Home Telugu భారత జట్టు తన చేతిలో తానే ఓడిపోయింది… (విశ్లేషణ)

భారత జట్టు తన చేతిలో తానే ఓడిపోయింది… (విశ్లేషణ)

485
1
SHARE
(సలీం బాష)
భారత జట్టు మరోసారి తన చేతిలో తాను ఓడిపోయింది!! ప్రపంచ కప్ లో విజయం ముంగిట బోల్తా కొట్టడం భారత జట్టు కి ఇది ఐదవ సారి. 4 సార్లు సెమీ ఫైనల్ లో(1987,1996,2015, 2019), ఒక సారి ఫైనల్ లో (2003).
భారత్ జట్టు బలమైనదని ఇతర జట్లు భావిస్తాయి. కానీ భారత జట్టు మాత్రం కీలక సమయంలో అలా భావించదు. అందుకే ఒక అంతగా బలంగా లేని ప్రత్యర్థి న్యూజిలాండ్ చేతిలో తనంతకు తానే ఓడిపోయింది, కోట్ల మంది అభిమానులను, క్రికెట్ ప్రేమికులను ని నిరాశకు గురిచేసింది. ఇంతవరకు ప్రపంచ కప్ లో భారత జట్టు మూడు సార్లు మాత్రమే ఫైనల్స్ కు చేరగా రెండు సార్లు గెలిచింది(1983,2011), ఒక్కసారి ” రన్నరప్”(2003) గా నిలిచింది.
ఇప్పుడిక భారత జట్టు ఓడిపోవడానికి గల కారణాలను విశ్లేషించడానికి మీడియా, ప్రజలు, అభిమానులు తమ తమ విశ్లేషణలతో సిద్ధంగా ఉంటారు, కొండకచొ బిజీగా ఉంటారు.
భారత జట్టు ఎప్పుడైనా సరే ఓడిపోవడానికి, మొదటి కారణం ప్రొఫెషనలిజం లేకపోవడం! రెండవ కారణం అవసరమైనప్పుడు సమిష్టి తత్వాన్ని చూపించకపోవడం(ఇంతవరకు భారత జట్టు గెలిచిన 2 ప్రపంచ కప్ లను పరిశీలిస్తే ఆ విషయం స్పష్టమవుతుంది).
ప్రతిసారి ఒకరిద్దరి మీదే ఆధార పడటం. ఇది ఆ ఆటగాళ్ల మీద ఒత్తిడి పెంచుతుంది. ఈ మ్యాచ్ లో కూడా జరిగిందదే! రోహిత్, కోహ్లీ, రాహుల్ ఔట్ కావటానికి కారణం అదే!. దీనికి తోడు జట్టు ఎంపికలో రాజకీయాలు. మరో ముఖ్యమైన కారణం. అదనంగా భారతదేశ అభిమానులు పెంచే ఒత్తిడి! భారత జట్టు ఎంపిక, కూర్పు ప్రతిసారి వివాదాస్పదమే!
జట్టులో ప్రతిభావంతులకు చోటుండదనే విమర్శ ఉంది. ఈమధ్య మరో కొత్త వాదన తెరమీదికి వచ్చింది. జట్టులో దాదాపుగా అందరూ అగ్రవర్ణాల ఆటగాళ్లే ఉన్నారు, ప్రతిభావంతులైన బలహీన, బడుగు, దళిత వర్గాల కి భారత జట్టులో చోటు దొరకడం లేదు అన్నది. ఈ వాదనకు క్రమ క్రమంగా బలం చేకూరుతోంది.

ఇంతకుముందు రెండుసార్లు ప్రపంచ కప్ ఛాంపియన్ అయిన భారత్ డిఫెండింగ్ చాంపియన్ గా రెండుసార్లు సెమీ ఫైనల్లో ఓడిపోయింది (1987, 2015).ఈ ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ ను గమనిస్తే భారత జట్టుకి ఒక స్పష్టమైన ప్రణాళిక లేదని అర్థమవుతుంది.
అంతవరకూ చాలా బాగా రాణించిన మహమ్మద్ షమీ ని ముఖ్యమైన సెమీ ఫైనల్ మ్యాచ్ కు దూరం పెట్టడానికి కారణం ఏమిటో కోచ్ కి , కోహ్లీకి మాత్రమే తెలియాలి! ఇది కేవలం అంతర్గత రాజకీయం మాత్రమే.
బయటి రాజకీయాలు కూడా చాలా ఉంటాయి. ఉదాహరణకు అంబటి రాయుడు వ్యవహారం. చక్కటి గణాంకాలు ఉన్న రాయుడి ని (పైగా రిజర్వుడ్ లో ఉన్నాడు ) కాదని మయాంక్ అగర్వాల్ కి అవకాశం ఇవ్వడం. దీనికి కారణం మరో తెలుగువాడైన చీఫ్ సెలెక్టర్ ఏం ఎస్ కె ప్రసాద్ కావడమే నని చాలా మంది క్రికెటర్లు అభిప్రాయం కూడాను. కొంతవరకు రాయుడి నోటి దురుసు కూడా!
కీలకమైన ఈ మ్యాచ్లో భారత జట్టు న్యూజిలాండ్ ని తక్కువ పరుగులకే ఆలౌట్ చేసినా సరైన ప్రణాళిక లేకపోవడం వల్లనే ఓడిపోయింది. ధోని చాలా అనుభవం ఉన్న ఆటగాడు. మిస్టర్ కూల్ అని కూడా పేరు ఉంది. మొదటి మూడు వికెట్లు పడిన తర్వాత ధోని కి బదులుగా ఏ మాత్రం అనుభవం లేని పంత్ ను, నిలకడలేని పాండ్యా ను పంపించడం మనకు అర్థం కాదు.
తన క్రికెట్ జీవితం లో ఎన్నో మ్యాచ్ లు సంయమనంతో ఆడి గెలిపించిన ధోనిని ముందు పంపించి పరిస్థితులను నియంత్రించే అవకాశం ఇవ్వక పోవటం ఒక తప్పిదం. ఈ మ్యాచ్ లో అలాంటివి ఎన్నో ఉన్నాయి.
ధోని మైదానంలో ఉంటే అనుభవము, నిలకడతో గెలిపించే అవకాశాలు ఎక్కువ. భారత జట్టు కోచ్ కెప్టెన్ పిచ్ ను కూడా సరిగా అంచనా వేయలేదని అర్థమైంది. కానీ న్యూజిలాండ్ కెప్టెన్ విలియంసన్ పిచ్ ను చక్కగా అంచనా వేశాడు. 240 పరుగులను ప్రణాళికాబద్ధంగా కాపాడుకోగలిగాడు.
న్యూజిలాండ్ పక్క ప్రణాళికతో, పటిష్టమైన వ్యూహాలతో ఆడిందని చూసినవాళ్ళకి అర్థమవుతుంది. ఒక బలమైన జట్టు సరైన ప్రణాళిక, వ్యూహం లేక ఓడిపోవడం అంటే ఇదే! అలాగని న్యూజిలాండ్ జట్టును తక్కువ చేయడం లేదు.
ప్రతి ఓవర్ కి ఒక ప్రణాళిక ఉండవలసిన సమయంలో భారత జట్టు ఆ పని చేయలేక పోయింది. వర్షాన్ని నిందించడం కన్నా అది వచ్చినప్పుడు వ్యూహాల్లో మార్పు ఎలా ఉండాలి అన్నది భారత జట్టులో లేదు. న్యూజిలాండ్ మాత్రం తెలివిగా ఆలోచించింది.
అందుకే 80 బంతుల్లో ఒక్క ఫోర్ కూడా కొత్త కుండా పరుగులు పేర్చుకుంటూ పోయింది. మనవాళ్ళు అలా చేయలేదు. అనవసరమైన షాట్ లు ఆడి, ( పంత్, పాండ్యా, కార్తీక్ లు). ధోని ఒక్కసారి కూడా అలా చేయలేదు. పాపం ధోని. తన మొదటి వన్డేలో రన్ అవుట్ అయినా ధోని, తన చివరి వన్డేలో కూడా రన్ అవుట్ కావటం విశేషం!
గతంలో జరిగిన ఆష్ట్రలేషియా కప్పు లో కపిల్ దేవ్ లెక్క సరిగ్గా వేసుకోలేక చివరి ఓవర్ తాను వేయకుండా చేతన్ శర్మ కు ఇవ్వటం, మియాందాద్ చివరి బంతిని సిక్స్ గా కొట్టడం ఇప్పటికీ జీర్ణించుకోలేక ఉన్నాము. అప్పుడు కపిల్ దేవ్ “లెక్కల ట్యూషన్ ” చెప్పించుకోవాలని ఒక పేపర్ రాసింది.
ఇప్పుడు లెక్కలు ఎవరు నేర్చుకోవాలి? కోచ్ రవి శాస్త్రియా, కోహ్లీనా, జట్టు మొత్తమా? లేక కేవలం డబ్బు లెక్కలు మాత్రమే చూసుకుంటూ ఎవరినీ, దేన్నీ “లెక్క” చేయని, ప్రపంచం లోనే అత్యంత ఖరీదైన బోర్డు, బి.సి.సి,ఐ నా?
కారణాలు ఎన్ని ఉన్నా, ఒక అభిమాని ” భారత జట్టును ఎవరూ ఓడించలేరు” అని చెప్పడం కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే భారత జట్టు ని ఈసారి కూడా ఎవరూ ఓడించ లేదు. భారత జట్టు తనను తాను ఓడించుకుంది!!.
చివరిగా బెర్నార్డ్ షా చెప్పింది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ” క్రికెట్ అన్నది పదకొండు మంది ఫూల్స్ ఆడితే, పదకొండు మిలియన్ ఫూల్స్ చూస్తారు”. మొత్తంమీద బోర్డు,భారత జట్టు కలిసి ఒక బిలియన్ అభిమానులను ఫూల్స్ చేసినట్లేనా?
(సలీం బాష..రచయిత, స్పోర్ట్స్ జర్నలిస్టు)