డాక్టర్ అంబేడ్కర్ కు ఉస్మానియాఫేక్ గౌరవ డాక్టొరేట్ ఇచ్చిందా?

ఈ రోజు డాక్టర్  బిఆర్ అంబేడ్కర్ 64వ వర్ధంతి. అనేక మంది ఆయనకు నివాళులర్పిస్తున్నారు.  ఈ సందర్బంగా ఆయనకు హైదరాబాద్ తో ఉన్న అనుబంధం ఏమిటో చూద్దాం.
హైదరాబాద్ కు డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కు ఉన్న అనుబంధం చిత్రమయింది.ఇందులో ఒక సందర్భం బాగా వివాదానికి దారితీసింది. అది డాక్టర్ అంబేడ్కర్ కు  ఉస్మానియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టొరేట్ ప్రదానం చేయడం.
1953 జనవరి 12న డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ కు ఉస్మానియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టొరేట్ (Honoris Causa) ప్రదానం చేసింది. ఇది ఉస్మానియా విశ్వ విద్యాలయం అందించిన మొట్టమొదటి గౌరవ డాక్టరేట్. ఇది ఉస్మానియాకు చాలా ప్రతిష్టాకరమమయిన సందర్బం. ఎందుకంటే ఆయన గౌరవ డాక్టరేట్  అప్పటికి ప్రదానం చేసిన రెండో విశ్వవిద్యాలయం ఉస్మానియా. మొదటి గౌరవ డాక్టొరేట్ 1952లో అమెరికా కొలంబియా విశ్వవిద్యాలయం అందంచింది. ఆతర్వాత  ఉస్మానియకు ఆ అవకాశం లభించింది. ఇప్పటికీ ఉస్మానియాలో జనవరి 12న  డాక్టర్ అంబేడ్కర్ కు గౌరవ డాక్టొరేట్ పురస్కారం అందించినందుకు  గుర్తుగా స్కాలర్స్ డే (Scholars’ Day) జరపుకుంటారు.
అయితే, ఇది చెల్లని సర్టిఫికేట్ అని చాాలా మంది వివాదం లేవనెత్తారు. ఇలాంటి చెల్లని గౌరవ డాక్టొరేట్ అందించి భారత రాజ్యంగ నిర్మాత ను అగౌరవ పరిచారని ఆ మధ్య కొంత మంది చరిత్రకారులు వ్యాఖ్యానించారు.
ప్రముఖ చరిత్ర కారుడు, దక్కన్ డెమోక్రటిక్ అలయన్స్ కు చెందిన డాక్టర్ చిరంజీవి కొల్లూరి ఒక ఆసక్తికరమయిన విషయం వెల్లడిస్తూ, ఇది చెల్లని సర్టిఫికేట్ అని అన్నారు.
ఎందుకంటే, ఆ డాక్టొరేట్ గౌరవ పట్టా మీద ఉస్మానియా యూనివర్శిటీ లోగో లేదు. దానికి తోడు  చాన్స్ లర్  సంతకం చేయాల్సిన చోట నాటి ముఖ్యమంత్రి  బూర్గుల రామకృష్ణ రావు చాన్స్ లర్ అని సంతకం చేశారు. ముఖ్యమంత్రి  చాన్స్ లర్ గా  సంతకం చేయకూడదని డాక్టర కొల్లూరి అంటున్నారు. ఎందుకంటే, ఆ రోజు నిజాం హైదరాబాద్ స్టేట్ రాజ్ ప్రముఖ్. రాజ్ ప్రముఖ్  అంటే గవర్నర్. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి  గవర్నరే చాన్సలర్. అందువల్ల డాక్టర్ అంబేడ్కర్ కు ప్రదానం చేయాల్సిన పట్టామీద రాజ్ ప్రముఖ్ కాకుండా ముఖ్యమంత్రి ఎలా సంతకం చేస్తారనేది ఆయన అభ్యంతరం.  ఆ విధంగా  అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన న్యాయ కోవిదుడయిన అంబేడ్కర్ కు ఉస్మానియా ఫేక్ గౌరవ డాక్టొరేట్ ఇచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.
అంతకు ముందు డాక్టర్ అంబేడ్కర్ రెండు సార్లు హైదరాబాద్ కు వచ్చారు. మొదటి సారి 1934లో తాను స్థాపించిన యూత్ లీగ్ కార్యక్రమంలో పాల్గొనందుకు వచ్చారు. రెండోసారి ఒక చెరువు నుంచి మంచినీళ్లు తీసుకునేందుకు దళితులను బహిస్కరించిన సంఘటన జరిగినపుడు 1936లో వచ్చారు.
డాక్టర్ అంబేడ్కర్ కు న్యాయ శాస్త్రంలో  ఆ రోజుల్లో వచ్చిన ఖ్యాతి గురించి విన్న నిజాం ఒక దశలో ఆయనను నైజాం చీఫ్ జస్టిస్ పదవి స్వీకరించమని కోరారు. అంబేడ్కర్ తన రాజకీయ కార్యకలపాాల కారణంగా దానిని తిరస్కరించారని చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *