న్యాయరాజధానిని టిడిపి, వామపక్షాలు వ్యతిరేకించడ సరికాదు

(బొజ్జా దశరథ రామి రెడ్డి*)
శ్రీబాగ్ ఒడంబడిక అమలు పరచాలన్నది రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్ష. రాయలసీమ హక్కుల పత్రమైన శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమలో రాజధాని లేదా హైకోర్టు ఏర్పాటు చేయాలి. శ్రీబాగ్ ఒడంబడిక అమలు చేయాలని రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక ఆనేక సత్యాగ్రహాలు, సమావేశాలు నిర్వహించి, వాటి తీర్మానాలను పాలకులకు ఎప్పటికప్పుడు పంపడమైంది.
ఈ నేపధ్యంలో శ్రీబాగ్ ఒడంబడికను గౌరవిస్తూ, రాయలసీమలో న్యాయ రాజధాని ఏర్పాటుకై శాసనసభలో నిర్ణయం చేసి, రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. శ్రీబాగ్ ఒప్పందం అమలులో తొలి అడుగు వేసిన ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజా సంఘాల వేదిక ఆహ్వానిస్తున్నది.
ఈ సందర్బంలో రాయలసీమలో హైకోర్టు ఏర్పాటును తెలుగుదేశం పార్టీ, సి.పి.ఐ వ్యతిరేకించడాన్ని ప్రజా సంఘాల వేదిక తీవ్రంగా ఖండిస్తున్నది.
రాయలసీమ అభివృద్ధికి సంబంధించిన విషయాలను విస్మరించి, కేవలం అమరావతి కేంద్రంగా అభివృద్ధిని కాంక్షించే తెలుగుదేశం పార్టీ, సి.పి.ఐ, అదే పద్దతిలో పోతున్న ఇతర రాజకీయ పార్టీల వైఖరిని ప్రజా సంఘాల వేదిక తీవ్రంగా ఖండిస్తున్నది.
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుకు మద్దతు తెలియచేస్తు, రాయలసీమలో సెక్రటేరియట్ విభాగాలు, ప్రతి సంవత్సరం కనీసం ఒక శాసన సభ సమావేశం నిర్వహించేలాగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యక్రమాలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ, సి.పి. ఐ మరియు ఇతర రాజకీయ పార్టీలను ప్రజా సంఘాల వేదిక కోరుతున్నది.
రాయలసీమ అభివృద్ధికి కీలకమైన శ్రీబాగ్ ఒడంబడిక అమలు మరియు రాయలసీమ బతుకు తెరువు సమస్య అయిన తాగు, సాగునీటి అంశాలను విస్మరించి, అమరావతి కేంద్రంగా అభివృద్ధే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించే రాజకీయ పార్టీలను రాయలసీమ ద్రోహులుగా ప్రకటిస్తామని ప్రజా సంఘాల వేదిక హెచ్చరిస్తున్నది.
ఇప్పటికైన రాజకీయ పార్టీలు తమ ఆలోచన సరళి మార్చుకొని రాయలసీమ అభివృద్ధికి కీలకమైన శ్రీబాగ్ ఒడంబడిక అమలుపై తమ పార్టీ జాతీయ/ రాష్ట్ర స్థాయి విధానాన్ని ప్రకటించాలని. ప్రజా సంఘాల వేదిక డిమాండ్ చేస్తున్నది.
రాష్ట్ర విభజన అనంతరం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటి సూచించిన విధంగా రాష్ట్ర స్థాయి కమీషనరేట్లు, డైరెక్టరెట్లు, కార్పొరేషన్ల ఏర్పాటులో రాయలసీమకు సమ ప్రాతినిద్యంపై అన్ని రాజకీయ పార్టీలు తమ విధానాన్ని ప్రకటించాలని ప్రజా సంఘాల వేదిక డిమాండ్ చేస్తున్నది.

(*బొజ్జా దశరథ రామి రెడ్డి, కన్వీనర్, రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక, 25/510, శ్రీనివాస నగర్, నంద్యాల – 518501, 98480 40991, rjac1913@gmail.com)