ఊరు-వాడ పోవాలి, అందరికి ఫార్మ్ హౌస్ లు నిర్మించాలి!

(బత్తుల సిద్దేశ్వర్లు)
ఓపెన్ ఎయిర్ జైళ్ల తరహా ఓపెన్ ఎయిర్ ఆసుపత్రులు నిర్మించాలి!! మిత్రులారా! ప్రపంచం కాలాన్ని క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని వ్యవహరించినట్టుగా ఇప్పుడు కరోనా పూర్వం కరోనా క్రితం అని వ్యవహరించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఎందుకంటే ప్రపంచ చరిత్రలో ఎంతో అభివృద్ధి చెందినమని అనుకుంటున్న కరోనా మనిషి బలహీనత మీద దెబ్బ కొట్టింది.ఇది అంత ప్రమాదకర వైరస్ కాకున్నా ఒక ట్రయిల్ వేసినట్టైంది.దీన్ని మించిన వైరస్ లు చుట్టూ ముడితే మానవ జాతి అంతమే అనే పరిస్థితిని కళ్ళముందు చూపెట్టింది.ఇదంతా వైద్యాన్ని వ్యాపారంగా మార్చుకొన్న పలితమేనని ప్రత్యేకించి చెప్పుకొనక్కర లేదు.
కరోనా తర్వాత సమాజం లో జరగాల్సిన మార్పులు,నిర్మాణాలు,జీవన విధానాలు ఎట్లుండాలనేది ఈసందర్బంగా చర్చ జరగాలి.
ఉదాహరణకు కెసిఆర్  ఫార్మ్ హౌస్ లో పంటుండని విమర్శల మీద విమర్శలు వెల్లువెత్తుతుంటాయి.నిజానికి ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అంతకు మించింది మరొకటి లేదు.
ఫార్మ్ హౌస్ లు ప్రజలందరికీ అందుబాటులోకి వస్తేనే అందరికి ఆరోగ్యమని కరోనా మరింత స్పష్టంగా తెలియచెప్పింది. దేశాన్నంత బాగా కలవర పెట్టిన కరోనా కేరళను ఎక్కువగా ఇబ్బంది పెట్టలేక పోయింది.కారణం అక్కడ చాలా కాలం నుండి ఎక్కువ మంది జీవించేది ఫార్మ్ హౌస్ జీవితమే.
గుజి గుచ్చినట్టు వుండే ఇండ్లు,ఇరుకిరుకు వీధులు ఎంత మాత్రం ఆరోగ్యకరం కాదు.పక్క పక్కనే వుండే ఇండ్లు దర్వాజాలు కలిసినట్టే వుండే పేదల బస్తీలలో భౌతిక దూరాలు సాధ్యం కాని పరిస్థితి.
ఒక ఇంట్లోనుండి చిన్న పిల్లలు మరో ఇంట్లోకి పోవడాన్ని ఆపలేక పోయినం.ప్రజలందరికి ప్రతి కుటుంబానికి ఒక ఐదేకరాలలో ఫార్మ్ హౌస్ నిర్మాణం చేయగలిగినప్పుడు ప్రజారోగ్యం వర్ధిల్లుతుంది. మహనీయులు డా,,బి ఆర్ అంబేడ్కర్ ఆశించినట్టు ఊరు-వాడ ధ్వంసం అవుతుంది. వివక్షత పునాదులు కూలి పోతాయి.
ఇక మన రాష్ట్రంలో…
ఖైదీల కోసం ఓపెన్ ఎయిర్ జైళ్లు కట్టిండ్రు.అదే హాస్పిటల్స్ వరకు వస్తే పది,ఇరవై అంతస్తుల బంగలాలు,స్వచ్ఛమైన గాలి లేని గదులు ఏ సీ గదులు…
కార్పొరేట్ హాస్పిటల్స్ మరీను.గత చరిత్రలో చూస్తే విద్య వైద్యం ఎప్పుడు ప్రకృతి ఒడిలోనే కొనసాగేవి. సమాజం మొత్తం మీద బ్రాహ్మణుడి పెత్తనం కొనసాగినా అడవులలోనే గురుకులాలు ఉండేవి. అట్లాగే వైద్యాలయాలు కూడాను ప్రకృతి ఒడిలోనే వర్ధిల్లినయి.
ఉదాహరణకు మన కండ్ల ముందున్న, నిజాం సర్కారు కట్టించిన అనంత గిరి TB ఆసుపత్రి సాక్ష్యంగా ఉంది.చరిత్ర ప్రారంభంలో రాజ భవనాలు కోషాగారాలు శత్రువు నుండి రక్షణ కోసం మాత్రమే నిర్మించ బడ్డాయి.
వర్గ సమాజం వునికిలోకి రావడంతో అవి ఆస్తులుగా మరిపోయినయి.ఆధునికత తెచ్చిన పరిణామం విద్య,వైద్యం గదుల్లోకి…ఏసీ గదుల్లోకి మారింది.
ఆధునికత తెచ్చిన పరిణామం మనిషిని ప్రకృతి ఒడి నుండి మృత్యువు అంచుల వరకు తీసుకెల్లింది. కరోనా సోకిన రోగి మృత్యువును వెతుక్కుంటూ హాస్పిటల్ కు వెళ్లినట్లయితుంది.హాస్పిటల్ సిబ్బంది మృత్యువు ముఖంలో జీవించినట్లే ఉంది.కరోనా రోగి బాగయ్యే సంగతి అట్లుంచితే ఆ రోగితో పాటు డాక్టర్లు,నర్సులు,ఇతర స్టాఫ్ కరోనా బారిన పడి మరణిస్తున్నారు.
దీన్ని పరిష్కరించడానికి ఓపెన్ ఎయిర్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలి. అక్కడక్కడ ఇప్పటికే ఏర్పడి ఉన్న ప్రకృతి చికిత్సలను వారు ఏర్పాటు చేసిన ఆశ్రమాలను ఉపయోగించుకోవాలి.వైద్యం లేని అల్లోపతి వైద్యంలోనే ప్రమాదకర మందులతో మనుషుల మీద ప్రయోగాల వల్ల చాలా మంది మరణిస్తున్నారు.
దీని వల్ల మనిషిలో మరింత భయం పెరిగిపోతుంది.భయం వల్ల మరిన్ని మరణాలు.ఇది ఒక విషవలయంలా మారింది.ఆత్మహత్యా సదృశ్యంగా మారింది.కావున మిత్రులారా!ఊరు వాడ పోవాలి,అందరికి ఫార్మ్ హౌస్ లు నిర్మించాలి.ఓపెన్ ఎయిర్ జైళ్ల లాగా ఓపెన్ ఎయిర్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలనే విషయాలపై చర్చ జరగాలని కోరుతూ…దండాలతో…
-బత్తుల సిద్దేశ్వర్లు.9704672813