రేపు అంటే సోమవారం జూలై 15, 2019న తెల్లవారు జామున 2.51ని.లకు భారత శాస్త్రవేత్తలు చంద్రయాన్ మిషన్ ప్రారంభిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట నుంచి GSLV MKIII ఆకాశంలోకి ఎగురుతుంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి దక్షిణ ధృవం మీద ఒక రోబొటిక్ రోవర్ దించుతుంది.
ఇది చంద్రుడితో గాఢానుబంధం ఉన్న భారతీయులుందరికి ఎంతో ఆనందకరమయిన విషయం. ఈ సందర్భంగా చంద్రుడెలా మన సంస్కృతి లోకి వచ్చాడో మనం తెలుసుందాం… చంద్రుడి వల్ల భారతీయుల జీవితం, సంస్కృతి,సాహిత్యం,కళలు అన్నీ సంపన్నమయ్యాయి… అందుకే చంద్రుడెలా చంద్రుడు మన జీవితంలోకి ఎంత గొప్పగా ఎంటరయ్యాడో చూడండి…
చందమామ రావే, జాబిల్లి రావే…
చాలా కాలం కిందటి మాట… చాలా చాలా కాలం కిందటి మాట. ఎంతకాలం కిందటో చెప్పడం చాలా కష్టం. దేవుడు అపుడే కొత్తగా ప్రపంచాన్ని సృష్టించాడు. అంటే ఎంత పూర్వమో మీకు అర్ధమవుతుంది. అపుడు భూమ్మీద మనుషులు, వాళ్లకి తోడుగా … ఆకాశంలో సూర్యుడు…ఎపుడూ ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉంటాడు. మనుషులంతా కష్టపడి పనిచేస్తున్నారు.ఒక్కటే పని. విసుగు విరామం లేకుండా పనిచేస్తున్నారు. విశ్రాంతనేది లేకుండా పని చేస్తున్నారు. అలాకొంతకాలం గడిచింది.
ఒక సుప్రభాతాన, తను సృష్టించిన ప్రపంచంలో మనుషులుఎలా ఉన్నారో చూసి రావాలనుకున్నాడు దేవుడు.
ఆయన వెంటనే ప్రపంచంలో ప్రత్యక్ష మయ్యాడు. దూరాన ఒక పొలంలోకి ప్రవేశించాడు. పొలంలో పనిచేసుకుంటూ పోతున్నారు మనుషులు. వాళ్ల దగ్గిరకు వెళ్లి ఒక మనిషి పిలిచి ఇలా ప్రశ్నించాడు.
‘ఈ చెట్లకు నీళ్లెపుడు పోశారు.’
‘ఈ రోజే ’ అని సమాధానంచెప్పాడు మనిషి.
‘మరి ఈ బావి ఎపుడు తవ్వారు?’ అని అడిగాడు దేవుడు.
‘ ఈ రోజే ’ అన్నాడు మనిషి
‘ఈ తోటలో ఈ చెట్లెపుడు నాటారు?’
‘అవి కూడా ఈ రోజే’
తర్వాత , దేవుడు పక్కనున్న ఒక స్త్రీ దగ్గిరకు వెళ్లాడు. ఆమె ఒడిలో చిన్న పాప ఉంది.
‘ ఈపాప ఎపుడు పుట్టింది.’ అని అడిగాడు.
‘ఈ రోజే’ అని ఆమె చెప్పింది.
ఇదేంటి, వీళ్లని సృష్టించి చాన్నాళ్లయిందిగా , ఇంకా ఈ రోజే అంటున్నారేమిటని దేవుడు ఆలోచనలో పడ్డాడు.
అపుడు దేవుడికి ఒక విషయం అర్థమయింది. వీళ్లకి టైం గురించి ఏమీ అవగాహన లేదు. టైం తెలియకపోవడంతో వీళ్లిలా పనిచేసుకుంటూ పోతున్నారు. ఎపుడు పని ప్రారంభించాలి, ఎపుడు ఆపేయాలి, ఎపుడు విశ్రాంతి తీసుకోవాలనే డివిజన్ లేకుండాపోయిందనుకున్నాడు. ఇదంత మంచి పద్ధతికాదు. దీని కోసం ఏమయినా చేయాలనుకున్నాడు.
వీల్లకి పనిచేసేందుకు పగలు, విశ్రాంతి తీసుకునేందుకు రాత్రి అనే విభజన చేయాలనుకున్నాడు. దేవుడు వెంటనే సూర్యున్ని పిలిచి, ‘చూడు నువ్వు పగలు మాత్రమే ప్రకాశించాలి. తర్వాత వెళ్లిపో.మళ్లీ మరుసటి రోజు పొద్దనే రావాలి,’ అని ఆదేశించాడు.
సూర్యుడు ‘అలాగే’ అని చెప్పి వెళ్లిపోయాడు.
ఇవి కూడా చదవండి
* ప్రపంచంలోనే ఖరీదయిన ద్రాక్షపళ్లివే…
* కూరగాయల్లా బంగారు కొనే రోజులొస్తాయా?
*భారత జట్టు సైమీ ఫైనల్లో ఓడేందుకు కారణమెవరు?
అప్పటినుంచి పగలు రాత్రి అనేవి ఏర్పడ్డాయి. ‘ఇక నుంచి మీరు పగలు పనిచేయడండి, రాత్రి విశ్రమించండి’ అని మనుషులందరికి దేవుడు చల్లగా చెప్పాడు.
ఇకనుంచి ప్రజలు హ్యాపీగా ఉంటారని భావించి అంతర్థానమయ్యాడు.
అయితే, దేవుడనుకున్నట్లు జరగలేదు.
సూర్యుడు పగలంతా ప్రకాశించి, వెలుతురు ఇచ్చి ఎటో వెళ్లిపోతున్నాడు.
ఆయన అలా పోగానే ఇక్కడ ప్రపంచంలో గాఢాంధకారం మొదలవుతున్నది. ఆ కారు చీకట్లో మనుషులకేమీ కనిపించడంలే. మనిషెవరో, చెట్టెవరో, పుట్టేదో, బావేదో, గొయ్యేదో తెలియక మనుషులు ప్రమాదంలో పడిపోతున్నారు.
రాత్రి జీవితం చాలా కష్టమయింది. చీకటి పడుతుందని ప్రతి రోజూ అంతా భయపడటం మొదలు పెట్టారు. రాత్రవుతూనే భయం భయంగా బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు.
ఇలా కొద్ది రోజులు గడిచాయి. తను సృష్టించిన మనుషులు ఇపుడెలా ఉన్నారో చూడాలనుకున్నాడు దేవుడు. మళ్లీ ప్రపంచంలోకి వచ్చాడు.
మనుషులున్న చోటికి వచ్చి ‘ఇపుడెలా ఉంది జీవితం’ అని అడిగాడు.
‘పగలు రాత్రి విభజించాగా. ఇక మీరు పగలు పని చేసి రాత్రి విశ్రాంతి తీసుకుంటున్నారా,’ అని అడిగాడు.
అయితే,అంతా బోరుమన్నారు. దేవుడికిదేమిటో అర్థంకాలేదు. ‘ మళ్లీ ఏమయింది, అని అడిగాడు దేవుడు.
‘మీ సమస్య పరిష్కారమయిందిగా, మళ్లీ ప్రాబ్లమేమొచ్చింద,’ని అడిగాడు.
‘పగలు రాత్రి విభజన బాగుంది. పగలంతా పని చేస్తున్నాం, రాత్రి విశ్రాంతి తీసుకుంటున్నాం. అయితే, ఒక సమస్య పీడిస్తా ఉంది. సాయంకాలం కాగానే సూర్యు డు ఉన్నట్లుండి మాయమై పోతాడు, అంతే. అంతటా చీకటి పడుతూ ఉంది. దాంతో చుట్టూ ఏముందో మాకేమి కనిపించడం లేదు. చీకట్లో ఒకర్నొకరురు ఢీకొన్నాల్సి వస్తున్నది. చెట్లకు కొట్టుకుంటున్నాం, రాళ్లకు కొట్టుకుంటున్నాం. చాలా మంది కింద పడి గాయపడుతున్నారు. సామాన్లన్నీ పగిలిపోతున్నాయ్. ఏ వస్తువు ఎక్కడ పెట్టామో కూడా కనిపించడం లే. అందువల్ల రాత్రి కూడా కొద్ది సేపయినా వెల్తురు కావాలి,’ అని ప్రపచంలోని పెద్ద మనుషులంతా దేవుడికి వివరించారు.
దేవుడు ఒక్క క్షణం ఆలోచించాడు.కరెక్టే కదా అనుకున్నాడు. రాత్రి పూట మీకిన్ని సమస్యలుండటానికి వీల్లేదు. నేనేదో ఒకటి చేస్తాను అని మనుషులకు హామీ ఇచ్చాడు.
‘రాత్రి పూట కూడా కొద్దిగా వెలుతురు వచ్చే ఏర్పాటు చేస్తాను. అంతేకాదు, ఆ వెల్తురు చల్లగా, హాయిగా ఉండే ఏర్పాటు చేస్తాను.. అపుడు మీకు పప్రంచమంతా కనిపించడమే కాదు, ప్రశాంతంగా నిద్రపోవచ్చుకూడా, ’ అని దేవుడు మనుషులకు హామీ ఇచ్చాడు.
అపుడు దేవుడు పక్కకు పోయి చందమామను సృష్టించాడు. వాళ్ల కళ్ల ముందే సాయంకాలమయింది.
సూర్యుడు తన పని ముగించుకుని వెళ్లిపోయాడు.
వాళ్లు చూస్తుండగానే ఆకాశంలో చందమామ ప్రత్యక్షమయ్యాడు. మనుషులంతా సంతోషంతో కేరింతలుకొట్టారు. చప్పట్లు కొంటారు. ఎందుకంటే చందమామ ఇచ్చే వెలుతురు సూర్యుడి ఎండలాగా వేడిగా లేదు. చల్లగా, హాయిగా ఉంది.చంద్రుడి వెలుతురులో ప్రపంచం ఎపుడూ లేనంత రొమాంటిక్ గా కనిపించింది.అందరిలో ఉల్లాసం తొణికిస లాడింది.
ఆ రాత్రి అంతా ప్రశాంతంగా,నిశ్చింతగా నిద్రపోయారు. మరుసటి రోజు పొద్దునే మళ్లీ లేచే సరికి ఎవరికి అలసట లేదు. దానికి తోడు హుశారుగా తయారయ్యారు.
అలా చందమామ ప్రపంచంలోకి వచ్చాడు. అప్పటినుంచి ఇప్పటి దాకా మనుషులందరి మధ్య మనిషిలాగా మెలుగుతూ వస్తున్నాడు.
అందుకే కథల్లో చందమామ, పాటల్లో చందమామ, కవిత్వంలో చందమామ, ఇంట్లో చందమామ, ఇంటి బయట చందమామ, పిల్లలకు అన్నం తినిపించాలంటే చందమామ, సినిమా హీరో యిన్లు పాటపాడుకోవాలంటే చందమామ. చందమామ లేని జీవితం లేదు. అట్లాంటి చందమామ దగ్గిరకు రేపు మనవాళ్లు స్పేష్ క్రాఫ్ట్ పంపిస్తున్నారు.
(ఇదొక జానపద కథ)