ట్వంటీ 20 పాయె… ట్వంటీ 21 వచ్చే..

2020.. ఓ పీడకల.. ఒకటా.. రెండా కాదు నెలలకు నెలలే దారుణాతి దారుణంగా గడిచిన రోజులు.. ఎక్కడో ఊహాన్లో పుట్టి కంటికి కనిపించకుండా ప్రపంచ మానవాళి జీవనస్థితిగతులను దుర్భరపరిస్థితుల్లోకి నెట్టేసి తాను మాత్రం వికటాట్టహాసం చేస్తూ విశ్వవ్యాప్తమైంది. ముఖాన మాస్కు పెట్టుకుని, తరుచూ చేతులు శానిటైజ్ చేసుకుంటూ… భౌతిక దూరం పాటిస్తూ… అయినా భయంభయంగానే గడిపేశాం. చాలావరకు కాలక్షేపానికి నెట్టింటనే ఉండిపోయాం.
2020 అంటే ఠక్కున గుర్తేచ్చిది.. క్రికెట్లో అతిపొట్టి మ్యాచ్ లు.. అదేనండి ట్వంటీ 20. ఎడాపెడా బాదేయడం… ఉరుకులు పరుగులు పెట్టడం… చకచకా వికెట్లు పటగొట్టడం. ఆ పూటలోనే కోట్లాది హృదయాలను కొల్లగొట్టడం.. ఓవర్ ఓవర్ కు టెన్షన్ పెరగడం… బాల్ బాల్ కు బీపీ పెరిగి నరాలు తెగే ఉత్కంఠను రేపుతున్న ఈ ట్వంటీ 20 మ్యాచ్ లు ఒక్కోసారి ఫలితం తేలక సూపర్ ఓవర్ కు వెళుతున్న సందర్భాలు లేకపోలేదు. ఈ తరహా మ్యాచ్ లను ట్వంటీ 21 అని ముద్దుగా పిలుచుకోవచ్చేమో… ఎంతైనా మనోళ్లకు క్రికెట్ అంటే మజా.. ఆ కిక్కే వేరబ్బా…
2020లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొవిడ్-19 ఎలా వచ్చిందో.. అసలు వచ్చిందో లేదో కూడా తెలియని పరిస్థితులను కూడా చవి చూశాం. ఈ కరోనా మహమ్మారికి యాక్టర్ అని… డాక్టర్ అని తేడాలేదు. అందర్నీ చుట్టేసింది. ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. మరెన్నో కుటుంబాలను ఆర్థికంగా చిదిమేసింది. జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. అయినా ఎక్కడో ఆశ.. భవిష్యత్తుపై భరోసా.. అదుగు.. వచ్చేస్తోంది.. ఇదుగో వచ్చేస్తోంది వ్యాక్సిన్ అంటూ రోజూ తీపి వార్తలు వింటూనే ఉన్నాం. ఈ మహమ్మారితో 2020 సంవత్సరాన్ని ఎలాగొలా నెట్టుకువచ్చేశాం.. ఇక వ్యాక్సిన్ తో అల్లకల్లోల ప్రపంచం ప్రశాంతతను అందుకుంటుందని భావించే తరుణంలో యూకే అంట… యూకే నుంచి మిడిమాళంగా వచ్చిపడింది… కొత్త స్ట్రెయిన్… అదే 2020 కరోనా మహమ్మారికి మరొకటి జత అయింది.. అదేనండీ 2021.
ఇంకొంతకాలం ముఖాలను కప్పేసుకుని… తరుచూ చేతులు శుభ్రపరుచుకుంటూ… భౌతిక దూరం పాటించక తప్పని పరిస్థితులు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల్లో చెప్పాలంటే…ఎక్కడ నెగ్గాలో కాదురా.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు.. ఇప్పుడు కోట్లున్నోడు కాదు కాస్తంత కరుణ ఉన్నోడికే జనం సలాం చేస్తోంది. సర్వేజనా సుఖినోభవంతు…
నూతన సంవత్సర శుభాకాంక్షలతో
– అవ్వారు శ్రీనివాస్, జర్నలిస్టు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *