నవంబర్ 26 సార్వత్రిక సమ్మె, కారణాలు, కర్తవ్యాలు

(పి. ప్రసాద్ (పిపి), కే. పొలారి)
భారత కార్మిక వర్గానికి ఘన పోరాట చరిత్ర వుంది. 1908 లో తిలక్ అరెస్టు సందర్భంగా బొంబాయి లో ఆరు రోజుల సార్వత్రిక సమ్మె చేసి, కడవల కొద్దీ నెత్తురు కార్చి తన ప్రాణార్పణలతో భారత స్వాతంత్య్ర పోరాటానికి భారత కార్మిక వర్గం కొత్త రాజకీయ చైతన్యాన్ని సమకూర్చింది.
1921 లో “బ్రిటిష్ యువరాజ్ గో బ్యాక్” పిలుపులో భాగంగా నాటి పెద్ద పారిశ్రామిక నగరం బొంబాయి ని బ్రిటిష్ గుండెల్లో పిడిబాకు గా మార్చింది. 1928 లో “సైమన్ కమీషన్ గో బ్యాక్” పిలుపులో బొంబాయి, కలకత్తా, లాహోర్, కాన్పూర్ వంటి చోట్ల లక్షలాది కార్మికవర్గం పిడికిళ్లు బిగించి బ్రిటిష్ వలస ప్రభుత్వ అధికారాన్ని సవాల్ చేస్తూ వీధుల్లో కవాతు తొక్కింది.
అదే ఏడాది చివరలో కలకత్తాలో భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక మహాసభల వద్దకు యాబై వేల మంది కార్మికులు ఎర్ర జండాల తో ప్రదర్శనగా వచ్చి సంపూర్ణ స్వాతంత్య్ర తీర్మానం ఎందుకు చేయరని నిలదీసే రూపంలో కాంగ్రెస్ కి విజ్ఞప్తి చేసిన ఘన చరిత్ర అది స్వంతం చేసుకుంది.
1929 లో కార్మిక నాయకుల & స్వాతంత్ర్యోద్యమ రాజకీయ నేతల నిర్బంధం కోసం బ్రిటిష్ ప్రభుత్వం తెనున్న రెండు నల్ల చట్టాల (TRADE DISPUTES BILL & PUBLIC SAFETY BILL) ప్రక్రియ పట్ల నిరసనగా నాటి సెంట్రల్ అసెంబ్లీ లో బాంబులు విసిరిన భగత్ సింగ్, దత్తు వంటి గొప్ప నిరుపమాన కార్మిక మిత్రుల్ని భారత కార్మిక వర్గం సృష్టించు కొగలిగింది.
1929 మీరట్ కుట్ర కేసు పేరిట కార్మిక నేతల్ని నిర్బంధించిన గడ్డు కాలంలో సైతం భారత కార్మిక వర్గం అసమాన గుండె నిబ్బరంతో నిలబడింది. భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో సువర్ణాక్షరాల తో లిఖించదగ్గ షోలాపూర్ కమ్యూన్ స్థాపించి, ఆరు రోజులు బ్రిటిష్ పాలన స్థానంలో ప్రత్యామ్నాయంగా కార్మిక వర్గ పరిపాలన ఎలా వుంటుందో నిరూపించిన ఘనమైన గత చరిత్ర భారత కార్మిక వర్గానికి వుంది.
1939 లో రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభమైన వెంటనే అనేక ఐరోపా పెద్ద నగరాలలో కంటే ముందుగా అతి భారీ యుద్ధ వ్యతిరేక కార్మిక ప్రదర్శన (బొంబాయి) జరిగిన ఘన చరిత్ర భారత కార్మిక వర్గానికి దక్కుతుంది.
ఫాసిస్టు సైనిక యుద్ధ కూటమి సోషలిస్టు రష్యా పై 1941లో ప్రకటించిన దురాక్రమణ యుద్దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ప్రదర్శనలను నిర్వహించి అంతర్జాతీయతా భావంతో సోషలిస్టు చైతన్యాన్ని చాటిన ఘన చరిత్ర భారత కార్మిక వర్గానికి వుంది.
1946 లోనే ఒకవైపు బ్రిటిష్ రాయల్ నౌకా సిబ్బంది చేపట్టిన చారిత్రాత్మక పోరాటానికి, మరో వైపు నేతాజీ నేతృత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్ నేతల ఉరిశిక్షల వ్యతిరేక పోరాటానికి సంఘీభావంగా సమరశీల చైతన్యంతో లక్షల సంఖ్యలో రోడ్డెక్కి పోరాడిన ఘన చరిత్ర భారత కార్మిక వర్గానికి వుంది. ఇవి కొన్ని వీరోచిత ఘట్టాలు మాత్రమే.
ఇవన్నీ ఎందుకు ఇక్కడ ప్రస్తావన చేయాల్సి వచ్చింది? భారత కార్మిక వర్గం చేపట్టిన రేపటి సార్వత్రిక సమ్మెకూ, అది సృష్టించిన గత వీరోచిత చరిత్ర కూ మధ్య సంబంధం ఏమిటి? ఇది అవసరం లేని అనుచిత ప్రస్తావన కాదా? ఇలాంటి ధర్మ సందేహాలు ఎవరికైనా రావచ్చు. ఇది అనుచిత ప్రస్తావన కాదు. పైగా ఇది అవసరమైన, ఇంకా చెప్పాలంటే అత్యవసరమైన సాపేక్షిక ప్రస్తావిత అంశం.
డిమాండ్ల కోసమే డిమాండ్లు కాదు. సమ్మెల కోసమే సమ్మెలు కాదు. పోరాటాల కోసమే పోరాటాలు కాదు. ఈ అన్నింటి వెనక ఒక లక్ష్యం వుండాలి. హారంలో బయటకు పూసలు మాత్రమే కనిపిస్తాయి. లోపలి దారం కనిపించదు. పూసలే హారం కాదు. దారమూ హారమే. అసలు కనిపించని దారం లేకుండా అందమైన హారం లేదు.
దారం వంటి ఓ నిగూఢ రాజకీయ లక్ష్యం లేకుండా కార్మిక వర్గ పోరాటాలు లేవు. కార్మిక చట్టాల వంటి “సంక్షేమ” చర్యలు లేవు. అదే ముఖ్యం. అది ఏ మేరకు సరిగ్గా వుందో పరిశీలన చేయాల్సింది. దారం తెగిపోతే, హారానికి గుచ్చిన అందమైన పూసలు కింద రాలి పడతాయి. అవి హారం అనే స్వభావాన్ని కోల్పోతాయి. పూసల వలె బయటకు కంటికి కనిపించే కార్మికవర్గ పోరాటాల వెనక, నిగూఢ హారం వంటి ఓ రాజకీయ దృక్కోణం సరిగ్గా వుందో లేదో చూడాలి. అది అందులో ఏ మేరకు విజయం సాధించిందో ముఖ్యమైనది. అదే అసలు రాజకీయ కొలబద్ద.
పైన పేర్కొన్నట్లు బ్రిటిష్ పాలనలో 1923లో తొలి కార్మిక చట్టంతో మొదలై 1947 మార్చి లో ఐదవ కార్మిక చట్టం వరకు భారత కార్మిక వర్గం సాధిస్తూ వచ్చింది. అందుకోసం భారత కార్మికవర్గం అనేకసార్లు పెను రక్తతర్పణలు చేసింది. ఐతే కార్మిక వర్గం కోసం ఎన్ని కార్మిక “సంక్షేమ” చట్టాల్ని బ్రిటిష్ ప్రభుత్వం చేస్తూ వస్తె, అంత ఎక్కువ వర్గ కసి, వర్గ చైతన్యం భారత కార్మిక వర్గంలో ఆనాడు పెరుగుతూ వచ్చింది.
కార్మిక “సంక్షేమం” పేరిట ఏ బ్రిటిష్ ప్రభుత్వం కార్మిక చట్టాలను చేస్తూ వచ్చిందో, అదే బ్రిటిష్ ప్రభుత్వ వలస పాలనకు రాజకీయ మరణ శాసనం రాసేందుకు అది మరింత వర్గ చైతన్యంతో పైన పేర్కొన్న వీరోచిత పోరాటాలను మరిన్ని చేపడుతూ వచ్చింది.
ఒక్క మాటలో చెప్పాలంటే, కార్మిక సంక్షేమ చట్టాల్ని నాడు భారత కార్మికవర్గం తన విప్లవ పథంలో మెట్లుగా మార్చుకుంది. దాన్ని ఆనాడు నడిపించిన నేపథ్య తాత్విక, సైద్ధాంతిక మేదోధార స్టూలంగా సంస్కరణలను విప్లవ పథంలో ముందడుగులు గా భావించింది. అది అందుకు అనుగుణంగా కార్మిక వర్గంలో వర్గ చైతన్యం, వర్గకసి లను పెంచింది. నాడు కొన్ని చారిత్రిక పొరపాట్లు దొర్లివుండొచ్చు.
కానీ నాడు స్థూలంగా కార్మికవర్గానికీ సంక్షేమ కార్మిక చట్టాల పట్ల సంతృప్తి భావనను కలిగించ లేదు. అందుకు భిన్నంగా రాజ్యాధికార భావనను అది కలిగించింది. 1947 తర్వాత అట్టి రాజకీయ వారసత్వం కొనసాగలేదు. రేపటి సార్వత్రిక సమ్మె సందర్భంగా శ్రామికవర్గ విప్లవ సంస్థలు తెలుసుకొని తీరాల్సిన చారిత్రిక అంశమిది.
1947 తర్వాత ఒక్కొక్క కార్మిక “సంక్షేమ” చట్టం వచ్చే కొద్దీ, భారత కార్మిక వర్గంలో వర్గకసి, వర్గ చైతన్యం క్రమంగా మొద్దు బార్చబడుతూ వచ్చిన ఓ క్రమం వుంది. ముఖ్యంగా “ప్రభుత్వ రంగం” పట్ల కార్మిక వర్గంలో “స్వర్గ” భావనను పెంచే రాజకీయ ప్రక్రియ నాడు చోటు చేసుకుంది. నిజానికి బూర్జువా వ్యవస్థలో రాజకీయంగా కార్మికవర్గ విప్లవీకరణ ప్రక్రియ నియంత్రణ కోసం అది విసిరిన శక్తివంతమైన “ఎర” మాత్రమే ప్రభుత్వ రంగం. అంతకంటే అది గొప్పదేమీ కాదు.
కానీ అది “సోషలిస్టు” స్వభావం గల ఒక ప్రత్యామ్నాయ పారిశ్రామిక రంగంగా కార్మికవర్గ మనస్సుల్లో చిత్రించ బడింది. అంతిమంగా దాని యాజమాన్యం కూడా దోపిడీ పాలక వ్యవస్థ చేతుల్లో వుందనే సైద్ధాంతిక భావన కనుమరుగయ్యే విధంగా ఈ ప్రాచుర్యం జరిగింది. అందుకే అది కుప్ప కూలిన క్రమం కార్మిక వర్గానికి సహజంగానే నిరాశ కలిగించింది. తమ ఊహాజనిత స్వర్గం తమ కళ్ల ముందే కూలి పోతున్నట్లు తీవ్ర నిస్పృహకు గురవుతోంది.
పర్మినెంట్ ఉద్యోగాలు, 8 గంటల పనిదినం, ఉద్యోగ భద్రత, ఉపాధి కల్పన, బోనస్, కరవు భత్యం, వివిధ రకాల భత్యాలు (అలవెన్సులు), కాలనీలు నిర్మించి గృహవసతి కల్పన వంటి అనేక “సంక్షేమ” సౌకర్యాలను 1950 నుండి 80 దశకంవరకి వివిధ ప్రభుత్వాలు సమకూర్చుతూ వచ్చాయి. అవి సంఘటిత రంగ కార్మిక వర్గం అనుభవిస్తూ వచ్చింది.
మరీ ముఖ్యంగా ప్రభుత్వ రంగ కార్మిక వర్గం సాపేక్షికంగా మరి కొంత ఎక్కువ అనుభవించ గలిగింది. ఆ కార్మిక “సంక్షేమ” సంస్కరణలు ఆచరణలో రాజకీయంగా కార్మికవర్గ చైతన్యాన్ని మొద్దు బార్చింది. కార్మిక చట్టాలు తదితర వివిధ సంస్కరణలను రాజ్యాధికార సాధన దిశలో విప్లవపథంలో మెట్లుగా మార్చుకునే రాజకీయ ప్రక్రియ సాగలేదు. అందుకు పూర్తి భిన్నంగా, వారిలోని రాజకీయ చైతన్యాన్ని క్రమంగా మొద్దు బారుస్తూ వచ్చింది. ఇదే అసలు రాజకీయ సమీక్షాంశం.
నేడు ఫాసిస్టు రాజకీయ ధోరణి బల పడటానికి ఒక ముఖ్య కారణం పైన పేర్కొన్న విధంగా భారత కార్మిక వర్గంలో విప్లవ చైతన్యం క్రమ క్రమంగా మొద్దు బారడమే. ఆ మొద్దు బారిన వర్గచైతన్యాన్ని తిరిగి కార్మిక వర్గంలో పెంపొందించి, క్రమంగా రాజ్యాధికార భావన తో విప్లవ పథంలో నడిపించే అవకాశం చరిత్ర తిరిగి నేడు కల్పిస్తోంది.
తమ ఊహాజనిత “సోషలిస్టు స్వర్గం” నేడు కూలి పోతున్నదని కుమిలిపోయే నేటి భారత కార్మిక వర్గానికి తమ తాత ముత్తాతల తరాల కార్మికవర్గం నాటి “సంక్షేమ” సంస్కరణలను ఎలా విప్లవ పథంలో ముందడుగు లు గా మలుచుకుందో వివరించాలి. వారిని వాస్తవ సోషలిస్టు సమాజ నిర్మాణం దిశలో నడిపించాలి. అందుకు వర్తమాన చరిత్ర ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. దాన్ని సద్వినయోగం చేసుకుందాం.
ఇది నిజానికి గత కాలపు “సంక్షేమ” సంస్కరణల వ్యవస్థ తమ కళ్ల ముందే కుప్పకూలి పోతున్నందుకు కార్మిక వర్గ విప్లవ సంస్థలు బాధ పడే విషాద కాలం కాదు. ఇది కార్మిక వర్గాన్ని విప్లవపథంలో మరింత కసితో ముందుకు నడిపించే అవకాశాన్ని తమ చేతికి చరిత్ర ఒక గొప్ప రాజకీయ కానుకగా ఇచ్చినందుకు రాజకీయ ఆనందం పొందే కాలమిది. అది ఎందుకో చూద్దాం.

(పి. ప్రసాద్ (పిపి)అధ్యక్షులు; కే. పొలారి ప్రధాన కార్యదర్శి,రాష్ట్ర కమిటీ, ఆంధ్ర ప్రదేశ్, భారత కార్మిక సంఘాల సమాఖ్య -IFTU))

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *