సంతోషానికి ఐదు శక్తివంతమైన ‘రూమి’ గుళికలు

(CS Saleem Basha)
జలాలుద్దీన్ ముహమ్మద్ రూమి (30 సెప్టెంబర్ 1207-17 డిసెంబర్ 1273) ఒక పర్షియన్ కవి.ఆయన మన వేమన్నలాాగా  చిన్న  చిన్న ఆధ్యాత్మిక పదాలు (spiritual couplets) రాశాడు. ఇందులో Mathnawi Ma’nawi పదకావ్యం చాలా ప్రముఖమయింది. ఆయన పదాలను సెకండ్ ఖురాన్ లేదా పర్షియన్ ఖురాన్ అని కూడా పిలుస్తారు.

2014లో కూడా ఆయన పుస్తకాలు అమెరికా బెస్ట్ సెల్సర్స్.
మనిషి సంతోషంగా ఉండకపోవడానికి 5 కారణాలు చెబుతాడు రూమి. చెబుతాడు అనడం కన్నా నిర్వచిస్తాడు అనడం కరెక్ట్. మొదటిది ” విషం”. రూమి ఉద్దేశంలో లో ” ఏదైనా సరే అవసరానికన్నా ఎక్కువైతే అది విషంగా మారుతుంది. అది అధికారం కావచ్చు, ప్రేమ కావచ్చు, సంపద కావచ్చు, కోపం కావచ్చు, సోమరితనం కావచ్చు, ఆశ కావచ్చు, ద్వేషం కావచ్చు సంతోషమే కావచ్చు!” అతి అన్నది దుఃఖ కారకం.
రెండోది కోపం. “కోపం అన్నది మన నియంత్రణలో లేని వాటిని అంగీకరించకపోవడం. మన నియంత్రణలో లేని వాటిని అంగీకరిస్తే కోపం సహనంగా మారుతుంది” సంతోషానికి దారి సుగమం అవుతుంది. కోపం అన్నది ఒక అగ్ని. వేడి పుట్టిస్తుంది. సంతోషం ఆవిరైపోతుంది. అంటే భూమి అది స్వల్ప మోతాదులో ఉంటే పర్వాలేదు. మోతాదు మించితేనే ప్రమాదం.
మూడోది ద్వేషం.” వ్యక్తులు ఎలా ఉంటారో వాళ్ళని యధాతధంగా స్వీకరించక పోవడం. వ్యక్తులను ఎలా ఉంటారో అలాగే స్వీకరించ గలిగితే అది ప్రేమగా మారుతుంది. లేకపోతే ద్వేషంగా మారి, అవతలి వాళ్ల సంగతి ఏమో గానీ మనకు సంతోషం లేకుండా చేస్తుంది.”
నాలుగోది భయం.” అనిశ్చిత పరిస్థితిని స్వీకరించ లేకపోవడం భయానికి దారి తీస్తుంది. మనం ఊహించని పరిస్థితిని స్వీకరించగలిగితే, అది సాహసం అవుతుంది. అప్పుడు భయం స్థానంలో మనకు ఆనందం కలుగుతుంది.
ఐదోది చాలా ముఖ్యమైనది. అదే అసూయ. అన్నిటికన్నా ప్రమాదకరమైనది. “ఇతరులలో మంచిని, వారి ఎదుగుదలను స్వీకరించక పోవడం. అలా స్వీకరించగలిగితే అది మనకు ఇన్స్పిరేషన్ అవుతుంది.”. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇది చాలా కష్టమైన విషయం. అసలు చాలామంది సంతోషంగా ఉండకపోవడానికి ఇదే ప్రధాన కారణం.
“మనం ఏం ఏం ఆలోచిస్తున్నామో , ఏం చెప్తున్నామో , ఏం చేస్తున్నామో – సంతోషం అంటే మూడు ఒకటే అయినప్పుడు మనం సంతోషంగా ఉన్నట్లు”, అని చెప్పింది ఎవరో కాదు, మహాత్మా గాంధీ. సంతోషం గురించి చాలా నిగూఢమైన అర్థం ఉన్న మాటలు ఇవి. అయితే వీటిని అర్థం చేసుకుంటే సంతోషం పూర్తి చేసినట్లే! సంతోషంగా ఉండడం అంటే దాదాపుగా స్వచ్ఛంగా ఉండటం. గిల్టీ ఫీలింగ్ లేకుండా ఒక నిర్మలమైన భావనే సంతోషం అంటే.
సంతోషం బయట నుంచి లోపలికి వెళ్ళేది కాదు. లోపలి నుంచి బయటకు వచ్చేది. అది ఒక అనిర్వచనీయమైన అనుభూతి. గాంధీ గారు చెప్పిన సిద్ధాంతం చూస్తే, ఒకటి ఆలోచించి మరొకటి బయటకు చెప్పడం గిల్టీ ఫీలింగ్ ని కలిగిస్తుంది. అప్పుడు సంతోషం అనేది బయటికి రాదు. పోనీ, ఏం ఆలోచిస్తాము అదే బయటికి చెప్పినా కూడా, దాన్ని పాటించకపోతే మళ్ళీ సంతోషంగా ఉండదు. నిజానికి గాంధీ చెప్పింది ప్రస్తుత ప్రపంచంలో అంత సులభమైన విషయం కాదు. కానీ గొప్ప వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూస్తే, గాంధీ చెప్పింది తు.చ తప్పకుండా ఉంటుంది. అందుకే వాళ్ళు క్లిష్ట పరిస్థితుల్లో కూడా సంతోషం అనే స్వచ్ఛమైన భావనతోనే ఉంటారు.
సంతోషాల సప్తపది
సంతోషం గురించి జరిగిన ఒక సర్వేలో, తేలిన విషయం ఏంటంటే, సంతోషంగా ఉండే వ్యక్తులందరికీ 7 లక్షణాలు కామన్ గా ఉంటాయని తెలిసింది. అవేంటో చూద్దాం..
1. కృతజ్ఞతా భావం. సంతోషంగా ఉన్న వాళ్ళు కృతజ్ఞతలు కలిగి ఉంటారు. జీవితంలో చిన్న
చిన్న విషయాలకు కూడా కృతజ్ఞతలు తెలుపుతారు.
2. వర్తమానంలో జీవించడం. సంతోషంగా ఉన్న వాళ్ళు ఎప్పుడూ గతం గురించి గానీ, భవిష్యత్తు గురించి గానీ అసలు పట్టించుకోరు.
3. సంతోషంగా ఉన్నవారంతా హాస్య ప్రియులు. వాళ్లకి సెన్సాఫ్ హ్యూమర్ ఉంటుంది. నవ్వు నాలుగు విధాలా చేటు కాదు, నలభై విధాల మేలని వారికి బాగా తెలుసు. వారు ముఖ్యంగా భావించేది ఏంటంటే ” సమస్యలు వచ్చినప్పుడు నవ్వడం వల్ల సమస్యలు తీరిపోవు కానీ, నీ కష్టాలను ఎదుర్కొనే సామర్థ్యం ఇంకా పెరుగుతుంది”.
4. సంతోషంగా ఉండే వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఎక్కువ. వాళ్ళకి తమ సామర్థ్యం మీద అపారమైన నమ్మకం ఉంటుంది. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలమన్న విశ్వాసం వారి సొంతం. ఆత్మవిశ్వాసం అన్నది సంతోషానికి దగ్గర బంధువు. చాలా మంది సంతోషంగా ఉండేవాళ్ళు, క్లిష్టమైన పరిస్థితుల్లో నే రాణిస్తారు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా భయపడకుండా ఉండగలుగుతారు.
5. పరిస్థితులకు అనుగుణంగా తమను తాము కలుసుకోవడం సంతోషంగా ఉన్న వాళ్ల ముఖ్యమైన లక్షణం. అనుకోని పరిస్థితులు ఎదురైనా, బెంబేలు పడకుండా, తమని తాము పరిస్థితులకనుగుణంగా మార్చుకోగలుగుతారు. అలాగే పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోగలవు తారు.
6. సంతోషంగా ఉండే వాళ్ళు ఆశావాదులు. నిరాశను వారు ఎప్పుడూ దగ్గరికి రానివ్వరు. వాళ్లు ప్రతి దాన్ని పాజిటివ్ గానే తీసుకుంటారు. అటువంటి పాజిటివ్ దృక్పథం వల్లనే వారు నిరంతరం ఆశావాదాన్ని ప్రతిబింబిస్తూ ఉంటారు.
7. వాళ్లు డబ్బుకి, పదవులకి, ఇతర భౌతికమైన విషయానికి పెద్దగా విలువ ఇవ్వరు. స్నేహానికి, విలువలకు, కుటుంబానికి, సంతోషానికి ప్రాధాన్యతనిస్తారు. ఆస్తులు సంపాదించడం కన్నా, ఆప్తులను సంపాదించుకోవడం లోనే సంతోషాన్ని పొందుతారు.

 

(CS Saleem Basha వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ఇతని ప్రవృత్తి – 9393737937)