తెలంగాణలో కోవిడ్ మరణాలు, అన్నీ తప్పుడు లెక్కలు: గవర్నర్ కు వంశీ లేఖ

ఐ.సి.ఎమ్.ఆర్ మార్గదర్శకాలను విస్మరిస్తున్న ప్రభుత్వం, గవర్నర్ గారికి ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి లేఖ
కోవిడ్ పరీక్షలలో, కరోనా నివారణలో విఫలమై హైకోర్టుతో చివాట్లు తిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ మరణాలను దాస్తు తప్పుడులెక్కలు చూపిస్తున్నదని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి  రాష్ట్ర గవర్నర్ గారికి లేఖ రాశారు.
కోవిడ్ మరణాల తప్పుడు లెక్కల నమోదు ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ఐ.సి.ఎమ్.ఆర్ మార్గదర్శకాలను పూర్తిగా తుంగలో తొక్కుతున్నదని ఆయన లేఖలో పేర్కొన్నారు.
Vamsi Chand Reddy , AICC secretary
కోవిడ్ మరణాల నమోదుపై ఐ.సి.ఎమ్.ఆర్ విడుదల చేసిన మార్గదర్శకాలలో సెక్షన్ 2.4 లో చాలా స్పష్టంగా ప్రతీ కోవిడ్19 పోజిటివ్ మరణాన్ని నమోదుచేయాల్సిన అవసరాన్ని వివరించారని, ఈ లెక్కల ఆధారంగానే ప్రపంచంలో కోవిడ్ లక్షణాలు, వ్యాప్తి, నివారణ, నియంత్రణ, చికిత్సపై అధ్యయనాలు జరుగుతాయని పేర్కొన్నారు.
మరణానికి ప్రాధమిక కారణం కరోనా కాకపోయినా, కోవిడ్19 సోకిన ప్రతీ వ్యక్తి మరణాన్ని నమోదుచేయాలని ఐ.సి.ఎమ్.ఆర్ మార్గదర్శకాలలో సెక్షన్ 3 లో స్పష్టంగా ఉందని, వాటిని ప్రభుత్వం విస్మరిస్తుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో రోజుకు దాదాపు వందల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తుంటే కేవలం 10లోపే చూపుతున్నారని. కేవలం హైద్రాబాద్ లొనే రోజూ 50 మృతదేహాలను రహస్యంగా దహనం చేస్తున్నారని పేర్కొన్నారు. గుట్టు చప్పుడు కాకుండా కోవిడ్ మరణాలను దాయటం, మృతదేహాలను దహనం చేయడం దుర్మార్గమైన చర్య అని దుయ్యబట్టారు.
“డాక్టర్స్ ఫర్ సేవ” లాంటి అనేక సంస్థలేకాక, వివిధ వార్తా పత్రికలు, ఛానెళ్లు, మరణించిన వ్యక్తుల బంధువులు అనేక రుజువులు బహిర్గతం చేశారని, అయినా ప్రభుత్వం పారదర్శకత చూపకపోవడం హేయమైన చర్య అని పేర్కొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలాగూ స్పందించరు కాబట్టి,
ఐ.సి.ఎమ్.ఆర్ మార్గదర్శకాల ప్రకారం కోవిడ్19 మరణాల నమోదు జరిగెటట్టు ఆదేశాలు జారిచేయాలని ఆయన  గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు.