‘ప్రొఫెసర్ ఐలయ్య వాదనల్లో హేతుబద్ధత, నిలకడ లేవు’

కంచ ఐలయ్యకు తన సొంత సిద్ధాంతాలు ఉండవచ్చు కాని తాత్వికతలో అబద్దాలు,వక్రీకరణలు సరికాదు.

(ఎ సూర్య ప్రకాష్)
18/8 న కంచ ఐలయ్య రాసిన వ్యాసం చూశాక ఇది రాస్తున్నాను. నేను రచయితను కాను. నాయకుడనూ, రాజకీయ కార్యకర్తను కూడా కాదు. 60 సంవత్సరాల వయసు దాటిన వాణ్ని. ఈ దేశంలో ప్రజలకు మంచి జీవితం దొరకాలనీ, సమాజంలో ప్రజాస్వామ్యయుత వాతావరణం ఉండాలనీ కోరేవాణ్ని. ఇందుకోసం సాగే కార్యకలాపాల్లో నాకు వీలైన మేరకు పాల్గొంటుంటాను. సమాజ పురోగమనానికి దారితీసిన విప్లవోద్యమాలను, నాయకత్వం వహించిన వాళ్ల చరిత్రలను చదవడమే కాక, వారి పట్ల గౌరవం కలిగి ఉండేవాడిని.
ఉ. సా. మరణం తర్వాత కౌంటర్ కరెంట్స్ తో సహా ప్రచురితమైన కొన్ని వ్యాసాలు నన్ను బాధించాయి. సమాజంలో విభిన్న సిద్ధాంతాలు ఉండడంవల్ల ఎవరికి నచ్చిన దాన్ని వాళ్లు అనుసరించవచ్చు. “బ్రాహ్మణులు విప్లవం తేగలరా లేదా” అన్న చర్చలోకి గానీ ఏది సరైన పంథా అన్న చర్చలోకి గానీ నేను వెళ్లడం లేదు. సమాజంలో బ్రాహ్మణ ఆధిపత్యం లేదని కూడా నేను చెప్పబోవడం లేదు. ఐలయ్య రాసిన రెండు వ్యాసాల్లో ఒక పంథాకి సంబంధించిన నాయకున్ని కించపరచడం పై మాత్రమే నేను కొన్ని విషయాలు రాస్తాను.
” TN (తరిమెల నాగిరెడ్డి) అనే పట్టకం( Prism) నుండి విషయాలను అంచనా వేస్తున్నట్లు ఐలయ్య రాశాడు.
ఐలయ్య ఎంత బాధ్యాతారహితంగా వాస్తవాలను చూశాడో, ఆ ప్రాతిపదిక పై తన సిద్ధాంతాలను వండి వార్చాడో నేనొక ఉదాహరణ ఇవ్వడం ద్వారా మొదలు పెడుతున్నాను. ఆయన ఇలా రాశాడు.
“బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘ అధ్యక్షునిగా పనిచేసిన నాగిరెడ్డి బ్రిటిష్ అధికారులను గడగడలాడించాడు . జాతీయోద్యమ నాయకులతో పాటు కమ్యూనిస్టు బ్రాహ్మణులైన పి.సి.జోషి , డాంగే, రణదివే తదితర నాయకులంతా మహమ్మద్ బిన్ తుగ్లక్ ను వెర్రి /పిచ్చివాణ్ణి గా కొట్టిపడవేస్తున్నపుడు అతని ఆర్థిక విధానాల గురించి తన ఎం. ఏ. కోర్సు కోసం బ్రహ్మాండమైన జీవన చిత్రం (monograph) రాశాడు. నాగిరెడ్డి అనుచరులుగా చెప్పుకోబడే వాళ్ళెవ్వరూ ఇప్పటి వరకు దాన్ని ప్రచురించలేదు.”
తుగ్లక్ పై తరిమెల నాగిరెడ్డి  రాసింది తన ఎమ్ ఎ పరీక్షల కోసం కాదు. మద్రాసు లయోలా కళాశాలలో ఇంటర్ చదివే రోజుల్లో రాశాడు.
ఈ విషయం ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పగా అది పలుమార్లు పత్రికల్లో, బుక్ లెట్లుగా తెలుగులోనే కాక ఇంగ్లీషులో కూడా ప్రచురితమైంది.
ఐలయ్య అంతగా పొగిడేది దాన్ని గురించే.
ఇంత స్పష్టంగా ఉన్న యదార్థాన్ని ఐలయ్య ఎలా తప్పించి విషయాన్ని వక్రీకరించగలిగాడు? తను రాబట్టదలచుకున్న సిద్ధాంతానికి దీన్ని సమర్థనగా వాడుకున్నాడు.

 

Prof Kancha Ilaiah Shepherd
“బ్రాహ్మణీయ ఆర్థికవేత్తలు తుగ్లక్ పిచ్చివాడన్న అభిప్రాయాన్ని మార్చుకోరు” అనీ ఇంకా ” ఆ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ అయిన బ్రాహ్మణ ఛాందస వేదాంతి అంటూ సర్వేపల్లి రాధాకృష్ణన్ ను కూడా ఇందులోకి లాగాడు. కమ్యూనిస్టులను, బ్రాహ్మణులను నిందించడమే కాక, ఆ పుస్తకాన్ని ప్రచురించనందుకు ఆయన అనుచరులకు దురుద్దేశాలు ఆపాదించే వరకు వెళ్ళాడు.
తను రాసిన పత్రాన్ని ప్రచురించుకోలేనంత బలహీన నాయకుడా నాగిరెడ్డి? ఆ పత్రం ప్రస్తుత పరిస్థితికి అన్వయించేదే అయితే ఆయన దాన్ని తప్పనిసరిగా ప్రచురించి ప్రచారంలో పెట్టే వాడే. చనిపోయేనాటికి వరకు ఆయన “జనశక్తి” పత్రికా సంపాదకుడేగాక, ప్రచురణకర్త కూడా. అయినా ఎందుకు ప్రచురించలేదు? నాకర్థమైనదేమంటే TN, DV లాంటి నాయకులకు తమ స్వంత ప్రచారాల పట్ల ఆసక్తి ఏమాత్రం ఉండేది కాదు. విప్లవ ఉద్యమ అవసరాలకు ప్రాధాన్యం ఇచ్చి వ్యవహరించే వాళ్ళు . DV చాలా అరుదుగా బహిరంగ సభల లో మాట్లాడే వాడు. TN ఆ పనిలో తలమునకలై ఉండి ప్రాచుర్యం కూడా పొందాడు.
M.A.కృష్ణ ఇదే పత్రికలో ” సంతాపాలు ఎలా రాయకూడదో ఐలయ్యదే ఒక తప్పుడు నమూనా” పేరుతో రాసిన వ్యాసంలో ఐలయ్య రాసిన అబద్ధాలను, వక్రీకరణలను పేర్కొన్నాడు.
ఉసా రాసిన ” కుల నిర్మూలన- మార్క్సిస్టు దృక్పథం ” అన్న పుస్తకాన్ని తను రాసినట్లు చెప్పుకునే అంత అనైతికతకు పాల్పడ్డాడని చెప్పాడు. ఈ వ్యాసానికి ఐలయ్య జవాబు రాయకపోగా, తన అభిప్రాయాలు చెప్పకపోగా మరోసారి బురద జల్లుతూ పక్కదారి పట్టించే ఎత్తుగడకు పునుకున్నాడు. తుగ్లక్ విషయం లాంటి అనేక అసత్య విషయాలు ఆయన ఇంగ్లీష్, తెలుగు వ్యాసాల్లో ఉన్నాయి.
దీన్ని ఒక పద్ధతిగా చేపట్టి బాధ్యతారహితంగా సూత్రీకరణలు చేస్తూ పోతే వాటికి విలువ ఎలా వస్తుంది?
ఐలయ్య చెప్పుకున్నట్లు TN అనే పట్టకం( ప్రిజం) నుండి కాదు – ఆయన చూసిందంతా కులం అనే పట్టకం నుండే.
అత్యున్నత శ్రేణి విప్లవ నాయకులైన దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డిల వ్యక్తిత్వ హననానికి ( character assasination ) ఐలయ్య పూనుకున్నాడు. కుల వివక్షత వారిద్దరి మధ్య ఉందంటూ లేనిపోని కృత్రిమ ఆధార రహిత వైరుధ్యాన్ని వెతికే నైచ్యానికి దిగజారడం ఆయన దురుద్దేశం నెరవేర్చుకోవడానికే. ప్రస్తుతం ఆయన ఎంచుకున్న కుల రాజకీయాలను బలపరచుకొనే ఉద్దేశంతోనే ఆ నాయకులిద్దరిలో ఎవరు సమర్థులు, లేదా శక్తివంతులన్న అనవసర చర్చను లేవనెత్తాడు. మన తెలుగు సమాజంలో గత కొన్ని దశాబ్దాలుగా కుల, వర్గ రాజకీయ చర్చ నడుస్తోంది. అయితే ఈ చర్చలోకి వీరిద్దరు నాయకుల పేర్లను లాగడం మాత్రం ఇదే తొలిసారి. ఎస్సీ, ఎస్టీ, బిసి నాయకులు ఎవరూ గతంలో ఇలాంటి ప్రయత్నం చేయలేదు. నాకు తెలిసినంత మేరకు ఐలయ్య కూడా ఇలాంటి చర్యలకు గతంలో తలపడలేదు .
అభ్యుదయకర స్వభావం గల తెలుగు ప్రజలు కామ్రేడ్స్ TN, DV లను విప్లవకర జంటగా భావించారు తప్ప వేరు చేసి చూడలేదు. వారిద్దరినీ భారత విప్లవ నిర్మాతలుగా చూశారు తప్ప వారిలో ప్రథములు ఎవరు, ద్వితీయు లెవరు అన్న తప్పుడు చర్చలోకి వెళ్ళలేదు. ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో వారిరువురి స్మారక సభలను ఒకే వేదికపై నుండి ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా తెలిసిన విప్లవ కవి జ్వాలాముఖి (1938-2008) మహాభారతంలోని కృష్ణార్జునులుగా వీరిని అభివర్ణించేవారు. సభలకు హాజరైన పదుల వేల మంది ఇలా పోల్చడాన్ని హర్షించేవారు.
ఏ సంస్థలో /పార్టీలోనైనా/ ఏ ఇద్దరు నాయకుల మధ్య నైనా కొన్ని రోజువారీ సమస్యలను ఎలా చూడాలి, ఎలా అన్వయించాలి అనే విషయాల్లో చిన్నపాటి భిన్నాభిప్రాయాలు రావడం సహజం. కమిటీలలో చర్చలు జరిగేది, ఒక్కోసారి మెజారిటీ, మైనార్టీ ఓటింగ్ లాంటి దాకా కూడా పోయేది అందుకే. కామ్రేడ్ DV, TN లు తమ సుదీర్ఘ సహచర్యంలో ఒకరినొకరు బలపరుచుకుంటూ, ఒకరినొకరు పూరించుకుంటూ కలిసి పనిచేయడం అందరికీ తెలిసిన విషయమే. వారిద్దరి మధ్య ఉండే సంబంధాల్లో చిన్నపాటి వివక్ష కూడా పొడచూపలేదు. కామ్రేడ్ TN తన మరణానికి కొద్ది రోజుల ముందు విప్లవకారులందరికీ DV రచించిన డాక్యుమెంట్లు చదవమని పిలుపునివ్వడం, వారిద్దరి మధ్య గల సుహృద్భవ సంబంధాలకు గొప్ప నిదర్శనం. ఈ విషయాలపై గతంలో బుక్ లెట్లు వచ్చాయి.
DV అప్పటి CPI కేంద్రకమిటీలోకి ఆయనకు తగిన అర్హత లేనప్పటికీ బ్రాహ్మణుడైన కారణంగానే ఎదిగించబడ్డాడని ఐలయ్య బరితెగించి రాస్తున్నాడు. కానీ నాగిరెడ్డి ఒకసారి లోక్‌ సభకు, మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నిక కావడమే గాక ఎప్పుడూ గౌరవనీయ స్థానంలోనే ఉన్నాడు. పార్లమెంటరీ పంథా తొలిదశలోనే 1952లో చిన్న వయసులోనే శాసనసభాపక్ష నాయకుడయ్యాడు. 1968లో విప్లవ పంథా కు పార్టీ తిరిగి వచ్చాక ఆయన ప్రముఖ స్థానంలో ఉన్నాడు. APCCCR కి కన్వీనర్ అయ్యాడు. UCCRI (M-L) సహ వ్యవస్థాపకుడిగా ఎప్పుడూ కేంద్ర కమిటీలో ఉన్నాడు.
UCCRI (M-L) సంస్థాపక మహాసభలో DV కార్యదర్శిగా ఎన్నికైనప్పటికీ, కమ్యూనిస్టులు విప్లవకారులు వేరు వేరు గ్రూపులుగా విడిపోయి ఉన్న నాటి దశలో ఆంధ్రలోని కమ్యూనిస్టు విప్లవకారులను ‘TN .పార్టీ’ గానే దేశమంతా గుర్తించే వాళ్ళు. నాయకులు తమను ఆంధ్రకమ్యూనిస్టు విప్లవకారులు గానే గుర్తించాలని కోరుకునేవారు. ఆయన మరణించిన ఐదు,ఆరు సంవత్సరాల తర్వాత UCCRI (M-L) లోని చీలిక గ్రూపు ఆయన పేరు పెట్టుకుని లబ్ది పొంద జూసింది. అయితే కొద్ది కాలానికే UCCRI (M-L) పేరును వదిలేసింది. విప్లవ శ్రేణుల్లో TN పేరు ప్రఖ్యాతులకు ఇదొక నిదర్శనం.
శూద్రుడైన కారణంగా ఆయన వివక్ష ఎదుర్కొన్నట్లు ఇప్పటికీ ఎవరూ భావించడంలేదు. నిజానికి 1947 తర్వాత ఆంధ్రరాజకీయాలలో ‘శూద్ర’ అనే పదాజాలాన్ని వ్యక్తులు గానీ, పత్రికలు గాని ఎవరూ వాడలేదు( ఐలయ్య తప్ప). అగ్రవర్ణాలగానో SC, ST, BC లు గానో పిలుస్తూవచ్చారు. రెడ్డి, కమ్మ, వెలమలు గా పిలవబడ్డారు. ఈ కులాలన్ని ఆధిపత్య అగ్ర కులాలుగానే వాటి సమర్ధకుల చేత, వ్యతిరేకుల చేత కూడా పిలవబడ్డాయి తప్ప శూద్ర అనే పద ప్రయోగమే జరగలేదు.
విప్లవకారుడుగా కామ్రేడ్ D V 17 సం|| ల అజ్ఞాత జీవితాన్ని,5 సం. ల జైలు జీవితాన్ని గడిపాడు. T N . పలు సందర్భాలలో 10 సం. ల జైలు, 5 సం||లు అజ్ఞాత జీవితం గడిపాడు. ప్రతి సంవత్సరం పత్రికా వ్యాసాల్లో తేదీలతో సహా ఈ వివరాలు చూస్తాం. ఇద్దరూ అజ్ఞాత జీవితం గడుపుతూనే చనిపోయారు. నిరంకుశ రాజ్యం కళ్ళు గప్పి అజ్ఞాతంలో వుంటూ భారత విప్లవోద్యమానికి వారిరువురు కృషి చేశారు,మార్గదర్శకత్వం వహించారు.
పాలకవర్గాలు వీరిని అరెస్టు చేయడంలో, వేధించడంలో, కుట్ర కేసులు పెట్టడంలో వీరి మధ్య బ్రాహ్మణ, శూద్ర తేడాలు చూడలేదు. తెలంగాణా సాయుధ పోరాట కాలంలోను, ఆ తర్వాత కూడ అన్ని కులాల వారు చంపబడ్డారని ఎన్ కౌంటర్ల జాబితాను చూస్తే తెలుస్తుంది. భారత రక్షణ నిబంధనలను వర్తింపజేసి, వీరిరువురూ తమకు ముప్పు కలిగించే వారిగానే భావించబడ్డారు. రాజ్యం ఎలాంటి తేడా చూపకపోయినా ఒక ఆచార్యుడు ఇప్పుడు వారిని కులాలను బట్టి విడగొట్టి చూస్తునాడు.
జన్మ రీత్యా చాంధసపు బ్రాహ్మణత్వంలో పుట్టినప్పటికీ ఆయన కమ్యూనిస్టు జీవితాన్ని విలాసవంతమైన, సౌఖ్యమైన, బ్రాహ్మణ కుటుంబంలో గడపలేదు. పేద గ్రామీణుల మధ్య, అడవుల్లో దళితులు, ఆదివాసీలు, లంబాడాల మధ్య వారు ఏమి పెడితే అది తింటూనే పాలకుల నిర్భందాల మధ్య ఆయన జీవితం గడిచింది. తను వండి పెట్టిన, లేదా ఊర్లో సేకరించుకు వచ్చిన అన్నాన్ని తిని DV తన ఇంట 15 రోజులు ఉన్నాడని కామ్రేడ్ ఐలమ్మ ( ఇపుడామెను చాకలి లేదా దోభీ ఐలమ్మగా ఎత్తి పడుతున్నారు) ఒక సందర్భంలో వివరంగా చెప్పింది. 1980ల ఆరంభంలో కొన్ని దశాబ్దాల తర్వాత కామ్రేడ్ D V ఐలమ్మను కలిసి ఫోటోలు తీసుకుని ‘ వడిశెల’అన్న తెలుగు సాహిత్య పత్రికలో ప్రచురించారు. ఆ పత్రిక ఆవిష్కరణ సభలో ఆయన పాల్గొన్నారు. ఆ సందర్భంలో ఈ రచయిత (సూర్యప్రకాష్) కూడా D V వెంట ఉండడం తటస్థించింది. తెలంగాణ చరిత్రలో తొలిసారిగా ఆమె ఫోటోలను ప్రచురింప చేసింది D V రావే.
గ్రామీణ ఉత్పత్తి సంబంధాలు బ్రహ్మణుడైన DV కి తెలియవని ఐలయ్య రాస్తున్నాడు. ఇందుకు మనం ఆయన పైన జాలి పడాల్సిందే. వాస్తవాలు ఇందుకు పూర్తి భిన్నంగా వున్నాయి. ఆయన అత్యధిక సమయాన్ని పోరాట కాలంలో గ్రామీణ ప్రజల మధ్య తిరుగుతూ, వారిని భూస్వామ్య దోపిడి దౌర్జాన్యాలకు వ్యతిరేకంగా కూడగడుతూ గడిపాడు. భూములు సాధించుకోవాలన్న ప్రజల కోరికను గుర్తించడమే గాక, దాన్ని ప్రధమ డిమాండ్ గా ముందుకు తెచ్చాడని – పోరాట శత్రువులు కూడా గుర్తించారు. పోలీసు రికార్డులు కూడా ఇందుకు సాక్ష్యంగా వున్నాయి.
తెలంగాణా గ్రామీణ ప్రత్యక్ష అనుభవాల ఆధారంగానే ఆయన దేశంలోని ఫ్యూడల్ వ్యవస్థను అంతం చేసే తెలంగాణ సాయుధ పోరాట పంథాను రూపొందించగలిగాడు. పుస్తక పరిజ్ఞానంతోనే గాక కార్యాచరణ అనుభవాలతోనే ఇది జరిగింది. ఇతరుల కన్నా ముందుగానే చైనా వ్యవసాయ విప్లవం అనుభవాలను, రష్యా ఆకస్మిక తిరుగుబాటును క్షుణ్ణంగా అర్థం చేసుకుని సృజనాత్మకంగా భారతదేశ నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించాడు.
1949 లో ఆయన రాసిన పుస్తకం మళ్ళీ 40 సంవత్సరాల క్రితం పునర్ముద్రణ పొందింది. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన ఎంత ప్రముఖ పాత్ర నిర్వహించాడో వర్ణించడానికి నాకు పదాలు దొరకడం లేదు.
గ్రామీణ వ్యవస్థ రూపురేఖలు సమూలంగా మార్చే భూమి సమస్య పై పనిచేస్తున్న సందర్భంలోనే ఆయనపై తొలి పోలీస్ కేసు నమోదయిన సంగతి గుర్తు చేస్తున్నాను. భారత విప్లవానికి భూమి సమస్య ఇరుసు లాంటిదాని గుర్తించడంలోను మన సమాజంలోని అన్ని వర్గాలను విశ్లేషించి, అసమాన, అర్ధ బానిస గ్రామీణ సంబంధాలను రద్దు చేసేందుకు- విభిన్న వర్గాల ప్రజల మధ్య సాగించాల్సిన కృషిని గుర్తించడం ద్వారానే ఆయన విశిష్టమైన నాయకుడయ్యాడు.
బ్రాహ్మణ పుట్టుక ద్వారా గాక తన కృషి ద్వారానే ఒక ఆదర్శవంతమైన స్థానం పొందాడు.
కుల పట్టకంలో చూసేవాళ్ళు కమ్యూనిస్టు పార్టీతో సహా అన్ని పార్టీలను నడుపుతున్నది అగ్రకులాలేనంటారు.
1980-90 ల ప్రాంతంలో ఈ ధోరణి ఆంధ్రప్రదేశ్ లో మొదలయింది. వారు సి పి ఐ నాయకులైన చండ్ర రాజేశ్వరరావు లోని కమ్మ కులాన్ని, సిపిఎం సుందరయ్య లోని రెడ్డి కులాన్ని , పీపుల్స్ వార్ కొండపల్లి సీతారామయ్య, CPI (ML) చండ్ర పుల్లారెడ్డి లోని రెడ్డి కులాలను ఎత్తి చూపారు.
అలాగే ఇతర గ్రూపులను, పార్టీలను కూడా చూశారు. వీటిని అగ్రకులాలుగా చెప్పారు తప్ప శూద్రులుగా కాదు. దళితులు, బి.సి.లు జెండాలు మోసి అగ్రకుల నాయకుల కోసం చనిపోతున్నట్లు ఆరోపించారు. ఇప్పుడు ఐలయ్య దానికి భిన్నంగా వ్యాఖ్యానిస్తున్నాడు. దక్షిణ ఇండియాలో ఆధిపత్యం లేని బ్రాహ్మణ కులం చేతుల్లో ఈ పై చెప్పిన శూద్ర నాయకులు వివక్షను ఎదుర్కొన్నట్లు ఈయన చిత్రించ జూస్తున్నాడు.
ఐలయ్య ప్రతి విషయాన్ని కులానికి కుదిస్తున్నాడు. సిద్ధాంతాలు, కార్యాచరణ ల ప్రాతిపదికన కాకుండా ఉద్యమాలను, రాజకీయ కార్యాచరణను కుల చట్రంలో చూసి తీర్పు చెప్పడాన్ని నేను అర్థం చేసుకోలేక పోతున్నాను.
దేశంలో అనేక చోట్ల తిరోగామి, ప్రతీకాత్మక పార్టీలను బిసి,ఎస్సీ ,ఎస్టీలు ( జార్జండ్ ) నడపడం చూస్తున్నాం. మతపరమైన, కులపరమైన రాజకీయాలను ప్రస్తుతం బిసి గా చెప్పుకునే ఆయనే నడుపుతున్నాడు. ఈ పార్టీలు ముస్లిం, సిక్కు వంటి మైనార్టీ మతాల వాళ్లను,దళితుల్ని అధ్యక్షులుగా కూడా పెట్టుకున్నాయి. అనేక రాష్ట్రాల్లో బిసిలు, ఎస్సీలు ఇతర శూద్రులు పాలించడం బహుశా ఐలయ్యకు సంతోషం కలిగిస్తుండి ఉండవచ్చు.
అనేక మంది ప్రస్తుత భారతాన్ని ఫాసిస్ట్ గానో, హిందుత్వ ఇండియా గానో పరిగణిస్తున్నారు. కుల ప్రాతిపదికన చూసే ఐలయ్యకు ఈ కోణం కనపడదా? కులాల పరిభాషలో ఇలాంటి ప్రశ్నలు ఆయనకు వేయాల్సి రావడం నాకు బాధగా వుంది. కంచ ఐలయ్య షెపర్డ్ తన నిర్ధారణలను ఈ స్థాయిలో చేస్తున్నాడు.
కేజీ సత్యమూర్తి దళితుడైనందువల్ల తగిన ప్రాముఖ్యం పొందలేదని చెప్పడం కూడా తప్పు. మరోవైపు ఆయన పేరు చివర మూర్తి ఉండడం వల్ల ఆయన తన పార్టీ నుండి బయటకు వచ్చేవరకు బ్రాహ్మణుడనే భావించినట్లు కూడా చెబుతున్నాడు.
కె.ఎస్. అరెస్టు అయ్యాక కె.జి.ఎస్. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యాడు. ఇక కుల వివక్ష ప్రశ్న ఎలా ఉత్పన్నమవుతుంది. బ్రాహ్మణేతర కులాలలో కూడా మూర్తి అన్న పేర్లు అనేక కులాల్లో ఉండడం ఈయన గుర్తించలేడా?
ఒక సాధారణ పౌరుడిగా కవిగా శివసాగర్ ( K G S) కి,కళాకారుడిగా గద్దర్ కు అత్యధిక ప్రాచుర్యం వుందనుకంటాను. ఇటీవలే చనిపోయిన వంగపండు, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, తదితరులు బ్రాహ్మణేతరులైనా మీడియాలో చాలా ప్రచారం పొందారు.
ఆంక్షల మధ్య కూడా ఎలక్ట్రానిక్ మీడియాతో సహా, మీడియా వీరి గురించిన వందలాది కథనాలను వెలుగులోకి తెచ్చింది. దీనికి కారణం వారు భూస్వామ్య వ్యతిరేక ప్రజాపోరాటాలకు మద్దతు దారులుగా ప్రజల్లో గుర్తింపు పొందడమే. ఉద్యమాలు లేకుండా వీరికి ఆలాంటి గుర్తింపు సాధ్యమా? వీరికి, శివసాగర్ తో సహా వరవరరావు కన్నా ఎక్కువే గుర్తింపు ఉంది.
వరవరరావుకి ప్రధానంగా వక్తగా గుర్తింపు వుంది. తెలుగు ప్రజలు వీరికున్న అభ్యుదయ తత్వాన్ని, కళానైపుణ్యాన్ని చూశారు తప్ప కులాన్ని గాదు. ఎవరైనా తమ సొంత నిర్ధారణలు చేసుకోవచ్చు గానీ వాస్తవాలను తారుమారు చేయడం తప్పు.
కమ్యూనిస్టు సంస్కృతమైన ఇంగ్లీష్ లో ప్రావీణ్యం ఉండడంవల్ల బ్రాహ్మణులు ఆధిపత్యం వహించి ఆంగ్లంలో వెనుకబడ్డ శూద్రుల పై ఆధిపత్యం చెలాయించారని కూడా ఈయన చెప్పాడు. వారు తమను తాము న్యూనతకు గురైన కారణంగా కమ్యూనిస్టు ఉద్యమ నేతృత్వంలో వెనుక స్థానాల్లో ఉన్నారన్నాడు. మరి దీన్నే అన్వయిస్తే DV కన్నా TN కే ఆంగ్ల ప్రావీణ్యం ఎక్కువ వుండి కూడా పై స్థానాల్లో కి వెళ్లనట్లు గదా! ఇది ఐలయ్య సూత్రానికి విరుద్ధం కాదా? ఆయన వాదనలో హేతుబద్ధత కాని నిలకడగానీ లేదు.
ఆ మాటకొస్తే ఉత్తరాది రాష్ట్రాల ముఖ్యమంత్రు లనేకమందికి ఆంగ్లం సరిగ్గా రాదు. ఆంగ్లంలో ప్రావీణ్యం ఉన్నంత మాత్రాన బ్రాహ్మణులు గానీ, కమ్యూనిస్టులు గానీ, ఇతరులు గానీ ఎన్నికలలో గెలవలేక పోతున్నారు కదా ?అధికార నియంతృత్వం (బ్యురొక్రసి) వుండే మన దేశంలో, అందునా ఉత్తరభారతంలో ఆంగ్లానికి కాక హిందీకే ప్రాధాన్యం ఉంది.
D V రావు సమర్థకులు తనపై దాడి చేస్తున్నారనీ, T N కన్నా D V మేధావి అని రుజువు చేయజూస్తున్నారని కూడా ఐలయ్య ఆరోపిస్తున్నాడు. నాకు తెలిసినంత వరకు D V సమర్థకులు TN ను కూడా అత్యంత విలువైన నాయకుడిగానే తమ రాతల్లో, ప్రసంగాల్లో పేర్కొంటారు. అనేక మీటింగులకు హాజరైన నేను ఆ విషయం ఖచ్చితంగా చెప్పగలను. ఈ కౌంటర్ కరెంట్స్ లో ప్రచురితమైన వ్యాసాల్లో కూడా దీన్ని చూడవచ్చు.
ఒక పాఠకుడి గా నేను కొన్ని వాస్తవాలు పేర్కొని, నా అభిప్రాయాలను చెప్పాను. కులపోరాటాల తాత్వికతను, కుల,వర్గ రాజకీయాల్ని, ఉద్యమాలను బేరీజు వేయడానికి పూనుకోలేదు. వాస్తవాలను వక్రీకరించి గందరగోళ పరచడంపైననూ, నిజమైన ప్రజాస్వామిక ఉద్యమాలను కుల సమీకరణాల ద్వారా పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నరీత్యా నూ నేను ఈ వ్యాసం రాశాను. ఐలయ్య లాంటి రాతలు ప్రస్తుత అసమ, వివక్షాపూరిత పాలనకే వంత పాడుతాయి, రక్షిస్తాయి. సామాజిక చట్రాన్ని చిన్న ముక్కలుగా విడగొట్టి కన్నీరు పెట్టే ప్రయత్నాల నుండి మనల్ని మనం రక్షించుకోవాలి. కడగండ్లకు కారణమైన దోపిడి పాలక వర్గాలను తుద ముట్టించకుండా వదిలేసి మనలో మనమే ఘర్షణ పడడం వారికే తోడ్పడుతుంది. హిందుత్వ, ఫాసిజం చుట్టుముడుతున్న ఈ రోజుల్లో మరీనూ. అలాంటి పర్యవసానాల నుండి హెచ్చరించాలన్నదే నా ప్రతిస్పందన లోని ఉద్దేశ్యం.

(ఎ. సూర్యప్రకాశ్, సోషల్ యాక్టివిస్టు, హైదరాబాద్)