థియేటర్లకు పూర్వపు కళ వస్తుందా?: తిరుప‌తి జ్ఞాప‌కాలు -17

(రాఘ‌వ శ‌ర్మ‌)
సుదీర్ఘ విరామం త‌రువాత ఎట్ట‌కేల‌కు తెర తొల‌గింది.
వెండి తెర‌పై బొమ్మ‌ల క‌ద‌లిక‌ మళ్లీ మొద‌లైంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొన్ని సినిమా హాళ్లు శుక్ర‌వారం నుంచి మెల్ల‌గా తెరుచుకున్నాయి.
సినిమా అంటే ఎన్నో అనుభూతులు, అనుభ‌వాలు, క‌ళాత్మ‌క వినోదాల క‌ల‌బోత‌.త‌మ జీవిత‌మే తెర‌పైన క‌నిపిస్తోంద‌ని ప్రేక్ష‌కులు తాదాత్మ్యం చెందేవారు.
ఇప్పుడైతే దుస్సాహ‌సాలు, ద్వేషాలు, దుర‌హంకారాలు, ద్వందార్థాలు క‌ల‌బోసిన ఒక క‌ల‌గూర గంప అయ్యింది కానీ, నిజానికి ఒక‌ శ‌తాబ్దం పైగా ఆధునిక జీవితంలో సినిమా ఒక భాగ‌మైపోయింది. తొలిసారిగా సినిమా కెళితే పిల్ల లు ఎలా స్పందిస్తారు?
మ‌ర‌పురాని ఒక అనుభ‌వం.
అన్న‌మ‌య్య సినిమా 1997 మే 22న  రిలీజైంది.
తిరుప‌తిలోని శ్రీ‌నివాసం థియేట‌ర్‌కు నాలుగేళ్ళ మా మేన‌ల్లుడు బ‌బ్బిని తీసుకుని వెళ్ళాను. అప్ప‌టి వ‌ర‌కు టీవీ త‌ప్ప సినిమా వినోదం తెలియదు. సినిమా అంతా అయిపోయాక ‘ అబ్బా ఎంత పెద్ద టీవీనో చ‌మ్మామా ‘ అన్నాడు.
’దేవదాసు’ లో అక్కినేని
తిరుప‌తి వ‌చ్చిన కొత్త‌ల్లో శ్రీ‌వెంక‌టేశ్వ‌ర థియేట‌ర్‌లో మాయ‌దారి మ‌ల్లిగాడు సినిమా చూశాను. ఆ త‌రువాత చాల ఏళ్ళ‌కు నా మిత్రుల‌తో క‌ల‌సి అదే థియేట‌ర్లో మ‌హ‌త్త‌ర‌మైన మాభూమి సినిమా చూశాను. ఎన్నో.. ఎన్నెన్నో సినిమాలు; ఎంత జీవితం! ఎంత కాల్ప‌నిక‌త‌! ఎంత వినోదం!
లాక్‌డౌన్‌తో సినిమా హాళ్ళు గ‌త‌ ప‌ది నెల‌లుగా మూత‌ప‌డ్డాయి.ఈ ప‌దినెల‌లూ సినీ ప్రేక్ష‌కులు టీవీల‌కే ప‌రిమిత‌మైపోయారు. సినిమాలకు ప్ర‌భుత్వం అనుమ‌తిచ్చినా, కొత్తవి రిలీజ్ కాక‌ హాళ్ళు తెరుచుకోలేదు.
శుక్ర‌వారం వైకుంఠ ఏకాద‌శి, క్రిస్‌మ‌స్ క‌లిసి రావ‌డంతో ‘ సోలో బ‌తుకే సోబెట‌ర్ ‘ అన్న ఏకైక తెలుగు సినిమా విడుద‌లైంది.
దీనితో పాటు ‘ టెనెంట్ ‘ ‘ వండ‌ర్ ఉమ‌న్ ‘ అన్న రెండు ఇంగ్లీషు డ‌బ్బింగ్ సినిమాలు కూడా రాష్ట్ర‌మంతా విడుద‌లైనాయి. తిరుప‌తిలో కేవ‌లం పీజీఆర్‌, ప్ర‌తాప్‌, వేల్‌రామ్స్‌, సంధ్య‌, సివిఎస్‌ఆర్ థియేట‌ర్ల‌ లో మాత్రమే సినిమాలు ఆడాయి.
సామాన్యుల‌కు సినిమా ఒక క‌ల‌ల ప్ర‌పంచం. వెండితెర‌పై న‌టించాల‌నుకునే చాలామందికి అదొక రంగుల క‌ల‌. సినిమాలో డ‌బ్బులు పెట్టేవారికి అది క‌ల‌ల వ్యాపారం. సినిమా నిర్మించేవారికి అదృష్టాన్ని ప‌రీక్షించుకునే ఒక జూద మైదానం.
త‌మ జీవితాల్లో సామాన్యులు సాధించ‌లేనివి, అనుభ‌వించ‌లేనివి వెండి తెర‌పై చూసి ఆనందిస్తారు. హీరో లను, హీరోయిన్ల‌ను చూసి క‌ల‌ల ప్ర‌పంచంలో విహ‌రిస్తారు.
Touring Talkies. Representative image credits moviemaker.com
మ‌నిషి అలా త‌న అల‌స‌ట నుంచి, బాధ‌ల నుంచి తాత్కాలికంగా ఉప‌శ‌మ‌నం పొందుతున్నాడు. అలాంటి సినిమాల గురించి ఒక్కసారి వెన‌క్కి తిరిగి చూస్తే…
మ‌నిషి త‌న శ్ర‌మ‌ను మ‌ర్చిపోడానికి, అనాదిగా ఒక సాంస్కృతిక రంగాన్ని సృష్టించుకున్నాడు. ఒక‌ప్ప‌డు కోలాటాలు వేసేవారు. చీక‌టి ప‌డ‌గానే దేవాలయాల‌లో భ‌జ‌న‌లు చేసేవారు. కీర్త‌న‌లు పాడేవారు.
పంతొమ్మిదో శ‌తాబ్దంలో మాన‌వుడు ఒక వినోద ప్ర‌క్రియ‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ప‌గ‌టి వేషాలు, వీధి బాగోతాలు, య‌క్ష‌గానాలు, చిందులు వంటి జాన‌ప‌ద క‌ళారూపాల‌ను సృష్టించుకున్నాడు.
దివిటీల వెలుగులో తెల్లారే వ‌ర‌కు తోలు బొమ్మ‌లాట‌లు, నాట‌కాల‌ను ప్ర‌ద‌ర్శించాడు.పంతొమ్మిద‌వ శ‌తాబ్దం చివ‌ర‌లో వినోదం కొత్త పుంత‌లు తొక్కింది. తెల్ల‌ని తెర‌పై క‌దిలే బొమ్మ‌లు మొద‌ల‌య్యాయి.
స‌రిగ్గా 124 ఏళ్ళ క్రితం , అంటే 1896లో బొంబాయి (ముంబ‌య్‌)కి చెందిన వాట్స‌న్ హోట‌ల్లో తెల్ల‌ని తెర‌మీద బొమ్మ‌లు క‌దిలాయి. కానీ ఆ బొమ్మ‌లు మూగ‌వి. వాటికి మాట‌లు రావు. అయినా ఆవింత‌ను చూసి ప్ర‌జ‌లు సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గుర‌య్యారు.
దాదాసాహెబ్ ఫాల్కే ‘ రాజా స‌త్య‌హ‌రిశ్చంద్ర ‘ అన్న మూకీ సినిమా తీసి 1913లో బొంబాయిలో ప్ర‌ద‌ర్శించాడు. ‘లంకాద‌హ‌న్ ‘ వంటి మ‌రెన్నో పౌరాణిక సినిమాలు తీశాడు. భార‌తీయ సినిమాకు పితామ‌హుడుగా గుర్తింపు పొందాడు.
తెలుగు వాడైన ర‌ఘుప‌తి వెంక‌ట‌ర‌త్నం నాయుడు అదే స‌మ‌యం(1913-15)లో మ‌ద్రాసు(చెన్నై)లో మూడు సినిమా హాళ్ళ‌ను క‌ట్టించి, 1921లో ‘ భీష్మ ప్ర‌తిజ్ఞ ‘ అనే మూకీ సినిమా నిర్మించాడు.
‘గ‌జేంద్ర మోక్షం’ ‘ మ‌త్స్యావ తారం ‘ వంటి సినిమాలు కూడా నిర్మించి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు పితామ‌హుడుగా గుర్తింపు పొందాడు. తెలుగు నాట తొలి సినిమా హాలు ; విజ‌య‌వాడ‌లో మారుతీ టాకీస్‌ అవ‌త‌రించింది. అప్ప‌టి వ‌ర‌కు సినిమాల‌న్నీ మూగ‌వే.
మూగ‌దైన భార‌తీయ సినిమాకు 1931లో మాట‌లు వ‌చ్చాయి. ఆర్డీ షేర్ ఎం. ఇరానీ ‘ అలం అరా ‘ అనే తొలి టాకీ హిందీ సినిమాను నిర్మించాడు.
హెంచ్ ఎం రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ‘ భ‌క్త ప్ర‌హ్లాద ‘ అనే తొలి తెలుగు టాకీ సినిమాను ఇరానీ నిర్మించాడు. తొలి త‌మిళ టాకీ సినిమా ‘ కాళిదాసు ‘ కూడా మన హెచ్ఎం రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలోనే వ‌చ్చింది.
ఇవ్వ‌న్నీ సినిమా రంగంలో గుర్తుంచుకోద‌గ్గ కొన్ని మైలు రాళ్ళు.
అప్ప‌టి వ‌ర‌కు పౌరాణిక సినిమాల‌తోనే ప్రేక్ష‌కులు సంతృప్తి చెందారు.
తొలి సాంఘిక చిత్రం ‘ ప్రేమ విజ‌యం ‘ 1936లో వ‌చ్చిన‌ప్ప‌టికీ, ఆ త‌రువాత రైతు స‌మ‌స్య‌ల‌పై, హ‌రిజ‌నోద్య‌మం , మ‌ద్య‌నిషేధం గురించి ప్ర‌జ‌ల‌ను చైత‌న్య ప‌రిచే సినిమాలొచ్చాయి.
స్వాతంత్రోద్య‌మ ప్ర‌భావం తెలుగు సినిమా రంగంపైన కూడా ప‌డింది.
‘ బాల‌యోగి ‘ ‘ గృహ‌ల‌క్ష్మి ‘ ‘ మాల‌పిల్ల‌ ‘ ‘ మ‌ళ్ళీ పెళ్ళి ‘ ‘ రైతు బిడ్డ‌ ‘ ‘ వ‌ర‌విక్ర‌యం’ ‘వందేమాత‌రం ‘ ‘ సుమంగ‌ళి ‘ ‘ దేవ‌త ‘ వంటి అభ్యుద‌య భావాలున్న చిత్రాలు వ‌చ్చాయి.
వీటికి హెచ్ ఎం రెడ్డి, రామ‌బ్ర‌హ్మం, వైవి రావు, ఎల్‌వి ప్ర‌సాద్ వంటివారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.
పంతొమ్మిది వంద‌ల న‌ల‌బైయ‌వ ద‌శ‌కంలో గొప్ప న‌టీన‌టులు, ద‌ర్శ‌కులు వెండితెర‌కు ప‌రిచయ‌మ‌య్యారు.
సీతారామ జ‌న‌నం(1944)తో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు ప‌రిచ‌య‌మైతే, ఎన్టీరామారావు మ‌న‌దేశం(1946)తో ప‌రిచ‌య‌మ‌య్యాడు.
అలాగే ఎస్వీ రంగారావు వ‌రూధిని(1946)తో, సంగీత ద‌ర్శ‌కుడు పెండ్యాల ద్రోహి(1948)తో ప‌రిచ‌య‌మ‌య్యారు.
మ‌ధుర గాయ‌కుడు ఘంట‌సాల స్వ‌ర్గ‌సీమ‌(1946)తో ప‌రిచ‌య‌మ‌య్యాడు.
అపురూప క‌ళాఖండాలుగా భావించే చిత్రాలు వ‌చ్చిన 1950-1970 మ‌ధ్య కాలాన్ని తెలుగు సినిమాకు స్వ‌ర్ణ‌యుగ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు.
వినోదాత్మ‌క‌ జాన‌ప‌ద చిత్రం పాతాళ‌భైర‌వి కెవిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో 1951లో వ‌చ్చింది.
ఆ త‌రువాత వ‌చ్చిన ‘ పెళ్ళి చేసిచూడు ‘ ‘అప్పు చేసి ప‌ప్పు కూడు ‘ ‘ మిస్స‌మ్మ‌ ‘ ‘ గుండ‌మ్మ క‌థ ‘ గొప్ప వినోదాత్మ‌క చిత్రాలుగా మిగిలాయి.
తెలుగు వారికి త‌ప్ప మ‌రొక‌రికి సాధ్యం కాద‌న్న‌ట్టుగా నిలిచిపోయిన మ‌ల్లీశ్వ‌రి(1951) దేవ‌దాసు (1953) వంటి అపురూప క‌ళాఖండాలు సినిమా చ‌రిత్ర‌లో నిలిచిపోయాయి.
‘ మ‌ల్లీశ్వ‌రి ‘ సినిమాలో సాలూరి రాజేశ్వ‌ర‌రావు స‌మ‌కూర్చిన సంగీతం ఎంత గొప్ప‌గా శ్రోత‌ల‌ను మంత్ర‌ముగ్ధుల‌ను చేసిందో మాట‌ల్లో చెప్ప‌లేం. బంగారుపాప‌(1955), అమ‌ర శిల్పి జ‌క్క‌న్న‌(1963) వంటి గొప్ప చిత్రాలు వ‌చ్చాయి. అలాగే ‘ మ‌యాబ‌జార్ ‘ మంచి వినోదాత్మ‌క పౌరాణిక చిత్రంగా ఈ నాటికీ అల‌రిస్తోంది. బాట‌సారి(1961) న‌ర్త‌న‌శాల‌(1964), ఏక‌వీర‌(1969) వంటివి గొప్ప దృశ్య‌కావ్యాలుగా నిలిచిపోయాయి. అప్ప‌టి వ‌ర‌కు సినిమా స‌మ‌ష్టి కృషిగా సాగింది.
ఎంత పెద్ద న‌టుడైనా ద‌ర్శ‌కులు చెప్పిన‌ట్టే వినేవారు.కానీ, 1960వ ద‌శ‌కం నుంచి హీరోల ప్రాధాన్య‌త‌, కొన్ని కుటుంబాల ఆధిప‌త్యం పెరిగింది. ఈ పెరుగుద‌ల క్ర‌మంగా సినిమా రంగాన్నే శాసించే స్థాయికి చేరింది.
తెలుగు సినిమా 1970వ ద‌శ‌కంలో రంగుల‌ద్దుకుంది. ద‌స‌రాబుల్లోడు(1970) సినిమా తొలి తెలుగు రంగుల చిత్రంగా అల‌రించింది. రంగుల‌తోపాటు సినిమాల సంఖ్యా పెరిగింది. వేగం పెరిగింది. వ్యాపార దృష్టీ పెరిగింది.
సినిమా క‌థంతా హీరో చుట్టూనే తిర‌గ‌డం మొద‌లు పెట్టింది.వీటితో పాటు కాలం మారింది(1972), గాంధీపుట్టిన దేశం(1973), బ‌లిపీఠం(1975), ఊరుమ్మ‌డి బ‌తుకులు( (1976), త‌రంమారింది(1977), చ‌లిచీమ‌లు(1978), గోరింటాకు(1979) మా భూమి(1980) వంటి కొన్ని మంచి చిత్రాలు కూడా వ‌చ్చాయి.
ఆ త‌రువాత శంక‌రాభ‌ర‌ణం, సాగ‌ర సంగ‌మం వంటి సంగీతాత్మ‌క చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను బాగా అల‌రించాయి. క్ర‌మంగా సినీ సంగీతంలో వాద్య‌ఘోష ఎక్కువైంది. అక్క‌డ‌క్క‌డా శ్రావ్య‌త క‌నిపించినా, ఎలక్ట్రానిక్ వాద్య‌ఘోష దాన్ని డామినేట్ చేసింది.
సినిమాల్లో తొలి నుంచీ యుగ‌ళ గీతాలు బాగా అల‌రించాయి. చ‌క్క‌ని సాహిత్యం, శ్రావ్య‌మైన సంగీతం ప్రేక్ష‌కుల‌ను మైమ‌ర‌పించాయి. ఒక‌ అంద‌మైన కాల్ప‌నిక జ‌గ‌త్తులోకి ప్రేక్ష‌కుల‌ను తీసుకెళ్ళిపోయాయి. రాను రాను డ్యూయెట్లు యాంత్రిక‌మైపోయాయి.
నా మిత్రుడు ఏ. గాంధీ (పీకాక్ క్ల‌సిక్స్ ) మార్క్సిస్ట్ ఫిలాస‌ఫీ చ‌దువుకోడానికి చాలా కాలం క్రితం మాస్కో వెళ్ళాడు. మ‌న సినిమాల్లో యువ‌తీ యువ‌కులు స్వేచ్చగా పార్కుల్లో ఎగురుతూ, గెంతుతూ డ్యూయెట్లు పాడుకుంటూ, ప్రేమించుకుంటున్న దృశ్యాల‌ను చూసి ర‌ష్య‌న్లు చాలా అబ్బ‌ర ప‌డిపోయార‌ట.
‘ అబ్బా మీ దేశంలో స్త్రీల‌కు ఎంత స్వేచ్ఛ‌! ప్ర‌పంచంలో ఇంత అభివృద్ధి చెందిన మా సోవియ‌ట్ యూనియ‌న్‌లోనే కాదు, అమెరికాలో కూడా ఎక్క‌డా లేదు ఈ స్వేచ్ఛ ‘ అన్నార‌ట‌. పాపం గాంధీ కి ఏం చెప్పాలో తోచ‌లేదు.  న‌వ్వేసి ‘ అవి సినిమాలో మాత్రమే ‘ అని ముక్త‌స‌రిగా చెప్పాడు.
కేవ‌లం వినోదం కోసం మొద‌లైన డ్యూయెట్లు క్ర‌మంగా కృతక‌మై పోతున్నాయి. ఒక భావాన్ని వ్య‌క్తం చేసే ఆంగికంగా కాకుండా వ్యాయామ భంగిమ‌లైపోతున్నాయి. సినిమాలు ఎంత వీలైతే అంత వాస్త‌విక‌త‌కు దూరంగా జ‌రిగిపోతున్నాయి.
ఒక‌ప్పుడు కెవిరెడ్డి వంటి విజ్ఞ‌త‌గ‌ల ద‌ర్శ‌కులు ప్రేక్ష‌కులకు ఏం చెప్పాలో, ఏం చెప్ప‌కూడ‌దో , ఏం చూపించాలో, ఏం చూపించ కూడ దొ తెలుసుకుని సినిమా తీసేవారు. త‌రువాత కొంత కాలానికి సాంకేతిక‌త పెరిగి విజ్ఞ‌త కొరవడింది.
‘ మేం ఏం చూపిస్తామో, ఎలా చూసిస్తామో అదే ప్రేక్ష‌కులుచూస్తారు ‘ అన్న దీమాకు వ‌చ్చేశారు. ప్రేక్ష‌కులు ఆ ధోర‌ణికి అల‌వాటుప‌డ్డాక‌, ‘ ప్రేక్ష‌కులు ఏం కోరుకుంటున్నారో అదే చూపిస్తున్నాం ‘ అంటూ త‌మ ధోర‌ణిని స‌మ‌ర్థించుకుంటున్నారు.
ఒక‌ప్పుడు హీరో అంటే చాలా సౌమ్యుడు, సామాజిక స్పృహతో మంచికి మారు పేరు, ఆద‌ర్శ‌ప్రాయుడు. ఇప్పుడు హీరో అంటే మ‌హాబ‌లాడ్యుడు. దూర్తుడు, దుర‌హంకారుడు, కంటి చూపుతో చంపేవాడు, చిటికిన వేలితో రైలును వెన‌క్కిలాగ‌గ‌లిగే వాడు, స‌క‌ల అతిశ‌యోక్తుల కుప్ప‌.
సాంకేతిక‌త పెరిగింది. క‌థ‌నంలో యాంత్రిక‌త పెరిగింది. మ‌ళ్ళీ సినిమా హాళ్ళు మొద‌లైనా ఆ పాత మాధుర్యాలు మ‌ళ్ళీ రావు. సినిమా నిర్మాణంలో ఆ నిబ‌ద్ద‌త‌, స‌మష్టి కృషి మ‌ళ్ళీ అగుపించ‌దు. ఆ మ‌హాన‌టులు మ‌ళ్ళీ క‌నిపించ‌రు.

 

Mayabazar Poster/ Wikipedia
ఆ మ‌ధుర గానాలు మ‌ళ్ళీ వినిపంచ‌వు, ‘గ‌త‌ము త‌ల‌చి వ‌గ‌చే క‌న్నా సౌఖ్య‌మే లేదోయ్ ‘ అన్న దేవ‌దాసు వైరాగ్యం తో స‌రిపుచ్చుకోవాలిమరి!

(ఆలూరు రాఘవ శర్మ, సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/top-stories/features/tirupati-veterinay-doctors-loves-to-visit-houses-for-treament/

2 thoughts on “థియేటర్లకు పూర్వపు కళ వస్తుందా?: తిరుప‌తి జ్ఞాప‌కాలు -17

  1. చాలా బావుంది సర్. సినిమా అనుభవం, విశ్లేషణ ఆకట్టుకున్నాయి.

  2. చాలా బావుంది సర్. సినిమా అనుభవం, విశ్లేషణ, రచనా శైలి ఆసక్తికరంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *