ఆలయ దాడుల మీద బాబు ఆగ్రహం, రేపు రామతీర్థం సందర్శన

మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ఆంధ్రలో ఆలయాలమీద జరుగుతున్న దాడులను సీరియస్ గా తీసుకుంటున్నారు.   విజయనగరం జిల్లా రామతీర్థం గ్రామంలోని కోదండరామస్వామి ఆలయంలోని లోని కోదండ రాముడి విగ్రహాన్ని దుండగులెవరో ధ్వంసం చేశారు. విగ్రహం తల నరికేశారు. ఆలయం తలుపులు పగుల గొట్టి శిరచ్ఛేదం చేసి తల ఎత్తుకు  పోయారు.  ఇది చాలా ఆందోళన కలిగించింది. ఆ ఆలయాన్ని  పరిశీలించేందుకు  జనవరి 2 న ఆయన విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు.
శనివారం ఉదయం ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి వైజాగ్ వెళ్లి  అక్కడ నుండి  మధ్యాహ్నం 12 గంటలకు రామతీర్థం చేరుకుంటారు. రాష్ట్రంలో దేవాలయాలపై వరుస దాడులు చోటు చేసుకుంటున్నాయని  విజయనగరం జిల్లా రామతీర్థంలో నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన కోదండరామాలయంలోని రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారని చెబుతూ ఈ పరిణామాల మీద ఆయన విచారం వెలిబచ్చారు.
ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన ప్రకటన
“రాష్ట్రంలో దేవాలయాల మీద దాడులు నిత్యకృత్యం అవడం దురదృష్టకరం. రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేదు. కనీసం గుళ్లో ఉన్న దేవుళ్లకు కూడా రక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వ అలసత్వ తీరు వల్లే ఈ దాడులు చోటు చేసుకుంటున్నాయి.
రాజమండ్రిలో విఘ్నేశ్వర ఆలయంలో సుబ్రమణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని విధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. విజయవాడలో దుర్గమ్మ గుడిలో మాయమైన 3 సింహాలను ఇప్పటివరకు గుర్తించలేదు.
అంతర్వేదిలో రధం తగులబెట్టిన నిందితులను ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. దేవాలయాలపై జరుగుతున్న దాడులపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తే ప్రజల ఆగ్రహానికి గురవ్వక తప్పదు.
రామతీర్థం ఘటనపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకుంది? మొదటి సారి దాడి జరిగినప్పుడే చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. రాష్ట్రంలో అన్ని మతాల ప్రజల మనోభావాలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దేవాలయాలపై దాడులు చేసిన వారిలో ఇప్పటి వరకు ఎంత మందిని ప్రభుత్వం గుర్తించిందో ప్రజలకు చెప్పాలి.
దేవాలయాల పరిధిలోని సీసీ టీవీ ఆధారాలను బయటపెట్టాలి. వరుస దాడులు జరుగుతున్నా జగన్ రెడ్డి ఎందుకు మౌనం వహిస్తున్నారు.? జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి హిందూ ధర్మాలకు, సాంప్రదాయాలకు కళ్లెం పడింది.
అంతేకాకుండా దేశంలోనే ఎక్కడా లేనంతగా రాష్ట్రంలో దేవుళ్లపై దాడులు జరుగుతున్నాయి. వరసగా చోటు చేసుకుంటున్న ఈ దురాగతాల నివారణకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో ప్రజలకు సమాధానం చెప్పాలి.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *