తెలుగు వాళ్ల ఇంగ్లీష్ మీడియం మొగ్గుకి 2 శతాబ్దాల చరిత్ర ఉంది తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో తల్లితండ్రులు అధిక శాతం పిల్లలను ఇంగ్లీష్ మీడియంలోనే చదివిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియాంలోనే చదివించడానికి ఇష్టపడతారు. తెలుగు మీడియం కొనసాగించాలని వాదించినా, మనసంతా ఇంగ్లీష్ మీడియం మీదే ఉంటుంది. ఈవిషయంలో తెలుగు వాళ్లెపుడూ టాప్ మూడు నాలుగు రాష్ట్రాల్లో ఉంటారు.
 ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ లోఇంగ్లీష్ మీడియం మీద  వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకటో తరగతి నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో  ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రయివేటులో ఎపుడూమొదలయింది. అసలక్కడ తెలుగు సబ్జక్టు కూడా మాయవవుతూ ఉంది. ఆప్లేస్ లోకి సంస్కృతం వస్తూ ఉంది.
ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ ఎంపి  జివొ కూడా తెచ్చింది. వచ్చే ఏడాది నుంచి  ఇది అమలు కావాలసి ఉండింది.  ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో  మొత్తం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని భాషాభిమానులు వ్యతిరేకించారు కోర్టుకు వెళ్లారు.  కోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చింది. ఇంగ్లీష్ మీడియం ప్రతిపాదను వచ్చే ఈ వివాదం తర్వాత జగన్ ప్రభుత్వం ఎలా అమలుచేస్తుందో చూడాలి.
ఈలోపు కేంద ప్రభుత్వం నూతన విద్యావిధానం తీసుకువచ్చింది. ఇందులో ‘ప్రాథమిక స్థాయిలో మాతృభాషకు ప్రాముఖ్యం ఇచ్చింది. సాధ్యమైన  చోటల్లా అయిదో తరగతి వరకు తప్పనిసరిగా , ఇంకా వీలుంటే 8వ తరగతి వరకు, ఆపైనా కూడా, మాతృభాష  లేదా  స్థానిక భాష లేదా ప్రాంతీయ  భాష మాధ్యమంలో విద్యాబోధన సాగాలి. ఇది ప్రభుత్వ, పాఠశాలలకు  రెండింటికి వర్తిస్తుంది,’ అని రాసింది.
(Wherever possible, the medium of instruction until grade 5, but preferably till grade 8 and beyond, will be the home language, mother tongue, local language or the regional language. Thereafter, the home or local language shall continue to be taught as a language wherever possible. This will be followed by both public and private schools.)
న్యూఢిల్లీలో ప్రభుత్వ ఆలోచన అలా ఉంటే  ఊర్లలో పరిస్థితి న్యూఎడ్యకేషన్ పాలసీకి ఏ మాత్రం అనుకూలంగా లేదు. ఎందుకంటే తల్లితండ్రులంతా తమ పిల్లలకు ప్రైమరీ స్థాయి నుంచే కాదు, నర్సరీ నుంచి కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవాలనుకుంటున్నారు.  ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ (NSO)  సర్వేలో నే వెల్లడయింది.
ఇవి కూడా చదవండి
కేంద్ర ప్రభుత్వం, కోర్టులు,  భాషాభిమానుల ఆలోచనకు భిన్నంగా ప్రజలు ఇంగ్లీష్ మీడియం పట్ల మక్కువ చూపుతున్నారు.
వివిధ భారతీయ భాషలు మాట్లాడే ప్రజల్లో బోధనా మాధ్యమం (Medium of Instruction) పట్ల అభిరుచి ఎలా ఉందనే తెలుసుకునేందుకు జరిగిన సర్వే ఇది.
ఈ సర్వే ప్రకారం ఇంగ్లీష్ మీడియం వైపు మొగ్గు చూపుతున్న ప్రాంతీయ భాషలలో తెలుగు ప్రముఖంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన రిపోర్టు టైమ్స్ ఆఫ్ ఇండియా లో వచ్చింది.
తెలుగుభాష మాట్లాడే వారిలో 79.8శాతం  విద్యార్థులు ప్రీప్రైమరీలోనే ఇంగ్లీష్ మీడియం లో చేరుతున్నారు. వీళ్ల సంఖ్య  ప్రైమరీ స్థాయిలో 58.6 శాతం దాకా ఉంది.  తెలుగు పిల్లలో  53.1 శాతం మిడిల్ స్కూల్ లెవెల్లో ఇంగ్లీష్ చదువుతున్నారు.
సెకండరీ లెవెల్లో మాత్రం కొద్ది తక్కువగా  49.2 శాతంచదువుతున్నారు.
సీనియర్ సెకండరీ లెవెల్లో  అత్యధికంగా 74.5 శాతం విద్యార్థులు ఇంగ్లీమీడియంలో ఉన్నారు.
  ప్రీ ప్రైమరీ స్థాయిలో ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి తెలుగు విద్యార్థులు తమిళం (90.6శాతం) ఉర్దూ (82.4) మలయాళం(80.9) తర్వాత నాలుగోస్థానంలో ఉన్నారు.
ప్రైమరీ స్థాయిలో తెలుగు మీడియం తీసుకోవడంలో తెలుగు విద్యార్థులు నాలుగోస్థానంలో ఉన్నారు.  మొదటి స్థానాలు మణిపూర్ (76.7శాతం) మలయాళం (60.3 శాతం),పంజాబీ (59.7 శాతం) లవి.
హయ్యర్ సెకండరీలో తెలుగు వాళ్ల ఇంగ్లీష్ మీడియం మూడోస్థానం (74.5 శాతం)లో ఉంది. మొదటి రెండు స్థానాలుమణిపూర్ (93.7 శాతం), మలయాళం (78.8 శాతం)లది.
పరిస్థితి ఇలా ఉన్నపుడు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టకుండా నివారించడం సాధ్యమా? ఇదే జరిగితే తల్లితండ్రులు నాసిరకానివైన ఇంగ్లీష్  ‘కాన్వెంట్’ స్కూళ్లకే ప్రాధన్యాం ఇస్తారు.
తెలుగుతో పాటుమలయాళం, మణిపురి, పంజాబీ, ఉర్దూ,సింధీ, కొంకణి,నేపాలి భాషలు మాట్లాడే పిల్లలు కనీసం టెన్త్  లేదా ప్లస్ టు  దాకా ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతున్నారు.
తెలుగు వాళ్ల ఇంగ్లీష్ చదవుకు 200 సం. చరిత్ర ఉంది
తెలుగు ప్రజలకు ఇంగ్లీష్ మీద ఉన్న మోజు ఇప్పటిది కాదు.  19వ శతాబ్దం నుంచి ఇది కనబడుతుంది. తెలుగు ప్రజలు ఉపాధిఅవకాశాలు ఎలా వస్తాయో పసిగట్టగలరు.ఈస్టిండియా కంపెనీ  ప్రభుత్వం దేశాన్ని పరిపాలించే రోజుల్లో  ప్రభుత్వంలో ఉద్యోగం రావాలంటే నాలుగు ముక్కలు ఇంగ్లీష్ రావాలి. చక్కగా, అర్థమయ్యేలా గుండ్రటి అక్షరాలు రాస్తే సరి ఆరోజుల్లో జిల్లా కచేరిల్లో ఉద్యోగం దొరికేది.
ఆ రోజుల్లో భారతదేశంలో ప్రజలకు చదువే రాదు. తెలుగు రాయడం చదవడం తెలిసిందే తక్కువ. ప్రభుత్వకార్యాలయాలల్లో  టైపు రైటర్లు, జిరాక్స్ మిషన్లు ఆ రోజుల్లో లేవు కాబట్టి ప్రతి ఉత్తర్వును, లేఖను, ఇతర వ్యవహారాలను పైళ్లలో భద్రపరచాలంటే కాపీ చేయాలి. అందువల్ల ఆ రోజుల్లో  కొద్దిగా ఇంగ్లీష్ రాయనూ, చదవడం తెలిసినవాళ్లందరికి కలెక్టరాఫీస్ రైటర్ ఉద్యోగం దొరికేది.
ఈ సమాచారం అప్పడు చదవుకున్న వర్గమయిన బ్రాహ్మణులు ముందుగా తెలుసుకున్నారు.  అందుకే బ్రాహ్మణలు పిల్లలకు నాలుగు ముక్కలు ఇంగ్లీష్ నేర్పించి రైటర్ ఉద్యోగాల్లో కుదిరించే వారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఉంటే చాలా ఆయనే చాలా మంది బంధువుల పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించి కాపి రైటర్ ఉద్యోగాలలో పెట్టించేవారు.
తాను ఏ విధంగా నాలుగు ముక్కలు ఇంగ్లీష్ చక్కగా  రాయడం నేర్చుకుని రైటర్ ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా మద్రాసు సదర్ కోర్టులో చీఫ్ ఇంటర్ ప్రెటర్ గా ఎదిగిన విషయాన్ని వెన్నెలకంటి సబ్బారావు (నవంబర్ 28,1784-అక్టోబర్ 1, 1839) తన అత్మకథలో వివరించారు).
మద్రాస్ ప్రెశిడెన్సీలో ఇదే తొలి ఆత్మకథ అని చెబుతారు.  ప్రయివేటు ఇంగ్లీష్ మాస్టర్ల దగ్గిర ఆంగ్లం నేర్చుకున్న తన  బంధువులకు కూడా ఆయన రైటర్ ఉద్యోగాలు ఇప్పించిన విషయాన్ని ఆత్మకథలో రాశారు.
వెన్నెలకంటి సుబ్బారావు/wikipedia
ఇంగ్లీష్ నేర్చుకుంటే ఉద్యోగాలొస్తాయనే నమ్మకం బాగ ప్రబలిపోవడంతో  200 సంవత్సరాల కిందట కూడా 2020లో లాగానే  స్పోకెన్ ఇంగ్లీష్ పెద్ద బిజినెస్. ఆరోజుల్లో ఇంగ్లీష్ మీడియంకు  ఎంత డిమాండ్ ఉండిందో Robert Eric Frykenberg అనే చరిత్ర కారుడు ఒక చోట ఇలా రాశారు.
“… wealthier families, in anticipation of career advantages which might be gained, actually employed English tutors for their sons, while their poorer relations had to seek admission into special schools, whether in the city itself or in surrounding towns, where English could be learned”.
విపరీతంగా ఇంగ్లీష్ భాషకు డిమాండ్ ఉండటంతో నాటి మద్రాస్ మౌంట్ రోడ్డులో వందల సంఖ్యలో ఇంగ్లీష్ చెప్పే దుకాణాలు వెలిశాయని  ఆయన రాశారు.

ఫ్రైకెన్ బర్గ్ కూడా వెన్నెలకంటి సుబ్బారావు అనుభవాన్ని ఉదహరించారు. ఒంగోలు దగ్గిర ఒక కుగ్రామానికి చెందిన సుబ్బారావు కేవలం ఇంగ్లీష్ వల్ల మద్రాస్ సదర్ అదాలత్ చీఫ్ ఇంటర్ ప్రెటర్ అయిన అద్భుతాన్ని ఉదహరిస్తూ ఆరోజు మౌంట్ రోడ్దులో 500 ఇంగ్లీష్ బోధించే స్కూళ్లుండేవని ఇవన్నీ కూడా తాము ఇంగ్లీష్ నేర్పించడంలో Best అని బోర్డులు తగిలించుకునేవని ఫ్రైకెన్ బెర్గ్ రాశారు.

ఈ స్టోరీ నచ్చితే, మీ ఫ్రెండ్స్ కి షేర్  చేయండి

సుబ్బారావు చిన్న వయసులో తండ్రి చనిపోయారు. ఆయన ఒక ప్రయివేటు ఇంగ్లీష్ టీచర్ దగ్గిర ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. తర్వాత కలెక్టరాఫీసుల గుమాస్తాగా ఉన్న బంధువొకరు  ఆయన కాపియింగ్ అసిస్టెంట్ గా నియమించేలా సిఫార్సుచేశారు.గుంటూరు కచేరిలో ఆయన మొదటి ఉద్యోగం. నెలసరి జీతం అయిదు వరహాలు.
నిజానికి నాలుగు ముక్కలు ఇంగ్లీష్ తెలిసిన వాళ్లందరిన బంధువులు కెలెక్టరాఫీసుల్లో నియమింపచేస్తుండటంతో  చాలా జిల్లాల్లో కలెక్టరాఫీసులు  ఒకే కుటుంబంతో నిండిపోయిన ఉండేవి. దానికి తోడు అంతా బ్రాహ్మణులు. వీళ్ల పెత్తనం ఎక్కువయిందని కొన్ని జిల్లాల్లో తిరుగుబాట్లు వచ్చాయి. ఇలా తెలుగు ప్రాంతాలలో వచ్చిన మొదటి తిరుగుబాటు వచ్చిన జిల్లా అనంతపురం. ఒకే కుటుంబానికి చెందిన వాళ్లంతా ఇలా కార్యాలయంలో తిష్టవేస్తే, బ్రిటిష్ మహారాణి ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తుందని అక్కడ కొంతమంది ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇది భూకంపం సృష్టించింది.ఎంక్వయిరీ జరిగింది.  ఏం తేలిందో తెలుసా, కడప, కర్నూలు, నెల్లూరు, బళ్లారి జిల్లాల కలెక్టకారాఫీసులన్నీ ఒకే  అధికారి బంధువులతో నిండిపోయిందని. ఈ కథ మరొక సారి చూద్దాం.
19వ శతాబ్దంలో  ఇంగ్లీష్ నేర్చుకుంటే ప్రభుత్వోద్యోగం వస్తుందని మొదట గుర్తించి ఆ అవకాశాన్ని వినియోగించుకున్నది బ్రాహ్మణులు. ఇపుడు  21వ శతాబ్దాంలో చదువు సార్వజనీనం అయింది. గ్లోబలైజేషన్ వల్ల  ఐటి వంటి ఆధునిక రంగాలు విస్తరించడంతో దేశ విదేశాలలో ఉద్యోగావకాశాలు పెరగడం వల్ల ఇంగ్లీష్ ఉపాధికి మార్గమని అన్ని కులాల, మతాల వారు నమ్ముతున్నారు. నేటికి నాటికి తేడా ఇదే.
(Featured Image Credits: Gerd Altmann from Pixabay )