మాటే మంత్రం, అదే కమ్యూనికేషన్ సారం

(CS Saleem Basha)
“మాట”ఎంతో శక్తివంతమైనది. మనుషుల మధ్య అదే ఒక వారధి! మాట(లు)అన్నది భావవ్యక్తీకరణలో(కమ్యూనికేషన్) చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంటే వెర్బల్ కమ్యూనికేషన్ లో అన్నమాట. అదే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అయితే, నవ్వు, శరీర భాష (బాడీ లాంగ్వేజ్) ముఖ్యమైనవి.
నాకు మిత్రుడు డాక్టర్ వడ్డెర పోతన (పూర్వం కర్నూలు ఆకాశవాణిలో పనిచేశారు.)  “మాట” గురించి చాలా చక్కగా, అర్థవంతంగా రాసిన ఒక చిన్న కవిత లో చెప్పారు.
“మాట మాటకు ఒక అర్థం ఉన్నది
మాటల్లోనే మనిషి బతుకు చిత్రం ఉన్నది
సూటిపోటి మాట దాన్ని కాటు ఎంత ఘాటు
సూది లాంటి మాట, దాని చూపు ఎంతో చేటు
మాట మలినమైతే దాని గుండె నల్లగుండు
మాట తెల్లగుంటే, దాని మనసు వెన్నెల సొగసు
నక్కజిత్తుల మాట దాని చేత కుట్రల మూట
పగలు రగిలే మాట దాని మీసం కత్తుల కోట
మాట కక్ష కడితే దాని నడక పాముపడగ
మాట మధురమైతే దాని గుణం మీగడ తరగ
మాట మౌనం అయితే దాని ఎత్తు ఆకాశమంత
మాట గుంభనమైతే దాని లోతు పాతాళ మంత
మాట మూగబోతే దాని బాధ చెప్పతరమా
మాట కమ్మగుంటే దాని గానం మోహనరాగం
మాట మనిషి నేస్తం మాట మనిషి నైజం
మాట మనిషి భుక్తి ఆమాటే సర్వశక్తి
మాట మంచిగుంటే మనిషి తోడుగుంటాడు
కాని మాట అయితే ఆ మనిషే దూరమవుతాడు”
ఈ కవితలో ఎంతో అర్థం ఉంది. కమ్యూనికేషన్ ఎలా ఉండాలన్నది, ఈ కవిత చాలా సింపుల్ గా చెప్పింది.
ఈమధ్య “ కమ్యూనికేషన్ స్కిల్స్” అన్నమాట తరచు వినబడుతోంది. దీన్నే తెలుగులో భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అంటారు. ఇంట్లో, ఉద్యోగంలో, సమాజంలో ఈ నైపుణ్యాలు ఉన్నవారు బాగా రాణించే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ కొంతమేరకు ఈ నైపుణ్యాలు కలిగి ఉండడం ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం.
భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు ( కమ్యూనికేషన్ స్కిల్స్) “మాట”( మాటల) మీద ఆధారపడతాయి. ఇంకా కొంచం లోతుగా వెళ్లే ముందు, ఒక చిన్న విషయం ప్రస్తావిస్తాను. SWORD( కత్తి) మరియు WORDS( మాటలు) ల ను జాగ్రత్తగా వాడాలి. రెండూ కోసుకుంటాయి. కత్తితో చేసిన గాయం మానిపోతుందే మోగానీ, మాట చేసిన గాయం మానదు. అందుకే కమ్యూనికేషన్ లో మాటకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అంటే దాని ఉద్దేశం, మంచి మాట అని!
మనం సాధారణంగా వినే డైలాగులు కొన్ని చూస్తే, మాటకు ఉన్న ప్రాధాన్యత అర్థం అవుతుంది.
ఎంత “మాట” అన్నావు. అంటే ఆ మాట సరైంది కాదనో, తప్పనో అర్థం వస్తుంది.
ఎప్పుడూ నేను ఎవరితో ఒక్క “మాట” కూడా పడలేదు తెలుసా?
ఓ “మాట” అనుకుందాం. అని వ్యాపారం లో నో, పెళ్లి సంబంధాలు లోనూ అనుకుంటే ఒక ఒప్పందం అని అర్థం.
ఈ “మాట” నువ్వు చెప్పకూడదు. వేరే వాళ్ళు ఎవరైనా చెప్పవచ్చు. ఇది ఫ్రెండ్స్ మధ్యలో, ప్రేమికుల మధ్య లో, వయసు అంతరం ఉన్న వాళ్ళ మధ్యలో వాడతారు.
ఎంత “మాట” అన్నాడో తెలుసా? అంటే అనకూడని మాట అన్నాడని.
నువ్వు నాకు మాట ఇచ్చావు తెలుసా? అంటే వాగ్దానం.
నీ “మాట” జవదాటను, అంటే ఆదేశం పాటిస్తాను.
“మాటలు” జాగ్రత్తగా రానీ, అంటే అనవసరమైన వన్నీ మాట్లాడుతున్నారని.
పెద్దల “మాట” చద్ది మూట, అంటే మంచి సలహా అని.
నీ “మాటల్లో” ఏదో తేడా కనిపిస్తుంది, అంటే ఇంతకు ముందు ఎప్పుడూ అలా మాట్లడలేదని అర్థం. మాటకు మాట జవాబు ఇస్తున్నావు ఎందుకు? ఎదురు తిరుగుతున్నావని అర్థం.
ఇక్కడ మాట అంటే సంభాషణ అని కూడా అర్థం చేసుకోవాలి. కొన్ని మాటల సమాహారమే సంభాషణ కదా? బాగా మాట్లాడడం అంటే ఏమిటి? బాగా కమ్యూనికేట్ చేయటం , లేదా భావాలను వ్యక్తం చేయటం అని అర్థం. స్థూలంగా చెప్పాలంటే కమ్యూనికేషన్ స్కిల్ లేదా భావవ్యక్తీకరణ నైపుణ్యం అని అర్థం.
చాలామంది మాట్లాడేటప్పుడు, అనవసరమైన మాటలు మాట్లాడిన తర్వాత అవసరమైన అసలు మాట చెప్తారు. అలా కాకుండా మాటలు ఎప్పుడూ సూటిగా, క్లుప్తంగా, చక్కగా,స్నేహపూరితంగా, మర్యాదగా ఉండాలి. అంటే KISS లాగా ఉండాలి అని అంటారు. KISS అంటే Keep It Short and Sweet అన్నమాట! అదే మంచి కమ్యూనికేషన్ కి నిదర్శనం.
మాట్లాడడం నచ్చకపోతే చాలామంది, ఏం “కూశావు”, “ఏం కూస్తున్నావు ” అంటారు. అది కొంచెం మొరటు మాట.
సినిమాల్లో మాటలకు కూడా కమ్యూనికేషన్ స్కిల్ వర్తిస్తుంది. ఎందుకంటే సినిమా కూడా మాట్లాడుతుంది కదా? అందుకే చాలా సినిమాలు కేవలం డైలాగులు వల్ల కూడా బాగా ఆడతాయి. అంటే దాని అర్థం చెప్పవలసిన విషయం బాగా చెప్పడం వల్లనే కదా?
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ” మాటల మాంత్రికుడు” అని పేరు ఉంది. తెలుగు సినిమాల్లో “one Liners” ఎక్కువగా వాడే దర్శకుడు. కొన్నిసార్లు సుత్తి లేకుండా, సూటిగా, క్లుప్తంగా మాటలు రాస్తాడు. దాంతో చాలా సన్నివేశాలు పండుతాయి. అతడి మాటల కోసమే చాలామంది అతడి సినిమాలు చూస్తారు. అన్నది అతిశయోక్తి కాదు. “
” నిజం చెప్పేటప్పుడు మాత్రమే భయమేస్తుంది. చెప్పకపోతే ఎప్పుడూ భయమేస్తుంది”. అన్నది ” అల వైకుంఠపురం లో” సినిమాలోనిది. తమాషా ఏంటంటే ఈ సినిమాలో త్రివిక్రమ్ మార్కు క్లుప్తమైన, సూటిగా ఉండే మాటలు తక్కువగా ఉన్నాయని చాలామంది ప్రేక్షకులు అసంతృప్తికి లోనయ్యారు!!
“అద్భుతాలు జరిగేటప్పుడు ఎవరు గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు”
” నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్దాన్ని నిజం చేయాలనుకోవడం మోసం”
“వాచి ఉన్న ప్రతి వాడు టైం వస్తుంది అనుకుంటాడు,, కానీ టైం తెలుస్తుంది, అంతే”
చివరగా ఒక విషయం. మాటలన్నవి verbal కమ్యూనికేషన్ చెందినవి. రాయటం కూడా అంతే.
అయితే మాటలకు ఎంత విలువ ఉందో, non-verbal కమ్యూనికేషన్ అంటే హావభావాలు, సైగలు, సంకేతాలు, నవ్వుకి (Body Language అంటారు) కూడా అంతే. వర్బల్, నాన్ వెర్బల్ రెండు కలిస్తేనే చక్కటి భావ వ్యక్తీకరణ సాధ్యమవుతుంది.
నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ గురించి మరోసారి చూద్దాం.

 

Saleem Basha CS

(సిఎస్ సలీమ్ బాషా వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ఇతని ప్రవృత్తి – 9393737937)