అభివృద్ధి కేంద్రీకరణా? వికేంద్రీకరణా? రాయలసీమపై వైఖరి చెప్పండి: ప్రతిపక్షానికి ప్రశ్న

 

టిడిపి, వామపక్షాలకు ఇతర రాజకీయపార్టీలకు రాయలసీమ ఉద్యమ సంఘాల సమన్వయ వేదిక వినతి

( యనమల నాగిరెడ్డి)
శ్రీబాగ్ ఒడంబడిక ప్రాతిపదికగా పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను రాయలసీమ ఉద్యమ సంఘాల సమన్వయ వేదిక స్వాగతిస్తున్నది.  అమరావతి కేంద్రంగా  అభివృద్ధిని కేంద్రీకరించాలనుకుంటున్న తెలుగుదేశం, సిపిఐ పార్టీలు అన్ని రంగాలలో పూర్తి నిర్లక్ష్యానికి గురైన రాయలసీమ అభివృద్ధి పై ఆ  పార్టీల  వైఖరి స్పష్టంగా ప్రకటించాలని రాయలసీమ ఉద్యమ సంఘాల సమన్వయ వేదిక కన్వీనర్  బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు.  ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆంధ్ర రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, రాయలసీమకు ప్రజల కోరిక మేరకు రాజధాని/హైకోర్టు కేటాయించడం, సీమ నీటి అవసరాలు తీర్చేంతవరకు నీటికేటాయింపులు చేసి ప్రాజెక్టులు నిర్మించడం లాంటి నిర్ణయాలతో కుదిరిన శ్రీభాగ్ ఒప్పందం అమలు పరచాలన్నది రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్ష. రాయలసీమ హక్కుల పత్రమైన శ్రీబాగ్ ఒడంబడికను  అమలు చేయాలని ఆంద్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి  అనేకమంది వివిధ రకాలుగా  పోరాటం చేశారని, అందుకు కొనసాగింపుగా 2014 నుండి  రాయలసీమ  ప్రజా సంఘాలు  ఆనేక సత్యాగ్రహాలు, సమావేశాలు, ఉద్యమాలు  నిర్వహించి, వాటి తీర్మానాలను రాజకీయ పార్టీలకు,  పాలకులకు అనేక సార్లు  పంపించామని ఆయన గుర్తు చేశారు.
బొజ్జా దశరథరామిరెడ్డి
అయితే రాజకీయ పార్టీలు, ప్రభుత్వ అధినేతలు సీమపై ముసలి కన్నీళ్లు కార్చడం మినహా ఈ విషయం పై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న పాలన, అధికార వికేంద్రీకరణ నిర్ణయాన్ని టీడీపీ, సిపిఐ బహిరంగంగా వ్యతిరేకిస్తుండగా, మిగిలిన రాజకీయ పార్టీలు మౌనం వహిస్తున్నాయని, అందువల్ల సీమకు మరోసారి ద్రోహం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ విషయంపై తమ వైఖరిని, రాయలసీమ అభివృద్ధికి తాము చేపట్టదలచిన ప్రణాళికలను అన్ని రాజకీయ పార్టీలు విడుదల చేయాలని, అభివృద్ధి కేంద్రీకరణపై కూడా తమ విధానాలను ప్రకటించాలని దశరథ డిమాండ్ చేశారు.
ఈ నేపధ్యంలో ప్రభుత్వం శ్రీబాగ్ ఒడంబడికను గౌరవించి, ఆ ఒప్పందాన్ని అమలు చేయడానికి రాయలసీమలో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తూ  శాసనసభలో చట్టం చేయడాన్ని,  అమలు చేయడానికి తీసుకుంటున్న కార్యాచరణ ప్రణాలికను రాయలసీమ ఉద్యమ సంఘాల సమన్వయ వేదిక స్వాగతిస్స్తు న్నది.  అయితే  రాయలసీమ సమగ్రాభివృద్ధికి అవసరమైన నీటి  కేటాయింపులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి  చేయడం, అవసరమైన కొత్త ప్రాజెక్టులు చేపట్టడం చేయాలని, అందుకోసం అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వంపై వత్తిడి తేవాలని ఆయన కోరారు.
రాష్ట్ర విభజన అనంతరం రాజధాని ఎంపిక కోసం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటి  సూచించిన విధంగా రాష్ట్ర స్థాయి కమీషనరేట్లు, డైరెక్టరెట్లు, కార్పొరేషన్ల ఏర్పాటులో రాయలసీమకు సమ ప్రాతినిద్యం కల్పించడంపైన, అన్ని రాజకీయ పార్టీలు తమ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేసారు. అలాగే రాయలసీమలో ఏడాదికి ఒక్క సారైనా శాసనసభ సమావేశాలు నిర్వహించాలని  సెక్రటేరియట్ విభాగాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాము.
ఈ సందర్బంలో రాయలసీమలో హైకోర్టు ఏర్పాటును, రాయలసీమ అభివృద్ధికి సంబంధించిన విషయాలను విస్మరించి, కేవలం అమరావతి  కేంద్రంగా అభివృద్ధి జరగాలని కోరుతున్న  తెలుగుదేశం పార్టీ, సి.పి.ఐ, అదే పద్దతిలో పోతున్న ఇతర రాజకీయ పార్టీల వైఖరిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామనారు.  రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుకు మద్దతు తెలియచేస్తు, రాయలసీమలో ప్రతి సంవత్సరం కనీసం ఒక శాసన సభ సమావేశాలు నిర్వహించేలాగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యక్రమాలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ, సి.పి. ఐ మరియు ఇతర రాజకీయ పార్టీలను కోరారు.
రాయలసీమ అభివృద్ధికి కీలకమైన శ్రీబాగ్ ఒడంబడిక అమలు, రాయలసీమ బతుకు తెరువు సమస్య అయిన తాగు,  సాగునీటి అంశాలను విస్మరించి, అమరావతి కేంద్రంగా అభివృద్ధే  లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించే రాజకీయ పార్టీలను రాయలసీమ ద్రోహులుగా ప్రకటిస్తామని ఆయన హెచ్చరించారు.  అందువల్ల ఇప్పటికైనా అన్ని  రాజకీయ పార్టీలు రాష్ట్ర సమగ్రతకు, అభివృద్ధికి   కీలకమైన శ్రీబాగ్ ఒడంబడిక అమలుపై తమ పార్టీ జాతీయ/ రాష్ట్ర స్థాయి విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాము. రాయలసీమ వెనుకపాటు తనంపై గత అనేక దశాబ్దాలుగా సానుభూతిచూపుతున్న మేధావులు ప్రాంతాలకు అతీతంగా సీమ అస్తిత్వం కోసం తమ వైఖరిని స్పష్టం చేయాలని ఆయన కోరారు.
(యనమల నాగిరెడ్డి, సీనియర్ జర్నలిస్టు, కడప)