రోజూ కర్నూలు సన్నబియ్యం తింటూ దాని సృష్టికర్త ను మర్చిపోతున్నాం!

(చందమూరి నరసింహారెడ్డి)
పై ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తు పట్టగలరా? కష్టమే. ఆయన సినిమా నటుడు కాదు, రాజకీయ నాయకుడు అంతకూ కాదు.  టిివిల్లో కూడా ఎపుడు కనిపించిన వ్యక్తీ కాదు. మారుమూల్ల పల్లెనుంచి వచ్చి చడీా చప్పుడు లేకుండా తాను చేయాల్సిన మేలు సమాజానికి చేసి, అంతే నిశబ్దంగా మాయమయిన ఒక గొప్ప తెలుగు వ్యవసాయ శాస్త్రవేత్త.
సన్నాలు లేదా సాంబామసూరిగా లేదా కర్నూలు సోనా బియ్యం తెలియని వారుండురు. అయతే, ఈ సన్నబియ్యం చరిత్ర, వాటిని సృష్టికర్త ఎవరనే విషయం చాలా మందికి తెలియదు. ప్రపంచంలో 40 దేశాలలో రైతులు ఈ పంట పండిస్తున్నారు. ఈ పంట వల్ల ఆహార సమస్య తీరడమేకాదు, ప్రభుత్వాలకు ఆదాయం కోట్లలో జమకూడుతూ ఉంది. అయితే, దీని వెనక ఉన్న శాస్త్రవేత్త గురించి పెద్ద తెలియదు. విచారకరం.
దీని వెనక ఉన్న వ్యక్తి ఒక మారు మూల కుగ్రామంలోని రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడు.బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థి. ఆయన పేరు డా. మొరవల్లి వెంకట రమణా రెడ్డిగారు లేదా డాక్టర్ ఎంవీ రెడ్డి (11929-2014). బీపీటీ 5204 రకం వరి వంగడం సృష్టికర్త. కోట్లాది మందికి ప్రధాన ఆహార ధాన్యమయిన BPT 5204 Dr MV Reddy అని గూగుల్  సెర్చ్ చేస్తే వచ్చిన ఎంట్రీలు ఎన్నో తెలుసా? కేవలం 84   మాత్రమే.
అంటే అన్నదాత ని గుర్తు పెట్టుకునేందుకు ప్రజల తరఫున ప్రభుత్వాల తరఫున ప్రయత్నాలేవీ జరగలేదని అర్థమవుతుంది.

…These unsung heroes don’t want medals,
glory or even fame.
In fact, most would walk away afterwards,
without anyone ever knowing their name.

(Poem by David Harris)

సాంబా మసూరి (బి.పి.టి. 5204) వరి వంగడం పేరు తెలియని రైతులుండరు. ముఖ్యంగా  రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలోని నెల్లూరు జిల్లా, కర్ణాటక రాయచూరు తుంగభద్ర ఆయకట్టు ప్రాంతాలలో, తమిళనాడులో ఆంధ్రకు చేరువలోనున్న జిల్లాలలోను ఈ వరి పంటతో పరిచయంలేని రైతులుండరంటే అతిశయోక్త కాదు. ఈరకం మన దేశంలోనే కాదు విదేశాలకు కూడా వ్యాప్తి చెందింది.
Kurnool Sona Masuri/ Facebook Picture
సాంబా మసూరి బియ్యం చాలా నాజూకుగా నుండి నిగనిగ లాడుతూ, అన్నం బాగా ఉడికి తెల్లగా నుండి, కంటికి సొంపుగా, జిహ్వాకు ఇంపుగా ఉంటుంది. బహుళ ప్రజాదరణ పొందింది.
మార్కెట్టులో సాంబా మసూరి బియ్యం (బి.పి.టి. 5204) ధర మిగతా రకాల కంటే ఎక్కువ నున్నందున ,పంట దిగుబడి కూడ మిగిలిన వాటికన్నా ఎక్కువ ఉండటం వల్ల ఇది పలు ప్రాంతాలకు సునాయసంగా వ్యాప్తి చెందింది. సాంబా మసూరి రకం, రైతు సోదరులకు, మిల్లర్లకు, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ విత్తనాభివృద్ధి సంస్థకు గత కొన్ని దశాబ్దాలనుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు ఆదాయం గడించింది .నాన్ బాసుమతి బియ్యం రకాలలో సాంబ మసూరి బియ్యానికి విదేశాలలో విపరీతమైన గిరాకీ ఉంది. ఈ బియ్యం ఎగుమతి వలన, మన రాష్ట్రానికి, దేశానికి, విదేశీ మారక ద్రవ్యం విరివిగా లభ్యమగుచున్నది. అందువలన సాంబా మసూరి బి.పి.టి. 5204 యొక్క పేరు ప్రపంచవ్యాప్తంగా ఇంటింట చలామణి అవుచున్నది. దీనిని కొన్ని ప్రాంతాలలో ” జిలకర సూరి” తమిళనాడులో “సీరాక పోన్ని” అని అంటారు. బియ్యాన్ని “సోనా మసూరి” గా లేదా “కర్నూలు సోనా గా మార్కెట్లో వ్యవహరిస్తున్నారు
సాంబా మసూరి వరి వంగడం గత నాలుగు దశాబ్దాలకు పైగా సాగులో ఉన్నప్పటికీ, దీని తరువాత ఎన్నియో పరి వంగడాలు విడుదల చేసినప్పటికి, ఈ వరి వంగడం బియ్యం నాణ్యత బహుళ ప్రజాదరణ పొందడం చేత, దీని ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గలేదు కదా, ఇంకా కొత్త ప్రాంతాలకు విస్తరించి అపూర్వ వరి వంగడంగా పరిణితి చెందింది.
బి.పి.టి. 5204 రూపకల్పన ఒక బృహత్తర పథకం .డా ఎం.వి. రెడ్డి  సారధ్యంలో ఎడెనిమిది సంవత్సరాలు చేసిన అవిరామ కృషి ఫలితమే బి.పి.టి. 5204 , ఈ వరి వంగడంకోసం ఒక బోధనా విభాగంలో ఎటువంటి పరిశోధనా సిబ్బంది సహాయం లేకుండా, ఒక అపూర్వ నూతన వంగడం రూపొందించడం మనదేశంలో ఇదే ప్రథమం కావచ్చు.
మనదేశానికి ఇంతటి ఖ్యాతి నార్జించిన బి.పి.టి. 5204 – సాంబా మసూరి అధ్బుత వరి వంగడాన్ని డాక్టర్ యం.వి.రెడ్డి కృషి ఫలితమే 1986లో విడుదలయింది. ఇపుడు దాదాపు 40దేశాలలో దీనిపండిస్తున్నారు. మూడురకాల వరివంగడాలలోని సుగుణాలను సమ్మేళనపరచి రూపొందించారు.
అవి: 1964 సంవత్సరాని కంటే ముందు జి.ఇ.బి. 24 (Government Economic Botanist 24) “సాంబా వరి”, తదుపరి 1967లో ఆంధ్రాలో బాపట్ల వ్యవసాయ కళాశాల నుండి ప్రవేశ పెట్టబడిన “మసూరి వరి “రకం,దేశ శాస్త్రజ్ఞులు ఫిలిఫైన్సు అంతర్జాతీయ వరి పరిశోధనా స్థానము నుండి 1964లో మన దేశంలో ప్రవేశ పెట్టిన వాటిలో తైచింగు నేటివ్-1(Taichung Native-1)
వీటిని దేశవాళీ రకాలతో సంకరపరచి హెచ్చుదిగుబడిని సంక్రమింపచేస్తున్న మొక్క నిర్మాణ విశిష్టత సంబంధించిన జన్యు సముదాయాన్ని దేశవాళీ రకాలకు చొప్పించి వాటి సంతతి నుండి హెచ్చు దిగుబడినిచ్చి, మన అవసరాలకు అనుగుణంగా క్రొత్త వంగడాలను రూపకల్పన చేయవచ్చును – అనే మౌళిక సూత్రాన్ననుసరించి రూపకల్పన చేసిన వంగడమే బీపీటీ- 5204 సాంబా మసూరి వరి వంగడం
ఒక సరిక్రొత్త వరి వంగడం రూపొందించాలన్న ఒక్క మహత్తర సంకల్పంతో బాపట్ల వ్యవసాయ కళాశాల సస్య ప్రజనన విభాగంలో (Plant Breeding Division) డా యం.వి.రెడ్డి సారధ్యంలో ఒక బృహత్తర పథకం 1968 వ సంవత్సరములో ప్రారంభమైంది. 7-8 సంవత్సరాల అవిరామ కృషి ఫలితంగా బి.పి.టి. 5204 వరి వంగడాన్ని రూపకల్పన చేయడం జరిగింది.
బి.పి.టి. 5204 యొక్క ప్రాముక్యతను గుర్తించి రాష్ట్రములో వివిధ ప్రాంతాలలో సాగుచేయుటకు ఈ వంగడము 1986లో ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ విశ్వ విద్యాలయము వారి (ఇప్పుడు ANGRAU) ఆధ్వర్యములో, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బి.పి.టి. 5204 వరి వంగడాన్ని “సాంబా మసూరి” పేరుతో (జి.ఇ.బి. 24 – సాంబా వరి – మసూరి రకాల కలయికకు చిహ్నంగా) విడుదల చేసింది. తదుపరి 1988లో సెంట్రల్ వెరైటీ రిలీజు కమిటి వారిచే దేశమంతటా పండించుటకు నోటిఫై చేయబడినది. అప్పటికే ఈ వరి వంగడం దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యాపించి యున్నది.
బి.పి.టి. 5204 వరి వంగడాన్ని రూపకల్పనకు తోడ్పడిన, జి.ఇ.బి. 24, మసూరి, తైచింగ్ (నేటివ్-1) వంగడాలు కాల గర్భంలో ఎప్పుడో కలిసి పోయినవి. వాటి సంతతి అయిన బి.పి.టి. 5204 సాంబా మసూరి వరి వంగడం ఇప్పటి వరకు దేదీష్యమానంగా ప్రజల మన్నలను అందుకొంటున్నది
1986లో వ్యవసాయ విశ్వవిద్యాలయం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వరి పండించేందుకు ప్రోత్సహించింది. 1988లో సెంట్రల్ రిలీజ కమిటి ద్వారా దేశ మంతటా విడుదలై సంచలనం సృష్టించింది. ఆదరణ పాత్రమైంది.
డాక్టర్ యం. వి. రెడ్డి ప్రఖ్యాతులై ‘సాంబ మసూరి’ వరి రకానికి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కీర్తి ప్రతిష్టలు సాధించి పెట్టారు.
ఈ వ్యవసాయశాస్త్రవేత్త మన దేశానికి గర్వకారణం. బోధన చేస్తూనే, దేశంలోని అత్యుత్తమ పరిశోధన సాగించడం, ఫలితం సాధించడం ఒక్క డాక్టర్ యం.వి. రెడ్డి గారికే సాధ్యమయింది. అలాగే బోధన, పరిశోధనల్లో అద్భుత ఫలితాలు సాధించి కళాశాల నిర్వహణలో కూడా గణనీయమైన చాతుర్యం ప్రదర్శించి, విజయం పొందడం తమాషా కాదు.
తిరుమల దగ్గర వుండే అలిపిరిలో పొద్దుతిరుగుడు పువ్వు, వేరుశెనగ మీద పరిశోధన సాగించిన పరిశోధనా కృషీవలుడు డా యం.వి.రెడ్డి.
డా యం. వి. రెడ్డి అనంతపురం జిల్లా తనకల్లు మండలం ఎద్దులవాడ్ల పల్లి లో 1929 అక్టోబరు 3న జన్మించారు. తండ్రి నంది రెడ్డి తల్లి లక్ష్మమ్మ .వీరికి నలుగురు సంతానం .డాక్టర్ ఎం.వి రెడ్డి కి ఇద్దరు అన్నలు ఒక అక్క. విద్యాభ్యాసం కదిరి, ములకలచెరువు, మదనపల్లి (చిత్తూరు జిల్లా) పాఠశాలల్లో సాగింది.
1954లో బాపట్ల వ్యవసాయ కళాశాల నుంచి బి. ఎస్సీ (అగ్రి) పట్టా పొందారు. అది కూడా ఉత్తమ శ్రేణిలో మొదటి ర్యాంకు. 1955లో అదే కళాశాలలో అసిస్టెంటు లెక్చరర్‌గా చేరి 1958లో ఎం. ఎస్సీ (ఆటా) సాధించారు. 1964లో వ్యవసాయ విద్యాలయం ఏర్పడింది.
యుఎస్ ఎయిడ్ కార్యక్రమం క్రింద అమెరికాలో కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీలో డా రెడ్డి 1967లో డాక్టరేటు పట్టా పొందారు.
ప్రఖ్యాత బ్రీడర్ (గోధుమలు) డా.ఇ.జి. హైనీ గారి నేతృత్వంలో పరిశోధన ప్రారంభించారు. వారి పరిశోధన అంశం – ప్లాంట్ బ్రీడింగ్ మరియు జెనెటిక్స్, డా.ఇజి. హైనీ దగ్గర పరిశోధన చేయడం గొప్ప అదృష్టమంటారు .
డా.హైనీ లాగా తను కూడా భారతదేశం వచ్చాక కొత్తరకాల వంగడాలు సాధించాలని కలలు కనేవారుఒక విశిష్టమైన విషయం వెనుక ఒక అపురూపమైన తపన వుంటుంది. 1975 లో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులయ్యారు. అదనంగా ఐసిఎఆర్ వారి డైరక్టరేట్ ఆఫ్ ఆయిల్ సీల్స్ సంస్థ డైరక్టరుగా కూడా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఇక్రిసాట్ – ఎపియు, రాక్ ఫెల్లర్ కార్యక్రమం క్రింద వివిధ దేశ శనగ పరిశోధనా స్థానాలు సందర్శించారు. తదుపరి బాపట్ల వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్ అయ్యారు.
1983లో తిరుపతి ఎస్వీ వ్యవసాయ కళాశాలకు బదిలీ అయ్యారు. 1988లో తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ‌పరిశోధనా స్థానం అసోసియేట్ డైరక్టరుగా పదవీ బాధ్యతలు చేపట్టి  ప్రొద్దుతిరుగుడు లో ఎ.పి.యస్. హెచ్-11, వేరుశనగ లో బిపిటి 1 రకం కూడ సృష్టించారు.1989లో పదవీ విరమణ‌ చేశారు.
దాదాపు 34 సం. పాటు బోధనా, పరిశోధనా రంగాల్లో రాణించి 1989 తర్వాత బెంగళూరులోని ఒక ప్రయివేటు కంపెనీలో హైబ్రిడ్ విత్తన బ్రీడర్ గా 1994 దాకా పనిచేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రూరల్ అగ్రికల్చరల్ వర్క్ ఎక్స్ పీరియన్స్ (ఆర్.ఎ.డబ్ల్యు.ఇ.) రూపకల్పనలో ప్రధానపాత్ర పోషించారు.

పరిపాలనా దక్షుడు డా రెడ్డి. అందుకే ఆయనను 1982లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవించింది. తన విషయాలన్నిటా తన అర్థాంగి, హోమియోవైద్యురాలు డా. ఎం. అన్న పూర్ణ గారి చల్లని హస్తముందంటారు.

2004 సంవత్సరాన్ని అంతర్జాతీయ వరి సంవత్సరంగా (International Year of Rice) గా ఆహార సమస్యను పరిష్కరించడం BPT 5204 పాత్ర, దీని సృష్టకర్త డారెడ్డి కృషి ప్రత్యేకంగా ప్రశంసలందుకున్నాయి..
2008లో రాష్ట్ర ప్రభుత్వం ఆయ నకు వరిష్ట వ్యవసాయ శాస్త్రవేత్త పురస్కారంతో గౌరవించింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా ఎంవీ రెడ్డి బంగారు పతకం అందుకున్నారు .ఈ అవార్డుతో పాటు ఆయన ఉత్తమ అధ్యాపకుడి అవార్డును అందుకున్నారు. డా. రెడ్డి 2014 ఏప్రిల్ 23 న బెంగళూరు లో మరణించారు.
Chandamuri Narasimhareddy
(చందమూరి నరసింహారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, ఖాసాసుబ్బారావు అవార్డు గ్రహీత ఫోన్ నెంబర్:9440683219)