ఢిల్లీ రైతు ఉద్యమంలో కనిపించని శక్తి ‘మహిళ’

-ఇప్టూ ప్రసాద్, పిపి (సింఘా సరిహద్దు నుంచి)
ఢిల్లీ  రైతాంగ ఉద్యమంలో స్త్రీల పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి ఉంది.  బయటనుంచి  చూస్తే  స్త్రీలు తక్కువ శాతం మంది కనిపిస్తారు. మా బృందం చేసిన ప్రాధమిక పరిశీలన ప్రకారం పొద్దున 10 గంటల లోపు సుమారు ఐదారు శాతం మంది పై ముట్టడిలో స్త్రీలు కనిపిస్తారు.
ఆ తర్వాత ఈ సంఖ్య పెరుగుతుంది. మిట్ట మధ్యాహ్నం అయ్యే సరికి సుమారు 15 శాతానికి అటు ఇటుగా చేరతారు. ఇది సింఘు, టెక్రీల్లో ఒకే సరళి లో ఉంటుంది. ఘజీపూర్ లో ఈ సంఖ్య మరికొంత తక్కువే ఉంటుంది.
రాత్రివేళల్లో బైఠాయింపులో వుండే ఐదారు శాతం మంది వుంటారు. వీరు ప్రధానంగా వృద్ధ మహిళలే. స్త్రీలకు ప్రత్యేక మరుగుదొడ్ల వంటి సౌకర్యాలు లేని పరిస్థితి గమనంలో ఉంచుకోవాలి. ఇలా బైఠాయింపుల్లో ప్రత్యక్షంగా పాల్గొనే స్త్రీల భాగస్వామ్యతని బట్టి యీ ఉద్యమంలో స్త్రీల ఉద్యమ భాగస్వామ్యతను అంచనా వేసే పద్దతి చాలా లోపభూయిష్టమైనది.
నేడు సాధారణ రాజకీయ పండిత వర్గాలు, పరిశీలకులు, పాత్రికేయులు, విశ్లేషకులు అంచనా వేసి పద్దతిలో ఈ లోపభూయిష్టత ఉంటుంది. మాబృందం భిన్నంగా చూసింది.
ఉద్యమాలలో స్త్రీల పాత్ర గణింపుకూ లేదా విశ్లేషణకూ కంటికి కనిపించే దృశ్యపరమైన కొలబద్దల్ని ప్రాతిపదిక చేయడం శాస్త్రీయ పద్దతి కాదు. నేటి పురుషాధిక్య సమాజంలో పురుషుల ఉద్యమ పాత్ర లెక్కింపుకూ; స్త్రీల ఉద్యమ పాత్ర లెక్కింపుకూ మధ్య ప్రాతిపదికలలో చాలా తేడా ఉంటుంది. ఈ తేడాలను మా బృందం పరిగణనలోకి తీసుకుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే, స్త్రీల వాస్తవ ఉద్యమ పాత్రని కూడా నిర్లక్ష్యం చేయడానికి దారి తీస్తుంది.
ఐతే వీటిని పరిగణనలోకి తీసుకొని మేము విశ్లేషించే పద్దతి భిన్నంగానే ఉంటుంది. నేటి పురుషాధిక్య సమాజపు ప్రమాణాల ప్రకారం ఎంతో కొంత అసహజంగా లేదా అతిశయోక్తిగా అనిపించవచ్చు. అందుకే స్త్రీల ఉద్యమ పాత్ర గణనకూ, విశ్లేషణకూ మేము ఎంచుకున్న కొలబద్దల్ని గూర్చి ముందుగా మిత్రలోకానికి చిన్న వివరణ ఇవ్వాల్సి ఉందని అభిప్రాయపడుతున్నాము.
పురుషాధిక్యతతో కూడిన నేటి పితృస్వామ్య సామాజిక వ్యవస్థలో స్త్రీల శ్రమకు తగిన గుర్తింపు, విలువ లేకపోవడం తెలిసిందే. గృహిణులు ఇళ్లల్లో రోజంతా చేసే శ్రమకు నేటి సమాజం విలువ ఇవ్వదు. శ్రామిక మహిళలు సైతం ఇల్లు తుడవడం, బట్టలు ఉతకడం, అంట్లు తోమడం, వంట, వడ్డిoపు వంటి పనులు చేసి, పిల్లలు, భర్తలకు సఫర్యలు చేసి, తిరిగి శ్రమ వృత్తుల్లోకి వెళ్లడం తెల్సిందే. అసలు విలువలేని ఇంటిపనులతో పాటు వివక్షతతో కూడిన విలువను పొందే బయటి పనుల్ని చేయడం తెల్సిందే. ఐతే ఈ దుస్థితి ఇంటిపనికే కాకుండా, ఉద్యమ పాత్రకు కూడా వర్తిస్తుంది.
ఈనాటి సమాజంలో ఉద్యమాలలో పురుషుల పాత్రలో అధిక భాగం ప్రత్యక్షంగా కంటికి కనిపించే దృశ్యరూపం ధరిస్తుంది. కానీ పురుషుల ఉద్యమ పాత్రకు పూర్తి విరుద్ధంగా స్త్రీల ఉద్యమపాత్రలో అత్యధిక భాగం బయటకు కనబడని అదృశ్య రూపంలోనే ఉంటుంది. అట్టి స్త్రీల అదృశ్య ఉద్యమ పాత్రల్ని కూడా విలువైనవిగా గుర్తించి లెక్కకట్టాలి. అలా లెక్క కట్టకపోతే ఆయా ఉద్యమాల్లో స్త్రీల వాస్తవ పాత్ర వెలుగులోకి రాదు. వాటిని మేము గుర్తించి గణిస్తున్నాము.
ఉదాహరణకి మా బృందం ప్రస్తావనతోనే ప్రారంభిస్తాము. మా బృంద పర్యటన ఫలితాల్ని మేము ప్రాతినిధ్యం వహించే సంస్థల లేదా మా కృషి ఫలంగా సహజంగా భావిస్తారు. కానీ మా బృందం సభ్యుల జీవిత భాగస్వాముల కృషిని లెక్కలోకి తీసుకోరు. మా అనారోగ్యాల వల్ల గానీ, వృద్దాప్యాల వల్ల గానీ, గడ్డకట్టే చలి వల్ల గానీ మా ప్రయాణాల్ని నిరుత్సాహ పరచలేదు. పైగా ప్రోత్సాహం అందించారు. మా ప్రయాణాల్లో అవసరమైన ఆహార పదార్థాల్ని కూడా తయారు చేసిన వారి పాత్రలు లెక్కింపులోకి రావు. అలాంటి సూక్ష్మ అంశాల్ని సైతం లెక్కించే విధానం ఉద్యమాలలో స్త్రీల వాస్తవ భాగస్వామ్యత నిర్ధారణకి గీటురాయి కావాలి.
ఉద్యమాల్లో స్త్రీల పాత్రని పురుషాధిక్యత అనే తెర చాలా వరకు మరుగు పరుస్తుంది. సహజంగానే స్త్రీలు ఆయా ఉద్యమాలలో పోషించే వాస్తవ పాత్రలో కొంతభాగం లేదా ఎక్కువ భాగం పురుష ఉద్యమకారుల ఖాతాలలోనే లెక్కించడం జరుగుతుంది. నేటి సమాజంలో స్త్రీల శ్రమలో రెండు భాగాలు ఉంటాయి. ఒక భాగం అసలు గుర్తింపే లేనిది. మరోభాగం పురుషుడి ఖాతా లేదా కోటాలో లెక్కించేది. అది స్త్రీల శ్రమకు ఎలా వర్తిస్తుందో, ఉద్యమాలలో స్త్రీల పాత్రకి సైతం వర్తిస్తుంది. ఆయా పోరాటాల్లో స్త్రీలు ప్రత్యక్షంగా పాల్గొని కంటికి కనిపించే దృశ్యపాత్రకు తప్ప పరోక్షంగా పాల్గొనే అదృశ్య పాత్రకు గుర్తింపు ఇవ్వని సమాజమిది. అలా జమ కట్టని స్త్రీల ఉద్యమ పాత్రని రెండు విధాలైనదిగా వర్గీకరణ చేయాలి. అందులో అసలు లెక్కింపుకు రాని ఒక భాగం ఉంటుంది. అదే విధంగా తమ భర్తల లేదా కొడుకుల లేదా తండ్రుల ఖాతాలలో లెక్కించే మరోభాగం కూడా ఉంటుంది. ఈ తరహా అన్ని ప్రమాణాల్ని కొలబద్దలుగా భావించి విశ్లేషిస్తేనే, ఆయా ఉద్యమాల్లో స్త్రీల వాస్తవ ఉద్యమ పాత్ర వెలుగులోకి వస్తుంది.
ఆర్ధిక, రాజకీయ, సామాజిక రంగాలన్నింటిలో పురుషులతో పాటు స్త్రీలు కూడా సమగ్ర సమానులుగా మారే సమున్నత సమసమాజంలో తప్ప, స్త్రీల పాత్ర లెక్కింపుకి పైన పేర్కొన్న కొలబద్దల్లో కూడా వివక్షత ఉండి తీరాల్సిందే. లింగ వివక్షత లేని సమాజంలో కొలబద్దలకు కూడా వివక్షత వుండనక్కర లేదు. లింగ వివక్షత గల నేటి సమాజంలో నిష్పక్షపాతంగా స్త్రీల ఉద్యమ భాగస్వామ్యతను నిర్ధారణ చేయడానికి, వాటిని కొలిచే కొలబద్దలకు కూడా వివక్షత ఉంటుంది. ఏ ఉద్యమాలకైనా వర్తించే గణాంక సూత్రమే ఇది. తాజా రైతాంగ ఉద్యమానికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఈ వివక్షతాపూరిత కొలబద్దల ప్రాతిపదికతోనే తాజా రైతాంగ పోరాటంలో వెలుగులోకి రాకుండా దాగిన స్త్రీల గుప్త పాత్రను కూడా వెలికి తీసే ఒక చిన్న ప్రయత్నం చేసున్నాం.
స్థూల వర్గీకరణ (Macro classification) ప్రకారం తాజా రైతాంగ ఉద్యమంలో స్త్రీల ప్రత్యక్ష భాగస్వామ్య పాత్ర తక్కువ స్థాయిలోనే ఉంది. కానీ సూక్ష్మ వర్గీకరణ (Micro classification) ప్రకారం పరోక్ష భాగస్వామ్యత అధికంగా ఉంది.
1) ప్రత్యక్ష భౌతిక భాగస్వామ్య పాత్ర గూర్చి
తాజా రైతాంగ ఉద్యమంలో స్త్రీల ప్రత్యక్ష భాగస్వామ్య పాత్ర ఈ క్రింది రకాలుగా వర్గీకరణ చేయాల్సి ఉంది.
A – హైవేల దిగ్బంధనాల్లోనే రాత్రి, పగలు ఉంటున్న స్త్రీలు. (వారానికి ఒకరోజో రెండు రోజులో ఇళ్లకు వెళ్లి వచ్చే వారిని కూడా ఈ కోవలోనే లెక్కించవచ్చు)
B – సమీప జిల్లాలు లేదా ప్రాంతాల నుండి ప్రతిరోజూ పగటి వేళల్లో తమ ఇళ్ల నుండి వచ్చి బైఠాయింపులలో పాల్గొనే స్త్రీలు. (వారానికి ఒకరోజో రెండు రోజులో ఇళ్ల నుంచి రాలేక పోయిన స్త్రీలను కూడా ఈ కోవలో వేస్తున్నాం)
C – వారానికి ఒకరోజో, రెండు రోజులో ఇళ్లనుండి వచ్చి పగటివేళల్లో బైఠాయింపులో పాల్గొనే స్త్రీలు.
D – బైఠాయింపులో కనీసం ఒక్కరోజైనా తమ తండ్రులు, కొడుకులు, భర్తలతో పాటు పాల్గొనాలనే భావంతో వచ్చి పగటి వేళల్లో పాల్గొనే స్త్రీలు.
E – బైఠాయింపులో పాల్గొనక పోయినా, దాన్ని చూసి తమ సంఘీభావం ప్రకటించాలనే భావంతో సందర్శకులుగా వచ్చి వెళ్లే
స్త్రీలు.
F-వంటలు వండటం, వడ్డించడం, ఇతర ఆహారాది సరఫరాలు చేయడం, ఇంకా వాలంటీర్ బాధ్యతల్లో స్త్రీలు గణనీయంగా వున్నారు. (ఐతే వీటిలో స్త్రీలు మాత్రమే లేరు. పురుషులతో పాటు వున్నారు)
2) పరోక్ష భౌతిక భాగస్వామ్య పాత్ర గూర్చి
స్వయంగా బైఠాయింపు వద్దకు రాకుండానే, దానిని జయప్రదం చేసేందుకు వివిధ రూపాల భౌతిక కార్యకలాపాల లో పాల్గొనే స్త్రీలు ఈ క్రింది కోవలలోకి వస్తారు. వీరిది “భౌతిక శ్రమ” (physical labour) తో కూడిందే. వీరు ఢిల్లీకి రారు. అంటే పరోక్ష పాత్రే. ఐతే ఢిల్లీ బైఠాయింపు వల్ల కొత్తగా భౌతికంగా శ్రమిస్తారు.
A – అప్పటి వరకు పొలం పనుల్లో పాల్గొనే స్త్రీల విషయం చూద్దాం. తమ కుటుంబంలో ఒకరిని ఢిల్లీ ముట్టడికి పంపిన కారణంగా వ్యవసాయ పని కొంత కుంటుపడుతుంది. అట్టి లోటు భర్తీకోసం అంతకు ముందు నుంచే పొలం పని చేసే స్త్రీలు నేడు అదనపు గంటలు పని చేసేందుకు పూనుకోవడం జరుగుతుంది. ఢిల్లీ వెళ్ళిన తమ కొడుకు నిర్వర్తించే ఉద్యమ పాత్రలో ఆ స్త్రీల వంతు వున్నట్లుగానే భావించాల్సి ఉంది.
B – అప్పటి వరకు పొలం పనులు అలవాటు లేని స్త్రీలు తమ కుటుంబంలో ఓ సభ్యుడు డిల్లీతో లోటు ఏర్పడింది. అట్టి లోటుభర్తీకై తనభర్తకు చేదోడు గా సహాయకురాలిగా పొలానికీ కొత్తగా వెళ్లే స్త్రీలు.
C – ఛలో ఢిల్లీకి వెళ్లే తన తండ్రి లేదా కొడుకు లేదా మామ లేదా భర్త కోసం వంటలు, ఆహార పదార్థాలను వండి సిద్ధం చేసిన శ్రమలో పాల్గొన్న స్త్రీలు.
D – మోడీ ప్రభుత్వం తమ వాళ్ళను ఢిల్లీలోకి రానివ్వని కారణంగా చేపట్టే బైఠాయింపు కొనసాగింపు కోసం అదనంగా పిండి వంటలూ, ఇతర ఆహార పదార్థాలు వగైరా వండి ఢిల్లీకి పంపే అదనపు నిరంతర శ్రమ చేస్తోన్న స్త్రీలు.

3) మానసిక భాగస్వామ్యం వహించే స్త్రీలు

తాజా రైతాంగ ఉద్యమం కోసం వీరు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ భౌతిక శ్రమ చేయక పోవచ్చు. కానీ దాన్ని గూర్చి మానసిక శ్రమ చేస్తారు. అంటే, తాజా రైతాంగ ఉద్యమ మీద తమ మనసుల్ని లగ్నం చేసి పరిశ్రమిస్తారు. తద్వారా ఉద్యమంలో మానసికంగా వారు భాగస్వాములుగా మారతారు. ఈ క్రింది స్త్రీలు ఈ కోవలోకి వస్తారు.
A – ఎప్పటి వలెనే తమ ఇంటి పని చేస్తూనే, ఖాళీ సమయాల్లో ప్రచార మాధ్యమాల్లో గతంలో వీక్షించే జనరల్ ఉబుసుపోక లేదా కాలక్షేపపు ప్రోగ్రాముల్ని వదిలి, ఢిల్లీ ముట్టడి వార్తలపై దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ఇదో రకం మానసిక మధనం క్రిందికి వస్తుంది.
B – ఇరుగుపొరుగు స్త్రీలు ఒకచోట కూర్చొని ఢిల్లీ వార్తల గూర్చి పరస్పరం మాట్లాడుకునే అలవాటు ఏర్పడింది. “ఢిల్లీలోని మీ నాన్నగారు లేదా కొడుకు ఈరోజు ఏ వార్తలు చెప్పాడు?” అని ఒకరు అడిగి, “మా నాన్న గారు/ మా కొడుకు ఫలానా వార్తలు చెప్పాడ”ని ఆమెకు ఈమె చెప్పడం రూపంలో సాగే ముచ్చట్లు ఇవి. ఇలా పరస్పరం ముచ్చటించుకునే సంస్కృతి ఇప్పుడు వీధివీధిలో కనిపించే దృశ్యంగా మారింది. ఇవి ఉబుసుపోక ముచ్చట్లు కాదు. అదో రాజకీయ చర్చా ప్రక్రియ.
మొదటికోవలోని స్త్రీలలో విభిన్న ఉపకోవల వారున్నారు. వారు స్వయంగా బైఠాయింపు లో పాల్గొనడం ద్వారా లేదా అనుసరణ ద్వారా తరతమ స్థాయుల్లో రాజకీయ చైతన్యం పొందుతారు. వేలాది ఉద్యమ కారుల మధ్య వుంటూ, నిత్యం వక్తల ప్రసంగాలు వింటూ వారు పొందే రాజకీయ చైతన్యాన్ని ఊహించుకోవచ్చును.
ఢిల్లీ రాకుండానే, అదనపు భౌతిక శ్రమ తమ పొలాలలో, ఇళ్లల్లో చేస్తున్న రెండోకోవలోని స్త్రీలలో కూడా రాజకీయ కసి ద్వేషాలు మరో రూపంలో పెరుగుతాయి. పొలం పనులు చేస్తూ, మోడీ ప్రభుత్వం ఇలా మొండి వైఖరి ఇంకెన్నాళ్ళు అనుసరిస్తుందని ప్రశ్నిస్తారు. అలా ఆ స్త్రీలలో పెరిగే కసి కూడా పరిమితంగానైనా వారి రాజకీయ పరివర్తనకు విధిగా తోడ్పడుతుంది.
మూడోకోవలోని స్త్రీల మీద ఢిల్లీ ముట్టడి వల్ల ప్రత్యక్ష లేదా పరోక్ష భౌతిక ప్రక్రియలో పాల్గొనక పోవచ్చు. ఐతేవారి మనస్సులు మేధోమధనానికి గురవుతాయి. అంతవరకు రాజకీయాలకు అతీతంగా వుండే స్త్రీలు సైతం ప్రాధమిక రాజకీయ పరివర్తనా ప్రక్రియకు గురవుతారు.
సెప్టెంబర్ 21 నుండే పంజాబ్ లో రైల్వే వ్యవస్థను దిగ్బంధనం చేసిన సమరశీల పోరాటంలో స్త్రీల ప్రత్యక్ష పాత్ర తాజా ఢిల్లీ ముట్టడిలో కంటే ఎక్కువ స్థాయిలోనే ఉంది. నవంబర్ 26న హర్యానా బోర్డర్ లో బారికేడ్ల తొలగింపు, పోలీస్ వర్గాల ఆటంకాల అధిగమింపు, ట్రాక్టర్లను డ్రైవింగ్ చేస్తూ దూసుకెళ్లడం వంటి క్రియాశీల ప్రక్రియల్లో కొద్దీ శాతం మంది పంజాబ్ స్త్రీలు ముందు పీఠిన నిలిచారు.
అట్టి కొన్ని ముఖ్య పాత్రల్ని పక్కకు పెట్టినా, తాజారైతాంగ పోరాటం లో స్త్రీల పాత్ర స్థూలంగా బహుళ స్థాయిలో విస్తరిస్తోంది.
పైనపేర్కొన్న రకరకాల ప్రత్యక్ష, పరోక్ష, భౌతిక, మానసిక పాత్రల్ని కలిపి ఒక యూనిట్ గా లెక్కిస్తే, నేటి రైతాంగ పోరు లో స్త్రీల వాస్తవ పాత్ర అత్యంత విస్తృతరూపం తీసుకుంటోన్న పరిణామ క్రమాన్ని అర్ధం చేసుకోవచ్చు.
మా బృందం అంచనా ప్రకారం మోడీ-షా ప్రభుత్వం మారణ హోమం ద్వారా దీని అణచివేతకు పాల్పడితే, ముఖ్యంగా నేడు పోరాడే రైతాంగ కుటుంబాలకి చెందిన స్త్రీలు ధర్మాగ్రహంతో వీధుల్లోకి వచ్చి పురుషులతో చేతులు కలిపి సమరశీలంగా తిరగబడే అవకాశం ఉంది. ఇది రాజ్య పాలనా యంత్రాంగం దృష్టిలో కూడా ఉండి తీరుతుందని భావిస్తున్నాం. ఐతే అదే సమయంలో అది దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించక పోతే, దానికి కొన్ని కొరతలు ఉండక తప్పదు. ఏది ఏమైనా, తాజా రైతాంగ ప్రతిఘటనలో స్త్రీల ఉద్యమ భాగస్వామ్య పాత్ర ముమ్మాటికీ ఒక కొత్త స్ఫూర్తిదాయక ధోరణి గా భావించి, ఉద్యమ సంస్థలు, శక్తులు ప్రాచుర్యం కల్పించాల్సి ఉందని కూడా భావిస్తున్నాం.
ఇఫ్టూ ప్రసాద్
(ఇఫ్టూ ప్రసాద్ (పిపి), IFTU నేషనల్ సెక్రెటరీ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *