విశాఖ ఉక్కుపై నిర్మలమ్మ ప్రకటన సరికొత్త మార్పులకి సిగ్నల్!

(ఇఫ్టూ ప్రసాద్  పిపి)

విశాఖ ఉక్కు అమ్మకం 100% జరిగి తీరుతుందనీ, రాష్ట్ర సర్కార్ కి ఉక్కులో వాటా లేదనీ లోక్ సభలో నిర్మలా సీతారామన్ మొన్న 8వ తేదీన బరితెగింపు ప్రకటన చేశారు. మోడీ షా ప్రభుత్వ రాజకీయ ఓటమికి చిహ్నమిది. ఇది ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చేపట్టే ఐక్య కార్యాచరణ ఉద్యమం ఓ దశ నుండి మరో ఉన్నత దశకి చేరడాన్ని సూచిస్తుంది.

సాంప్రదాయ రాజకీయ పద్దతి లో ప్రజల్ని ఒప్పించి అమలు చేసే సామర్ధ్యాన్ని కోల్పోయిన నేటి నిరంకుశ పాలకుల స్వీయ రక్షణ స్థితికి నిర్మలమ్మ ప్రకటన అద్దం పడుతోంది. మున్ముందు ప్రజాఉద్యమ గమనంలో ఇదో వ్యూహాత్మక ముందడుగుకు విధిగా దారి తీస్తుంది.

ఉక్కుపై నిర్మలమ్మ ప్రకటన బయటకు మోడీ షా ప్రభుత్వ దూకుడు స్థితిని సూచిస్తుంది. అది భౌతికంగా నిజమే కావచ్చు. రాజకీయపరంగా నిజం కాదు. ఆత్మరక్షణ స్థితిలో పాము “బుసలు” కొడుతుంది. ఈ ప్రకటన కూడా అలాంటిదే.

నిరంకుశ పాలకులు స్వీయ రక్షణ స్థితిలో రెండు రకాల ఎత్తుగడలను అవలంబిస్తారు.

1-ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని ప్రజలతో రాజకీయంగా ఒప్పించ గలిగేస్థితిలో ఉంటే, ఒప్పిస్తాయి. అవసరమైన రాయుతీల్ని కూడ ప్రజల్ని “మభ్య” పెడతాయి.

2- అవి స్వీయరక్షణ స్థితికి గురైతే, ప్రజల్ని గందరగోళపరిచి, అవి వ్యూహాత్మకంగా కవ్విస్తాయి. పాలకులు ఎప్పుడు ప్రజల్ని కన్విన్స్ చేయ జూస్తాయో, ఎప్పుడు కన్ఫ్యూజ్ చేయ జూస్తాయో ప్రజాతంత్ర ఉద్యమ సంస్థలకు స్పష్టమైన అంచనా ఉండాలి. ఆ ప్రకారం నిర్మలమ్మ తో మోడీ ప్రభుత్వం ఇప్పించిన ప్రకటన వెనక వ్యూహాత్మకత ఉండొచ్చు. ఇంకా చెప్పాలంటే, ఇది మోడీ షా ప్రభుత్వంతో పోస్కో సహా క్రోనీ కార్పొరేట్ వ్యవస్థ వ్యూహాత్మక దృష్టితో ఇప్పించిన ప్రకటన కావచ్చు.

విశాఖ ఉక్కు సమస్య మీద కార్మికవర్గాన్నే కాకుండా, రాష్ట్ర ప్రజల్ని సైతం రాజకీయంగా ఒప్పించలేని నిస్సహాయస్థితి లో మోడీ ప్రభుత్వం పడింది. కార్మికవర్గంతో పాటు, రాష్ట్ర ప్రజల్ని కూడా కవ్వించే వైఖరి చేపట్టి ఉండొచ్చు. దీనిపై తక్షణ ప్రతీకార ప్రతిస్పందన ఎంత అవసరమో, నిలకడైన దీర్ఘకాల వ్యూహాత్మక నిర్మాణాత్మక ఉద్యమ కార్యాచరణ కూడా అంతే అవసరమైనది. మొన్న, నిన్నటి అసంకల్పిత కార్మిక స్పందన అద్భుతంగా ఉంది. నిర్వాసిత ప్రజల ప్రతిస్పందన అందులో సింహభాగం కావడం విశేషమూ, ఆహ్వానించదగినదీ!

విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ నిర్ణయం 26-1-2021 జరిగింది. ఢిల్లీ రైతాంగ పోరును రక్తసిక్త అణిచివేతకు ఎర్రకోట కేంద్రoగా కుట్రపన్నిన రోజది. తర్వాత 62 వ రోజు నిర్మలమ్మ ప్రకటన వెలువడింది. గత రెండు నెలల్లో ఈ దౌత్యయుద్ధంలో స్థూలంగా మోడీ ప్రభుత్వం ఓడింది. కార్మికవర్గం గెలిచింది. మోడీ ప్రభుత్వం గత్యంతరం లేక ఆఖరి ఉన్మాద చర్యకి దిగక తప్ప లేదు. మోడీ ప్రభుత్వం చేపట్టిన  కవ్వింపు చర్యకి కార్మికవర్గం తాత్కాలిక ఉద్రిక్తతతో కాక రాజకీయ స్థితప్రజ్ఞతతో ధీటైన వ్యూహాత్మక కార్యాచరణను గుర్తించాల్సిన సమయమిది.

నిర్మలమ్మ ప్రకటన తర్వాత హఠాత్తుగా రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కింది. కార్మిక వర్గంలో భావోద్వేగ ధోరణులు పెరిగే భౌతిక ప్రాతిపదిక నేడు ఏర్పడింది. ఈ తరహా సమయ, సందర్భాల్లో “ఇప్పుడే సాధించుకోవాలి లేదా ఎప్పటికీ సాధించలేం” (NOW OR NEVER) లేదా “విజయమో వీర మరణమో” (DO OR DIE) వంటి దుస్సాహసిక తెంపరి ఆలోచనలకు పునాది పడొచ్చు. ఈ స్వల్పకాలిక పాలపొంగు ఉద్రిక్తత విధానంతో దీర్ఘకాలిక లక్ష్యం వికటిస్తుంది. ప్రధానంగా ఉక్కుఉద్యమాన్ని చేపడుతోన్న కార్మిక సంస్థలకు ఆచరణాత్మక, నిర్మాణాత్మక, సూత్రబద్ద వైఖరి అనుసరణీయం. హర్యానా, ఉత్తరాఖండ్ లలో SKM చేపట్టే శాసనపోరాట రూపం కూడా నేడు ఉక్కుపై కార్మిక సంస్థలకు ఓ మధ్యంతర ఆదర్శం కావాలి.

వర్తమాన భారతదేశ రాజకీయ చరిత్రను కుదిపి వేస్తోన్న రైతాంగ ప్రతిఘటన తెలిసిందే. దాన్ని నడిపించే సంయుక్త కిసాన్ మోర్చా (SKM) & ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష కోఆర్డినేషన్ కమిటీ (AIKSCC)ల పోరాట రూపాల్లో శాసన సభా వేదిక ఒకటి. అవిశ్వాస తీర్మానలతో సరికొత్త కార్యాచరణను అవి చేపడుతున్నాయి. హర్యానా, ఉత్తరాఖండ్ అనుభవమిదే.

SKM విజ్ఞప్తిపై ప్రతిపక్ష కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానాన్ని పెట్టింది. ఈ రోజు (10-3-2021) హర్యానాలో, ఎల్లుండి 12-3-2021న ఉత్తరాఖండ్ శాసనసభలలో అవిశ్వాస తీర్మానాలపై చర్చ జరగనుంది. రైతాంగ పొరుతో నేడు హర్యానా రగులుతోంది. ఉత్తరాఖండ్ కూడా అదే దిశలో ఉంది. దీంతో పై 2 రాష్ట్రాల రాజకీయస్థితి అతలాకుతలం అవుతోంది. SKM, AIKSCC పిలుపులతో రైతు ఉద్యమ సంస్థలు ఆయా శాసన సభ్యులపై నియోజక వర్గాల వారీగా గత వారంగా మాస్ వత్తిళ్ళు ఒక ఉద్యమ రూపం ధరించింది.

పై సంక్షోభం ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కాపాడతాయో ముంచుతాయో ముఖ్యంకాదు. తాత్కాలికంగా నేడు నిలబడ్డా, మరో రూపంలో అవి రాజకీయ మూల్యం చెల్లించక తప్పలేదు. ఆటలో దిగకముందే నిన్న ఓ వికెట్ పడింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి రాజీనామయే మోడీ ప్రభుత్వపై వత్తిడిని సూచిస్తోంది.

కొన్నిదశాబ్దాలు గా సంతల్లో సరుకులుగా శాసన సభ్యుల అమ్మకాలు, కొనుగోళ్ల తో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోయే కృళ్ళు రాజకీయ సంస్కృతి తెల్సిందే. అందుకు భిన్నంగా తొలిసారి వర్తమాన రైతాంగ ప్రతిఘటనతో ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలని కూల్చే కొత్త రాజకీయ ప్రయోగానికి ఓ ప్రయత్నం జరుగుతోంది.

ఈ ప్రయోగం విశాఖ ఉక్కు పై కార్మిక సంస్థలు క్రింది డిమాండ్ల పై కార్యాచరణకి పూనుకోవడం ఓ తక్షణవాశ్యకతగా భావించి ఉద్యమిస్తాయని ఆశిద్దాం.

1-పార్లమెంట్ లో ప్రకటన పై ఏపీ శాసనసభ సమావేశ పరిచి తీర్మానం చేయించడం.
2-“చలో పార్లమెంట్” కు అసెంబ్లీ చేత పిలుపు ఇవ్వడం. భారీస్థాయిలో కదిలించడం.
3-ముఖ్యమంత్రి  రాష్ట్ర అఖిలపక్ష సమావేశం జరిపి, చలో పార్లమెంట్ కు సారథ్యం వహించడం. రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక రైళ్లను నడిపించడం.
4-వైకాపా, టీడీపీ రెండింటి తో పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టించడం. (అది వీగుతుందా, గెలుస్తుందా ముఖ్యం కాదు, కేంద్రానికీ రాష్ట్రాలకూ వైరుధ్యాన్ని అఖిల భారత స్థాయి పోరాటంగా మార్చడం ముఖ్యం)
5-అఖిల భారత స్థాయిలో ముఖ్యమంత్రుల & దక్షిణాది ముఖ్యమంత్రుల సమావేశాల ఏర్పాటుకు AP ప్రభుత్వం చొరవ తీసుకోవడం.

ఇప్పటికే విశాఖలో అఖిలపక్ష పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లి పార్టీల్ని కూడగట్టే పని సాగుతూనే, ఇది కూడా సాగాలి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఉక్కు సాధనలో ఉమ్మడి రాష్ట్ర ప్రజల త్యాగంలో నాటి వాటాతో పాటు నేటి మాధారం గనులు, హైదరాబాద్ లోనే హెడ్డాఫీసు, గెస్ట్ హౌస్ వంటి వాటాదారుగా తెలంగాణ రాష్ట్రం ఉంది. Ap ముఖ్యమంత్రి తెలంగాణని కలుపుకునే ఒక ప్రయత్నం చేయాలి.

గమనిక: మిగిలిన వివిధ పోరాట రూపాల్ని యధావిధిగా నిర్మాణాత్మకంగా తీవ్రతరం చేస్తూనే, పై శాసనబద్ద పోరాట పద్దతుల్ని కూడా పాటించడం నేడు అనుసరణీయమైనది.

నేడు కేంద్రానికీ, రాష్ట్రాలకీ మధ్యవైరుధ్యం తీవ్రతరమయ్యే క్రమం ఉంది. గుజరాతీకరణ ఆర్థిక, రాజకీయ ప్రక్రియ నేడు దేశంలో వేగంగా జరుగుతోంది. గుజరాత్ సెంటర్ గా మోడీ, షా ఏర్పడ్డ “వెస్ట్ ఇండియా కంపెనీ” “ఈస్ట్ ఇండియా” (బెంగాల్, అస్సాం ఎన్నికలకై) లో నేడు మకాం పెట్టింది. ఓవైపు ఒకే భారత్ నినాదంతో, మరోవైపు పలు భారత్ లుగా విడగొట్టి అసమానతల్ని సృష్టిస్తోంది. ప్రతిపక్షాలు చాలా బలహీనంగా ఉన్నాయి. నేడు అవి వదిలేసిన రాజకీయ శూన్యాన్ని రైతాంగ ప్రతిఘటన భర్తీ చేస్తోంది. AP రాష్ట్ర పోరాటం అఖిల భారత స్థాయిలో ఐక్య పోరాటంగా మారితే, దేశవ్యాప్తంగా మిత్రుల సంఖ్య పెరుగుతుంది. ఈ క్రమం లో ముందుకొచ్చే కొత్త పోరాట కర్తవ్యాల్ని పిమ్మట రూపకల్పన చేసుకోవచ్చు.

ఈ దీర్ఘకాలిక వ్యూహాత్మక దృక్కోణంతో నిర్మాణాత్మకంగా, నిలకడగా, అదే సమయంలో మరింత క్రియాశీల, చురుకైన సమరశీల ఐక్య కార్యాచరణ ద్వారా భావి ఉద్యమ ప్రక్రియను చేపట్టుటకి తగు సమయమిది. అందుకు నడుం బిగిద్దాం.

కొసమెరుపు: విశాఖలో ఉక్కు నేపథ్యంలో సంయుక్త కిసాన్ మోర్చా (SKM) ముఖ్య నేతలతో భారీ ఎత్తున కార్మిక- కర్షక సభ జరిపే ప్రయత్నం జరుగుతోంది. ఈ ఉద్యమ గమనానంలో అదోదారి దీపం వంటిది. నేడు ఫాసిస్టు ధోరణి బలపడే గడ్డుకాలంలో ఉక్కుపై మోడీ ప్రభుత్వ నూరుపాళ్లు అమ్మకం విధానాన్ని కార్మిక, కర్షక పునాదిగా ఏర్పడే విశాల ప్రజాఉద్యమమే ఓడిస్తుంది. అట్టి దారిదీపాన్ని వెలిగిద్దాం. దాని వెలుతురులో ముందుకు సాగుదాం. (ఇందులో వ్యక్తం చేసిన అభిప్రాయాలన్నీ పూర్తిగా రచయిత వ్యక్తిగతం)

(ఇఫ్టూ ప్రసాద్ (పిపి),రాష్ట్ర అధ్యక్షులు, భారత కార్మిక సంఘాల సమాఖ్య (IFTU) విజయవాడ)

 

https://trendingtelugunews.com/top-stories/breaking/why-cm-jagan-suggesting-part-sale-of-vizag-steel-lands-when-locals-are-opposing/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *