ఇంగ్లిష్ మీడియమ్ ను తల్లితండ్రుల హక్కుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని, అందుకేదానిని ఒక హక్కుగా అమలుచేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈరోజు 74 సాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా విజయవాడలో పతాకావిష్కరణ జరిపిన అనంతరం ప్రసంగిస్తూ ఆయన ఈ విషయం వెల్లడించారు.
జగన్ ప్రసంగంలోకి ముఖ్యాంశాలు
ఇంగ్లీష్ మీడియం ఒక హక్కు
చదువుకునే హక్కు మీకుందని రాజ్యాంగంలో రాసిన వాక్యాలు ఆచరణలోకి తీసుకురావాల్సిన అవసరం గుర్తించి, తల్లిదండ్రుల కోరిక మేరకు ఇంగ్లిష్ మీడియమ్‌ను ఒక హక్కుగా అమలు చేస్తున్నాం. చదువే నిజమైన ఆస్తి, చదువే నిజమైన సంపద అని నమ్మి విద్యా విధానంలో మార్పులు తీసుకువచ్చాం.
అంతే కాకుండా విద్యను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ సంస్థల మీద కొరడా ఝలిపించేందుకు మన ప్రభుత్వ హయాంలో రెండు కమిషన్లు నియమించాం. తల్లిదండ్రులకు, పిల్లలకు ఊరటనిచ్చేలా ఈ కమిషన్లు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రైవేటు సంస్థలను రెగ్యులేట్ చేయబోతున్నం. కట్టిన డబ్బుకు తగిన నాణ్యత, తగిన ప్రమాణాలు పాటించేలా చూస్తాం.
ప్రత్యేక హోదా–డిమాండ్
పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదాను అమలు చేయాలని ఎప్పటికీ గట్టిగా అడుగుతూనే ఉంటాం. కేంద్రంలో ప్రభుత్వం మిగతా పార్టీల మద్దతు మీద ఆధారపడే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికిప్పుడు వారు ఇచ్చే అవకాశం కనిపించకపోయినా రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదాను కచ్చితంగా సాధించాలన్న ధృఢ సంకల్పంతో ఉన్నాం. ఈరోజు కాకపోతే భవిష్యత్తులో అయినా దేవుడి దీవెనలతో పరిస్థితులు మారి, కేంద్ర ప్రభుత్వం మనసు మారి, ప్రత్యేక హోదా ఇస్తుందనే నమ్మకంతో, హోదా కోసం కేంద్రాన్ని డిమాండ్ చేస్తూనే ఉంటాం ఇచ్చే దాకా.
పరిపాలన వికేంద్రీకరణ
రాష్ట్ర విభజన ద్వారా అయిన గాయాలు మానాలన్నా, అలాంటి గాయాలు మరెన్నడూ తగలకుండా జాగ్రత్త పడాలన్నా, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో సమన్వయం వర్ధిల్లాలి. దీనికి వికేంద్రీకరణే సరైన విధనామని నిర్ణయించి మూడు ప్రాంతాలకు సమ న్యాయం జరిగేలా మూడు రాజధానుల బిల్లును చట్టంలా మార్చాం.
త్వరలో విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని, కర్నూలు కేంద్రంగా న్యాయ రాజధాని ఏర్పాటుకు పునాదులు వేస్తాం.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ పథకాన్ని తీసుకున్నా.. ప్రతి ఒక్క పథకం మీద ఈరోజు మన ప్రభుత్వం చేస్తున్న ఖర్చుకు పూర్తి స్థాయి ఫలాలు, ఫలితాలు మరో 10 నుంచి 20 ఏళ్ల తర్వాతే వస్తాయి. కాబట్టి ఇవి ఎన్నికల పథకాలు కావు. ఇవి మన రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక రాజకీయ చరిత్రలో మెరుగైన మార్పుల కోసం.. బాధ్యతతో, మనసుతో అమలు చేస్తున్న పథకాలు.
అక్క చెల్లెమ్మలకు తోడుగా
ఇక అక్క చెల్లెమ్మల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడేలా 23 లక్షల అక్క చెల్లెమ్మలకు తోడుగా చేయూత కార్యక్రమాన్ని మూడు రోజుల క్రితం ప్రారంభించాం. అమ్మ ఒడి ద్వారా అక్షరాలా 43 లక్షల తల్లులకు, 82 లక్షల పిల్లలకు లబ్ధి చేకూర్చాం. విద్యాదీవెన మొత్తాన్ని అమ్మ పేరుతో బ్యాంకులో వేస్తున్నాం. వసతి దీవెన ద్వారా పిల్లల లాడ్జింగ్, బోర్డింగ్ ఖర్చులన్నింటినీ కూడా నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. 91 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు మేలు చేసేలా సున్నా వడ్డీ డబ్బులు జమ చేశాం. అదే 91 లక్షల అక్క చెల్లెమ్మలకు 2019 ఎన్నికల తేదీ వరకు ఉన్న పొదుపు సంఘాల రుణాలకు సమానమైన మొత్తాన్ని నాలుగు విడతల్లో వారి చేతికి ఇచ్చే ఆసరా కార్యక్రమాన్ని వచ్చే నెలలో అమలు చేస్తున్నాం.
దిశ బిల్లును ఆమోదించాం. దిశ పోలీసు స్టేషన్లు, దిశ యాప్ ద్వారా మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. నామినేటెడ్ పదవులు, నామినేషన్ విధానంలో ఇచ్చే పనుల్లో 50 శాతం అక్క చెల్లెమ్మలకు ఇస్తూ అసెంబ్లీలో ఏకంగా చట్టం తీసుకువచ్చాం. దేశ చరిత్రలో కనీవినీ ఎరగని విధంగా 30 లక్షల అక్క చెల్లెమ్మల పేరిట ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌కు రంగం సిద్ధంగా ఉంది.
Like this story? Share it with a friend!