ఎపి హైకోర్టులో చంద్రబాబుకు ఊరట, సిఐడి విచారణ మీద స్టే…

అంతా అనుకున్నట్లే అయింది. రాజధానిలో  అసైన్డ్‌ భూములను బలవంతంగా సేకరించారన్న ఆరోపణ జరపాలనుకున్న సీఐడీ విచారణ‌ అమరావతి హైకోర్టు స్టే విధించింది.అంతేకాదు, ఇందులో కొత్తగా విచారించేందుకేముందని కూడా కోర్టు అనుమానం వ్యక్తం చేసింది. పిర్యాదులు కాకుండా తాజాగా ఏమయిన అధారాలు దొరికాయా అని కూడా సిఐడిని ప్రశ్నించి కోర్టు ఇరుకున పెట్టింది.  విచారణ మొత్తం పిటిషనర్లకు అనుకూలంగా సాగింది. చివరకు నాలుగు వారాల స్టే విధించింది.

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన అభియోగం మీద రాష్ట్ర ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. దీని మీద సిఐడి అధికారులు చంద్రబాబుకు నోటీసులు కూడా జారి చేశారు. ఎస్ సి ఎస్ టి  అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసులు పెట్టారు. వారిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమయింది. విచారణ పేరుతో సిఐడి కార్యాలయానికి రప్పించి అక్కడి నుంచే అరెస్టు చేసే వీలుందనే వదంతులు వచ్చాయి.

ఈ దశలో విచారణ మీద చంద్రబాబు నాయడు, ఆయన తోపాటు నోటీసులు అందుకున్న మాజీ మునిసిపల్ మంత్రి నారాయణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.

చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్ లూత్ర, మాజీ మునిసిపల్ మంత్రి పి నారాయణ తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ ఈ నెల 12న సీఐడీ అధికారులు పిటిషనర్ల పై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరారు. వారిని విచారించడం, అరెస్టు చేయడం వంటి పనులు చేయకుండా ఆదేశించాలి కూడా వారు కోరారు. చంద్రబాబు, నారాయణల మీద ఎస్ సి, ఎస్ టి కేసులు పెట్టడాన్ని ప్రస్తావిస్తూ అవి భౌతికదాడులకు మాత్రమే వర్తిస్తాయని వారు పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం  టీడీపీ సభ్యులకు వ్యతిరేకంగా పాల్పడుతున్న కక్ష సాధింపు చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో భాగంగానే సిఐడి  కేసు నమోదు చేసిందని చెబుతూ మంగళగిరి సీఐడీ పోలీస్‌ స్టేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి,మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు.

రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రభుత్వం కేసు పెట్టినందున అరెస్టు సహా,తదుపరి చర్యలు చేపట్టకుండా నిలువరించాలని వారు కోర్టును కోరారు. ఐపిసి 166,167 సెక్షన్ల కింద కేవలం అధికారులమీద మాత్రమే కేసు పెట్టాలని చెబుతూ అసెంబ్లీ చేసిన చట్టం ద్వారా సేకరించిన భూముల మీద ముఖ్యమంత్రి మీద కేసులు పెట్టడం చెల్లదని చంద్రబాబు న్యాయవాది లూథ్రా వాదించారు.

పిటిషనర్లు  వాదనతో ఏకీభవించిన హైకోర్టు విచారణపై నాలుగు వారాలు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు, నారాయణపై అసైన్డ్ భూముల కుంభకోణానికి సంబంధించి ఏమయినా అదనపు ఆధారాలు లభించాయా, లభించి ఉంటే చూపించాలని న్యాయమూర్తి సీఐడీని అడిగారు.  ఫిర్యాదు మీద జరిపిన ప్రాథమిక విచారణలో ఏం గుర్తించారో  కోర్టుకు సమర్పించాలని  న్యాయమూర్తి సీఐడీ అధికారులను ఆదేశించారు.

అయితే, విచారణ తొలి దశలో వివరాలు చెప్పలేమని సీఐడీ వాదించింది. పూర్తిస్థాయి విచారణకు అనుమతిస్తే అన్ని విషయాలు తెలుస్తాయని పేర్కొంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *