అసెంబ్లీ రాజీనామా గంటా శ్రీనివాస్ ని గట్టెక్కిస్తుందా?

కొంత మంది ఎదయినా చేస్తే నమ్మలేం. విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రాజీనామా వార్త  అలాంటిదే. వైజాగ్ స్టీల్ ప్లాంటును కేంద్రం  ప్రవేటీకరిస్తున్నందన్న వార్త  రాాగానే  నిరసన చెబుతూ ఈ రాజీనామా చేసి పడేశారు.

ఉన్న ఫలానా రాజీనామా చేసినట్లున్నారు, ఎదురుగా ఉన్న లెటర్ హెడ్   మీద  నాలుగు లైన్లు రాసి సంతకం పెట్టేశారు. ఈ వార్త టివిల్లో వచ్చింది. లేఖ వాట్సాప్ లో   అందరికీ అందుబాటులోకి వచ్చింది. సోషల్ మీడియాలో బాగానే షేర్ చేశారు. అయితే, ఆయన రాజీనామా వార్త  భూకంపం సృష్టించలేదు. తన మీద అపవాదులన్నింటిని తుడిచేసుకునేందుకు  రాజీనామా ‘త్యాగం’ చేశారని అంటున్నారు.

ఆయన ఇపుడు తెలుగుదేశం ఎమ్మెల్యే. విశాఖ నార్త్ నుంచి వైసిసి అభ్యర్థిగా, పర్వాలేదు, మంచి మెజారిటీతోనే గెలిచారు. అయితే, ఏం లాభం, తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది. వైసిపి అధికారంలోకి వచ్చింది. మంత్రిపదవి వచ్చే అవకాశం లేదు.  తెచ్చుకోవడం ఎలా? ఈ ప్రశ్న ఆయన్ని ప్రశాంతంగా ఉండనీయలేదు. వైసిపిలోకి దూకమంది. దూకాలనుకున్నారు. కాని, దూకలేకపోయారు. అందుకే ఇపుడు ఆయన తనని మూడుసార్లు గెలిపించి, రాజకీయ జీవితం ప్రసాదించిన పార్టీ అయిన తెలుగుదేశంలో ఉండలేరు, వైసిపిలోకి వెళ్లలేరు. మంత్రి పదవి రాదు.

ప్రజా రాజ్యం పార్టీలో ఉన్నపుడు, కాంగ్రెస్ లో ఆ పార్టీని విలీనం చేయించిన లబ్ది పొందిన ఎమ్మెల్యే ఆయన. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ఖాయిలా పడిందని చక్కగా పసిగట్టారు, తెలుగుదేశం పార్టీకి సరైన నాయకత్వం ఉందని భావించి టిడిపి లో చేరి, నెగ్గారు. మంత్రి అయ్యారు. 2019 తర్వాత ఆయన స్టార్స్ మసకబారాయి. గెలిచినా స్టార్స్ వెలగకపోవడం ఆయనకు నచ్చలేదు. అందుకే ఫిరాయించాలనుకున్నారు. ఈ పాచిక పారలేదు. పారకపోవడమే కాదు,వైసిపి వాళ్లు బాగా అవమానపర్చారు.

గంటాను పార్టీ లోకి తీసుకుంటున్నారని వార్తలు రాగానే సుమారు 300  మంది వైసిపి కార్యకర్తలు భీమ్లి తిమ్మాపురం జంక్షన్ దగ్గిర మానవహారం ఏర్పాటుచేసి, ప్లకార్డులు పట్టుకుని  పెద్దగొడవ చేశారు. ఇంత గొడవ జరిగడంతో   ఆయనను వైసిపిలోకి తీసుకోవడం జటిలమయింది.ఒకపుడు ఆయనకు సన్నిహితుడయిన అవంతి శ్రీనివాసరావు దీని వెనక ఉన్నాడని చెబుతారు.

తిమ్మాపురం జంక్షన్ ను ఎందుకు ఎన్నుకున్నారంటే… జగన్ పాదయాత్ర సందర్భంగా ఈ జంక్షన్ లో  వైఎస్ ఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్నారు. అపుడు మంత్రిగా ఉన్న గంటా దీనిని అడ్డుకున్నారు. వైసిపి కార్యకర్తలను అరెస్టు చేయించారు.

గంటా శ్రీనివాస రావు   అధికారంలో ఉన్న పార్టీలోకి దూకడం అలవాటని అట్లాంటి  వ్యక్తిని పార్టీలోకి తీసుకోవద్దని వాళ్లంతా గొడవచేశారు.  పార్టీనేత విజయ సాయిరెడ్డి వినతి పత్రం సమర్పించారు.దీనితో ఆయన ఫిరాయింపు ఆగిపోయింది.

తర్వాత ఇండియన్ బ్యాంక్  రు. 200 కోట్ల రుణం వ్యవహారం బయటకు వచ్చింది.  ఒక  కంపెనీ పూచీ పడి ఈ రుణం ఇప్పించడం, దానికి ఆ కంపెనీ చెల్లించకపోవడంతో  గంటా ఫ్లాట్ వేలం వేసే దాకా వ్యవహారం సాగింది. ఇది బాగా ఆయనకు అపకీర్తి తెచ్చింది. ఒకపుడు ఈ కంపెనీలో ప్రముఖ పాత్రపోషించింది గంటాయేననేది ఆరోపణ.

వీటితో తెలుగుదేశం పార్టీ ఆయనను విస్మరించింది. పార్టీలో గాని, అసెంబ్లీలో గాని ఆయన గొంతు వినిపించడం లేదు. ఆయన బొమ్మ కూాడా టివిలలోొ కనిపించడం మానేసింది. అంటే  టిడిపి ఆయనను దూరంగా పెట్టిందని అర్థం. అలాగే వైసిపికి దగ్గిరా కాలేక పోయాడు.

ఇలాంటపుడు వైజాగ్ స్టీల్ ప్రయవేటీకరణ ప్రతిపాదన వచ్చింది. దీని మీద ఆయన నిరసన చెబుతూ రాజీనామా చేశారు. ఇది ఆయనను రాజకీయాల్లో ప్రముఖుడిని చేస్తుందా?

ఈ రాజీనామా డ్రామాయా, లేక నిజంగా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కేంద్రం దెబ్బతీస్తున్ననదని కడుపు తరుక్కుపోయి చేసినా రాజీనామాయా?

ఈ రాజీనామా  ప్రిస్క్రైబ్డ్ ఫామ్ లో లేదని, అది ఆమోదం పొందదని అంటున్నారు. వైజాగ్ స్టీల్ కోసం పరిరక్షణ కోసం రాజీనామా చేయాల్సిన పనిలేదు. ఉద్యమం చేస్తే చాలు. మరీ ఎపుడూ పవర్ తప్ప పోరాటం తెలియని గంటా శ్రీనివాసరావు వైజాగ్ స్టీల్ కోసం ఆమరణ నిరాహార దీక్ష లాంటివి చేస్తారా? లేక ఉద్యమాలతో విశాఖలోభూకంపం సృష్టిస్తారాచూడాలి. ఎందుకంటే, నిరాహార దీక్షలకు చాలా శక్తి ఉంటుంది. కెసిఆర్ ఆమరణ నిరహార దీక్ష చేశాకే తెలంగాణ అంటుకుంది. ప్రత్యేక రాష్ట్రం వచ్చే దాకా ఆరిపోలేదు. ఆ బాటాలో గంటా పయనిస్తారా?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *