళ్లు పడేసిన విస్తర్లు, ప్లాస్లిక్ వస్తువులు, సీసాలు ఈ ప్రదేశమంతా కనిపిస్తాయి. ఆలయానికి  వచ్చేందుకు వాళ్లే చెట్లు చెలకలు కొట్టేసి దారి ఏర్పాటుచేసుకుంటున్నారు. వారికి ఇష్టమొచ్చిన రీతిలో ఇక్కడ వినోదాలు జరుపుకుంటున్నారు.  శివరాత్రి గడిచాక మళ్లీ శివరాత్రి దాకా ఎవరూ పట్టించుకోవడం లేదు.

కొండ మీద రెండు మూడు గంటలు గడపవచ్చు. చివర కొండ మీది నుంచి సూర్యోదయం చాలా కనువిందుచేస్తుంది. సూర్యోదయపు చల్లని, ఆహ్లదకరమయిన గాలి అనుభూతి పొందవచ్చు. చరిత్రలోకి కొద్దిసేపు జారుకోవచ్చు. అందుకే కాలభౌరవ  గుట్టయాత్ర వినోదానికి, ఆరోగ్యానికి, విజ్ఞానానికి కూడా ఉపయోగపడుతుంది. మీరు ఒకసారి సందర్శించి చూడండి.

2 thoughts on “తిరుపతి పక్కనే మరొక ట్రెకర్స్ స్వర్గం… కాలభైరవ గుట్ట

  1. కిందటి ఆదివారం భూమ న్ గారితో పాటు కాల భైర వ గుట్ట ఎక్కాను. ఒక గొప్ప అనుభూతిని పొందా ను. తె ల తెల వారుతుండగా ఈ గుట్ట ఎక్కాం. తూర్పున కొండల మాటునుంచి సూర్యుడి లే లే త కిరణాలు మెల్లగా రావడం, ఆకాశంలో మబ్బుల మాటు నుంచి సూర్య బింబం కనిపించడం ఒక మహాద్భుత దృశ్యం. ఎంత ఆహ్లాదంగా ఉందో! లాక్ డౌన్ తరువాత ఈ గుట్ట ఎక్కడం తోనే మా ట్రెక్కింగ్ కు మళ్లీ శ్రీకారం చుట్టా ము.

  2. భూమన్ మితృలతో చేస్తున్న ట్రక్కింగ్,చూస్తున్న ప్రదేశాలు —+ వాటి గురించి రాయడం ఇప్పుడే ఈ రోజే చూసాను.ఇవి చదువుతుంటే ఏ ప్రయాస పడకుండా ఇంట్లో కూర్చుని ట్రెక్కింగ్ చేసిన అనుభూతి కలుగుతోంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *