తప్పెవరిది ?(కవిత)

ఎటు నుండి వచ్చిందో
ఏం ఆశించి వచ్చిందో
ఓ బక్క పలుచని కుక్క
మన వాకిట్లోకొచ్చి
చేరిందెపుడో
మన గడపలో నిలబడి
భౌ భౌమని అరుస్తుంటే
మనకు కాపలా
కాస్తోందనుకున్నాం
నాలుగు మెతుకులేసాం..
రోజుల తరబడి
నెలల తరబడి అలాగే అరుస్తూ
నేను మీ కాపాలా కుక్కనంటే..
సంవత్సరాలుగా అదె వాకిలిలో
స్థిరపడి కొందరిని చూసి మరీ మరీ
ఆ కుక్క అరిస్తే.. కరిస్తే..
దాని ఆవేశాన్నీ.. అరుపులనీ చూసి
వాళ్ళు నిజంగానే పెద్ద దొంగలని
మనమూ కర్రలూ, రాళ్ళూ విసిరాం..
కత్తులు నూరాము..
చివరికి కంచె కట్టుకున్నాం
ఇక అంతా భద్రమేనని
మనసు నిశ్చింత
చేసుకున్నాం..
ఇక మనకేం భయం లేదు
మన వాకిట్లో ఉంది కుక్క కాదు
అది పులిలాంటి కుక్కని
ఓ భద్రమైన భావనలోకి భద్రంగా జారిపోయాం..
పులి లాగే భావించాం..
పులి లాగే పెంచి పోషించాం..
కుక్కని పులిని చేసాం..
ఎప్పుడైతే ఆ కుక్క పులైందో
విశ్వాసమనే తన లక్షణాన్ని
కోల్పోయింది..
పులై రక్తదాహం పెంచుకుంది
ఇక, ఇపుడా పులి కంచెలోనే
వేట మొదలెట్టింది..
వేటాడుకుంటోంది..
మనతో ఆటాడుకుంటోంది..
ఆకలి తీర్చుకుంటోంది..
మన బిడ్డల్ని మనముందే కౄరంగా పాశవికంగా చీల్చి చంపుతూ
నిర్దయగా రక్తాన్ని జుర్రుతోంది..
మనం కంచె దాటి పోలేక..
ఆ పులిని చంపలేక..
ఆ పులిని బైటికి పంపలేక
నిస్సహాయులమై
వంతులెంచుకుంటూ
వరుసలో నిలబడి
దుఃఖిస్తున్నాం..
కంచెగట్టి తప్పుచేసామా అని..!
కుక్కని పులిని చేసామా అని..!
ఈ పాపానికి పరిహారం లేదని..!!
(సోషల్ మీడియా నుంచి. 2019లో ఈ పోయెమ్ ఫేస్ బుక్ లోొ  అచ్చయింది. ఇది ఇప్పటికీ ఈ కవిత విలువ తగ్గలేదు. అందుకే ముద్రిస్తున్నాం.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *