ఇదొక సక్సెస్ స్టోరీ: మంగళగిరి VTJM & IVTR డిగ్రీ కాలేజీ చరిత్రలో కొత్త మలుపు…

వీటీజేఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాల సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్ గా బాధ్యతలు చేపట్టిన రజతోత్సవ సందర్భంగా

 

ఆయనొక డాక్టర్. తన వైద్య సేవలతో పలువురికి సేవ చేస్తూ వైద్య వృత్తే పరమావధిగా భావించి, తన ప్రస్థానాన్ని ప్రారంభించిన వైద్యులు. వైద్యంతో పాటు విద్యా రంగంలో అడుగిడి విద్యాభివృద్ధికి పాటుపడిన విద్యావేత్త. వైద్య, విద్యా రంగాలలో అందించిన సేవలకు గుర్తింపుగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ప్రతిభా పురస్కారం అందుకున్నారు.
ఆయనెవరో అనుకుంటున్నారా… మరెవరో కాదు… మంగళగిరికి మంచి నీటిని తెప్పించి, అపర భగీరథుడుగా పట్టణ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ప్రథమ మున్సిపల్ చైర్మన్ గోలి గోపాలరావు  తనయుడు డాక్టర్ గోలి రామ్మోహనరావు.
మంగళగిరి పట్టణములోని ప్రథమ డిగ్రీ కాలేజీ అయిన వీటీజేఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాల సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్ గా బాధ్యతలు చేపట్టి, అత్యంత సమర్దుడుగా పాతిక సంవత్సరాలు పదవీ బాధ్యతలు నిర్వహించి, సిల్వర్ జూబ్లీ కార్యదర్శిగా కీర్తి గాంచి వెలుగొందుతున్న సందర్భంగా… కళాశాలకు సంబంధించిన కొన్ని విషయాలు ప్రత్యేకంగా…
తమ సోమా జ్యోతిర్గమయ
‘తమ సోమా జ్యోతిర్గమయ’ అనే సూక్తిని సార్ధంకం చేసిన చోటు అది. పేద విద్యార్థుల జీవితాల్లో చీకట్లను తొలిగించి విద్యా జ్యోతులు వెలిగించిన కళాశాల. అదే మన వీటిజేఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాల(వెనిగళ్ల తాతయ్య, జంజనం మంగళాద్రి అండ్ యిసునూరి వెంకట తాతారావు డిగ్రీ కళాశాల).
photo credit: Gorantla Puranchadrarao
ఇక్కడ విద్యను అభ్యసించిన విద్యార్థులు దేశ విదేశాలలో ఉత్తమ శ్రేణి ఉద్యోగులుగా వివిధ హోదాలలో రాణిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ విద్యనభ్యసిస్తున్న పలువురు క్రీడాకారులు జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించారు. అంతర్జాతీయ క్రీడా పోటీలు వైపు పరుగులు పెడుతూ, కళాశాలకు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కీర్తి ప్రతిష్టలకు వన్నె తెచ్చారు. మంగళగిరి ప్రాంత వాసులలో విద్యా కుసుమాలు వికసింపజేయటానికి 1977లో స్థాపించిన ఈ సంస్థ కలికితురాళ్లను తన కీర్తి కిరీటంలో చేర్చుకొని నేడు తన విజ్ఞాన జ్యోతులను నలుదిక్కుల ప్రకాశింప చేస్తోంది. సామాన్య విద్యార్థులను, కడు పేద కుటుంబాల నుంచి వచ్చిన బాలబాలికలను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్ది, వారిలోని సృజనాత్మక శక్తిని, మేధో సంపత్తిని వెలికితీసి వారి భావి జీవితానికి పునాదులు వేసిన ఘన చరిత్ర దీనికున్నది. అతి తక్కువ ఫీజులతో సాంప్రదాయ కోర్సులైన బీఏ, బీకాం కోర్సులను బోధిస్తూ, సేవా దృక్పథంతో కొనసాగుతోంది. అర్హత గల ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్లను మంజూరు చేయించి విద్యార్థికి అండగా నిలుస్తోంది. ప్రత్యేకమైన పాఠ్య ప్రణాళికలతో, విద్యార్థులకు ఉత్తమ శిక్షణ ఇచ్చి, క్రమశిక్షణతో విద్యను నేర్పి, ఉత్తమ విద్యార్థులుగా తయారుచేసి, వారి భవిష్యత్తు బంగారు బాట వైపు పయనించేందుకు ప్రోత్సహిస్తూ, చిరస్మరణీయమైన విజయకేతనంతో ముందుకు సాగుతున్నది. నాడు పది మందితో స్థాపించిన ఈ సంస్థ నేడు వేలాది విద్యార్థులతో ప్రకాశిస్తూ, అగ్రగామి విద్యాలయంగా విరాజిల్లుతున్నది.

Like this story? Share it with a friend!

నలు దిశలా విద్యా సుగంధాలు
చేనేత కేంద్రమైన మంగళగిరి పట్టణం పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు అధికంగా నివసించే ప్రాంతం. ఈ ప్రాంత విద్యార్థులు డిగ్రీ చదువులకు గుంటూరు, విజయవాడ, అమరావతి, నగరం లేదా ఏదైన దూర ప్రాంతాలకు వెళ్లి ఉన్నత చదువులను కొనసాగించేవారు. అనేకమంది పేద, మధ్య తరగతి విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో దూరప్రాంతాలకు వెళ్ళలేక, అర్ధాంతరంగా తమ చదువులకు స్వస్తి పలకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. స్వాతంత్ర్యానికి పూర్వమే మంగళగిరి ప్రాంతములో విద్యా సుగంధాలను వెదజల్లుతున్న సీకే విద్యా సంస్థల యాజమాన్యం, పేద విద్యార్థుల చదువులు మధ్యలో ఆగకూడదు అనే‌ ఉద్దేశంతో డిగ్రీ కళాశాల స్థాపన పై దృష్టి సారించింది. అప్పటి కార్యవర్గ సభ్యులైన కీర్తిశేషులు శ్రీ వి.వీరస్వామి గారు (ప్రెసిడెంట్), జె. కోటేశ్వర రావు గారు(సెక్రటరీ అండ్ కరస్పాండెంట్), కీర్తిశేషులు శ్రీ ఐ. భావన్నారాయణ గారు (హెడ్ మాస్టర్)ల సమర్థవంతమైన సారధ్యంలో ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రభుత్వం నుంచి అనుమతి పొందేందుకు, ప్రముఖ పాత్ర పోషించి కృషి సల్పిన వారిలో అత్యంత ధీశాలురైనా కీర్తిశేషులు శ్రీ వేములపల్లి శ్రీకృష్ణ గారు, కీర్తిశేషులు శ్రీ ప్రగడ కోటయ్య గారు, కీర్తిశేషులు శ్రీ ఎస్.లక్ష్మీనారాయణ(ఐఏఎస్) గారు ముఖ్యులుగా ఉన్నారు. సేవా దృక్పథంతో మంగళగిరి ప్రాంతంలో విద్యాకుసుమాలు అందిస్తున్న సీకే విద్యాసంస్థల యాజమాన్యం ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు సంబంధించి పునాదులు పడ్డాయి .
కళాశాల ప్రస్థానం
మంగళగిరి పట్టణంలోని సీకే విద్యా సంస్థల యాజమాన్యం డిగ్రీ కళాశాల స్థాపనకు నడుం బిగించింది. చేనేత ప్రముఖులు వెనిగళ్ల తాతయ్య, జంజనం మంగళాద్రి పేరుతో కళాశాలను 1977లో స్థాపించారు. వ్యాపార దృష్టితో కాకుండా సేవా దృక్పథంతో సేవలందించే సంస్థ గా పేరుగాంచిన వీటిజెఎం బికామ్ కోర్స్ తో తన ప్రస్థానం ప్రారంభించింది. 10 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ కళాశాల, బీకాం, బీఏ సాంప్రదాయ కోర్సులతో వేలాది మంది విద్యార్థులతో, వెలుగొందుతూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.
photo credit: Gorantla Puranchadrarao
1995లో యిసునూరి వెంకట తాతారావు, మరియు కొందరు దాతల దాతృత్వంతో కళాశాలలో బీఎస్సీ కోర్సును ప్రారంభించారు. దీంతో డిగ్రీ కళాశాల పేరు వీటీజెయం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాల గా రూపాంతరం చెందింది. ఈ కళాశాల అధ్యక్షులుగా వెనిగళ్ల షణ్ముఖ రావు గారు 1977 నుంచి 79 వరకు, జంజనం మంగళాద్రి గారు 79 నుంచి 2004 వరకు, యిసునూరి వెంకట తాతారావు గారు 2017 వరకు తమ సేవలను అందించారు. ప్రస్తుతం 2017 నుంచి జంజనం పాండు రంగారావు గారు అధ్యక్షులు గా పదవీ బాధ్యతలు చేపట్టారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గా ఐ.వి.సూర్య నారాయణ 77 నుంచి 79 వరకు, వి. షణ్ముఖరావు 79 నుంచి 86 వరకు, ఐ.వి. సూర్యనారాయణ 86 నుంచి 91 వరకు, జె.మంగళాద్రి 12 రోజులు (3.11.91 నుంచి 14.11.91) వరకు ఇన్చార్జిగా, డీకే మధుసూదన రావు 91 నుంచి 95 వరకు, డాక్టర్ గోలి రామ్మోహనరావు 95 నుంచి 2008 వరకు, తాడిపత్రి రామ్మోహనరావు 12.3.2008 నుంచి 12.5.2008 వరకు, మరల 13.5.2008 నుంచి డాక్టర్ గోలి రామ్మోహనరావు పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ కళాశాల పౌండర్ ప్రిన్సిపాల్ గా కె.ఎస్.ఆర్.ఆర్.శర్మ వ్యవహరించగా, అందె రామ్మోహన రావు, డాక్టర్ జి.బి. ఫ్రాంక్లిన్, డాక్టర్ ఎం.రాజశేఖర్ బాబు గార్లు పూర్తి స్థాయి ప్రిన్సిపాల్స్ గా పనిచేసి పదవీ విరమణ పొందారు. వీ.కృష్ణమూర్తి, పి.ఎన్. శాస్త్రి, టి. నిర్మల కుమారి లు ఇంఛార్జి ప్రిన్సిపాల్స్ గా పనిచేసి పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం ఎ.వెంకటేశ్వర్లు (యోగి) ప్రిన్సిపాల్ (ఎఫ్ఎసి)గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య కె వియ్యన్నారావు చేతుల మీదగా ప్రతిభా పురస్కార అవార్డు అందుకుంటున్న డాక్టర్ గోలి రామ్మోహన రావు (credits: Gorantal Purnachandra Rao
చెరగని ముద్ర ‘అందె’
1981లో కళాశాల‌ ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించిన అందె రామ మోహన్ రావు హయాంలో ఈ కళాశాల ఉత్తమ ఫలితాలను సాధిస్తూ, క్రీడా రంగంలో సైతం విశేష ప్రతిభాపాటవాలను కనబరుస్తూ రాష్ట్ర స్థాయిలో కీర్తి పతాకాలను ఎగురవేసింది. సూపరింటెండెంట్ గా బి.విద్యాసాగర్ సహకారం అందించారు. ప్రిన్సిపాల్ గా ఎక్కువ కాలం పని చేసిన అందె రామమోహన రావు అకుంఠిత దీక్ష, నిరంతర పర్యవేక్షణ, నిర్విరామ కృషి ఫలితంగా కళాశాల విజయ పధాన పయనిస్తున్న ఉత్తమ శ్రేణి విద్యాలయంగా అలరారుతోంది. 2007లో ఉద్యోగ పదవి విరమణ చేయడంతో తదుపరి వచ్చిన ప్రిన్సిపాల్స్ అదే బాటలో పయనిస్తూ కళాశాల అభివృద్ధికి పాటుపడుతున్నారు.
ఇవి కూడా చదవండి
*తిరుమల పవిత్రతను ఈస్టిండియా కంపెనీ ఎలా కాపాడిందంటే…

*తిరుమల వెంకన్న గుడి ఈస్టిండియా కంపెనీ పాలన కిందికి ఎలా వచ్చింది?

సర్వతోముఖ అభివృద్ధికి ఆద్యుడు “గోలి”
సిల్వర్ జూబ్లీ కార్యదర్శిగా చిరస్థాయి ముద్ర వేసిన ఆత్మీయ రామ్మోహనుడు. డాక్టర్ గోలి రామ్మోహన్రావు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గా 1995లో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆనాటి నుండి కళాశాలను అభివృద్ధి బాటలో పయనింప చేస్తున్నారు. రేకుల షెడ్లలో కొనసాగిన కళాశాల తరగతులు పక్కా భవనములలో అత్యాధునిక వసతులతో నిర్వహించబడుతున్నాయి. కాలక్రమేణ ఈ సంస్థ ఒక సమగ్ర రూపం సమకూర్చుకొని విస్తరిల్లింది. పలురకాల విభాగాలతో ఉన్నత విద్యా ప్రమాణాలు గల విద్యా సంస్థగా తీర్చిదిద్దడంతో పాటు, విద్యార్థి లోకానికి మరింతగా సాంకేతిక, ఆధునిక పరిజ్ఞానాన్ని అందించడానికి కళాశాలలో నూతన కోర్సులు నెలకొల్పారు. ఉన్నత విద్యా ప్రమాణాలతో, నిర్దుష్ట లక్ష్యాలతో ముందుకు సాగారు. ముఖ్యంగా ప్రతి విద్యార్థికి వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటూ, వారిలో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి, వారిని విజయపథంలో నడిపించే చర్యలు చేపట్టారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలుస్తూ, అత్యున్నత ఫలితాలు సాధించడం ఈ కళాశాల ప్రత్యేకతగా తీర్చిదిద్దారు. ఈ కళాశాలలో ఫీజులు నామమాత్రం కావడంతో ఎక్కువగా పేద, మధ్య తరగతి విద్యార్థుల పాలిట పెన్నిధిగా మారి, పేద, మధ్య, బలహీన, బడుగుల కళాశాలగా పేరుగాంచింది. అర్హతగల ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్ మంజూరయ్యే చర్యలు చేపట్టారు. అనుభవంగల నిష్ణాతులైన అధ్యాపకుల విద్యా బోధనతో జ్ఞాన తృష్ణను పెంపొందిస్తూ, భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు నిరంతర పర్యవేక్షణతో అహర్నిశలు శ్రమిస్తూ, అత్యున్నత స్థాయి సౌకర్యాలతో రూపుదిద్దారు. ఉన్నత ఆశయాలకు, క్రమశిక్షణకు మారు పేరైన వీటీజేయం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాల ఎందరో ఆణి ముత్యాలను జాతికి అందించింది. ‘పాతికేళ్ల ప్రస్థానంలో తనకు ఎల్లవేళలా సహకరించిన కమిటీ సభ్యులకు, చేయూతను అందించిన కళాశాల సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్తులో కళాశాల అభివృద్ధికి మరింతగా తోడ్పడాలని సిల్వర్ జూబ్లీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ రామమోహన్ రావు ’ కోరుతున్నారు.
Gorantla Purnachandra Rao
(గోరంట్ల పూర్ణచంద్రరావు, సీనియర్ జర్నలిస్టు, మంగళగిరి)

ఇది కూాడా చదవండి

తిరుమల గురించిన 20 చిన్న, చిక్కు ప్రశ్నలు, వీటి జవాబులు మీకు తెలుసా?