(చందమూరి నరసింహారెడ్డి)
ఆల్ ఇండియా రేడియో లో తొలి తెలుగు మహిళ న్యూస్ రీడర్, గాంధీ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్ మెంట్ అధ్యక్షురాలు, అనిబిసెంట్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఉపాధ్యక్షురాలు, లోక్ అదాలత్ సభ్యురాలు, ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ లైఫ్ మెంబర్ విద్యావేత్త డాక్టర్ జోలె పాళ్యం మంగమ్మ.
ఆలిండియా రేడియో తొలి తెలుగు మహిళా న్యూస్‌రీడర్ జోలెపాళ్యం మంగమ్మ 1925 సెప్టెంబర్ 12న మదనపల్లె లో జన్మించారు. తల్లి జే లక్ష్మమ్మ, తండ్రి సుబ్బయ్య .వీది బడి నుంచి డిగ్రీ వరకు మదనపల్లె లో చదివారు.యం.ఎ., బి.ఇడి చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు.
ఆలిండియా రేడియో నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణురాలై 1960లో రేడియో తొలి తెలుగు మహిళా న్యూస్‌రీడర్‌గా, ఎడిటర్ గా పనిచేశారు.1962 నుండి నేషనల్ ఆర్కీవ్స్, ఢిల్లీలో పరిశోధనా రంగంలో విశేష కృషి చేశారు. కేంద్ర సమాచారశాఖ, విదేశాంగశాఖలలో కీలకమైన పదవులను నిర్వహించారు.
అనంతరం 35 ఏళ్లపాటు ప్రయోగాత్మక విద్యాకేంద్రం, టీచర్ ట్రైనింగ్ కేంద్రాల్లో ఉపాధ్యాయురాలు గా పనిచేశారు.
జోలెపాళ్యం మంగమ్మ ఆలిండియా రేడియోలో తొలి మహిళా న్యూస్ రీడర్ గా బాధ్యతలు నిర్వహించారు. తెలుగు, ఇంగ్లీషు, ఫ్రెంచ్, ఎస్పరాంటో, తమిళ, హిందీ భాషలలో ప్రావీణ్యంతో పాటు బోధన రంగంలో విశేషానుభవం ఉంది. మంగమ్మ సరోజినీ నాయుడుకు మంచి స్నేహితురాలు.
ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మొదలైన సంస్థలలో లైఫ్ టైమ్ మెంబర్. అనేక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే ఆమె అనిబీసెంట్ ఎడ్యుకేషనల్ ట్రస్టు ఉపాధ్యక్షు రాలిగా, గాంధీ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్ మెంట్ అధ్యక్షురాలు హోదాల్లో సేవలను అందించారు. లోక్ అదాలత్ లో సభ్యురాలిగా, వివిధ సంస్థలు కీలక భాద్యతలు నిర్వహించారు.
బహు భాషల్లో ప్రావీణ్యం గల మంగమ్మ ఆంగ్ల, తెలుగు భాషల్లో మూడువందలకు పైగా వ్యాసాలు రాసారు. అనేక పుస్తకాలను ప్రచురించారు.
ఆమె రాసిన పుస్తకాలు తెలుగులో ‘ఇండియన్ పార్లమెంట్’, ‘శ్రీ అరబిందో’, ‘విప్లవ వీరుడు అల్లూరిసీతారామరాజు’, ‘అనిబీసెంట్’ ‘ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవమిషనరీల సేవ’ తదితర పుస్తకాలు ఎంతో పేరు తెచ్చాయి.
ఇంగ్లీష్ లో ఆమె రాసిన ’ప్రింటింగ్ ఇన్ ఇండియా’, ‘అల్లూరి సీతారామరాజు’, ‘లాస్ట్ పాలెగార్ ఎన్ కౌంటర్ విత్ ది బ్రిటిష్ ఇన్ ది సీడెడ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 1846-1847’, ‘ది రేట్ స్కూల్స్ ఆఫ్ గోదావరి’ తదితర పుస్తకాలు ఆమెకు గుర్తింపు తీసుకు వచ్చాయి
భారత దేశంలో ప్రింటింగ్ ఎలా మొదలయిందనే మీద ఆమె చేసిన పరిశోధన (Book Printing in India with Special Reference to the Contribution of European Scholars to Telugu :1975) చాలా ఆసక్తికరమయిన విషయాలను వెలికితీసింది. భారతదేశంలో మొదట అచ్చయని పుస్తకం బైబిల్. 1719లో తొొలి బైబిల్ అచ్చయింది. ప్రింటింగ్ మొదలయింది కలకత్తా సమీపంలోని సేరంపూర్ (Serampur) లో. అక్కడి ముద్రణాలయంలోనే బ్రిటిష్ వారు భారతీయభాషల్లో పుస్తకాలు, ముఖ్యంగా డిక్షనరీలు, వ్యాకరణ గ్రంధాలు ఆచ్చేశారు.
మొదటి తెలుగుపుస్తకాల ముద్రణ జరిగింది ఇండియాలో కాదు, జర్మనీలో.మొదటి తెలుగుపుస్తకాలు రోమన్ క్యారెక్టర్స్ లో ఉండేవి. ప్రధానంగా ఇవి యూరోపియన్లకోసం ఉద్దేశించినవి.1805 ప్రాంతంలో తెలుగులో బైబిల్ ను అనువాదం చేసేందుకు మిషనరీలు పూనుకున్నారు. దీనికి ఆనందరాయుడు అనే బ్రాహ్మణ పండితుడు సహకరించాడు. ఆనందరాయుడి అసలు పేరు సుబ్బరావు.మహారాష్ట్ర నుంచి వచ్చి గుంటూరు పరగణాలో సెటిల్ అయ్యాడు. క్రైస్తవం స్వీకరించాడు. ఇలాంటి ఆసక్తి కరమయిన విషయాలను డాక్టర్ మంగమ్మ తనపుస్తకంలో రాశారు.
ఇవి కూడా చదవండి
- తెలుగు వాళ్ల ఇంగ్లీష్ మీడియం మొగ్గుకి 2 శతాబ్దాల చరిత్ర ఉంది తెలుసా?
- HMT వాచ్ ని మర్చిపోగలమా?, బెంగుళూరులో ఆ జ్ఞాపకాల ఖజానా
- 1857కు ముందే బ్రిటిష్ పాలనకు తలవంచనన్న కర్నూలు నవాబు
- తాను గుడ్ బై చెప్పినా, సినిమాలు భానుమతిని వదల్లేదు
సాహిత్య రంగంలో ఆమె సేవలకు గాను 2002లో న్యూఢిల్లీ ‘తెలుగు అకాడమీ ఉగాది పురస్కారం’, కుప్పం’ రెడ్డెమ్మ సాహితీ అవార్డు విజయవాడ ‘సిద్ధార్థ కళాపీఠం విశిష్ట అవార్డులు మంగమ్మని వరించాయి.ఆంధ్రా నైటింగేల్ అనే బిరుదు అందుకున్నారు .
తెలుగు సాహిత్యంపై మక్కువతో మదనపల్లె రచయితల సంఘం ఏర్పాటులో కీలక భూమిక పోషించారు.
92 ఏళ్లలో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చిత్తూరు జిల్లా మదనపల్లె రెడ్డీస్ కాలనీలోని స్వగృహం లో 2017 ఫిబ్రవరి1 న మరణించారు.
(చందమూరి నరసింహారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, ఖాసాసుబ్బారావు గ్రామీణ జర్నలిజం అవార్డు గ్రహీత)