తెలుగు వాళ్లు కారం ఎక్కువగా తింటారెందుకు? అసలీ మిరపకాయ చరిత్ర ఏంది?

ప్రాంతాలను బట్టి కొద్ది కొద్దిగా వ్యత్యాసాలున్నా తెలుగు వాళ్లు బాగా కారం తింటారు. రాయలసీమలో ఘాటు కారాలెక్కువ. వుల్లిగడ్డకారం, తెల్లవాయ కారం, గొడ్డు కారం, కొరివి కారం… చాలా జిల్లాల్లో జొన్న రొట్టే పచ్చి మిరపకాయ,ఉల్లిగడ్డ కొరికి తినడం నేనుచూశాను. అలాగే పచ్చిమిరప  మజ్జిగన్నంతో, అంబలితో కరకర నమిలి తినే వాళ్లనుచూశాను.  ఇలాగే తెలంగాణ దీనికేమీ తీసిపోదు. కోస్తాలోకూడా కారమెక్కువ. కాకపోతే అదొక రకం.దక్షిణ కోస్తాంధ్రలో కారాన్ని, పచ్చళ్లూ వూరగాయల రూపంలో బాగా తీసుకుంటారు. ఒక్కొక్క జిల్లా మిర్చికి ఒక్కొక్కఘాటున్నా మొత్తానికి  తెలుగు వాళ్ల చిలీ హాట్ ని తెగ లైక్ చేస్తారు. ఎందుచేత?
దీనికి కారణం ఉందని శాస్త్రవేత్తలు  చెబుతున్నారు. తెలుగునేల ఉష్ణమండలం కిందికి వస్తుంది.వేడెక్కువ. ఇక్కడే కాదు, ప్రపంచమంతా వేడి ప్రదేశాల్లో కారం ఎక్కువగా తింటారు. దీనివెనక ఎవల్యూషనరీ  సైన్స్ ఉంది.వీళ్ల శరీరం  వేడిని తగ్గించుకునే మార్గాలను వెదుకుతూ ఉంటుంది. ఇది ఈ ప్రాంత ప్రజలు వేడికి అలవాటు పడటం లో భాగమే. మిరపకాయంలో బాడీ టెంపరేచర్ ను కంట్రోల్ చేసే గుణం ఉంది. మిరపలోని రసాయనం ‘క్యాప్సయ్ సిన్’ (Capsaicin: 8-methyl-N-vanillyl-6-nonenamide C18H27NO3 ) అనేది మెదడులోని హైపోథాలమస్ మీద పని చేసి శరీరాన్ని చల్లబరిచి ఉష్ణమండలాలలోనివసించే ప్రజలకు కొంతరక్షణ కల్పిస్తుంది.  అందుకే తెలుగు రాష్ట్రాల్లో కారం ఎక్కువ తింటారు. ఇక్కడే కాదు ప్రపచంలోని  అన్ని ఉష్ణమండాలలో నివసించే ప్రజలు కారం ఎక్కువగా తింటారని  క్యాప్సయ్ సిన్ మీద పరిశోధనలు చేసిన డా అర్నాల్డ్ జి నెల్సన్ బృందం (Brigham Young University, Hawaii) నిరూపించింది. వాళ్ల పరిశోధనా పత్రం The effect of Capsaicin on the thermal and metabolic responses of men exposed to  38° for 120 minutes లో  చూడవచ్చు.

“…we find it interesting that most of the ethnic cuisines high in capsaicin concentrations (eg, Cajun, Mexican, Szechuan, and Thai) are more prevalent among cultures that reside in hot climates than among cultures that reside in cold climates.” అని వాళ్లు చెప్పారు.

మిర్చి లేదా మిరపకాయ లేని జీవితం ఎంత రుచి హీనంగా ఉంటుందో చెప్పలేం.వేలెడు పొడవుకూడా ఉండని ఈ పల్చటి మిరపకాయ భారతదేశం-యూరోప్  చేసుకున్న ఫుడ్ ఎక్చేంజ్ నుంచి వచ్చిన కానుక.
ఎక్కడో లాటిన్ అమెరికా నుంచి వచ్చినా భారతదేశంలో ప్రతిఇంటిని, ప్రతినాలుకని జయించేసింది మిరపకాయ.
ఇదెంతగా భారతీయ పాకసంస్కృతిలో భాగమయిందంటే, ఇది లాటిన్ అమెరికా నుంచి వచ్చిందని, దాన్ని తీసుకువచ్చిన వాడు వాస్కోడగామ అనే పోర్చుగీసు నావికుడు అంటే నమ్మటం కష్టం.
ముఖ్యంగా తెలుగు వాళ్లసలు నమ్మరేమో. ఎందుకంటే, మిరపకాయ మీద తెలుగువాళ్లు చేసినన్ని ప్రయోగాలు ప్రపంచంలో ఎవరూ చేసుండరేమో. మిరప పచ్చళ్ళు, పొడులు, పులుసులు, ఊరగాయాలు,  మిర్చికూరలు,వేపుళ్లు, మిర్చీబజ్జీలు, మజ్జిగలో వూరేసిన మిరపకాయలు… ఇలా ఒకటేమిటి ప్రతిజిల్లా తెలుగు వాళ్లు మిరపకాయ తమ సొంతపంట అనుకునే పరిస్థితి ఉంది.
ఆధునిక ఆయుర్వేదంలో కూడా మిరప ప్రస్తావన ఉంది కాబట్టి, ఇది మనదే అని వాదించే దేశభక్తులు కూడా ఉండవచ్చు.
అయితే,చరిత్ర కారులంతా  మిరప చరిత్రను బయటకు లాగి, ఇది బొలివియాతో పాటు అనేక లాటిన్ అమెరికాలో దేశాల్లో మొదటపండిందని, అది భారత దేశానికి రావడానికి కారణం, 1496లో కాన్స్టాంట్ నోపుల్ ను తురుష్కులు స్వాదీనం చేసుకోవమే నని తేల్చారు. ఇదేంటో చూద్దాం.
16 వ శతాబ్దానికంటే ముందు భారతీయ సాహిత్యంలో ఎక్కడ పచ్చి మిరప ప్రస్తావన లేదని ఆహార చరిత్ర కారుడు  కెటి ఆచార్య (1923-2002)  చెబుతున్నారు. ఆచార్య సైంటిస్టు,  ఆహార పదార్థాల చరిత్రలో నిపుణుడు. ముఖ్యంగా ప్రపంచ ఆహారాల్లో దక్షిణభారత దేశ ఉనికిని కనిపెట్టడం మీద చాలా పరిశోధన చేసి పుస్తకాలు (Indian Food:A Historical Companion,The Food Industries of British India, A Historical Dictionary of Indian Food) రాసిన వాడు.

 

భారతీయ వంటకాల్ల  మిరపకు ఎంత ప్రాముఖ్యం ఉన్నా  అది భారతీయం కాదన్న వాస్తవాన్ని అంగీకరించక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. బయటి నుంచి వచ్చింది కాబట్టే  మిరపకు ఒక పేరంటూ లేకుండా పోయింది. కనీసం సంస్కృతంలోనైనా ఉండి ఉండాలిగా.
మిరపని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కవిధంగా పిలుస్తారు. తెలుగువాళ్లు మిరప అంటారు. తమిళులు మిళగై అంటే నార్త్ లో  మిర్చి అంటారు. అయితే భారతదేశంలో  మిరప ఎప్పుడొచ్చిందో కచ్చింగా నిర్ధారించడం కష్టమయినా పోర్చుగీసునుంచి వచ్చిన వాస్కో డా గామా మిరప విత్తనాలను తీసుకు వచ్చి గోవాకు పరిచయం చేశాడని చాలామంది నమ్ముతున్నారు.
గోవాలో  మొదటి మిరప మొక్క మొలకెత్తింది. తర్వాత  ఈ పంట  బాంబేకు వచ్చింది. అందుకే బొంబాయిలో ఇప్పటికి దీన్ని గోవా మిర్చ్ అనిపలుస్తుంటారు.
ఒక విదేశీ పంటలు గాని ధాన్యంగాని మరొక దేశంలో ప్రాచుర్యంలోకి రావడం చాలా కష్టం. ఉదాహరణకు ఓట్స్  ని తీసుకోండి. భారత దేశపు పట్టణ మధ్య తరగతి కుటుంబాల్లో పెరిగిపోతున్న స్థూలకాయం (Obesity), గుండెజబ్బులను చూపించి, భయపెట్టి, ఆరోగ్యంగా ఉండాలంటే ఓట్స్ తినాలని చెప్పిఒప్పించేందుకు ఆహార పరిశ్రమలకు దశాబ్దాలు పట్టింది. ఓట్స్ అలా మధ్య తరగతి మనుసుకభళించి ఇపుడు ప్రతిడైనింగ్ టేబుల్  మీద హెల్తీ బ్రేక్ ఫాస్ట్ గా ప్రత్యక్ష మవుతూ ఉంది. ఒట్స్ ని మనకు సంజీవనిగా విక్రయిస్తున్న మల్టీ నేషనల్ కంపెనీలు ఈ ప్రచారానికి కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి అడ్వర్టయిజ్ మెంట్ల రూపొందించి మన  మీద సాంస్కృతిక దాడి చేస్తున్నాయి.
ఓట్స్ కంటే మంచి ఆహారధాన్యాలైన జొన్నలను, రాగులను ఇలా ముస్తాబు చేసి అమ్మే ప్రయత్నాలు భారతదేశంలో జరగలేదు పెద్దగా. సరే ఇది వేరే విషయం.
మళ్లీ మిర్చాదాకా వద్దాం. వాస్కొ డ గామా తీసుకువచ్చిన మిర్చి ఎందుకంత తొందరగా  ప్రసార మాధ్యమాలు లేని ఆరోజుల్లో దేశమంతా ఎలా విస్తరించింది?
దీనికి సమాధానం లీజీ కోలింగ్యామ్ (Lizzie Collingham) దగ్గిర ఉంది. మిరప ప్రాచుర్యానికి  ప్రధాన కారణం దానిని ఆయుర్వేద వైద్యలు స్వీకరించడమే.
సాధారణంగా ఆయుర్వేదంలో  వాడే దినుసులన్నీ కూడా వేదకాలం నుంచి దేశీయంగా కనిపించేవి. కొత్త వాటిని వాడరు.వాటికి ఉన్న వైద్య గుణంఏమిటో మన పురాతన వైద్యంలో ఉండదు.  అయితే, ఆరోజుల్లోని ఆయుర్వేద వైద్యలు మిరపలో వైద్య గుణంచూశారు. వెంటనే ఆయుర్వేదంలో వాడటం మొదలుపెట్టారు. అంతే, ఆయుర్వేదం ద్వారా అలా మిరప గొప్పతనం దేశ వ్యాపితంగా ప్రాకిపోయిందని కోలింగ్యామ్  తన పుస్తకం ‘Curry: A Tale of Cooks and Conquerers’ లో రాశారు.
మిరపకాయ (Chillies)
మానవ జాతి మచ్చిక చేసుకున్న పురాతన వంటముడిసరుకుల్లో మిరపకాయ ఒకటి. దీని ఆధారాలు 6100 సంవత్సరాల కిందటే బయటపడ్డాయి.అయితే, ఇది  కేవలం లాటిన్ అమెరికా దేశాల ప్రజలకే తెలుసు.మయోనైజ్, గ్రే పౌపాన్ కంటే ఎంతో ముందు రెడ్ హాట్ చిల్లీ పప్పర్ వాడేవాళ్లంటే ఆశ్చర్యంగా కనిపిస్తుంది. లాటిన్ అమెరికాలోని బహామాస్ , పెరు, పనామా దాకా 6100 సంవత్సరాల కిందట అక్కడి పురాతన ప్రజలు మిరప ను వాడే వారనే చెప్పు ఆర్కియాలజీ  ఆధారాలు దొరికాయి. నాటి వ్యవసాయ సమాజాలు గోదుమలు, దుంపలు, మొక్కొ జొన్నలు,గెనసు గడ్డలతోపాటు మిరపను కూడా పండించేవారు. అంటే ఆరోజుల్లో లాటిన్ అమెరికన్లు కారం కారం వంటలు చేసుకేనేవారని అర్థం. అక్కడి తిరుగళ్ల మీద కారం చిల్లీ పెప్పర్ స్టార్  అవశేషాలుకనిపించాయి. ఈక్వడార్ లో  6100 సంత్సరాల కిందటి ఒక జనావాసంలో ఈఅవశేషాలు కనిపించాయి. మొదట  ఈ మొక్కలను బొలీవియా ప్రాంతంతో మచ్చిక చేసుకున్నారు. ఇవి దాదాపు మొక్కజొన్నంతటి పురాతనమయిన పంట అని లిండా పెరీ (స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ) అనే పరిశోధకురాలు చెబుతున్నారు. ఆమె వీటిచరిత్రను 9 వేల సంవత్సరాల వెనక్కు తీసుకెళ్లారు.
యూరోప్ కిచెన్ లో సంక్షోభం
1453లో కాన్ స్టాంట్ నోపుల్ ను గ్రీకులనుంచి (బైజాంటైన్ సామ్రాజ్యం) తరుష్కులు (ఒట్టోమన్ సామ్రాజ్యం)చేతిలోకి వచ్చింది. కాన్ స్టంట్ నోపుల్ తురుష్కుల వశం కావడం చరిత్ర మధ్యయుగాలనుంచి ఆధునిక దశలో మార్చింది. ఈ యుద్ధం చరిత్ర, సంస్కృతి, వర్తకం,అంతర్జాతీయ రాజకీయాల్లో  ఎన్ని మార్పులు తీసుకువచ్చిందో లెక్కలేదు.
అయితే, మనమిపుడు కేవలం మిరపకాయలకే పరిమితం అవుదాం.
ఆరోజులో కాన్ స్టంట్ నోపుల్ పట్టణం ఆసియా, ఐరోపాల మధ్య వర్తక వాణిజ్యాాలా హబ్. ఈ వాణిజ్యమంతా మధ్య ధరా సముద్రం మీదుగా ఐరోపా చేరేంది. అయితే,  ఈరేవు తరుష్కుల చేతుల్లో పడ్డాక ఈ వర్తక వాణిజ్యాలు బంద్ అయ్యాయి. దీనితో యూరోప్ లోని అనేక దేశాల కుటుంబాలలో  ఒక విధమయిన కిచెన్ సంక్షోభం మొదలయింది.
అంతవరకు యూరోప్ వంటకాలన్నీ ఇండియానుంచి వచ్చే బ్లాక్ పెప్పర్ తో ఘుమఘుమలాడుతూ ఉండేవి. కాన్ స్టంట్ నోపుల్ స్వాదీనం చేసుకున్నాక తురుష్కుల వర్తకాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. క్రిష్టియన్లకు,తరుష్కులకు వైషమ్యం మొదలయింది. పెప్పర్ వర్తకంలో ఆగిపోవడం యూరోప్ లో వాటిధరలు ఆకాశాన్నంటాయి. అందువల్ల మరొక మార్గంలో ఇండియాను చేరుకుని వర్తకాన్నిపునరుద్దరించకపోతే యూరోపియన్లు నాలుక పిడచకట్టుకుపోతుంది. జీవితంలో నుంచి రుచి మాయమైపోతుంది. యూరోప్ సంపన్నుల వంటకాల రసహీనమయిపోతాయి. కాబట్టి  ఇండియానుంచి బ్లాక్ పెప్పర్ ను తెప్పించే మార్గం ఆలోచించాలి.  అది సముద్రం మార్గం కని పెట్టడమే.
మిరియాల వ్యాపారం
ఆరోజు జరిగిన సుగంధ ద్రవ్యాల వర్తకంలో 90 శాతం బ్లాక్ పెప్పర్ దే.యూరోప్ లో విపరీతంగా డిమాండ్ ఉన్న సరుకు మిరియాలే (బ్లాక్ పెప్పర్). 1496 -1499 మధ్య బ్లాక్ పెప్పర్ ధరలు రెట్టింపయ్యాయయని లిజీ కొలింగ్యామ్ రాశారు.
ఈ సమయంలో మొదలైందే స్పెయిన్ కు చెందిన కొలంబస్ ఇండియా అన్వేషణ యాత్ర. అయితే, ఆయన నౌక దారి తప్పి దక్షిణ అమెరికా తీరానికి వెళ్లింది.అదే ఇండియా అని కొలంబస్ ఎగిరి గంతేశాడు.  అక్కడి ప్రజలను ఆయన ‘ఇండియన్స్ ’ అనుకున్నాడు. అక్కడ ఆయన యూరోప్ లో కనిపించని అనేక కూరగాయలను చూశాడు. అందులో మిరప (క్యాప్సికమ్ ) ఒకటి. కొలంబస్ దానిని పెప్పర్స్ అని పిలిచాడు. ఆ పేరే స్థిరపడిపోయింది. తర్వాత స్పెయిన్ దేశీయులు మెక్సికోలో మరొక రకం మిరప కనిపెట్టారు. ఇవి మనం చిల్లీస్ గా చెప్పుకునే మిరప కాయలు. ఇలా చిల్లీ దక్షిణ అమెరికాలోని స్పానిష్ వలస ప్రజల వంటగదుల్లోకి ప్రవేశించింది. అక్కడ  వాళ్లు మాంసానికి చిల్లీ దట్టించి కొత్త రుచులు కనగొన్నారు. అక్కడి నుంచి చిల్లీ స్పెయిన్ కు వచ్చింది.
మొత్తానికి కొలంబస్ ఇండియా చేరుకోలేకపోయాడు.లేకపోతే, ఆయనే భారత్ కు   మిరప విత్తనాలు తీసుకుని వచ్చే వుండేవాడే.
ఆ అవకాశం వాస్కొడగామా కు దక్కింది. పోర్చుగీసు నావికులు భారత్ కు వచ్చి క్యాలికట్ రాజు ను కలసి భారీగామిరియాలు పట్టుకుపోయారు. తర్వాత వాళ్లు అరబ్బు సమస్యఅను అధిగమించడంతో  దగ్గిర దారి దొరికింది. ఇండియాకు పలు మార్లు వచ్చిపోయారు. ఇలా గోవాదాకా వారు వచ్చారు.

 

మరిన్ని విశేషాలు
యూరోప్ఇండియా వంటల్లో పోర్చుగీసు నావికుల రాక చాలా మార్పులు తీసుకు వచ్చింది.తొలిసారి యూరోప్ ఇండియా వంటల మధ్య సామరస్యం  కుదిరింది. భారతీయ వంటకాలు వారి ద్వార యూరోప్ కు వెళ్లాయి. వాస్కోడ గామా పోర్చుగీసు నుంచే కాకుండా దారి మధ్యలో తాకిన దేశాల నుంచి భారతీయులు ఎపుడూ వినని చూడని  అనేక రకాల పండ్లను కూరగాయలను భారత దేశానికి తీసుకువచ్చారు. అందులో మిరప ఒకటి . మిగతా వాటిలో పొటాటో, టొమాటో, గుమ్మడి, క్యాషూనట్,పపయ, ప్యాషన్ ఫ్రూట్, పైనాపిల్, జామ, కొత్తిమిర వగైరా ఉన్నాయి. ఇవన్నీ భారతయుల ఆహారాన్ని గుర్తుపట్టలేనంతగా మర్చాయి. ఇదే విధంగా భారతీయ వంటకాలు అటువైపు వెళ్లాయి. ఆకథమరొకసారి చూద్దాం. ఇలా మొత్తానికి  కాన్ స్టంట్ నోపుల్ తురుష్కులు వశపర్చుకోవడంతో భారత దేశానికి మిరపకాయ పరిచయమయింది.
పచ్చి మిరప పవర్‌ ఎంతంటే!
పచ్చిమిర్చి ‘విటమిన్‌ సి’, బీటాకెరొటిన్ కి పెట్టింది పేరు. అందువల్ల కళ్లకు,చర్మానికి, రోగనిరోధకశక్తికి మంచిది. అయితే, పచ్చిమిరపను నీడన, చల్లటి ప్రదేశంలో నిలువ వుంచాలి. వేడి, వెలుతరు, గాలి సోకితే, విటమిన్ సి పోతుంది.
పచ్చిమిరపను తినగానే శరీరంలో ఎండార్పిన్స్ విడుదలవుతాయి. ఇవి నొప్పి ని తగ్గించి మనలు మంచి మూడ్ లో ఉంచుతాయి
పచ్చి మిరపకాయలకు బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేసే శక్తి ఉంది. డయబేటిక్ పేషంట్లు కూడా నిర్బయంగా వీటిని తీసుకోవచ్చు.
పచ్చిమిరపలో ఐరన్ బాగా ఉంటుంది. అందువల రక్తహీనత ఉన్నవాళ్లు బాగా వాడవచ్చు.
పచ్చిమిరపకు బ్యాక్టీరియాలను చంపే గుణముంది. దీనితో చర్మరక్షణకు తోడ్పడతాయి.
పచ్చిమిరపలో విటమిన్ కె కూడా బాగా ఉంటుంది. దీనివల్ల  ఎముకలను బలహీన పరిచే ఆస్టియో పోరోసిస్ రాకుండా నివారిస్తంది.ఎదయిన గాయం తగిలినపుడు రక్తస్రావాన్ని తగ్గించే గుణం కూడా పచ్చి మిరపకు ఉంది.
పైకి హాట్ అని పేరున్నా, నిజానికి పచ్చిమిరపకు బాడీ టెంపరేచర్ ను తగ్గించే స్వభావం కూడా ఉంది.  మెదడులో కూలింగ్ సెంటర్ గా పేరున్న హైపో థాలమస్ మీద ఇదిపనిచేసి బాడీ చల్లబడేందుకు చేస్తుంది. అందుకే రాయలసీమ వంటి వేడిప్రదేశాలలలో కారం ఎక్కువ తింటారు.
చివరగా, పచ్చిమిరపకాయలకు గుండెజబ్బులను నివారించేశక్తి కూడా ఉంది. రక్తంలో కొలెస్టరాల్, ట్రైగ్లిసరిడ్స్ని ప్లేట్ లెట్స్ గడ్డకట్టకుండా నుతగ్గ్గించి ఏధిరో స్క్లీరోసిస్ రాకుండా నివారిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. బ్లడ్ క్లాట్ కాకుండా నివారించడమంటే హార్ట్ ఎటాక్, స్ట్రోక్ రాకుండా నివారించడమే.