చిత్తూరు జిల్లా తొలి నవలా రచయిత సభా

(సేకరణ :– చందమూరి నరసింహారెడ్డి)
పశువుల కాపరి గా కష్టాలు చవిచూశారు.. కవిగా నవలా రచయిత గా ప్రజల కష్టాలు రైతుల దీనగాధలు కళ్లకు కట్టినట్టు చూపించారు.
రాయలసీమ నవలా రచయితలకు ఆయనో దార్శనికుడు… తొలి తరం కథారచయిత ల్లో అగ్రజులు. పద్యం నుంచి వచనం వైపుకు, గ్రాంధిక భాష నుంచి వ్యవహారిక భాష వైపుకు, గతం నుంచి వర్తమానం వైపుకు రాయలసీమ సాహిత్యాన్ని మళ్లించిన గౌరవం కే సభా, నాదముని రాజు లాంటి అభ్యుదయ రచయితల కే దక్కుతుంది.
సభా చిత్తూరు జిల్లా కొట్రకోన గ్రామంలో 1923 జూలై 1 న జన్మించారు. ఈయన తల్లి దండ్రులు పార్వతమ్మ, చెంగల్వరాయుడు. తండ్రి వీధిబడి ఉపాధ్యాయుడు. సభా పూర్తి పేరు కనక సభాపతి పిళ్లై .
జయరాం అనే తముడు శకుంతల, అమరావతి అనే
ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు.సభా కొంతకాలం పశువులు కాశారు. అతని తండ్రి చిన్నప్పుడు మహాభారత, రామాయణ, పురాణాలు కథలను చెప్పేవారు. కథలంటే సభాకు సరదా.
సభాకు నాటకాలు చూడటం చాలా ఇప్టం చుట్టుపక్కల ఎక్కడ నాటక ప్రదర్శనలు జరుగుతున్నా తప్పక వెళ్ళి చూసేవాడు . సభాకు నాల్గవ తరగతి వరకు వాళ్ళనాన్నే గురువు • ఐదో తరగతి పుస్తకాలు కొనడానికి కూడా డబ్బు లేదు. ఎంతో కష్టపడి ఆరుబండ్ల ఎరువు సేకరించి అమ్మి పుస్తకాలు కొన్నాడు. పట్టుదలతో చదివి ఐదో తరగతి పూర్తిచేశారు.
ఎనిమిదవ తరగతి తర్వాత 1940లో టీచర్ ట్రైనింగ్ కోర్సు పూర్తి చేశాడు. ప్రదానోపాద్యాయులు వెంకోబరావు సహాయంతో గొల్లపల్లిలో ఉపాధ్యాయుడిగా చేరాడు.
ప్రవేటుగా ఎస్- ఎస్: ఎల్.సి, 1958లో ఇంటర్ చదివారు. 1941 జూన్ 8 న వళ్లీదేవి తో పెళ్లి జరిగింది. వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె .
కొంతకాలం తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగం కు రాజనామా చేశారు. తర్వాత వివిధ పత్రికల్లో సంపాదకుడుగా ఉప సంపాదకుడు గా పనిచేశాడు.
కె.సభా రాయలసీమలో కథా రచనను తొలినాళ్ళలో ప్రారంభించి ఆ రుచిని తెలుగు పాఠకలోకానికి పంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి. జాతీయోద్యమ చైతన్యంతో జీవితానుభవాలను, ఆదర్శాలను తన రచనా మూలాలుగా అందించిన దార్శనికుడు.
కథారచయితగా, నవలాకారుడిగా, కవిగా, గేయకర్తగా, బాలసాహిత్య నిర్మాతగా, సంపాదకునిగా, జానపద గేయ సంకలనకర్తగా, ప్రచురణకర్తగా కె.సభా విస్తారమైన సాహిత్య కృషిని చేశారు.
సభా రాసిన “భిక్షు” నాదముని రాజా రాసిన “నదీనదాలు” “జలతారు తెరలు” అన్న నవలలు కనుమరుగవుతున్నాయి. ఒకనాడు రాయలసీమ యువతరం ఈ నవలను ఎంతో ఆసక్తితో, ఆనందంతో చదివింది.
ఓ వీర గున్నమ్మ.. ఓ రైతు వీరమ్మ గురించి రాస్తున్న కథలో గున్నమ్మ వీరోచతం గురించి సభా రచను ఈనాడు వారి తెలుగు వెలుగులో ఇలా వివరించారు.
చిమ్మే నెత్తురు చిమ్మగా-సై/ దుమ్ము కోసం రేగెను ప్రళయకాళియై నిలిచెరా/ ఆదిశక్తిలా లేచెరా/ గొడ్డలి గిరగిర త్రిప్పెరా- కను/ గ్రుడ్ల నిప్పులను రాల్చారు! సత్యభామలా పొంగెరా/ రుద్రమాంబలా లేచెరా మంటిలో బుట్టిన బిడ్డరా/ మంటలై ధగధగ మండెరా మింటిలో చుక్కలు రాలెము/ క్కంటి చిచ్చులా లేచెరా/.“ చరణాలు అంటే..
శౌర్య పరాక్రమం శత్రు మూకలు మీద ఈ చెలరేగిన ఓ సివంగి చిత్తరువు కళ్లముందు కదలటం లేదూ? మందస జమీందారీ దౌర్జన్యాల మీద తిరగబడిన ఉత్తరాంధ్ర వీరనారి సాసుమాను గున్నమ్మ గురించే ఈ వర్ణనంతా! సీమ రైతుల కడగండ్లు, జాతీయోద్యమ చైతన్యంలో తన అనుభవాలను కథల రూపంలో సమగ్రంగా చిత్రించిన కె.సభా, గున్నమ్మ
పరాక్రమానికి నీరాజనాలర్పిస్తూ 1954లో ఈ నృతగానం రాశారు.
కె.సభా. అన్ని ప్రక్రియల్లో రచనలు చేసి సీమ వాడి, వేడి, ఆర్ద్రత, ఆప్యాయతల స్థాయిని చాటిన బహుముఖ ప్రజ్ఞాశాలి.
1960 లో దేవదత్తం సచిత్ర సాహిత్య వైజ్ఞానిక వారపత్రిక చిత్తూరు నుండి వెలువడింది. కె.సభా ఈ పత్రికకు సంపాదకుడు, ప్రచురణకర్త.ఇందులో ఎంతోమంది కొత్త రచయితలను ప్రోత్సహించారు. పాంచజన్యం అనే ఆంగ్లపత్రికను నిర్వహించారు.
సమకాలీన రాజకీయ, సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక అంశాలపై వందల కొద్దీ వ్యాసాలను ప్రచురించడమే కాక విమర్శకుడిగా అనేక విమర్శనావ్యాసాలు, పుస్తక సమీక్షలు రాశారు.
శారదాపీఠాన్ని స్థాపించి కళాకారుల్ని సభా ప్రోత్సహించారు. మొట్టమొదట రామభద్రుని వేషం వేశాడు. 1948లో బడి పంతులు వేషం వేశారు. ఆచార్య రంగా ప్రశంసలందుకొన్నాడు
అనంతరం ‘1945’ లో ఓనాటకంలో శెట్టి పాత్రవేశాడు
సభాకు విలన్ గా నటించాలనే కోరికవుండేది. ‘సారాసీసా’ నాటకంలో విలన్ గా నటించడం నటనలో నేర్చు కొన్న దురలవాటు చేతనే సభాకు సిగరెట్ తాగే అలవాటు వచ్చింది.
తరువాత నటించలేదు పిల్లలకు నేర్పుతూ వచ్చాడు.
మొదట నాస్తికుడు. హేతువాది. ప్రతి విషయాన్ని శాస్త్రీయంగా ఆలోచించి వాస్తవికతకే ప్రాధాన్యం ఇచ్చాడు .తర్వాత చలం శిషరికంతో రమణ మహర్షి భక్తుడయ్యాడు .
తనచుట్టూ ఉన్న రైతు కూలీలు, రైతులు, వివిధ గ్రామీణ వృత్తులవారు, దళితులు పడుతున్న బాధలను చూసి తట్టుకోలేక అప్పటి సామాజిక ఉద్యమాలలో పాల్గొంటూనే మరోవైపు ఉద్యమశీలత్వంతో కూడిన అనేక రచనలు చేశారు. 1942లో తన సాహిత్య రచన ప్రారంబించారు.
ఆధునిక తెలుగు కథా సాహిత్యంలో తొలి కథ ‘దిద్దుబాటు’ కాగా చిత్తూరు జిల్లా తొలి కథ కె.సభా రచించిన ‘కడగండ్లు’. ఈ కథ మొట్టమొదటిసారిగా 1944 ఏప్రిల్ నెలలో ‘చిత్రగుప్త’ అనే పక్షపత్రికలో ప్రచురించబడింది. అంతేకాదు తొలి రాయలసీమ కథకునిగాకూడ భావిస్తున్నారు.
కరవు పిలిస్తే పలికే రాయలసీమ జన జీవిత చిత్రణ యథాతథంగా చేసిన సభా కథల్లో ‘పాతాళగంగ, అంతరంగం’ కథలు ప్రసిద్ధం. బావి తవ్వే యత్నంలో ఎంతకూ నీటి జాడ లేక సర్వమూ పోగొట్టుకునే రైతు కథ ‘పాతాళగంగ .
ఈకథ పాఠకులను మెప్పించింది. ‘అంతరంగం’ లో మంచీచెడ్డల మిశ్రమమైన మనిషి ద్వంద్వ ప్రవృత్తిని ఇందులో చిత్రించారు సభా. ఆయన మొత్తం వెయ్యి కథలుదాక రాసినట్లు తెలుస్తున్నా, ప్రచురించినవి మూడువందలే. ఆంధ్రప్రభలో ఉపసంపాదకుడిగా కొంతకాలం పనిచేసారు. భిక్షు, మొగలి’ తదితర నవలతో పాటు ఎంతో బాలసాహిత్యమూ రాశారు
అంతరించిపోతున్న భూగర్భజలాలు, ప్రకృతి విధ్వంసంతో కూలిపోయిన వ్యవసాయం, అతీగతీ లేని వృత్తులు, జీవనకల్లోలాలు వంటి ఎన్నెన్నో పరిణామాలు స్వాతంత్య్రానికి కొంచెం అటూయిటూగా సభా రచనల్లో వ్యక్తమయ్యాయి.
సామాజిక సమస్యలను ప్రజలకు తెలియజేయడానికి పత్రికా రంగంలో ప్రవేశించారు. పత్రికలలో రచనలు చేశారు. స్వయంగా పత్రిక నడిపాడు. సభాకు రంగా పరిచయం వలన జర్నలిజంలో ప్రవేశం కలిగింది .
అంతేకాదు ఆనాటి బహుముఖ ప్రజ్ఞాశాలి నార్ల వేంకటేశ్వరరావు వంటి ప్రముఖుల పరిచయం కూడా సభాకు లభించింది. పత్రిక రంగంలో వినూత్న మార్గాల ను ప్రవేశపెట్టాడు. స్వయంగా ఎన్నో రచనలు చేశారు
సభా 1944లో జర్నలిజంలో ప్రవేశించాడు 1947లో ఆచార్య రంగా శివగిరి రైతాంగ విద్యాలయం స్థాపించారు. సభా సలహా మేరకు రంగా ఆ విద్యాలయంలో లిఖిత పత్రికను ప్రారంభించాడు ఆ తరువాత అది ‘ నాగేలు ‘ పత్రిక గా వచ్చింది . పొలకల నరసింహారెడ్డి సంపాదకులు సభా ఉప సంపాదకుడు.
1949లో ప్రజారాజ్యం పత్రికకు ఉపసంపాదకుడుగా పనిచేశాడు .1950లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పబ్లిసిటీ ఆఫీసర్ పదవి చేపట్టారు.
1951లో ఆచార్య రంగా వాహిని పత్రిక ప్రారంభించారు ఇది రైతు ఉద్యమాలకు సహాయకారిగా ఉండేది దీనికి సభ ప్రధాన సంపాదకుడుగా పని చేశారు.
1954 నుండి 1939 వరకు అంధ్రప్రభ వార పత్రిక ఉప సంపాదకులుగా చేశారు. తరువాత చిత్తూరు లో 1950లో దేవదత్తం వార పత్రిక నడిపాడు .సభా కొంతకాలం పాంచజన్యం ఇంగ్లీష్, మాస పత్రిక నడిపారు సభా జమీన్ రైతు కు ఉప సంపాదకులు గా పనిచేశారు.
సభా 1978 నుండి మరణం రోజు దాక ఆంధ్రప్రభ దినపత్రికకు కరస్పాండెంట్ గా పని చేశారు . జర్నలిజం రంగంలో ఆయన సుదీర్ఘ కాలం పనిచేశారు. సభా బహుముఖ ప్రజ్ఞాశాలి. రచయితలకు దార్శనికుడు. వివిధ సాహిత్య సంస్థల ద్వారా ఎంతో సాహిత్య సేవ చేశారు.
రైతాంగం ఉపయోగించే వాడుక బాషలోని మాండలిక పదాలను సేకరించి తెలుగు సాహిత్య అకాడమీ ప్రచురించిన మాండలిక పదకోశానికి సమర్పించాడు. వెయ్యికి పైగా జానపదగేయాలనూ సేకరించి ఆంధ్రప్రభలో ప్రచురించాడు. కొన్ని రేడియోలో ప్రసారమయ్యాయి. కావ్యాలు, కవితలు, కథలు, గతికలు, నవలలు, బురకథలు, వ్యాసాలు, జీవిత చరిత్రలు, నాటకాలు, పత్రిక సంపాదకీయాలు, విమర్శలు, పాటలు, కోలాట పదాలు మొదలగు అనేక ప్రక్రియలలో రచనలు చేశారు. సభా 30 సంవత్సరాలు రచనలు చేసి తెలుగు సాహిత్య వికాసానికి అంకితమయ్యారు.
కె.సభా, రమా, కుమారి నిర్మల, జాబిల్లి విశ్వామిత్ర, కిసాన్ -కలం పేరుతో రచనలు చేశారు.
1943లో అరగొండలో స్వతంత్ర్య సాహితీ సమితి . అనే సమాజాన్ని స్థాపించారు. ‘ సాహిత్య అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సమాజ సేవా కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా నిర్వహించారు. ఇందులో సేవా నిరతులైన యువకులు ఉండేవారు .
1953 లో చిత్తూరు, కళాపరిషత్తు కార్యదరిగా జిల్లా కవుల, రచయితలకు చేయూత అందించారు.1960 చితూరులో రమణా ప్రెస్ , రమణ బుక్ స్టాల్ ప్రారంభించాడు. వివిధరచనలను ప్రచురించి యువ రచయితలను ప్రోత్సహించారు
1960లో ‘ శారదాపీఠం అనే సాహితీ సంస్థను స్థాపించారు.
సాహితీవేత్త లైన శంకరంబాడి సుందరాచారి, పూతలపట్టు, శ్రీరాముల రెడ్డి అలాంటి వారికి సన్మానం చేశారు. కొందరు ఉపాధ్యాయ పండితులకు సన్మానం చేశాడు. రమణ పబ్లికేషన్స్చే రమణ బుక్ స్టాల్ స్థాపించి సాహిత్య సేవ చేశారు.
1968 నవంబర్ 2న దామల్ చెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అష్టావధానం నిర్వహించి పలువురి ప్రశంసలు పొందారు. 1979 నుండి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యుడిగా చివరి వరకు తెలుగు సాహిత్య సేవ చేశారు.
రాజకీయ, న్యాయ, పాలనాయంత్రాంగాలు అవినీతి మయమైనప్పుడు, చివరకు ఫోర్త్‌ ఎస్టేట్‌ అయిన ప్రసార మాధ్యమాలు కూడా ధృతరాష్ట్ర కౌగిలిలో చిక్కినప్పుడు నిజాయితీపరుడైన ఒక విలేఖరి వ్యథను మృత్యుంజయుడు కథలో సభా చిత్రించారు.
బీరప్పలాంటి విలేఖరులకు చివరికి శ్రీముఖాలే అందుతాయనే సత్యాన్ని చెప్పారు. మరోపక్క అసత్యాల్ని, అతిశయోక్తుల్ని ఆధారం చేసుకొని రాసే కల్లబొల్లి వార్తలకు, ఎక్కువవుతున్న ప్రచారం, పెరిగిపోతున్న ఎల్లో జర్నలిజం వికృతరూపాన్ని కూడా ఈ కథలో ఆయన ఎండగట్టారు.
సభా జరుగుతున్న పరిణామాలను ఒక రచయితగా, పత్రికా రచయితగా ఎంత ముందు చూపుతో గమనించారో మృత్యుంజయుడు కథ ద్వారా తెలుస్తుంది. ‘నీటిదీపాలు’లో ప్రముఖ వ్యక్తి ఊరి లైన్‌మెన్‌, ‘బూరగపండు’లోని డబ్బున్న వాడిదే గెలుపు అనే ముందుచూపున్న బసప్ప లాంటి వాళ్ళు డెబ్బయ్యవ దశకం తర్వాత ఎంత స్థాయి కి వెళ్ళారో సభా కథలు ఆలోచింప చేస్తాయి. ఒక మాటాలో చెప్పాలంటే స్వాతంత్య్రానికి ముందు తరానికి చెందిన అంతరంగ ఘర్షణ ఆవిష్కరణే కె.సభా కథలు.
కె.సభా గారి అమూల్యం నవల గురించి గోతెలుగు. కామ్ లో సినీ రచయిత వంశీ ఇలాఅన్నారు.నాగరిక సమాజంలో మానవ సంబంధాలు పలుచబడుతున్నాయి. మనిషికి మనిషి తోడనే రోజులు కనుమరుగవుతున్నాయి.
మనిషి మరో మనిషిని నమ్మడం కన్నా తను సృష్టించిన యంత్రాన్నో, నోరు లేని జీవి నమ్మితే మేలనుకొంటున్న కాలం ఇది. మనిషి దృక్కోణం నుంచి ఈ ప్రత్యామ్నాయం సరే ! కానీ విచిత్రంగా మనిషి మాత్రం ఎవరి అంచనాకు అందని స్వార్థపరుడై పోతున్నాడు. “
నా దేశంలో ఆకలితో ఒక కుక్క కూడా మరణించకూడదు ” అని వివేకానందుడు పుట్టిన నేల మీద – ఆకలి కాదు, మనిషి ఎవరినైనా ఎంతకైనా చంపడానికి దిగజారడం ఘోరకలి ఈ దారుణమైన వ్యవస్థకు, ఆర్తితో, ఆవేదనతో అద్దం పట్టిన అమూల్యమైన కథ “అమూల్యం” .
నోరున్న వాళ్ళమీద ఎవరైనా కథలు, అల్లగలరు. నోరులేని జీవుల కళ్ళలోకి చూస్తూ వాటి కోసం కన్నీటిని సిరా చుక్కలుగా మార్చడం గొప్ప మనసున్న సభాగారి లాంటి రచయితలకే సాధ్యం
సభా 300 కథానికలు, 7 నవలలు, పిల్లలు -పెద్దల కోసం అనేక కథలు, రచనలు చేశారు. కథా సంకలనాల్లో బంగారు, పాతాళగంగ, నీటిదీపాలు, నవలల్లో భిక్షుకి, మొగిలి, దేవాంతకులు ముఖ్యమైనవి.
పిల్లలకోసం వచ్చిన కథా సంకలనాల్లో అరగొండ కథలు, సీసాచరిత్ర, ఐకమత్యం, చిలకమ్మ, బొంగరం, ప్రాచీన భారతి, విప్లవగాథలు చెప్పుకోదగ్గవి.
పిల్లల నవలల్లో మత్స్యకన్యలు, సూర్యం, కవిగాయకుడు, చంద్రం, పసిహృదయాలు, బుజ్జి జిజ్జి, పావురాలు, బాలల నాటకాల్లో పరీక్షా ఫలితాలు, చిట్టిమరదలు, స్వతంత్రోదయం, పురవదినాయక, ఏటిగట్టున, చావుబేరం, బుర్రకథల్లో రైతురాజ్యం, పాంచజన్యం పేరొందాయి.
దయానిధి, వేదభూమి, విశ్వరూప సందర్శనం అనేవి వీరి ప్రచురిత కావ్యాలు. 500 పైగా వివిధ పత్రికల్లో కవితలు ప్రచురితమయ్యాయి. . ‘పిచ్చిదంపతులు’ అనే ఆయన కథ చదివినప్పుడు సమాజ ప్రేమకు మనస్సున్న మనుషులు కావాలనే ఒక సామాజిక వేదన గుండెను తాకుతుంది.
‘అంబా’ కథ సీమకరవు నేపథ్యంతో రాసింది. చదివిన ప్రతి పాఠకుణ్ణి అది ఒక విషాదాంతసంఘటనగా వెంటాడుతుంది. ”చుక్కలవరాలు’ కథ అచ్చమైన దేశీయతను చెబుతుంది.
1975లో మొదటి ప్రపంచ తెలుగు సభల్లో ప్రభుత్వం ఆయనను సత్కరించింది.
1980 నవంబర్ 4, న ఆయన మరణించారు. ఈయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడు కూడా మంచి రచయిత.

 

(చందమూరి నరసింహారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, ఖాసాసుబ్బారావు అవార్డు గ్రహీత ఫోన్ నెంబర్:9440683219)