రైతుల హైవేల ముట్టడిలో ఢిల్లీ బందీ కావడం ఎపుడైనా చూశారా!

దేశ రాజధాని ఇలా రైతుల చేతిలో బందీ కావడం ఇటీవలి ఇదే మొదటి సారి…

(ఇఫ్టూ ప్రసాద్ పిపి)
మా నలుగురి బృందం ఢిల్లీ  రైతాంగ పోరాట ప్రాంతాలలో ఐదు రోజులు పర్యటించింది. మాకు ఇదో ప్రత్యేక అనుభవం. ఈ తరహాలో లక్షలాది రైతాంగం నిరవధికంగా దేశ రాజధానిని హైవేల ముట్టడితో దిగ్బంధనం చేసిన అనుభవాలు గతంలో మనదేశంలో లేవు.
ఇదో కొత్త తరహా పోరాటంగా చరిత్రలో నిలుస్తుంది. ఇది సహజంగానే కొత్త అనుభవాల్ని అందిస్తుంది. కొత్త పరిశీలన, అధ్యయనం, విశ్లేషణలకు కూడా ఆలంబన అవుతుంది. దాన్ని భావి చరిత్ర కు వదిలేద్దాం.
మా బృందానికి కలిగిన స్థూల అవగాహనను క్లుప్తంగా ఈ క్రింద అవలోకిస్తాము.
1 – ఇది సాధారణ పోరాట రూపం క్రిందికి రాదు. దీనిని రైతాంగ ప్రతిఘటనగా భావించ వచ్చు. ప్రతిఘటన తిరిగి సాత్విక ప్రతిఘటన (passive resistance) చురుకైన ప్రతిఘటన (Active resistance) అనే వర్గీకరణకు గురవుతుంది. ఇది కనీసం సాత్విక ప్రతిఘటన కోవలోకి వస్తుందనేది మా భావన.
2  వర్తమాన జాతీయ, అంతర్జాతీయ పరిస్థితుల్లో నుండి సాపేక్షిక దృష్టితో చూస్తే తాజా రైతాంగ ప్రతిఘటన చరిత్ర గమనాన్ని తక్షణ కోణం (short term) లో ముందుకు నడిపించే పాత్రను పోషిస్తుంది. ముఖ్యంగా ఫాసిస్టు ప్రమాదం ముంచుకొస్తోన్న కాలంలో దీనికి రాజకీయ ప్రాధాన్యత ఉంది.
3  గ్రామీణ ప్రాంతాల రైతాంగంలో ఉన్న పరస్పర విరుద్ధ వర్గాలు తాజా చట్టాల్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో గత సాంప్రదాయ గ్రామీణ పీడక, పీడితవర్గాలు నేడు ఇందులో కలిసి పోరాడే కొత్తపరిస్థితి ఏర్పడింది. పాత వర్గవైరుధ్యాల్ని తాత్కాలికంగా అవి నేడుపక్కకి పెట్టాయి. బడా కార్పొరేట్ సంస్థల వల్ల బయటి నుండి తమ సాగు భూములకి ముప్పు తలెత్తడంతో ఈ కొత్త పొందిక నేడు ఏర్పడింది. ఈ కారణంగా ఇది వర్గ పోరాటం కాదు. అంటే ఈ పోరాటానికి విప్లవ స్వభావం ఉండదు. ఇది ప్రజాతంత్ర పోరాటం మాత్రమే. ఐతే నేటి భౌతికస్థితిలో దీనికి గల ఫాసిస్టు వ్యతిరేక స్వభావం వల్ల సాధారణ ప్రజాతంత్ర పోరాటాలతో పోల్చితే, విస్తృతి, సాంద్రత తాజా పోరాటానికి ఎక్కువగా ఉంటుంది.
4  తాజా రైతాంగ ఉద్యమం తనంతట తానే భూమిలేని వ్యవసాయ కూలీల, కౌలు రైతుల, చిన్న, సన్నకారు పేద రైతుల, మధ్యతరగతి రైతుల డిమాండ్లను ముందుకు తెచ్చి, వాటి పరిస్కారం కోసం పూనుకోదు. అదే సమయంలో వారికోసం పోరాడే వర్గ పోరాట సంస్థలు ఇందులో చురుగ్గా పాల్గొనే అవకాశాన్ని అది కల్పిస్తుంది. తద్వారా పై పీడిత ప్రజల స్వాతంత్య్ర పునాదిని నిర్మించుకునే వీలు వాటికి లభిస్తుంది. తద్వారా వారి న్యాయమైన డిమాండ్లని ఒక క్రమంలో ముందుకు తెచ్చే వీలు  వుంటుంది. (సింఘు, టెక్రీ ల వద్ద జనసందోహంలో వర్గ పోరాట సంస్థల పాత్ర, చొరవ సాపేక్షికంగా ఎక్కువ స్థాయిలో ఉన్నాయని మా బృందం గమనించింది. అందుకే కాబోలు, పైరెండుచోట్ల సభా వేదికల పై “రైతు కూలీల ఐక్యత వర్ధిల్లాలి” -కిసాన్ మజ్దూర్ ఏక్తా జిందాబాద్- నినాదం బాగా వినిపించింది)
5 . ఇది వర్గ పోరాటం కాదనే భావంతో వర్గ పోరాట సంస్థలు దీనికి దూరంగా ఉంటే, దీర్ఘకాలంలో వర్గ పోరాటాలకు తీవ్ర నష్టం జరగవచ్చు. అవి ఏ భూమి లేని శ్రమ ఆధారిత వ్యవసాయ కూలీ వర్గం, ఇంకా చిన్న, సన్నకారు, మధ్యతరగతి రైతాంగ ప్రజల ప్రయోజనాల్ని లక్ష్యంగా ఎంచుకున్నాయో, ఆ పీడిత వర్గ ప్రజలని ఆచరణలో అవి దూరం చేసుకునే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే, ఈ పేద వర్గాల్ని గ్రామీణ సంపన్న వర్గమే సమీకరిస్తుంది. “మేము మా పంటల్ని ఎక్కడ ఎక్కువ ధర వస్తే, అంతదూరం తీసుకెళ్లి అమ్ముకోగలం, చిన్న కమతాలు గల మీకు సాధ్యమా? అందుకే అందరం కలిసికట్టుగా పోరాడి చట్టాల్ని రద్దు చేయిద్దాం” అని ధనిక, భూస్వామ్య రైతులు చిన్న, సన్నకారు రైతాంగాన్ని ఐక్యం చేసి సమీకరించే వాస్తవ భౌతిక పరిస్థితి పట్ల అవగాహన ఉండాల్సి ఉంది. నిజానికి అది ఇప్పటికే చాలావరకు జరిగింది. అందుకే వర్గ పోరాట సంస్థలు ఒకవేళ తాజారైతాంగ పోరాటం లో పాల్గొనకుండా దూరంగా ఉంటే, ఆచరణలో అవి తమ వర్గ ప్రజలకి దూరమై, తమ వర్గ పునాదిని కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడవచ్చు. నేడు వర్గ పోరాట సంస్థల ఎదుట తక్షణమే ఉన్న కర్తవ్యం ఒకటే! ఇందులో చురుగ్గా పాల్గొంటూ, గ్రామీణ పేదల స్వతంత్ర ప్రజా పునాదిని విస్తరించుకోవడం, తద్వారా వారి గొంతును ఈ ఉద్యమ క్రమంలో బలోపేతం చేయడం. నేడు అంతకంటే మరో సులభ మార్గం వాటి ఎదుట లేదు.
6. నేడు బయటి నుండి కొత్తగా ముం(దు)చుకొచ్చే కార్పొరేట్ ఆధిపత్య వర్గం మీద ఇప్పటికే ఉనికిలో ఉన్న గ్రామీణ ఆధిపత్యవర్గం విధిగా పోరాటం చేయాల్సిన కొత్త పరిస్థితిని నేటి కొత్త చట్టాలు కల్పించాయి. ఈ వెలుగులోనే అంబానీ, ఆదానీ వంటి బడా కార్పొరేట్ సంస్థల ప్రమాదం పై పోరాట క్రమంలో గత సాంప్రదాయ గ్రామీణ వర్గ వైరుధ్యాలు తాత్కాలికంగా వెనకవరసలోకి చేరిన అంశాన్ని పరిశీలించాల్సి ఉంది. ఇది స్థల, కాలాదుల్ని బట్టి తాత్కాలిక మార్పు తప్ప, వర్గ స్వభావంలో మౌలిక మార్పు కాదు. కొత్తగా ముంచుకొచ్చే కార్పొరేట్ ఆధిపత్య వర్గం మీద గ్రామీణ ప్రాంతాల్లోని ఆధిపత్య వర్గం కూడా పోరాడే కొత్త పరిస్థితిని స్థల కాలాదులకు లోబడి అర్ధం చేసుకోవాల్సి ఉంది. ఈ నేపధ్య స్థితిలో గ్రామీణ ఆధిపత్య వర్గం క్రింద ఇన్నాళ్ళు పీడించబడ్డ పీడిత రైతాంగ వర్గపు వైఖరి ఈ ఉద్యమం పట్ల ఎలా ఉండాలనే రాజకీయ అంశం నేడు కొత్త చర్చనీయాంశంగా మారడం సహజమే. కొత్తగా కార్పొరేట్ వర్గంపై సాగే పోరాటంలో ఓ వైపు సంపన్న రైతాంగంతో కలిసి పోరాడుతూనే మరోవైపు భవిష్యత్తులో తన స్వంత వర్గ ప్రయోజనాల్ని కాపాడుకోవడం సాధ్యం అవుతుందా? లేదంటే తాజా ఉద్యమానికి దూరంగా ఉండి తనవర్గ ప్రయోజనాల్ని వేరుగానే సాధించుకోవడం సుసాధ్యం అవుతుందా? ఈ రెండింటిలో ఏదో ఒకటి నేడు తేల్చుకోవాల్సిన కొత్త పరిస్థితి ఏర్పడింది. ఇది గ్రామీణ పీడిత రైతు కూలీ వర్గాల ప్రాతినిధ్య సంస్థలకు తాజా కార్పొరేట్ వ్యతిరేక రైతాంగ పోరాటం పెట్టిన ఒక రాజకీయ పరీక్షయే! ఈ రెండింటికి దూరంగా తటస్థ పాత్రని పోషించలేని స్థితికి అవి నేడు చేరుకున్నాయి. ఆర్ధిక, రాజకీయ, సామాజిక వంటి రంగాలన్నింటిపై కార్పొరేట్ వ్యవస్థ క్రమంగా ఆధిపత్యం వహించే రాజకీయ పరిస్థితిని నేటి ఫాసిస్టు రాజ్య విధానం కలిస్తోంది. ఏ రీత్యా చూసినా, నేటి ఫాసిస్టు రాజ్య విధానం పై ఎక్కు పెట్టిన తాజా ప్రజాతంత్ర పోరాటంలో పాల్గొంటూనే, తన వర్గ ప్రయోజనాల్ని పొందడం సరైన మార్గమని వర్తమాన చరిత్ర తన కర్తవ్య సందేశాన్ని పీడిత వర్గ ప్రజలకు ఇస్తోంది. ఫాసిస్టు వ్యతిరేక స్వభావంతో కూడిన ప్రజాతంత్ర రైతాంగ పోరాటం నుండి వేరుపడి, నేడు తన స్వీయ వర్గ ప్రయోజనాల సాధన కోసం తన స్వంత మార్గాన్ని చేపట్టడం ఆచరణలో ఫాసిస్టు రాజకీయ ప్రక్రియని బలోపేతం చేస్తుంది.
7. చారిత్రికంగా భవిష్యత్తు లో నిర్మించి తీరాల్సిన ఫాసిస్టు వ్యతిరేక పాపులర్ సమైక్య ప్రజా ప్రతిఘటనలకు నేటి రైతాంగ పోరాటం ఒక డ్రెస్ రిహార్సల్ వంటిదని మా బృందం భావిస్తోంది.
8. రానున్న కాలంలో నిర్మాణం చేయాల్సిన శ్రామికవర్గ విప్లవ పోరాటాలకు తాజా రైతాంగ ప్రతిఘటన ఒక దారిదీపంగా స్ఫూర్తిని ఇస్తుందని కూడా మా బృందం భావిస్తోంది.
పైన పేర్కొన్న కోణాల్లోనే కాకుండా మరో కోణంలో కూడా ఇంకో చర్చనీయాంశం ఉనికిలో ఉంది. పెట్టుబడికీ, రైతుకీ మధ్య సంఘర్షణలో పేద రైతాంగం అనివార్యంగా తమ భూమిని కోల్పోయి, తుదకు స్వంత ఆస్తిలేని కార్మికవర్గంగా మారుతుందని మార్క్స్ చెప్పిన మాట ఈచర్చకి మూలం. చిన్న, సన్నకారు రైతులకు తన స్వంత భూకమతమే గుదిబండగా మారే పరిస్థితి ఉంటుందనీ, అంతకంటే రైతు తన భూమిని కోల్పోయి, వేతన శ్రామికుడిగా పరివర్తన చెందడమే చరిత్ర గమనంలో సోషలిస్టు సమాజ నిర్మాణానికి సహకరిస్తుందని మార్క్స్, ఎంగెల్స్ లు చెప్పిన విషయాన్ని ఈ వాదన చేసే మిత్రులు ప్రస్తావిస్తున్నారు. పేదరైతు తనజీవిత మెడకు గుదిబండ వంటి భూకమతం కొనసాగింపుకై కమ్యూనిస్టుల ప్రయత్నాలు ఉండకూడదని ఫ్రెంచ్ సోషలిస్టుల్ని ఉద్దేశించి మార్క్స్ చెప్పాడు. ఆ ప్రకారం తాజా రైతాంగ పోరాటం కూడా సమర్ధనీయం కాదు. పైగా ఇది చారిత్రికంగా అభివృద్ధి నిరోధక ఉద్యమం అవుతుంది. ఇదీ వీరి వాదనల సారం.
పై వాదన చేసే మిత్రులు తాజా రైతాంగ పోరాటాన్ని అభివృద్ధి నిరోధకమైనదిగా భావిస్తారు. ఐతే బాహాటంగా వారు అలా ప్రకటించడం లేదు. పై సిద్ధాంత సూత్రీకరణల్ని ఈ సందర్భంలో పదేపదే వ్యక్తం చేయడం ద్వారా పరోక్షంగా ప్రచారం చేస్తున్నారు. బడా కార్పొరేట్ సంస్థల పెట్టుబడి ఎంత త్వరగా పేద రైతాంగాన్ని స్వంత ఆస్తిలేని శ్రామికవర్గంగా పరివర్తన చేయిస్తే, అంతే త్వరగా స్వంతఆస్తి వ్యవస్థని రద్దు చేసే సోషలిస్టు విప్లవ పరిస్థితి ఏర్పడుతుందని వీరు వాదిస్తారు. ఈ వాదన ప్రకారం అంబానీ, ఆదానీ వంటి బడా కార్పొరేట్ సంస్థలు ఎంత త్వరగా రైతుల భూమిని కబ్జా చేస్తే, అంత త్వరగా సోషలిస్టు విప్లవానికి అవసరమగు భౌతిక పాదార్థికస్థితి ఏర్పడుతుంది. తాజా రైతాంగ పోరాట లక్ష్యం రైతుల భూముల పరిరక్షణయే! అందువల్ల చరిత్ర గమనంలో అది సోషలిజాన్ని కాలయాపన చేస్తుందని వీరంటారు. అందుకే తాజా పోరాటం సారాంశంలో అభివృద్ధి నిరోధక రాజకీయ ప్రక్రియ అవుతుంది. ఇదీ వీరి వాదనల సారం. (సరిగ్గా రష్యా లో లెనిన్ నేతృత్వంలో విప్లవ ప్రక్రియకు కూడా ఇదే వాదనలు ఎదురవడం గమనార్హం) నేటి పోరాటంలో కూలీ, ధనిక, పేద రైతాంగాల ఐక్య భాగస్వామ్య పాత్రల మంచిచెడుల గూర్చి సిద్ధాంత చర్చ గూర్చి పైన 4,5, 6 అంశాలలో చర్చించాము. వీరి వాదనలు పై తరహలోనివి కాదు. తాజారైతాంగ పోరాటమే అభివృద్ధి నిరోధకమైనదని వీరి వాదనల సారాంశం కావడం గమనార్హం. నేటి రైతుల సాగు భూముల్ని కార్పొరేట్ వ్యవస్థని కబ్జా చేయనివ్వకుండా ఆటంక పరిస్తే, సోషలిజం ఆగమనంలో కాలయాపన జరుగుతుందనే చర్చ వీరిది. (రెండు శతాబ్దాల క్రితమే ఈ పరిణామక్రమం ఇంగ్లండ్, అమెరికా వంటి దేశాలలో పూర్తి అయ్యుంది. ఐనా అక్కడ నేటికీ సోషలిజం రాక పోవడం గమనార్హం)
పైన పేర్కొన్న విభిన్న రాజకీయ వాదనలు, సిద్ధాంత చర్చలకు నేడు తాజా రైతాంగ ప్రతిఘటన తెరలేపింది. ఇదో మంచి పరిణామమే. నూరు పూలను వికసించనిద్దాం. వెయ్యు ఆలోచనల్ని కొత్తగా తలెత్తనిద్దాం. కొత్త సిద్ధాంత, రాజకీయ చర్చలకి దారితీసి, దానినుండి కొంగొత్త ఆలోచనల వికాసం జరిగితే స్వాగతిద్దాం. దానికి కారణమైన నేటి రైతాంగ ప్రతిఘటనకు రాజకీయంగా చెయ్యెత్తి జేజేలు పలుకుదాం. మార్క్సిస్టు రాజకీయ సిద్ధాంత సంపదను అది ఈ విధంగా మరింత సమున్నతంగా తీర్చి దిద్దుతుందని ఆశిద్దాం.
పైన పేర్కొన్న రాజకీయ, సిద్ధాంత చర్చ పారదర్శకంగా ఎవరు చేసినా ఆహ్వానించ వలిసిందే. అందుకు బదులు, తమ మనస్సులో మాటని బయటకు చెప్పకుండా, నేడు రైతాంగం విస్తృతంగా పాల్గొనే తాజా పోరాటం మీద ఉత్తుత్తి శంకల్ని సృష్టిస్తూ సాగించే చర్చ వల్ల ఫలితం లేదు. ఆచరణలో అది సిద్ధాంత చర్చకు దోహద పడదు. పైగా చలనరహితమైన నిస్సార, నిస్తబ్దతలకి మాత్రమే దారితీస్తుంది.
తన కాలంలో ఎవరు ఏమన్నా, ఏమనుకున్నా తన సైద్ధాంతిక వాదనల్ని మార్క్స్ నిర్మొహమాటంగా బాహాటంగా వ్యక్తం చేసాడు. ఎవరికైనా అదే వైఖరి మార్గదర్శకం కావాలి. పైన పేర్కొన్న నాటి మార్క్స్ సిద్ధాంత సూత్రీకరణలు కూడా మార్క్సిస్టు సిద్ధాంత వెలుగులో స్థల, కాలాల్ని బట్టి మారవచ్చు. వర్తమాన భారత దేశ నిర్దిష్ట స్థితిగతుల్లో వాటి అన్వయింపు జరగాల్సి ఉంది. పైగా మార్క్స్, ఎంగెల్స్ ల అనంతరం యుగ స్వభావం కూడా మారింది. దానికి అనుగుణంగా లెనిన్ చేసిన అన్వయింపు కూడా ఉంది. నేటి భారతదేశ నిర్దిష్ట స్థితిగతులకి అనుగుణంగా అన్వయింపుపై ఎంత లోతైన చర్చనైనా చేసుకోవచ్చు. కానీ సూటిగా బయటకి చెప్పకుండా, సిద్ధాంత కుశంకలతో కుతర్కం చేసే మార్మికవాద పద్ధతుల వల్ల రాద్ధాంతం చేయోచ్చేమో తప్ప సత్ఫలితాలు రావు. అందుకే ఈ సందర్భంగా “భార్గవ” గారి వాల్ నుండి పొందిన ఆయన కవితలోని కొన్ని పంక్తుల్ని ఈ క్రింద ఉదహరిస్తున్నాం.
“గడ్డ కట్టే చలిలో
నిబ్బరంగా కూర్చున్న
లక్షలాది జనసందోహాన్ని
ఆటోమేటిక్ హీటర్
వెచ్చని కౌగిలిలో కూర్చొని
వెక్కిరించే తెంపరితనానికి
కారణమైన ప్రతిభావజాలాన్ని
చెత్తకుప్పలో వేద్దాం”
ఈ రైతాంగ పోరాటం గెలుస్తుందా, ఓడుతుందా అనే మరో కుశంకచర్చ కూడా ఉంది. అసలు ఓటములే లేకుండా తొలివిజయాలు సాధించిన ఉద్యమాలు చరిత్రలో చాలా అరుదుగా ఉంటాయి. అప్పుడు తిరగబడితే ఓటమి పొందే స్థితి పై మార్క్స్, ఎంగెల్స్ ముందస్తు హెచ్చరికల్ని పట్టించుకోకుండా 1871లో పారిస్ శ్రామికవర్గం సార్వత్రిక తిరుగుబాటుకి దిగింది. ఐనా మార్క్స్, ఎంగెల్స్ పారిస్ కమ్యూన్ పట్ల చేపట్టిన వైఖరి చరిత్రలో ససాక్ష్యంగా ఉంది. అది సర్వదా పురోగమి విప్లవ శక్తులకు శిరోధార్యం.
విజయాలకు ఓటములు మెట్ల వంటివి. (Failures are stepping stones to success) తాజా రైతాంగ పోరాటంలో అది నేడు గెలిస్తే రేపు కూడా గెలిచినట్లు కాదు. నేడు ఓడితే రేపు కూడా ఓటమి పొందినట్లు కాదు. ఇదో అనంత సంగ్రామం. శ్రమశక్తికీ, పెట్టుబడి కీ మధ్య పరస్పర సంఘర్షణ అనేది సుదీర్ఘ, సంక్లిష్ట ప్రక్రియ. భూమండలం మీది నుండి పెట్టుబడికి రాజకీయ మరణ శాసనం రాసేంతవరకూ ఈ పరస్పర సంఘర్షణ తప్పదు. నేడు ఒకవేళ “పెట్టుబడి” ఓడి పోయినా, రేపు మళ్లీ దాడికి దిగక పోదు. నేడు రైతాంగం గెలిచినా, కార్పొరేట్ వ్యవస్థ నుండి ఇకముందు దాడులు ఉండవని కూడా కాదు. ఇదో సుదీర్ఘ పోరాటం. ఈ పరస్పర సంఘర్షణలో వైరివర్గాలకి జయాపజయాలు ఎదురుకాక తప్పదు. వాటిని కొలబద్దలతో లెక్కించలేము. నిజానికి తాజా పోరాటంలో చేకూరే గెలుపు, ఓటములు శాశ్వతమైనవి కాదు. అట్టి సంఘర్షణలో ఉత్పన్నమయ్యే సామాజిక, రాజకీయ చైతన్యం మాత్రమే శాశ్వతమైనది. అది చరిత్రకు కానుకగా అందించే రాజకీయ వారసత్వమే శాశ్వతమైనది. అది చరిత్ర గమన మార్గంలో మిగిల్చే రాజకీయ ఆనవాళ్ళే వాస్తవమైనవీ, శాశ్వతమైనవీ. ఈ సందర్భంగా ” మోహన సుందరం ” గారి వాల్ నుండి ఓ కవితను ఉదహరిస్తున్నాం.
“ఓడిపోతామా
పరవాలేదు.
యుద్ధం చేసే
వాడి తెలిసింది కదా
పరవాలేదు.

పోరాటపు అదుపు
తెలిసింది కదా

గెలవడం కోసం వందసార్లు
ఓడిపోవడానికి సిద్ధమే.

దేహం నాగలై
బిరుసెక్కి పోయింది.
గుండె కొడవలై
కరుకెక్కి పోయింది.
విత్తుగా నన్ను నేను
నాటుకోవడమే కాదు.
అదునులో కోత
కోయడం కూడా తెలుసు”
ఔను, యుద్దాలలో విజయాలే సదా లభించవు. ఓటములకు సైతం సిద్ధపడ్డ వాళ్లే విజయాల్ని సాధించ గలరు. ఓటములకు భీతిల్లి శాశ్వతంగా యుద్దాలకు స్వస్తి చెప్పే వాళ్ళు ఎప్పటికీ విజయాలు సాధించలేరు. ఇది విజయాన్ని గూర్చి చర్చించే సందర్భం కాదు. తక్షణమే చేకూరే యుద్ధ ఫలితం గూర్చి చర్చించుకునే సందర్భం కూడా కాదిది. ఇది కేవలం యుద్ధ స్వభావం గూర్చి చర్చించే సందర్భం మాత్రమే.
అటు అంతర్జాతీయంగా, ఇటు జాతీయంగా పచ్చి అభివృద్ధి నిరోధక ఫాసిస్టు ఆర్ధిక, రాజకీయ శక్తులు చెలరేగిపోతున్న సంక్లిష్ట కాలమిది. ముఖ్యంగా మన దేశంలో 2014లో మోడీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత గత ఆరున్నర ఏళ్ల పరిపాలన మన కళ్లెదుటే ఉంది. ఇప్పటి వరకు శ్రమ దోపిడీ వ్యవస్థకు కవచంగా ఉపకరించిన పార్లమెంటరీ రాజ్యాంగ వ్యవస్థను సైతం ధ్వంసం చేసి, కొత్తగా ఫాసిస్టు రాజకీయ ప్రక్రియ స్థిరపడజూసే కాలమిది. ఏకత్వానికి తప్ప భిన్నత్వానికి కనీస స్థానాన్ని మిగల్చనివ్వని కొత్తస్థితి నేడు ఏర్పడుతోంది. ఫెడరల్ రాజ్య వ్యవస్థను కూడా మిగల్చడం లేదు. నేడు ఆర్ధిక, రాజకీయ రంగాలలోనే కాకుండా; కుల, మత, లింగ,భాషా, న్యాయ, సంస్కృతి వంటి వ్యవస్థలపై కూడా నేడు గుత్తాధికారాన్ని నెలకొలిపే ప్రక్రియ తెలిసిందే. ఈ స్థల, కాలాదుల (space and time) కు లోబడి సాపేక్షిక దృష్టితో నేటి చరిత్ర గమన సూత్రాల్ని అర్ధం చేసుకోవాలి. తదనుగుణంగా సిద్ధాంత సూత్రాల్ని నిర్దిష్ట అన్వయింపు చేసుకొని చరిత్ర గమన మార్గం లో ముందుకు సాగాల్సి ఉంది. ఈ నిర్దిష్ట చరిత్రగమన సూత్రాల తో సంబంధం లేకుండా మెటా ఫిజికల్ దృష్టితో పిడివాద యాంత్రిక వాదంతో చరిత్రని నిర్మించడం సాధ్యం కాదు.
పుక్కిటి పురాణ నీతి ప్రకారం అశ్వమేధయాగాలు తెలిసిందే. ఆ అశ్వం (గుర్రం) ఎంత దూరం వెళ్తే, అంతవరకూ ఆ రాజుదే సర్వాధికారమట. ఔను మరి, నేటి మోడీ-షా ప్రభుత్వం కూడా అన్ని రకాల వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ వచ్చింది. ఫాసిస్టు రాజకీయ అశ్వమేధ యాత్రను చేపట్టింది. పెద్ద నోట్లు రద్దు చేసింది. GST చట్టం చేసింది. ఉపా చట్టం తెచ్చింది. పెట్రో దాడి చేస్తోంది. ఆర్టికల్ 370ని రద్దు చేసింది. న్యాయ వ్యవస్థ, RBI, CBI, CAG ల్ని అదుపు చేసింది. పౌరసత్వ చట్టం చేసింది. విద్యా చట్టం చేసింది. 29 కార్మిక చట్టాల్ని రద్దు చేసింది. వ్యవసాయ రంగం వద్దకు వచ్చేసరికి దానికి అడ్డుకట్ట పడింది. హస్తిన కేంద్రంగా మోడీ షా సర్కారు తలపెట్టిన ఫాసిస్టు అశ్వమేధ యాత్రకి పంజాబ్ రైతాంగం అడ్డుపడింది.
గుర్రం చేరిన స్థలంలో దాన్ని గుంజకి కట్టివేసే పనికే రైతాంగం పరిమితం కాలేదు. గుర్రాన్ని రాజ్యాల మీదికి యథేచ్ఛగా వదిలేసిన రారాజు స్థలంలోకి రైతాంగం వచ్చింది. ఆ గుర్రాన్ని రాజ్యం మీదికి ఏ హస్తీనాపుర రాజ్యాధిపతులు వదిలారో, ఆ హస్తినకే రైతాంగం వచ్చింది. ఆ రాజ్య కేంద్రాన్ని దిగ్బంధనం చేసింది. ఈ తీవ్ర ప్రతిఘటానా ప్రక్రియకి గల భావి రాజకీయ ఫలితాన్ని సరిగ్గా విశ్లేషించాలి.
వర్తమాన చరిత్ర గమనానికి తాజా రైతాంగ ప్రతిఘటన ఉపకరిస్తుందా? లేదంటే దానికి ఆటంకకారిగా మారుతుందా? ఇందులో ఏది సత్యం? ఏది అసత్యం? ఈ అంశాన్ని నేడు చరిత్ర పురోగామి రాజకీయ శక్తులు నిస్పాక్షికంగా అంచనా వేయాల్సి ఉంది.
కప్పను పాము మింగ జూసింది. ఐతే తనను భక్షించ బోయిన పాము మెడను కప్ప గట్టిగా నోటితో పట్టింది. నేడు పాముకూ, కప్పకూ మధ్య తీవ్ర యుద్ధం సాగుతోంది. ఎవరు ఏ పక్షమో తేల్చుకోవాల్సిన స్థితి ఏర్పడింది. ఇది తటస్తంగా ఉండటానికి సమయం కాదు. నీతిబోధకూ, జ్ఞానబోధకూ సందర్భం కాదు. ఐతే కప్పవైపు నికరంగా నిలిచి, పాముపై చేసే దాని ఆత్మరక్షణ పోరాటాన్ని బలపరిచాలి. లేదా కప్పను కాదని పామును బలపరుస్తూ బాహాటంగా ప్రకటించాలి. ఈ రెండింటి మధ్య పోరు పట్ల ఏ అభిప్రాయం చెప్పకుండా ముసుగు ధరించి తప్పుకునే ప్రయత్నం ఎవరూ చేయరాదు. ముసుగు విప్పి అభిప్రాయాల్ని బాహాటంగా వ్యక్తంచేసిన మాజీ IAS అధికారి జయప్రకాష్ గారి వంటి వారిని ఒకరకంగా అభినందించాలి. కానీ మార్క్స్ మాటున ముసుగు ధరించి ఎవరైనా డొంకతిరుగుడుగా మాట్లాడితే, అది సముచితం కాజాలదు.
ఫాసిస్టు సర్పానికీ, కప్పకూ మధ్య జీవన్మరణ పోరాటం జరిగే సమయంలో నిన్నటి కప్ప దోషాల్ని అన్యాపదేశంగా ఏకరువు పెట్టడం ఎంత మాత్రం సముచితం కాదు. కప్పభక్షణ నీతి తెలియనిదేమీ కాదు. అది క్రిమి కీటకాదుల్ని భక్షిస్తుందని కూడా తెలిసిందే. కప్ప చేత అవి బాధిత జాతులే. అది నిప్పు వంటి నిజమే. అది నిజం కాదని ఎవరూ అనడం లేదు. ఐతే నేడు ఫాసిస్టు సర్పరాజ్యం నుండి కొత్త పెనుముప్పు ముంచుకొచ్చే కాలంలో క్రిమి కీటక జాతులతో పాటు కప్ప జాతి కూడా బాధిత జాతులు గా మారే కొత్త భౌతిక పరిస్థితి ఏర్పడింది. ఈ నిర్దిష్టస్థితిలో ఎవరి నిర్దిష్ట వైఖర్లు ఏమిటో స్పష్టంగా బహిరంగ పరచాలి. కప్పకూ, ఫాసిస్టు సర్పానికీ నడుమ ముఖాముఖి జరిగే యుద్ధం పట్ల తమ నిర్దిష్ట వైఖరి తేల్చి చెప్పకుండా, క్రిమి కీటక జాతులపట్ల కన్నీళ్లు కార్చితే, దానిలో దాగిన ఆంతర్యం ఏమిటో కూడా ప్రశ్నించాల్సి వస్తుంది. వారు కార్చే కన్నీళ్లు క్రిమి, కీటకాదుల కోసమా? లేదంటే, తెలిసో తెలియకో ఫాసిస్టు సర్ప జాతి కోసమా? అనే ప్రశ్న వేయాల్సి వస్తుంది.
సిద్ధాంత చర్చకు దారితీసే వాదనల్ని ఆహ్వానించవచ్చు. ఐతే సిద్ధాంత చర్చ చేసే ఎవరూ ముసుగు ధరించరు. అలాంటి వాళ్ళు తటస్థత వహించరు. ఇలా తటస్థత పేరుతో లేదా ముసుగులో కుశంక, కుతర్క, వితండ వాదనలు చేస్తే, ఏదో ఆంతర్యం దాగి వున్నట్లుగా సందేహించాల్సి వస్తుంది.
నేడు ఢిల్లీలో జాతీయ రహదారుల్ని గడ్డకట్టే చలిలో దిగ్బంధనం చేస్తోన్న రైతాంగం పట్ల ఈ తరహా సందేహాల్ని సృష్టించే వారి వైఖరి ఏమిటో స్పష్టం కావాలి. తమ మనస్సు లో మాటని వారు బయటకు తేల్చి చెప్పాలని రాజకీయ పరీక్షకు గురిచేయాలి. నిజానికి ఏఅంశం మీదనైనా సిద్ధాంత, రాజకీయ చర్చని ఆహ్వానించ వచ్చు. అది ఆరోగ్యకరమైనదే. ఐతే తమ మనస్సులో మాట చెప్పకుండా దోబూచులాడుతూ కుశంకలు,కుతర్కం చేయడాన్ని ప్రిత్సహించారాదు. పై రెండింటి మధ్య పోరు సాగే సందర్భంలో కప్ప లేదా పాముల్లో ఒకదాన్ని బలపరచక, డొంకతిరుగుడు పద్దతితో క్రిమి కీటకాదుల పక్షాన (అది కూడాఅప్పుడు మాత్రమే) కన్నీళ్లుకార్చే కుహనా సిద్ధాంతుల తటస్థ ముసుగుల్ని చించివేద్దాం.
మా బృందం నుండి చెప్పే ఒక చివరి విజ్ఞప్తి ఉంది. తాజా రైతాంగ ప్రతిఘటనకు ముందు కూడా మోడీ ప్రభుత్వ పాలన లో మరికొన్ని ముఖ్యమైన పోరాటాలు జరిగాయి. (వాటిని ఇక్కడ ఉదహరించడం లేదు) ఇదే మొదటిది కాదు. ఐతే ఈ పోరాటానికి ఓ ప్రత్యేకత ఉంది. ఐతేనేమి మూడు వ్యవసాయ చట్టాల్ని మోడీ ప్రభుత్వం ఉపసంహరించడం అంత తెలికైనది కాదు. ఐతే వాటిని ఉపసంహరిస్తేనే అది రైతాంగం విజయం సాధించినట్లు, లేని పక్షంలో ఓటమి పొందినట్లు కూడా కాదు. నిజానికి మోడీ సర్కార్ ఇప్పటికే రాజకీయ ఓటమి పొందింది. రైతాంగానికి రాజకీయ విజయం లభించింది. పై మూడు వ్యవసాయ చట్టాల రద్దు జరగకుండానే ఒకవేళ రైతాంగం ఉద్యమ విరమణ చేయాల్సి వస్తే, వారు రేపు పొందేది రాజకీయ ఓటమి కాదు. సాంకేతిక ఓటమియే! ఈ సందర్భంగా ఓ లెనిన్ సూక్తి ని క్రింద ఉదహరిస్తున్నాం.
“జయాపజయాలతో సంబంధం లేకుండా పోరాటం సాగించి తీరాల్సిన సందర్భాలు కొన్ని ఉంటాయి. ఎందుకంటే, ఆ పోరాట క్రమంలో మనం ఒక కొత్త సాంప్రదాయాన్ని నెలకొల్పి, భవిష్యత్తులో ఎదురయ్యే యుద్దాలను ఎదుర్కొనే స్ఫూర్తిని అందించగలం”

పైన లెనిన్ చెప్పినట్లు తాజా ఢిల్లీ ముట్టడి కూడా ఒక కొత్త పోరాట సాంప్రదాయమే. రేపటి ఆవశ్యకమైన ఫాసిస్టు వ్యతిరేక ఐక్య ప్రజా ప్రతిఘటనా పోరాట ప్రక్రియకు అవసరమైన నూతన ఉద్యమ స్ఫూర్తిని అందిస్తుంది.

మోడీ-షా ప్రభుత్వం బడా కార్పొరేట్ వ్యవస్థకు ఒక పెద్ద పాలేరు వంటి సేవా సంస్థయే. అట్టి పెద్ద పాలేరుతో చేయించిన పై చట్టాల రద్దుకి సాధారణంగా దాని యాజమాన్యం (బడా కార్పొరేట్ వ్యవస్థ) ఒప్పుకోదు. ఐతే తన పెద్ద పాలేరుకు నేటి పరిపాలనా అవకాశం కూడా కోల్పోయే రాజకీయ ప్రమాదం ఏర్పడితే, ఆ చట్టాల రద్దుకు సైతం దాని యాజమాన్యం అనుమతించే అవకాశం ఉంది. ఇది దేశ వ్యాప్త సమరశీల ఉద్యమంగా విస్తరించి, తుదకు రాజకీయ ఉద్యమంగా కూడా పరివర్తన చెందేస్థితి ఏర్పడితే సాధ్యపడుతుంది. ఈ రైతాంగ ప్రతిఘటన ఏ మేరకు ఆ దిశలో సాగుతుందో, దానిపై అది ఆధారపడుతుంది. ఆ దిశలో ఈ ఉద్యమం ఏ మేరకు సాగుతుందో వేచి చూద్దాం.
ఒకటి మాత్రం నిజం. రేపటి సాంకేతిక జయాపజయాలతో నిమిత్తం లేకుండా, ఇప్పటికే సాధించిన రాజకీయ విజయం భవిష్యత్తులో చరిత్ర గమనానికి స్ఫూర్తిదాతగా నిలుస్తుంది. అది దేశంలోని మిగిలిన పీడిత, తాడిత, శ్రామిక, కార్మిక వర్గాల ప్రజలకు కూడా “దీపదారి” గా వర్ధిల్లుతుంది. ఫాసిస్టు చీకట్లు క్రమంగా అలుముకుంటున్న వేళలో నేటి ఢిల్లీ ముట్టడి రేపు పోరాడే వర్గాల ప్రజలకు ఒక “దీపస్థంభం” (Light house) గా వెలుగొందుతూ దారి చూపిస్తూ మనోనిబ్బరంతో ముందుకు నడిపిస్తుంది.
నేటితో పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతున్నాం. రేపటినుండి కొత్త సంవత్సరం లో అడుగు పెడుతున్నాము. ఈ సందర్భంగా భావి కాలపు దారిదీపానికి వత్తులతో పాటు ఇంధనపు చుక్కలను కూడా అందిస్తామని శపథం చేద్దాం. రేపటి ఫాసిస్టు వ్యతిరేక పోరాట పథంలో దీపస్థంభంగా వెలుగు వెదజల్లె ఢిల్లీముట్టడికి మా బృందం మరోసారి పిడికిళ్లతో జేజేలు పలుకుతోంది.
(ఢిల్లీ ఇఫ్టూ ప్రసాద్ బృందం రాసిన ఈ వ్యాసాలు త్వరలో పుస్తకరూపంలో రానున్నాయి.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *