HMT వాచ్ ని మర్చిపోగలమా?, బెంగుళూరులో ఆ జ్ఞాపకాల ఖజానా ఏర్పాటు

(Ahmed Sheriff)
అనగనగా ఓ రాజు. అతడికి ఓ కొడుకు. కొన్ని రోజులకు రాజు కొడుకు అనారోగ్యం పాలవుతాడు. ఎన్ని మందులిచ్చినా అతడి ఆరోగ్యం బాగు పడదు.  ఆ రాజు. అతడిని  చెరసాల లో వుంచుతాడు. ఒంటరి తనం తో బాధ పడుతూ అనారోగ్యం ఎక్కువై ఆ రాజు కొడుకు చెరసాలలోనే మరణిస్తాడు. ఆ రాజే తన కొడుకుని చంపించాడని ఆ దేశ ప్రజలు అనుమాన పడతారు.
ఇలాంటిదే ఇంకో కథ చూద్దాం
అనగనగా ఓ రాజు. అతడికి ఓ కొడుకు కొన్ని రోజులకు రాజు కొడుకు అనారోగ్యం పాలవుతాడు. ఎన్ని మందులిచ్చినా అతడి ఆరోగ్యం బాగు పడదు. ఆ రాజు అతడిని  రాజమహలు లో నే వుంచుతాడు. తన కొడుకు ప్రాణం బదులుగా తన ప్రాణాన్ని తీసుకో మని  ప్రతి రోజూ దేవుడ్ని ప్రార్థిస్తాడు. కొన్ని రోజులకు ఆ రాజు కొడుకు జబ్బునుంచి కోలుకుని ఆరోగ్యవంతుడు అవుతాడు.
రెండు కథలూ తండ్రి కొడుకులకు సంబంధించినవే. మొదటి కథలో తండ్రి  1545 ప్రాంతం లో స్పెయిన్  దేశపు రాజు రెండొ ఫిలిప్, అతడి తనయుడు డాన్ కార్లోస్ అయితే, రెండో  కథలో తండ్రి బాబరు చక్రవర్తి, తనయుడు హుమాయున్.
రెండొ కథలో విశేషమేమీ లేదు. సాధారణంగా కొడుకుల మీద తండ్రుల కుండే మమకారమే కనబడుతుంది.
మొదటి కథలో మానసిక స్థితీ, శారీరక ఆరోగ్యం కలవర పెట్టే విధంగా వున్నా డాన్ కార్లోస్ ఆ రాజ వంశానికి ఏకైక వారసుడయ్యే  ఆశా కిరాణంగా చాలా కాలం కొనసాగాడు.  కొడుకు భారంగా తయారయ్యాడని, 23 సంవత్సా రాల   వయసులో కొడుకు మరణం తో ఆ భారాన్ని వదిలించుకున్న తండ్రిగా ఫిలిప్ రాజు ఒక  జంఝాటం నుంచి బయట పడినా,  వారసులు లేని కారణంగా రాజ్యాన్ని పరులకు అప్పగించాల్సి వచ్చింది.
వారసత్వాన్ని నిలుపుకోవడం చిన్న విషయ మేమీ కాదు. దీనికోసం రాజులు ఎంతో శ్రమ పడతారు. వారసత్వం నిలుపుకో లేని నాడు రాజ్యాధికారం పరహస్తగతమవుతుంది. రాజ్యం చిరునామా చెరిగి పోయిన ఒక పూర్వ సంపదగా (Heritage) మిగిలిపోయి చరిత్ర పుటల్లో చేరిపోతుంది. లేదా ఏదయినా కొద్ది పాటి అదృష్టం వుంటే ఒక వస్తు ప్రదర్శనశాల గా మిగిలి పొతుంది.
హెచ్ఎంటీ  హెరిటేజ్ సెంటర్ అండ్ మ్యూజియం  (HMT Heritage centre and museum) , బెంగుళూరు HMT కాలనీలో పచ్చని చెట్ల మధ్య  వుంది. ఇది వైభవాన్నిపొగొట్టుకుని ఒక అపూర్వ సంపద జ్ఞాపకాల ఖజనా. ఇది ఒక మ్యూజియం గా మారడానికి ముందు…
నాలుగు దశాబ్దాల  క్రిందటి మాట.  నువ్వు పరీక్షలు బాగా రాసి ఫస్టు క్లాసు లో పాసవుతే నీకొక హెచ్ఎంటీ. వాచి కొనిస్తాను అన్నారు మా నాన్న గారు.
నేను రాత్రికి రాత్రే రిక్షా తొక్కి లక్ష రూపాయలు సంపాదించే ఒక సినీ హీరోలా  పరీక్షల్లో ఫస్టు క్లాసు లో పాసు కాలేక పోయాను. మామూలు గా పాసయ్యాను. నేను మాట మీద నిలబడలేక పోయాను. కానీ మా నాన్న గారు తన మాట మీద నిలబడ్డారు. నాకొక హెచ్.ఎం.టీ వాచీ కొనిచ్చారు.
హెచ్ ఎంటి వాచ్ ల నాటి ప్రకటన
వృత్తాకారంలో నిగనిగ లాడే తెల్లటి బాక్ గ్రౌండు మీద నల్లటి సాదా అంకెల డయలు తో  స్తెయిన్లెస్ స్టీలు ఫ్రేములో బిగించిన 36 మిల్లి మీటర్ల వ్యాసపు ముద్దు గొలిపే హెచ్. ఎం. టీ. వాచి మొదటి సారి కట్టుకుంటున్నప్పుడు కుటుంబమంతా నాకేసి చూస్తూ వుండింది.
అప్పుడు నాకు కలిగిన  భావన మళ్లీ జీవితం లో ఎన్నడూ కలగ లేదు.   అది తొలి ప్రేమ. అప్పుడు గుర్తొచ్చింది నాకు “జిస్ దేశ్ మె గంగా బహతి హై”  చిత్రం లో రాజ్ కపూర్ (ముఖేష్) పాడిన పాట.
“లాఖ్ లుభాయే మహలు పరాయే అప్నా ఘర్ ఫిర్ అప్నా ఘర్ హై”
(పరాయి మేడలు లక్ష రకాలు గా ప్రలోభ పెట్టినా, నా ఇల్లు నా ఇల్లే)
ఒక అన్నయ్య తన చెల్లెలికి అనురాగంగా ఇచ్చినా, ఒక తండ్రి బాగా చదివె తన కొడుక్కి బహుమతిగా ఇచ్చినా, ఒక మామగారు తన అల్ల్దుడికి పండుగ కానుకగా ఇచ్చినా ఆ రోజుల్లో ఒక హెచ్ ఎంటీ వాచీ యే. – నా ఇంట (స్వదేశం)  లో  తయారయిన మొట్ట మొదటి వాచి.

 

Prime Ministeer Nehru in Shop Floo6 1961(Credits: HMT Museum)
స్వాతంత్య్రం వచ్చిన తరువాత “మన దేశాన్ని మనమే నిర్మించుకుందాం దీన్ని ఒక ఆదర్శవంతమైన దేశంగా ఆవిష్కరించుదాం” అన్న జవహర్ లాల్ నెహ్రూ పిలుపుకి స్పందించి నట్లు 1953 లో భారత ప్రభుత్వం ద్వారా ఒక ప్రభుత్వ రంగ సంస్థ గా  హెచ్ఎంటీ. (హిందుస్తాన్ మెషీన్ టూల్సు) స్వదేశీ సంస్థ స్థాపించ బడింది.
ఒక నూతన భారత దేశ నిర్మాణం లో భాగంగా 1961 లో ఈ సంస్థ ద్వారా HMT వాచ్ వచ్చింది. ఈ సంస్థ ద్వారా దేశం లో నే మొట్టమొదటి  ఆటొమాటిక్ డే అండ్ డేట్, అంధుల కోసం బ్రెయిలీ మోడల్, క్వార్ట్జ్ వాచీల తయారీ జరిగింది.

(Like this story? Share it with a friend)

“దేశానికే గడియారాలు” అని అర్థం వచ్చేట్లు, ఈ గడియారాల పంచ్ లైను “టైం కీపర్స్ టు ది నేషన్”  అని వుండింది. అప్పట్లో “ఇది కొంచం ఎక్కువ కాదూ?” అని ఎవ్వరూ వ్యాఖ్యానించలేదు.
మ్యూజియంలో నాటి మధుర జ్ఞాపకాల విక్రయశాల
పరిశ్రమల్లో వాడే యంత్రాలకు అవసరమయ్యే పని ముట్లనూ, ఇతర పరికరాలనూ మనమే తయారు చేసుకోవాలనె వుద్దేశ్యం తో 1953 లో స్వదేశీ ముద్ర తో HMT సంస్థ మొదలయింది.  మనం సూక్ష్మ భాగాల తయారీ లో కూడా నిష్ణాతులమే అని రుజువు పర్చడానికి  దేశానికి స్వంతంగా గడియారాలు తయారు చేసుకునే ఓ సంస్థ కావాలనిపించింది. అప్పటికే తన సామర్థ్యాన్ని నిరూపించు కున్న సంస్థ HMT కి ఈ కార్య భారాన్ని అప్పగించింది భారత ప్రభుత్వం. దీని పర్యవసానంగా 1961 లో జపాను సిటిజన్ వాచ్ కంపెనీ కొలాబరేషన్ లో  బెంగుళూరు లో    HMT వాచెస్ వుద్భవించింది. ఇదే భారత దేశపు మొట్టమొదటి స్వదేశీ గడియారాల సంస్థ .
A humble beginning at Machine Tool Factory 1, Jalahalli Bengaluru 1953 (source HMT)
కీ ఇచ్చే చేతి గడియారాల మొదటి బాచ్ గడియారాలను అప్పటి ప్రధాన మంత్రి శ్రీ జవహర్ లాల్ నెహ్రూ విడుదల చేశారు. ఈ గడియారాల ప్రాచుర్యం రాను రాను పెరగసాగింది. మొదటి ఫాక్టరీ కి తోడుగా 1972 లో జపాను సాంకేతికత సహాయం తో వాచ్ ఫాక్టరీ – 2  ను బెంగుళూరు లోనే మొదలెట్టారు. ఇది ఆటొమాటిక్ డే అండ్ డేట్ వాచీల తయారి విభాగం. ఇదే సంవత్సరం లో హెచ్ ఎం టీ ఇంజినీర్ల తోనే శ్రీనగర్ లో  వాచ్ ఫాక్టరీ – 3 ని స్థాపించారు. 1975 లో వాచీ లో ని ముఖ్య భాగాలయిన మెయిన్ స్ప్రింగు, హెయిర్ స్ప్రింగు షాక్ అబ్సార్బర్ భాగాలను తయారు చేసే విధంగా బెంగుళూరు ఫాక్టరీని అప్ గ్రేడ్ చేసారు. దీనితో హెచ్ ఎం టీ అవసరమైన  భాగాలతో సహా యాంత్రిక వాచీలను 100% స్వంతంగా తయారు  చేసుకునే సంస్థగా ఎదిగింది. అంటే Made in India కు హెచ్ ఎంటి  ఎపుడో బాట వేసింది.
Braille watches first from HMT(credits: HMT Museum)
ఆ తరువాత 1978 లో టుంకూరు, 1985 లో రాణిబాగ్ లో తయారీ విభాగాలను స్థాపించారు. ఇవి దాదాపు 20 లక్షల విడిభాగాలను తయారు చేసే దిశలో సాగాయి. ఈ విడిభాగాలను జత చేసేందుకు దేశం మొత్తం మీద పలు అసెంబ్లీ యూనిట్లను నెలకొల్పారు.  1983 లో ఒక ప్రత్యేక మైన వాచ్ కేసు ను తయారు చేసే నిమిత్తం బెంగుళూరు లోనే మరో విభాగాన్ని నెలకొల్పారు.
భారత దేశం లోకి  క్వార్త్జ్ గడియారాల్ని కూడా ఈ సంస్థే మొదట ప్రవేశ పేట్టినా, దీని తో పాటు కొత్త డిజైన్లు, నూతన సాంకేతిక నిపుణత తో 1980 మార్కేట్లో కి ప్రవేశించిన ఇతర సంస్థల వేగాన్ని ఇది అందుకోలేక పోయింది. దీనికి కారణం మానేజిమెంటు త్వరిత మైన నిర్ణయాలు తీసుకో లేక పోవడమే.
credits: HMT Musuem
ఇది భారత దేశం లో ని అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ (PSU) జరిగేదే. ఫలితంగా ఒడిదుడుకులు  తలెత్తాయి. వ్యాపార పరమైన ఇబ్బందులు మొదలయ్యాయి. 1999 లో ప్రభుత్వం ఈ సంస్థల్లో పునర్నిర్మాణాన్ని జరిపి సమస్యల్ని నివారించడానికి ఫలించని ప్రయత్నమొకటి చేసింది. దాదాపు  ఒక దశకమంతా ఇది నష్టాల్లోనే కూరుకు పోయింది.  ఒక అంచనా ప్రకారం 2012-2013 లో హెచ్. ఎం. టీ. సంస్థ 11 కోట్ల రాబడి తో 242 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది.
ప్రభుత్వ రంగ సంస్థల పునర్నిర్మాణ బోర్డు కి ఈ HMT వాచెస్ సమస్యను  ప్రస్తావించిన పుడు, యూపిఏ (UPA) ప్రభుత్వం దీని మీద ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. తరువాత వచ్చిన భాజపా (BJP) ప్రభుత్వం 2016 జనవరిలో ఈ కఠిన నిర్ణయాన్ని అమలు పరచడానికి ముందడుగు  వేసింది. దీనితో దేశంలో హెచ్ ఎంటి శకం ముగిసింది.
సెప్టెంబరు 2016 లో భారత ప్రభుత్వం, HMT అనుబంధ సంస్థలైన HMT వాచెస్, HMT బేరింగ్సు, HMT ట్రాక్టర్స్, HMT చినార్ వాచెస్ లను మూసివేసింది.  HMT వాచెస్ ఇప్పటికి వేల సంఖ్యలో తృప్తి పొందిన కస్టమర్లున్న సంస్థగా ప్రఖ్యాతి చెందింది
ఈ సంస్థల్ని మూసివేయడానికి నిర్ణయించినప్పుడు HMT పూర్వ సంపదని (Heritage) ప్రజలకు తెలియజేసే ప్రక్రియలో HMT Heritage centre and Museum  ఏర్పాటు చేశారు.  ఈ మ్యూజియం లో మూసివేసిన అనుబంధ సంస్థల పుట్టు పూర్వోత్తరాలనీ, అవి  పుట్టినప్పిటినుండి మూత బడేంతవరకు సాగించిన ప్రయాణాన్నీ,  రిస్టు వాచీలు, యంత్ర పరికరాల పనిముట్లూ, విద్యుత్ బల్బులూ, ట్రాక్టర్లూ మొదలైన వాటి నిర్మాణం లో HMT వుపయోగించిన సాంకేతికతనూ ప్రజలు  దర్శించుకోవచ్చు.  ఈ మ్యూజియం HMT  కాలనీ లో పచ్చని చెట్ల మధ్యలో HMT  పూర్వ చైర్మన్ నివాస గృహం లో స్థాపించ బడింది.
రెండంతస్తుల భవనం లో వున్న ఈ మ్యూజియం లో  గ్రౌండు ఫ్లోర్ లో HMT వాచీల కు సంబంధించిన వివరాలుంటే, మొదటి అంతస్తులో  యంత్ర పరికరాలకు  సంబంధించిన వివరాలున్నాయి.    ఈ మ్యూజియం లో కంపెనీ సాధించిన పురోభివ్రుధ్ధిని ఒక కాల ధార వెంబడి సూచించడం జరిగింది. భారత దేశపు పటంలో HMT స్థాపించిన మొత్తం కంపెనీల వివరాలూ, అవి సాధించిన మైలు రాళ్లు పొందు పరిచి వున్నాయి.  ఈ మ్యూజియం లో చెప్పుకొ దగ్గ ప్రదర్శితం (Exhibit) “గడియారం లోని భాగాలు” దీనిలో గడియారంలో వుపయోగించే    అతి చిన్న భాగాల వివరాలు, రక రకా ల డయళ్లూ (Dial) ప్రదర్శనకు వుంచారు.
మొదటి అంతస్తులో HMT  సంస్థ స్థాపించ బడిన దగ్గర నుండీ, తయారు చేసిన యంత్ర పరికరాల వివరాలున్నాయి. ఒక ప్రపంచ పటం లో HMT  ఏ ఏ దేశాలతో కొలాబరేషన్ లో వుందో చూపబడ్డాయి. ఇక్కడే ఒక  AV రూము లో HMT చరిత్ర,,  నైపుణ్యాభివృధ్ధి, (Skill Development),  శిక్షణ (Training) మొదలైన వివరాల్తో ఒక  20 నిముశాల వీడియో లూప్ లో నడుస్తూ వుంటుంది. చివరి సెక్షను లో HMT  ట్రాక్టర్ భాగాలు, అది పని చేసే విధానం వివరించ బడ్డాయి. ఈ సెంటరులో ట్రాక్టర్ రైడు కూడా ఉపలబ్ధం.
మనం నిజంగానే ఈ సంస్థ బరువుని భరించ లేక పోయామా? లేక ఈ జంఝాటం ఎందుకూ? అనుకున్నామా? ఈ జంఝాటం నుంచి బయట పడ్డాం సరే, స్వదేశీ వస్తు ప్రపంచం లో మహోన్నతంగా వెలిగిన అలనాటి HMT వాచీ కి వారసత్వాన్ని పోగొట్టుకున్న తరువాత “మేక్ ఇన్ ఇండియా”, “మేడ్ ఇన్ ఇండియా” అని మళ్ళీ కొత్త నినాదాల్తో జండాలెగరేస్తున్నాం. పరాయి హృదయాల్తో స్వదేశీ ప్రేమ ను పుట్టించే ప్రయత్నం చేస్తున్నాం. విదేశీకంపెనీలకు అన్ని రాయితీలు ఇచ్చి రప్పించుకునేందుు సిద్ధపడుతున్న మనం మన కంపెనీలను ఎందుకు అప్ గ్రేడ్ చేసుకోలేక పోయాం. ఇక్కడ వైఫల్యాన్ని అంగీకరించక తప్పదు.
Ahmed Sheriff
(Ahmed Sheriff, PMP, CMQ/OE, ACS, FLMI, PSM
Consultant, PMP Certification, Project Management, Quality
Mob: +91 9849310610)