కాంక్రీట్ బారికేడ్లు రైతు ఉద్యమాన్ని ఏ మలుపు తిప్పనున్నాయి?

(ఇఫ్టూ ప్రసాద్ -పిపి)

26-11-2020 నుండి 26-1-2021 వరకూ రైతాంగ ప్రతిఘటనకు సింఘు బోర్డర్ ప్రధాన కేంద గా ఉంది.

అందుకే సహజంగానే దేశంలోని మిగిలిన అన్ని రహదారి దిగ్బంధన పోరాట క్షేత్రాల కంటే, సింఘుకి ఎక్కువ రాజకీయ ప్రాముఖ్యత ఏర్పడింది. అంటే నేటి రైతాంగ ప్రతిఘటన అనే రాజకీయ తుఫానుకి సింఘు అల్పపీడన కేంద్రం (Epi centre)గా ఉందని అర్ధం.

టెక్రీ బోర్డర్ కూడా మరో కేంద్రoగా పని చేసింది. నిజానికి పై రెండింటి ప్రేరణతో నవంబర్ 26 తర్వాత కొద్దిరోజులకి ఉనికి లోకి వచ్చిందే ఘజీపూర్ బోర్డర్ దిగ్బంధన శిబిరం. ఇవీ వాస్తవ వరసక్రమంలోని తాజా రైతాంగ ప్రతిఘటనా పోరాట క్షేత్రాలు.

పోరాటాల వెల్లువలు తలెత్తే సందర్భాల్లో సహజంగా ఆయా రాజ్యాల అణిచివేతకు వరస క్రమం రెండు భిన్న రకాలుగా ఉండొచ్చు. ఒక వరస ప్రకారం తీవ్రస్థాయి పోరాట కేంద్రాల్ని ముందుగా అణచివేసి, అటు తర్వాత వాటి ప్రేరణతో నడిచే అల్ప స్థాయి పోరాట కేంద్రాల్ని ఆయా రాజ్యాలు సహజంగా అణచివేస్తాయి. నిజానికి అట్టి సందర్భాల్లో తీవ్రస్థాయి పోరాట కేంద్రాల అణచివేతతో వాటి స్ఫూర్తితో కొనసాగే పోరాట కేంద్రాల్ని ప్రత్యేకంగా అణచివేసే పరిస్థితి రాకుండానే సర్దుమణిగి పోతుంటాయి. వాస్తవానికి ఇదే సర్వ సహజ వరసక్రమం. మరో వరస ప్రకారం దిగువ స్థాయి నుండి ఎగువస్థాయికి రాజ్యాల అణిచివేత క్రమం ఉంటుంది. వీటికి కారణాల్ని పరిశీలిద్దాం.

తేలికపాటి అణచివేత ప్రక్రియ ద్వారా పోరాటాల ప్రక్రియను తుదముట్టించే భౌతిక పరిస్తితి రాజ్యాలకు వున్నప్పుడు సహజంగా ఆయా రాజ్యాల దమన కాండ ఎగువ స్థాయి నుండి దిగువ స్థాయి వైపుకు కొనసాగుతుంది. అలా కాకుండా ఒకవేళ పోరాట శక్తుల్ని సమీప భవిష్యత్ లో తిరిగి తలెత్త నివ్వకుండా వ్యూహాత్మకంగా క్రూర ఫాసిస్టు అణచివేతకు పూనుకునే లక్ష్యం రాజ్యాలకి ఉందనుకుందాం. ఆ నిర్దిష్ట సందర్భాల్లో భిన్నమైన వరస క్రమం రాజ్య అణచివేత ప్రక్రియలో చోటుచేసుకోవచ్చు. అప్పుడు ఏదో ఒకపోరాట క్షేత్రం పై ఫాసిస్టు తరహా క్రూర రక్తసిక్త దమనకాండకు స్టేజ్ కూప్స్ పేరిట పాల్పడాల్సిన ఆవశ్యకత ఆయా దోపిడీ రాజ్యాలకి ఏర్పడవచ్చు. అట్టి నేపద్యంలో తేలికపాటి నిర్బంధకాండతో దిగువ స్థాయి పోరాట కేంద్రాల్ని ముందు అడ్డు తొలగించుకొని, తుదకు న్యూక్లియస్ వంటి కేంద్రంపైకి దాడికి దిగుతుంది. ఈ నిర్దిష్ట సందర్భాలలో వరస క్రమం తలక్రిందులుగా రాజ్యం చేత ఎంపిక జరుగుతుంది. ఈ సందర్భాలలో ఓ స్టేజి కూప్ లేదా మరో బూచితో తాను ఎంపిక చేసుకున్న ప్రధాన పోరాట కేంద్రం పై రక్తసిక్త దమనకాండకు దిగుతుంది.

పైన పేర్కొన్న మొదటి వరస క్రమంలో రాజ్యం సాగించే అణచివేత ప్రక్రియకు వరసగా సింఘు, టెక్రీ, ఘజీపూర్… అనే విధంగా పోరాటక్షేత్రాల్ని రాజ్యం ఎంపిక చేస్తుంది. దానికి పూర్తి భిన్నమైన రెండో రకం వరస క్రమాన్ని అది ఎంచుకున్న సందర్భాలలో ఘజీపూర్, టెక్రీ, సింఘు… అనే వరసక్రమంలో పోరాట క్షేత్రాల అణచివేతకు రాజ్యం దిగుతుంది. నేడు మోడీ ప్రభుత్వం ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యం పై రెండింటి లో ఏ తరహా వరసక్రమాన్ని ఎంపిక చేసుకోవాల్సిన భౌతిక పరిస్థితి ఏర్పడిందో చూద్దాం.

రైతు సంఘాలతో మోడీ ప్రభుత్వ దౌత్య ప్రక్రియలో భాగంగా 11వ రౌండ్ చర్చలు జనవరి 22న ముగిశాయి. ఆ తర్వాత కూడా చర్చల క్రమం ఉంటుందని మోడీ ప్రభుత్వం మాటల్లో ప్రకటించింది. ఐనా చేతల్లో మాత్రం 22 తర్వాత దాని వైఖరి మారినట్లు తదనంతర పరిణామాల్ని బట్టి తేలిగ్గా అర్ధమవుతుంది. రైతు సంఘాల పట్ల దౌత్య ప్రక్రియ స్థానంలో క్రూర అణచివేత ప్రక్రియకు మోడీ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని బోధపడుతుంది. అందుకై ఓ స్టేజ్ కూప్ కొరకు రిపబ్లిక్ డే ని ఎంపిక చేసుకుందని కూడా ఎర్రకోట సంఘటనల్ని బట్టి తెలుస్తుంది. అట్టి వ్యూహాత్మక దృష్టితో ఆరోజు ట్రాక్టర్ పెరేడ్ కి అనుమతిచ్చిందని తెలుస్తోంది.

జనవరి 26వ తేదీ తర్వాత ఓ రెండు రోజుల పరిణామాలు “స్టేజి కూప్” వ్యూహకర్తలకి ఆశాజనకంగానే కనిపించాయి. తన ముందస్తు ఫాసిస్టు క్రూర దమనకాండ ప్రణాళిక అమలు కి అనువైనస్థితి ఏర్పడుతోందనే విశ్వాసమే కలిగి ఉంటుంది. ఆ అంచనాతోనే రాజ్యం పావులు కదిపిందని 27, 28 తేదీల నాటి మోడీ ప్రభుత్వ చర్యలు వెల్లడి చేస్తున్నాయి. రాజ్యవ్యవస్థకు అట్టి ఆశాజనక స్థితి దాదాపు 48 గంటల పాటు సాగింది. 26 నుండి 28వ తేదీ వరకు రాజ్యం అట్టి భ్రమలలోనే వుంటానికి అవకాశం ఉంది. ఆ భ్రమాత్మక దృష్టితోనే ఘజీపూర్ ధర్నా శిబిరం తొలగింపుకై యూపీ (యోగి) సర్కార్ అండతో మోడీ ప్రభుత్వం ఒక మోస్తరు అణచివేత ప్రక్రియకి దిగిందని తెలుస్తుంది. ముందస్తు రాజ్య ప్రణాళికకి అద్దం పడుతోంది. కాల్పులు, రక్తసిక్తత వంటి ఫాసిస్టు అణచివేత వైపు కాకుండా, రాకేష్ తికాయట్ సహా రైతునేతల్ని అవమానించి అరెస్టుచేసి, అక్కడున్న రైతు ఉద్యమకారుల్లో నైతికస్థైర్యాన్ని దిగజార్చే వైఖరిని ఆరోజు రాజ్యం చేపట్టిందని దాని గమనతీరు వెల్లడిస్తోంది.

మోడీ షా ప్రభుత్వం పన్నిన రక్తసిక్త ఫాసిస్టు రాజ్యరహదారి లో తుది మజిలీ (సింఘా) కి చేరక ముందే, తొలి మజిలీ (ఘజీపూర్) వద్దనే, ఆ ప్లాన్ ఓ ప్లాఫ్ అయ్యుంది. పైగా 29వ తేదీ నుండి సింఘు స్థానాన్ని ఘజీపూర్ చేపట్టింది. 29నాటి ముజఫర్ నగర్ మహా పంచాయతీతో భౌతిక పరిస్థితి గుణాత్మకంగా మారిపోయింది. కుడి ఎడమైనది. ఎడమ కుడై పోయింది. అంతవరకూ రైతాంగ ఉద్యమానికి సింఘు కేంద్రం (సెంటర్) గా; కేంద్రకం (న్యూక్లియస్) గా ఉండేది. అట్టి స్థానాన్ని ఆరోజు నుండి కొత్తగా ఘజీపూర్ భర్తీ చేసే స్థితికి దారి తీసింది. దానితో రాజ్యం డంగై పోయింది. ఓ రెండు రోజుల పాటు రాజ్యం సైకలాజికల్ గా సకాలంలో ఏ నిర్ణయం కూడా తీసుకోలేని అయోమయావస్థకి గురై ఉంటుంది.

రాజ్యం ఓవైపు 22వ తేదీ తర్వాత రూపొందించుకున్న తన ఫాసిస్టు రక్తసిక్త వ్యూహాన్ని యధావిధిగా అమలు చేయలేని స్థితికి నెట్టబడింది. మరోవైపున 22న నిలిచి పోయిన చర్చల ప్రక్రియకు రమ్మని వెనువెంటనే రైతాంగ సంఘాల్ని ఆహ్వానించ లేని క్లిష్టస్థితిలో పడి పోయింది. 26 నాటి పరిణామాలకు తనచే అభాండాలు మోపబడ్డ రైతాంగ ఉద్యమ సంస్థలను చర్చలకు వెంటనే ఆహ్వానించడం మోడీ ప్రభుత్వానికి సాధ్యం కాదు. ఓ మొఖంచాటు ముసుగు (Face save formula) ధరించకుండా వెంటనే దానికి అది దానికి సహజంగానే సాధ్యం కాదు. పై రెండింటికి సాధ్యం కాలేని ఒక అయోమయ పరిస్థితి మోడీ సర్కారు కి ఏర్పడి ఉంటుంది. ఈ పరివర్తనా దశలో రాజ్యం అప్పటికప్పుడు తాత్కాలికంగా ఎంపిక చేసుకున్న కొత్త ప్రక్రియే కాంక్రీట్ బారికేడ్ల నిర్మాణం.

రూపం (Form) లో చూస్తే, రోడ్లపై తాజా కాంక్రీట్ బారికేడ్ల నిర్మాణం మోడీ ప్రభుత్వ దూకుడుస్థితి (ఆఫెన్సివ్) కి అద్దం పడుతోంది. కానీ సారం (Content) గా చూస్తే, అది మోడీ ప్రభుత్వ రక్షణస్థితి (డిఫెన్స్) ని వెల్లడిస్తుంది. అది ఎలాగో చూద్దాం.

జనవరి 22 వరకూ సాగిన చర్చల దౌత్య వ్యూహం కంటే, 22 తర్వాత రాజ్యం ప్లాన్ చేసుకున్న రక్తసిక్త రహస్య రాజకీయ వ్యూహం ఎక్కువ దూకుడు స్థితికి అద్దం పడుతోంది. అట్టి రహస్య ఫాసిస్టు నిర్బంధ ప్రక్రియ ప్రకారం రాజ్యం చేపట్టాల్సిన నిన్నటి రక్తసిక్త దూకుడు స్థితితో పోల్చితే, నేటి బారికేడ్ల నిర్మాణ ప్రక్రియ ప్రభుత్వ వెనకంజ (డిఫెన్స్) స్థితిని వెల్లడిస్తుంది.

దూకుడు స్తితితో క్రూర రక్తసిక్త ఫాసిస్టు దమనకాండకి పథక రచన చేసుకొని, తర్వాత బోర్లా బొక్కలపడి క్రమంగా మోడీ ప్రభుత్వం రక్షణ స్థితిలో పడింది. దానిని వెల్లడిస్తోన్నదే తాజా బారికేడ్ల నిర్మాణం. నిన్న ప్రయోగించాల్సిన తూటాల్ని తాత్కాలికంగా జమ్మిచెట్టు పైకి ఎక్కించి, వాటి బదులు కొత్తగా ఇనుప మేకుల్ని బయటకి తీసి, రోడ్లపై బారికేడ్ల నిర్మాణానికి వినియోగించడం మోడీ సర్కారు కి ముమ్మాటికీ ఓ వెనకడుగే! ప్రాణం ఉన్న సజీవ పోరాట రైతాంగ ఉద్యమకార్ల గుండెల్లో తూటాల్ని దింపే తొలి ప్రణాళిక స్థానంలో ప్రాణం లేని జాతీయ రహదారులలో ఇనుప మేకులు నాటే పనిని చేపట్టడం ముమ్మాటికీ రాజ్య బలహీనతకే నిదర్శనం. మేకిన్ ఇండియా కి అనునిత్యం సజీవ కదలికలో ఉండాల్సిన రహదారుల మీద తానే స్వయంగా మేకులు పాతే స్థితి రావడం ముమ్మాటికీ దాని ఓటమిని సూచిస్తుంది. మేకిన్ ఇండియాని మేకుల ఇండియా గా మార్చడం మోడీ ప్రభుత్వం వెనకడుగుకు నిదర్శనం. చరిత్ర లో తొలిసారి ప్రభుత్వమే రోడ్లపై నిర్మిస్తోన్న కాంక్రీట్ బారికేడ్ల వ్యవస్థ రాజ్య బలానికి కాక, దాని వాస్తవ బలహీనతకు చిహ్నంగా భావించాలి. దీన్ని బట్టీ తాజా రైతాంగ ఉద్యమ గమనంలో రాజ్యానికి ఇదో తిరోగమన మలుపు కాగా, ఫాసిస్టు వ్యతిరేక ప్రజాతంత్ర ఉద్యమాలకు పురోగమన మలుపుగా మారుతుంది. ఇది వర్తమాన రైతాంగ ఉద్యమం సాధించిన ఓ ఘనమైన రాజకీయ విజయం.

(ఈ వ్యాస రచయిత ఇఫ్టు నేత. కొద్ది రోజులు సింఘు బార్డర్ రైతాంగ పోరాటంలో పాల్గొని అధ్యయనం చేసి వచ్చారు. ఇందులో వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతం. టిటిఎన్ కు వాటితో ఏకీభవించనవసరం లేదు.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *