మామగారు ఆ పూలని అచ్చం బాహుబలి లాగే కోసేవారు…

(శారద శివపురపు)

ఇది  రాస్తుంటే నాకనిపించిందీ,  ఇది చదివే వాళ్ళకి అన్నీ కాకపోయినా కొన్నిట్లో అయినా వాళ్ళ పెద్దవాళ్ళు తప్పకుండా కనిపిస్తారు, లేదా జ్ఞాపకం వస్తారు అని. ఎందుకంటే  చాలానే వ్యక్తుల ముఖ్యంగా ఒక శతాబ్దం  వెనక పుట్టిన వాళ్ళ వ్యక్తిత్వం ప్రభావితమైన పరిస్థితులు  ఒకే రకంగా ఉండేవి.  అప్పటి సమాజం పూర్తిగా పితృస్వామ్య ప్రధానం, ఇప్పుడు కాదని కాదు.  తేడా అల్లా అప్పటి స్త్రీల పరిస్థితులకీ ఇప్పటి స్త్రీలున్న పరిస్థితులకీ ఉంది.  కాబట్టి అప్పటి మగవారికి అయిన జరుగుబాటు వేరు.  అదే ఇప్పటి మగవారిని తీసుకుంటే పాపం వారి స్థితి కొంచం,  కొన్ని మెట్లు  దిగజారి ఎన్నో ప్రత్యేకాధికారాల్ని పోగొట్టుకుని సమానత్వం పేరుతో ఎన్నో పాట్లు పడాల్సి వస్తోంది.  ఇక కరోనా తరవాత మగవారి పాట్లు గురించి చెప్పాలంటే విడిగా ఇంకో సిరీస్ రాయొచ్చు.  పొరపాటున బయటకి వెళ్ళాల్సి వచ్చి,మా నాన్నగారిని గేస్ స్టవ్ కట్టెయ్యమని అడిగితే  రైట్ కి తిప్పాలా, లెఫ్ట్ కి తిప్పాలా అనేవారు.  అంటే అటో ఇటో తిప్పి కట్టెయ్యచ్చు.  కానీ ఎప్పుడూ చెయ్యని పని చెయ్యాలంటే ఏదోఒక రకంగా చేద్దాంలే అన్న ధైర్యం  కూడా లేకపోవడం.

ఇక మనం మళ్ళీ మా మామగారి విషయానికొస్తే,  ఆయనకి ఆయన వయసులో  ఉండేవారందరికీ ఉండేట్టే  ఒక అలవాటుండేది.  అది ఆయన నోట్లో మాట నోట్లో ఉండగానే ఇక్కడ అమలయిపోవాలి. మరి ఎంతో కొంత సమయం ఎవరైనా ఇస్తారేమోగానీ మా మామగారి డిక్షనరీలో లేనిదే అది.  మా ఆయన తన టీనేజ్లో, మోజుపడి అప్పటి రొమాంటిక్ హీరో రాజేష్ ఖన్నా హైర్ స్టైల్లో జుట్టు కట్ చేయించుకుని వచ్చాడట.  మా మామగారు డాన్స్ అయితే నేర్చుకోలేదు గానీ, అప్పుడు  కోపంలో ఆయన చేసిన కథాకళి, స్టేజ్ మీద  శూర్పణఖకి  ముక్కు చెవులు కోసి పంపి నపుడు రావణాసురుడి వేషధారుడు చేస్తే భలే రక్తి కట్టేదట.  బాత్రూంలో స్నానం చేస్తున్న వాడిని బాత్రూం తలుపుమీద శివమణిలా బాదేసి ఉన్నపళంగా బయటికి రప్పించి  మళ్ళీ సలూన్‌కి తోలారుట.  పాపం కటింగ్ చేసిన అబ్బాయికి ఏమీ తోచక అదేంటి సార్ కటింగ్ బాగా చేసానుగా అని మొహమంతా వెల్ల వేస్కున్నాడట.  మా నాన్నగారికి రాజేష్ ఖన్నా నచ్చడు గానీ మదర్ ఇండియాలో సునీల్ దత్ స్టైల్లో చిన్నగా కట్ చేసెయ్యని చెప్పి ఆ గండం నుంచి బయటపడ్డాడట.

అలా ఇక దారి తప్పడులే అని నమ్మకం ఆయనకి కలిగేవరకూ ఆయన తన మాట నెగ్గించుకుంటూనే ఉన్నారు. అదే ఇప్పుడు మన పరిస్థితేంటంటే  మన మగ పిల్లలు అరగుండు చేయించుకొచ్చినా,  నడి నెత్తిమీద  కమలంలా కుచ్చు  పెట్టుకున్నా, వెనకాల పొనీ టైల్ వేస్కున్నా అలానే ఆడపిల్లలు స్టైల్ పెరుతో సగం నున్నగా చెక్కేసి సగం వెపు కొద్దిగా జుట్టు ఒదిలేసినా ఏమీ మాట్లాడే పనిలేదు.  రోజులు మారిపోయాయి మరి.

ఇక మీకు మామగారి అలవాట్లు గుర్తుండే ఉంటాయి కదా.  ఒకవేళ గుర్తు లేకపోతే మొదటి భాగాని కెళ్ళి చదవండి ఒకసారి.  సాయంకాలం రోజూ మొక్కలకి నీళ్ళు పొయ్యడం, పాదులు చెయ్యడం,  ఇంటిముందు ఉన్న చిన్న చోటులోనే ఎన్నో మార్పులు చేర్పులు చేస్తుండేవారు.


టైగర్ మామగారు 3


అప్పట్లో ఇంటిముందు గేట్ పైన వేసిన ఆర్చ్ లో రాధా మనోహరం పూలు గుత్తులుగా పూసి నిజంగానే మనోహరంగా కనిపించేవి.  ఓపక్కగా వేసిన సన్నజాజి మేడమీదకి పాకి వెర్రిగా పూసేది.  దాని మొదలు నించి పైదాకా దాని వయసు చెప్తూ రెండు చేతుల్లోకీ రానంత లావుతో పైనంతా ఎండి ముడతలు పడ్డ తొంభై ఏళ్ళ ముదుసలి  లాంటి శరీరంతో ఎన్నో వంకర్లు తిరిగిగుండేది.  ఓ ఇరవై అడుగులు ఏటవాలుగా పాకిన తీగకి ముదుసలికి చేతికర్ర సాయంలా ఓ గుంజ సప్పోర్ట్ ఉండేది.  గేటునించీ గుమ్మం దాకా  కుడి ఎడమ వైపులు సందు లోకి నడవటానికి రెండడుగుల వెడల్పున దారి వదిలేసి చక్కని క్రోటన్స్ ఉండేవి.  ముందు వరాండా కిటికీ కింద,  దానినానుకుని ఉన్న  గది కిటికీ  కింద వరసగా కనకాంబరాలు విరగబూసి ఉండేవి.

ఎడమవైపునించి తెల్ల గులాబీ తీగ ఒకటి కిటికీ మీంచి చెజ్జా మీదకి పాకి ఆకులు తక్కువ పూలే ఎక్కువా అన్నట్లు గుత్తులు గుత్తుల గులాబీలతో నిండి ఉండేది.  ప్రహరీ గోడ వైపుగా రోడ్డు మీదకి రాలిపోతూ,  ఒకవైపు ఎర్ర గన్నేరు పూస్తుంటే, కుడివైపు సంపెంగలు పూసేవి.  సన్నజాజి వరసలోనే ఒక పెద్ద దేవ గన్నేరు చెట్టు నిండా పూసి,  వాకిలంతా రాలిన పూలతో ఉండేది.

దేవగన్నేరు పూలు (Plumeria flowers) చాలా ఎత్తులో పూసేవి.  పూజ కోసం మామగారు ఆ పూలు కూడా అచ్చం బాహుబలి లాగే కోసేవారు.  అంటే చెట్టు మొదట్లో పట్టుకుని ఊపేసేవారు.  పూలు జల జలా రాలేవి.  బుట్టలోకి ఏరే వారు.  ఎన్ని రకాల పూలున్నా అవి అలా కొయ్యాల్సిందే.  ఇక నిత్య మల్లి, బొండు మల్లి ఎండాకాలంలో మాత్రం పూసే మల్లి తీగె ఒక వరసలో ఉండేవి.  కుడివైపుకొస్తే ఒక పెద్ద కొబ్బరిచెట్టు, దాని పక్కగా మేడమీదకి పాకిన యెల్లో బెల్ల్స్ తీగ.  ఒక సందులో నుంచి మేడమీదకి పాకిన చెంబేలి ఆతరవాత ఒక సీత ఫలం చెట్టు,  అదే లైన్లో పెరటి వైపు,  ఒక తియ్యని జామకాయ చెట్టూ,  అంతే తియ్యని పాల సపోటా చెట్టు ఉండేవి. వెనకాల రెండు పెద్ద మామిడి  చెట్లూ, పెరటి మధ్యలో ఒక దానిమ్మ, పక్కగా  ఒక కొబ్బరి చెట్టు,  ఎడమవైపు సందులో ఒక ఉసిరి, కర్వేపాకు చెట్టూనూ.    అంటే అన్ని కాలాల్లో పూసే పూలూ, కాసే కాయల చెట్లూ అన్నీ ఉండేవి.

ఒక పెద్ద విగ్రహానికి దండ వేయడానికి సరిపడా పూలు పూసేవి.  ఇదంతా ఇప్పుడు నేను మీకు చెప్తుంటే నా జ్ఞాపకాల్లో కదలాడే దృశ్యం ఎంత మనోహరంగా ఉందంటే, అది ఒక అద్భుతమైన కల మాత్రమే ఇప్పుడు.  ఇప్పటి బాల్కనీల్లో చిన్న చిన్న కుండీల్లో  మొక్కలు పెంచుకుని  ఓ పువ్వు పూస్తే మురిసిపోయే దుస్థితి.  అలా మన ప్రయాణం  ప్రకృతి  అందాలు నిండిన పల్లెటూర్లనించి, విశాలమైన తోటల్నించి మొదలు పెట్టి, ఎంతో కొంత  వాకిలీ, పెరడు,  వాటిలో మచ్చుకి అన్నిరకాల మొక్కలు నించి,  నగరాలు మెగా నగరాలుగా  అభివృద్ధి చెందుతూ పోతుంటే మనం ఇరుకు డబ్బాల్లాంటి ఇళ్లలో కూరుకుపోయే వరకూ
వచ్చింది.

ఆ రోజుల్లో మా ఇంట్లో పేరుకు ఒక వంటావిడ ఉండేది. ఏ పని వచ్చని ఆవిడ్ని తీసుకొచ్చారో తెలియదు కానీ, ఆవిడకి వడ్డించే పని మనకు ఎక్స్ట్రా మాట. చూడ్డానికి పొట్టిగా, సన్నగా, పీలగా ఉండి చీర కొంచెం పైకి కట్టుకునేది. అవసరం ఉన్నా లేకపోయినా హి హి హి అంటూ నవ్వుతూ ఉండేది. మా ఇంట్లో అద్దెకు ఉండే వారికీ, చుట్టం చూపుగా వచ్చేవారికి వచ్చె వారికి బోనస్ ఏంటంటే, అనేక రకాల పండ్లు పూలు ఎప్పుడూ ఉంటాయి.  ఇక సంపంగి పూలు ఆమె కోసం మాత్రమే అన్నట్లు ఎప్పుడూ తలలో ఒకటో రెండో తురుము కొని ఉండేది. నౕను చూడగానే శారద గారూ అంటూ ఎదురొచ్చి ఓ సంపంగి పూవు ఇచ్చి గొప్ప ఘనకార్యం చేసినట్లు ముప్పై రెండు పళ్ళు కనిపించేలా నవ్వేది.   చెప్పాలంటే సంపంగి పువ్వు వాసన పక్కనబెడితే దాని మందపాటి రెక్కలు అర్ధచంద్రాకారంలో వంగి ఉండటం నన్ను కొంత ఇబ్బంది పెట్టేది. చూస్తే అదేదో ఆకుపచ్చని పురుగులా అనిపించేది. ఆవిడ ఆ తరువాత ఎడమ చేతిని కుడి వైపున నడుము‌ మీద వేసి, కుడి చేతిని బుగ్గల మీద ఆనించి, కుడి కాలిని ఎడమవైపు వేసి నిలబడి నవ్వే తీరు ఏ  బాపు కార్టూన్నో , ఆర్.కె.లక్ష్మణ్ కార్టూన్నో  తలపించేది. అసలు కథలో పిట్టకథలు ఎక్కువైనట్టు ఉన్నాయి.

ఇక మళ్ళీ మామగారి విషయానికొస్తే,  రోజూ వీటికి నీళ్ళు పైపుతో పొయ్యచ్చు నల్లాలో నీళ్ళు వచ్చే సమయంలో, కానీ అప్పటికింకా బతికిఉన్న బావిలోంచి తోడి పోసేవారు.  ఇంట్లో మిగిలి ఉన్న ఇటుకలతో అందంగా బార్డెర్స్  చేసే వాళ్ళు.  ఈ క్రమంలో పునాది వెయ్యగా మిగిలిన గ్రానైట్ రాళ్లు  అప్పట్లో అందరి ఇళ్లలోనూ ఇవి కనిపిస్తుండేవి. పైగా వాస్తు ప్రకారం ఈమూల బరువుండాలి అని ఓ పక్కగా పేర్చేవారు.  కాని మామగారు ఇటికల్ని వాడినంత సులభంగా వాటినీ అటూ ఇటూ మార్చేస్తుండేవారు.    అయ్యో మామగారు అంతంత బరువులు ఎందుకు మోస్తారండీ ఈ వయసులో అంటే, అవేం బరువుంటాయ్, చూడూ అంటూ మరోసారి ఎత్తి దూరంగా విసిరేవారు.  మరి మా మామగారు బాహుబలియేగా .

ఇక వాకిట్లోంచి ఇంట్లోకెళ్ళగానే  వారం వారం ఇంకొన్ని సర్ప్రైసులుండేవి.  .  ఆయనకున్న  మరో అలవాటు, ఇల్లంతా సర్దెయ్యడం.  ఉన్న వస్తువులు ఉన్నచోట ఎక్కువ రోజులు ఉండటం ఆయనకి నచ్చేదికాదు.  అందుకని  బరువైన వస్తువులన్నీ  కూడా అటూ ఇటూ సర్దేసేవారు.  బీరువా ఉండే చోటకి మంచం జరిగేది.  కిటికీ వైపు గాలి వెల్తురు వచ్చే చోటునుంచి మంచం జరిగితే ఆ చోటకి బీరువా వచ్చి అడ్డుగా నిలబడేది.  మొహమ్మీద వెలుతురు పడే చోటు నుంచి జరిగి అద్దం ఇంకో వైపుకు వెళ్ళిపోయేది.  ఒక్కోసారి గుమ్మానికడ్డంగా అలమారని  కూడా మూసేస్తూ మంచం జరిగిపోయేది.  దేనికీ లాజిక్కడగకూడదు.

అత్తగారు చెయ్యాల్సిందల్లా, ఆయనకవసరమైనవి అందించడం,  స్టూలో కుర్చీనో  పట్టుకోవడం,  ఆఖర్న ఇల్లు తుడిచెయ్యడం అంతే.  మరొక్క మాట కూడా ఆవిడ అనే సాహసం చేసేవారు కాదు.  ఈ సర్దడాలకి ఇంకో మెరుగు ఉండేది.  ఇంట్లో వేళ్ళడేసిన ఫొటోలూ,  దేనికోసమైనా కూడా కొట్టిన మేకులూ అన్నీ, అన్నీ కూడా స్థానభ్రంశం పొంది కొత్త చోట్ల పొడుచుకొచ్చేవి.  కనీసం అవి ఇదివరకున్న చోట్ల వాటి ఆనవాళ్లు కూడా మిగిలేవి కాదు.  ఎందుకంటే ఆ మేకుల కన్నాల్లో సున్నం వేసి పూడ్చేసి, పైనుంచి తెల్ల రంగు కూడా పూసేసే వారు.  అంత పెర్ఫెక్ట్ పని అన్నమాట.  అలా మా ఇంటి గోడల్లో గోడ తక్కువ సున్నం ఎక్కువ అయిపోయిందనుకోండి.  ఇదంతా చేసి సాయంత్రం ఇంటికొచ్చేవేళకి అసలేమీ ఎరుగనట్లు కులాసాగా పుస్తకం చదువుకుంటూ పడక్కుర్చీలో కూర్చుని కనిపించేవారు.

ఓరోజిలాగే ఇల్లు రిడిజైన్ అయ్యాకా గమనిస్తే ఆయన చొక్కాలు తగిలించుకునే కొక్కెం బాగా పైన కనిపించింది.  ఎంత ఎత్తున అంటే పూర్వం చెడుగాలి పోవడానికి వెంటిలేటర్స్ ఉండేవే, సరిగ్గా దాని కింద అన్నమాట. అయ్యో మామగారూ,  అంత  ఎత్తున హేంగర్ ఉంటే చొక్కా ఎలా తగిలిస్తారు అని అడిగాను అమాయకంగా.  ఆయన చురుగ్గా లేచి ఓ మూల నించి ఓ కర్ర తెచ్చి దానికి చొక్కా తగిలించి పైకి ఎత్తారు అయినా అందలేదు,  ఎంతైనా అంత పొడుగు మనిషి కాదు కదా.  ఎలా అయినా నాకు తగిలించి చూపెట్టాలికదా చొక్కాని, అందుకని ఒక్క గెంతు గెంతి వెనక్కి పడబోతే పట్టుకున్నాకా, ఇంకేం మాట్లాడడానికీ గొంతు పెగలక, ఇవతలికి వచ్చి పొట్ట పట్టుకున్నానంటే నమ్మండి.

ఇంకొకసారిలాగే ఏంచెయ్యబోయారో తెలియదు,  అడిగినా చెప్పలేదు.  ఇలాంటి రిపైర్లన్నీ చెయ్యడానికి ఎత్తైన స్టూల్ ఒకటుండేది.  నిజానికి ఆయన హైట్లో  మూడొంతులపైన ఉండే ఆ స్టూల్ ఎక్కడమే కష్టమైన పని.  కానీ, వద్దు చెయ్యొద్దు అని చెప్పే సాహసం ఎవరికుంది?  సాయంత్రం ఇంటికొచ్చేసరికి ఆ స్టూల్ఎక్కి ఏదొ చేస్తున్న ఆయన, సపోర్ట్ గా స్టూల్ ని పట్టుకుని నిలబడ్డ అత్తగారి మీద  పడి, ఇద్దరూ కలిసి కిందపడి,  ఆవిడ ఒళ్లంతా రకరకాల దెబ్బలు, గాట్లతో దర్శనమిచ్చింది.    ఓపక్కన దెబ్బలు,  ఒళ్ళు నొప్పులతో ఆవిడ కుయ్యొ మొర్రోమంటుంటే,  ఏమీ జరగనట్లు, ఎందుకు మూల్గుతావ్  ఓ paracetamol వేసుకో అని చెప్పే  మామగార్ని చూస్తూ,  ఆ వయసులో ఎముకలు విరగ్గొట్టుకోనందుకు సంతోషించి ఊరుకున్నాం ఇంట్లో అందరమూనూ.

ఇలా మామగారి సర్దుళ్ళ వల్ల బయటి వాళ్ళ తల బొప్పి కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయండోయ్.  అలాంటి మరిన్ని విశేషాలతో మళ్లీ ఇంకోసారికి మరిన్ని నవ్వించే ముచ్చట్లు చెప్పుకుందాం.

(శారద శివపురపు,రచయిత్రి, బ్లాగర్, బెంగళూరు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *