తిరుప‌తిలో మాయ‌మైన చెరువులు, కుంట‌లు (తిరుప‌తి జ్ఞాప‌కాలు-18)

(రాఘ‌వ శ‌ర్మ‌)
తిరుప‌తి లో ఒక‌ప్పుడు లెక్క‌లేన‌న్ని చెరువులు, కుంట‌లు ఉండేవి.వీటిలో చాల మ‌టుకు స‌హ‌జ‌సిద్ధంగా ఏర్ప‌డిన‌వే. కొన్ని మాత్రం మాన‌వ నిర్మితాలు. ఇవి ఒక‌టొక‌టిగా మాయ‌మ‌వుతున్నాయి. చాలామ‌టుకు ఆన‌వాళ్ళు కోల్పోతున్నాయి.
శేషాచ‌లం కొండల్లో కురిసిన వ‌ర్షపునీరు ప‌ల్లానికి పారి, తిరుమ‌ల కొండ‌ల సానువుల్లో కాల్వ‌లుగా ఏర్ప‌డ్డాయి.ఆ వ‌ర్షపు నీటి వ‌ల్లే స‌హ‌జ‌సిద్ధంగా చెరువులు, కుంట‌లు ఏర్ప‌డ్డాయి.
ఆ చెరువులు, కుంట‌ల మ‌ధ్యే శ‌తాబ్దాల క్రితం ఈ ఆధ్యాత్మిక న‌గ‌రం వెలిసింది. అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద ఉన్న దిగుడుబావిలో ఒకప్పుడు నీళ్ళు పొంగిపొర్లేవి.
ఇప్పుడు జ‌నంతో కిట‌కిట‌లాడుతున్న‌ చిన్న బ‌జారు, తీర్థ‌క‌ట్ట వీధి కూడా శ‌తాబ్దం క్రితం వంకలుగా పారేవి. నాగ‌రిక‌త పెరిగి తిరుప‌తి న‌గ‌రంగా విస్త‌రించింది.
నిరు పేద‌లు త‌ల‌దాచుకోడానికి చెరువు క‌ట్ట‌ల‌పైన గుడిసెలు క‌ట్టుకుని నివ‌సించ‌డం మొద‌లు పెట్టారు. ఆర్థిక అంగ బ‌ల‌మూ, రాజకీయ ప‌లుకుబ‌డి క‌ల‌ పెద్ద‌లు చెరువుల‌నే మింగేసి, బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాలు నిర్మించేశారు.
న‌గ‌ర విస్త‌ర‌ణ పేరుతో ప్ర‌భుత్వం కూడా కొన్ని కుంట‌ల‌ను, చెరువుల‌ను పూడ్చేసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ‌ ప్లీన‌రీ కోసం ఆ పార్టీ పెద్ద‌లు మ్యాజిక్ స్టిక్ పట్టుకుని ‘అబ్ర‌క ద‌బ్ర ‘ అన్నారు.
అతిపెద్ద అవిలాల చెరువు కాస్తా మాయ‌మైపోయింది. నాక‌ళ్ళ ముందు జరిగిన అన్నిటి కంటే అతి పెద్ద విషాదం ఇది. తిరుప‌తికి ద‌క్షిణాన‌ మా ఇంటికి కూత వేటు దూరంలో అవిలాల చెరువు ఉండేది. దాదాపు రెండు వంద‌ల ఎక‌రాలలో ఈ చెరువు విస్త‌రించింది.
మేం ఈ ప్రాంతానికి వ‌చ్చిన కొత్త‌ల్లో నాలుగు ద‌శాబ్దాల క్రితం కూడా ఈ చెరువు కింద వ్య‌వ‌సాయం సాగేది. ఈ చెరువులోకి స‌హ‌జ సిద్దంగా అన్ని వైపుల‌నుంచి వ‌చ్చే నీటి కాలువ‌ల‌(స‌ప్లై చానెళ్ళ‌) ను ముందుగా ఆక్ర‌మించేశారు. చెరువు లో త‌గినంత‌ నీళ్ళు లేక వ్య‌వ‌సాయం కుంటుప‌డింది. అయినా, చెరువుకు ఉత్త‌రాన వేస‌విలోనూ చాలా నీళ్లుండేవి. నాకు తెలిసి ముగ్గురు పిల్ల‌లు ఈ చెరువు నీటిలో ఈ త కొట్ట‌డానికి వెళ్ళి మ‌ర‌ణించారు.
అది 1992 . చెరువుల చ‌రిత్ర‌లో అత్యంత విషాద‌క‌ర‌మైన కాలం. పీవీ న‌ర‌సింహారావు ప్ర‌ధానిగా ఉన్నారు. జాతీయ‌ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు కూడా. రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా నేదురుమ‌ల్లి జ‌నార్ధ‌న రెడ్డి ప‌ని చేస్తున్నారు.
అఖిల భార‌త కాంగ్రెస్ ప్లీన‌రీ స‌మావేశాలు తిరుప‌తిలో 1992 ఏప్రిల్ 14-16 తేదీల లో జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించారు. రాజు త‌లుచుకుంటే దెబ్బ‌ల‌కు కొదువా! వెంట‌నే వారు అవిలాల చెరువును ధ్వంసం చేయించేశారు.
ఆ చెరువు మ‌ధ్య‌లో రాజీవ్ గాంధీ విగ్ర‌హాన్ని స్థాపించి, ఈ ప్రాంతానికి రాజీవ్ న‌గ‌ర్ అని పేరు పెట్టారు. ఆ త‌రువాత ఆ విగ్ర‌హాన్ని ప‌ట్టించుకోలేదు. అది వేరే విష‌యం. ఆ మూడు రోజులూ అంగ‌రంగ వైభ‌వంగా ప్లీన‌రీ జ‌రిగింది. తిరుప‌తిలో పండుగ వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది.
దేశం న‌లుమూల‌ల నుంచి కాంగ్రెస్ అతిర‌థ మ‌హార‌థులు వ‌చ్చారు. అంతా వెళ్ళిపోయారు. అవిలాల చెరువు నేల‌మ‌ట్ట‌మైపోయింది.దాని ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయి.
ఆ త‌రువాత చిరంజీవి ఈ అవిలాల చెరువులోనే ప్ర‌జారాజ్యం పార్టీని ప్రకటించారు. అవిలాల చెరువు ఉన్న రోజుల్లో, మా చుట్టుప‌క్క‌ల బావుల్లో ముప్పై అడుగుల్లో పుష్క‌లంగా నీళ్లుండేవి. ఇప్పుడు వంద‌ల అడుగుల లోతులో బోర్లు వేసినా నీటి జాడ క‌నిపించ‌డం లేదు. చెరువు పూడ్చేశాక బావుల‌న్నీ ఎండిపోయి సంపులుగా మారిపోయాయి. గంగ‌మ్మత‌ల్లికి కోప‌మొచ్చిన‌ట్టుంది.
అవిలాల చెరువును నేల‌మ‌ట్టం చేసిన‌ కాంగ్రెస్‌ను శ‌పించింది. ఈ చెరువులో పుట్టిన ప్ర‌జారాజ్యం పైన కూడా ఆ శాపం సోకిన‌ట్టుంది.
అవిలాల చెరువులో రెండు వంద‌ల కోట్ల రూపాయ‌ల పైగా ఖ‌ర్చుచేసి ఇప్పుడొక మెగా పార్కు క‌డుతున్నారు. ఏళ్ళు గ‌డుస్తున్నాయి. ప్ర‌భుత్వాలు మారుతున్నాయి.
ఆ పార్కు ఎప్ప‌డు పూర్త‌వుతుందో తెలియ‌దు. ఏ రూపు దాలుస్తుందో తెలియ‌దు. నీటిని పంపింగ్‌చేసి అందులో బోటు షికారు పెడ‌తార‌ట‌!
ప్లే గ్రౌండ్ గా మారిన తుమ్మల గుంట చెరువు
తుమ్మ‌ల గుంట చెరువు కింద ఉన్న పొలాల‌న్నీనివాస ప్రాంతాలైపోవ‌డం వ‌ల్ల చెరువు కాస్తా పెద్ద ప్లేగ్రౌండ్‌గా మారిపోయింది. ఇది చెరువు అని చెప్పుకోడానికి దీనికి క‌ట్ట‌లు మాత్రం ఇప్ప‌టికీ మిగిలిఉన్నాయి.
తిరుప‌తిలో పాలిటెక్నిక్ కాలేజీకి ఉత్త‌రాన పాచిగుంట ఉండేది. నాకు తెలిసిన కాలంలో కూడా ఆ నీటిగుంట‌ చుట్టూ యానాదులు గుడిసెలు వేసుకుని జీవించేవారు. క్ర‌మంగా వారిని త‌రిమేశారు. ఇప్పుడ‌క్క‌డ పెద్ద పెద్ద భ‌వ‌నాలు వెలిశాయి.
పాలిటెక్నిక్ కాలేజీ వెనుక వైపు సింగాల గుంట ఉంది. అది కూడా ఒక మోస్త‌రు చెరువే. ఒక‌ప్పుడు సింహాలు వ‌చ్చి అక్క‌డ‌ నీళ్ళు తాగిపోయేవ‌ట‌. అందుకే సింహాల‌ గుంట కాస్తా సింగాల గుంట అయ్యింది. సింగాల గుంట క‌ట్ట‌పైన తొలుత‌ పేద‌లు గెడిసెలు నిర్మించుకున్నారు. కొంద‌రు పెద్ద‌లు ఆ గుంటను పూడ్చేసి క్ర‌మంగా ఇళ్ళ నిర్మాణాలు చేప‌ట్టారు.
కొర్ల‌గుంట కూడా ఒక‌ప్పుడు చిన్న‌పాటి చెరువే. ఇప్పుడ‌ది న‌గ‌రంలో ప్ర‌ధాన భాగ‌మైపోయింది. గంగ‌మ్మ‌గుడి ఎదురుగా, తుడా ఆఫీసు వ‌ద్ద తాత‌య్య‌గుంట చెరువు ఉండేది. ఇప్పుడు ఆ చెరువు ఆన‌వాళ్ళు కూడా లేవు.
శ్రీ‌నివాసం ప‌డ‌మ‌టి వైపున‌, ఇప్ప‌టి ఆర్టీసి బ‌స్టాండు ప్రాంతంలో తాళ్ళ‌పాక చెరువు ఉండేది. శ‌తాబ్దాల క్రితం తాళ్ళ‌పాక వంశీకులు ఈ చెరువును త‌వ్వించారు.
నాలుగు ద‌శాబ్దాల క్రితం వ‌ర‌కు కూడా అక్క‌డ చెరువు ఉండేది. ఆ చెరువులో ఆర్టీసి బ‌స్ కాంప్లెక్స్ వెలిసింది. బ‌స్టాండు వెన‌కాల పెద్ద స్టార్ హోట‌ల్‌, దాని చుట్టూ వ్యాపార స‌ముదాయాలు వెలిశాయి.
ఒక‌ప్పుడు అక్క‌డ చెరువు ఉండేద‌ని చెప్పినా న‌మ్మ‌డానికి ఇప్పుడు క‌నీస ఆన‌వాళ్ళు కూడా లేవు.
బాలాజీ థియేట‌ర్ ఎదురుగా రోడ్డుకు ద‌క్షిణ దిశ‌గా సింగిరి గుంట ఉండేది. ఉత్త‌రాన బాలాజీ థియేట‌ర్ ముందున్న రోడ్డు, ద‌క్షిణాన రైల్వే ట్రాక్‌, తూర్పున ఫైర్ స్టేష‌న్‌, ప‌డ‌మ‌ర‌న ఎస్వీహైస్కూల్ గ్రౌండ్ హ‌ద్దులుగా మ‌ధ్య‌లో ఈ నీటి గుంట ఉండేది. మంచినీటి గుంట నిండితే నీళ్ళు ఈ సింగిరి గుంట‌లోకి వ‌చ్చి ప‌డేవి.
తిరుప‌తి చెరువు కూడా చాలా పెద్ద‌ది. దాదాపు వంద ఎక‌రాల విస్తీర్ణంలో ఉండేది. ప్ర‌స్తుత ఆకాశవాణి ఎదురుగా ఉన్న పాడుబ‌డిన మున్సిప‌ల్ షాపింగ్‌ కాంప్లెక్స్ , రైతు బ‌జార్ నుంచి, ప‌ళ‌ణి టాకీస్ ఎదురుగా రైల్వే ట్రాక్ వ‌ర‌కు ఈ చెరువు విస్త‌రించింది.
తిరుప‌తి, తిరుచానూరు మ‌ధ్య‌లో అర్బ‌న్‌హాట్ వెనుక‌వైపు ‘పెద్ద చెరువు ‘ ఉండేది. ఇప్పుడు ఈ ‘పెద్ద చెరువు ‘ చాల భాగం ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురై, నామ‌రూపాలు లేకుండాపోయింది.
ఆటోన‌గ‌ర్ కూడా ఒక‌ప్పుడు పెద్ద చెరువే. ఈ చెరువులో ఆటోన‌గ‌ర్ క‌ట్టాల‌ని, తిరుప‌తిలో ఆటో మెకానిక్ షాపుల‌న్నిటినీ ఈ చెర‌వు ప్రాంతానికి త‌ర‌లించాల‌ని ప్ర‌భుత్వం భావించింది. అంటే తొలుత‌ ప్ర‌భుత్వమే ఈ చెరువును నేల‌మ‌ట్టం చేసి, నిర్మాణాల‌కు ఉప‌యోగించాల‌నుకుంది.
కానీ, క‌మ్యూనిస్టు పార్టీ నాయ‌క‌త్వంలో కార్మికులు ఈ చెరువునంతా ఆక్ర‌మించి గుడిసెలు వేసుకున్నారు. ఇప్పుడది ఒక‌ పెద్ద నివాస ప్రాంత‌మైపోయింది. ఇప్పుడ‌క్క‌డ పెద్ద‌గా మెకానిక్ షెడ్లు ఏమీ లేవు. కానీ ఆ ప్రాంతానికి మాత్రం ఆటోన‌గ‌ర్ అని పేరు స్థిర‌ప‌డిపోయింది.
రెండు ద‌శాబ్దాల క్రితం వ‌ర‌కు ఉప్ప‌ర‌పాలెం వ‌ద్ద ఉన్న చెరువు క‌లుజు పారేది. ఇప్పుడు ఆ చెరువు కూడా ఆక్ర‌మ‌ణ‌కు గురైంది. బైరాగి ప‌ట్టెడ స‌మీపాన ఉన్న కేశవాయ‌న గుంట కూడా ఒక‌ప్పుడు చెరువే. ఇప్పుడ‌ది పెద్ద నివాస ప్రాంత‌మైపోయింది.
పెరుగుతున్న నాగ‌రిక‌త చెరువుల‌ను, కుంట‌ల‌ను నాశ‌నం చేసినా, ఇంకా కొన్ని మిగిలే ఉన్నాయి.
ప్రహరీ కట్టడంతో భద్రంగా ఉన్న మంచి నీటి గుంట
స‌హ‌జ సిద్ద‌మైన మంచినీళ్ళ‌ గుంట ఇప్ప‌టికీ నీటితో క‌ళ‌క‌ళ లాడుతూనే ఉంది. వేస‌విలో కూడా జ‌ల‌క‌ళ సంత‌రించుకునే ఉంటుంది.
దాని చుట్టూ ఎత్తైన ప్ర‌హ‌రీ గోడ నిర్మించ‌డం వ‌ల్ల ఆక్ర‌మ‌ణ‌కు అడ్డుక‌ట్ట ప‌డింది. ఆ ప్ర‌హ‌రీనే లేక‌పోతే దాన్ని కూడా ఆక్ర‌మించేసేవారే!
వ‌ర్షాకాలంలో ఈ మంచినీటి గుంట‌నిండి తూర్పుకు పొంగిపొర్లేవి. రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌య‌మ‌య్యేవి. ఈ మంచి నీటి గుంట‌కు పైపులు నిర్మించి, కాలువ‌ల‌కు మ‌ళ్ళించారు.
నీళ్ళు లేని రామచం ద్ర పుష్కరిణీ
మంచి నీటి గుంట‌కు తూర్పున ఉన్న రామ‌చంద్ర పుష్క‌రిణి నిజంగా ఒక‌ప్పుడు చెరువే. నాకు తెలిసి దానినిండా నీళ్ళుండేవి. ఈ చెరువు ను ఒక‌ప్పుడు మ‌ల‌మూత్ర విస‌ర్జ‌న‌కు ఉప‌యోగించేవారు. అది చెత్తా చెదారంతో నిండి ఉండేది.
టీటీడీ ఆ చెరువును శుభ్రం చేసి, చుట్టూ ఎత్తైన ప్ర‌హ‌రీగోడ క‌ట్టి, లోప‌ల చెట్లు పెంచి రామ‌చంద్ర పుష్క‌రిణి అని నామ‌క‌ర‌ణం చేశారు. ఈ పుష్క‌రిణిలో నీళ్ళు నింపి, రాముల వారి తెప్పోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్నారు. మిగ‌తా రోజుల్లో ఈ చెరువు కూడా పిల్ల‌ల‌కు ఆట‌స్థ‌ల‌మే!
రాముల వారి గుడిలో ఇప్ప‌టికీ దిగుడుబావి ఉంది. గోవింద రాజ‌స్వామి కోనేరు చాలా అందంగా రాతితో నిర్మించారు. రెండు మూడు ద‌శాబ్దాల క్రితం వ‌ర‌కు ఈ కోనేటి క‌ట్ట పైనే రాజ‌కీయ‌ స‌భ‌లు, స‌మావేశాలు జ‌రిగేవి.
మొరార్జీ దేశాయ్ లాంటి పెద్ద పెద్ద జాతీయ నాయ‌కులుకూడా ఈ కోనేటి క‌ట్ట‌నుంచే ప్ర‌సంగించేవారు. ఇప్ప‌డు మాత్రం అది గోవింద‌రాజ‌స్వామి తెప్పోత్స‌వాల‌కు ప‌రిమిత‌మైంది. గోవింద‌రాజ‌స్వామి ఆల‌యం గాలిగోపురం వ‌ద్ద ఇప్ప‌టికీ నీటి బుగ్గ ఉంది.
చెన్నారెడ్డి కాల‌నీలో ఒక చిన్న కోనేరు ఉంది. ఆ కోనేరుకు రాతితో మెట్లు నిర్మించారు. దానికి చుట్టూ గోడ క‌ట్టి ఈ కోనేరు నీటిని పంపింగ్‌చేసి ఉప‌యోగించేవారు. ఇప్పుడా కోనేరులో నీళ్ళున్నా చెత్తాచెదారంతో నిండి పోయింది.
ఎస్పీ డబ్ల్యు కాలేజీలో విజయనగర చక్రవర్తుల కాలం నాటి దిగుడు బావి
రాష్ట్రంలో తొట్ట‌తొలి మ‌హిళా క‌ళాశాల‌ ఎస్పీ డ‌బ్ల్యు కాలీజీలో పురాత‌న‌మైన పెద్ద దిగుడు బావి ఇప్ప‌టికీ ఉంది. ఆ బావి లోపల నలుచదరంగా చుట్టూ రాతితో నిర్మించిన మండపాలు, ఆ మండపాలు మధ్యలో ఇటుకలతో గుండ్రంగా నిర్మించిన బావి ఉన్నాయి.  స్తంభాల పై చెక్కిన శిల్పాలను బట్టి ఈ అందమైన కోనేరు వంటి దిగుడు బావి విజయనగర చక్రవర్తుల కాలం నాడు నిర్మించినది గా పురాతత్వ శాస్త్ర వేత్తలు భావిస్తున్నారు. ఆ కాలేజీలో చ‌దివిన వారికి త‌ప్ప దీని గురించి బైట ప్ర‌పంచానికి పెద్ద‌గా తెలియ‌దు. చుట్టూ ప్ర‌హ‌రీ నిర్మించిన నీటి త‌టాకాలు మాత్రం భ‌ద్రంగా ఉన్నాయి.ప్ర‌హ‌రీ నిర్మించ‌ని వ‌న్నీ ఆక్ర‌మ‌ణ‌ల‌కు గుర‌య్యాయి.
ఉన్న చెరువుల‌ను, కుంట‌ల‌ను కాపాడిన‌ట్ట‌యితే తిరుప‌తికి నీటి ఎద్ద‌డి ఉండేది కాదు. బావుల్లోనే పుష్క‌లంగా నీళ్లుండేవి.
చెరువులు, కుంట‌లు పూడ్చేయ‌డం వ‌ల్ల నీళ్ళు లేక బావులు బావురు మంటున్నాయి. నిజంగా చెరువుల‌ను కాపాడితే ఇంకుడుగుంట‌ల అవ‌స‌రం ఏముంటుంది? చెరువుల‌ను ఆక్ర‌మిస్తుంటే ప‌ట్టించుకోని ప్ర‌భుత్వం ప్ర‌తి ఇంటికి ఇంకుడుగుంట‌లు త‌వ్వ మ‌ని ఉచిత స‌ల‌హా ఇస్తోంది.
ఏన్ని కోట్ల ఇంకుడుగుంట‌లైతే ఒక్క చెరువుతో స‌మానం చెప్పండి!?
అందుకే.. చెరువులు చేతులెత్తి వేడుకుంటున్నాయి. కుంటలు మోక‌రిల్లి మొత్తుకుంటున్నాయి. రానున్న కాలానికి ఈ దురాక్ర‌మ‌ణ‌లొద్దు.
రేపటి కాలానికి భూబకా సురులే వ‌ద్దు. ప్ర‌కృతి విధ్వంస‌కులొద్దు.భూదేవిని చెర‌బ‌డుతున్న‌ దుశ్శాస‌నులు అస‌లే వ‌ద్దు.

(అలూరు రాఘవశర్మ సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)

తిరుపతి జ్ఞాపకాలు-17

https://trendingtelugunews.com/top-stories/features/post-covid-will-theatre-regain-their-glory/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *