ఆ రోజుల్లో వేసవిలో ప్రతి ఇంటా చల్లటి తరవాణి చేసేవారు… తరవాణి అంటే ఏమిటి?

(పరకాల సూర్యమోహన్)
పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలో వున్న మావూరు కవిటం, మా ఇల్లు, మా పలపదొడ్డి ఒక అంతులేని జ్ఞాపకాల నిధి. వాటి గురించి రాస్తున్నకొద్దీ అలనాటి జ్ఞాపకాలు దొంతరు దొంతర్లుగా కళ్ళముందు ప్రత్యక్షం అవుతాయి. ఆ రోజులే వేరు. ఆ నాటి పరిస్థితులే వేరు.
ఆ నాటి మనుషులు, వారి అభిమానాలే వేరు. అలాంటి చోట పుట్టిన వారు, వాటిని చవిచూస్తూ పెరిగిన వారు మాత్రమే ఆ మధుర స్మృతుల్ని అర్థం చేసుకోగలరు. ఆ అరుదైన జ్ఞాపకాల అనుభూతుల్లో కొన్నింటినైనా మీతో పంచుకోడానికి ప్రయత్నిస్తాను.
మా వూరిలో పాడి పంటలు ఎంతో సమృద్ధిగా వుండేవి.
ఏ ఇంటిలోనూ లేమి కనిపించేది కాదు. వున్నంతలో అంతా సంతోషంగానే కనిపించేవారు. రేపు ఎలా అన్న దిగులు వారిలో కనిపించేది కాదు. స్తోమతల్లో , కుటుంబ సభ్యుల సంఖ్యలో కాస్త తేడాలుండచ్చేమో గానీ ఎవరిలోనూ పొరపొచ్చాలు వుండేవికావు. ఏ కుటుంబంలోనైనా వయసు మీరిన వారు కాలం చేస్తే మిగతా వారు వారికి ఎంతో కొండంత అండగా నిలిచేవారు. ఎంతో ధైర్యం చేప్పేవారు. అన్ని పనులు భుజాన వేసుకుని మేమున్నామంటూ ధైర్యం చెప్పేవారు.
ఎవరింట్లోనైనా పెళ్ళిళ్ళు పేరంటాలు వస్తే ఇంక వారి సంబరాలు అంబరాన్ని తాకేవి. తమ ఇంట్లోనే జరుగుతున్నట్టుగా ఎంతో హడావుడిగా వుండేవారు. ఆ రోజుల్లో సాధారణంగా అన్నీ ఉమ్మడి కుటుంబాలే. తాతలు బామ్మలు, కొడుకులు కోడళ్ళు, మనుమలు మనవరాళ్ళతో ఇళ్ళు ఎంతో సందడిగా, నిత్యకోలాహలంగా కళకళలాడుతూ కనిపించేవి. అంతేకాదు, ప్రతి బాధ్యతనీ ఇంట్లో పెద్దా చిన్నా సమిష్టిగా పంచుకునే వాళ్ళు. అందుకు నిలువెత్తు నిదర్శనం మా ఇల్లు.
ఇందుకు ఒక ఉదాహరణ చెబుతాను. అది కొబ్బరి కాయల్ని కొట్టి గానుగలో నూనె ఆడించడం. అందుకోసం వందల సంఖ్యలో కొబ్బరి కాయల్ని కొట్టేవాళ్ళం. మా ఇంట్లో అదొక యజ్ఞంలా సాగేది.
పలపదొడ్డి లో కొబ్బరి చెట్లు ఉండేవి. అలాగే మా ఇంటి ఆవరణలో కూడా కొబ్బరి చెట్లు వుండేవి.ఇప్పటికీ వున్నాయి. కాయలు బాగా ముదిరాకా చెట్లనుంచి తీయించేవారు. ఒక 10,12 రోజులు బాగా ఆరాక వాటిని పలప దొడ్డి ఇంట్లో అటక మీద భద్రం చేసేవారు. అలా వేసవి కాలం వచ్చేవరకు పోగు పడిన కాయల్ని అటక మీద నుంచి దింపి తొక్క వలిపించి కాయలను ఇంటికి తెచ్చేవారు.
ఆ కాయలన్నీ కోబ్బరి నూనె కోసమే.
వలిచిన కొబ్బరి కాయలు వందల సంఖ్యలో పెద్ద గుట్టగా పాలేళ్ళు పోసేవారు. త్వరత్వరగా పనులు ముగించుకుని పెద్దాచిన్నా ఇంటి వీధి అరుగుల మీదకు చేరుకునేవాళ్ళం. ఒక అరుగు మీద మధ్యలో పెద్ద ఇత్తడి బిందె పెట్టేవారు. అది కొబ్బరి నీళ్ళకోసం. కిలుము ఎక్కకుండా ఆ బిందె లోపల కళాయి పూత వుండేది.

మోహన రాగాలు-7


ఇంక యుద్ధ ప్రాతిపదికన అరుగు అంచులమీద కొబ్బరికాయల్నికొట్టి కొబ్బరి నీళ్ళు ఆ బిందెలో వంపే వాళ్ళం. అయినా నీళ్ళు కింద వలికేవి. అవి ధారగా కారకుండా అరుగుల మీద కొబ్బరి పీచులు పరిచేవారు.
మేము, అదేనండీ, మా పిల్ల గ్యాంగ్, పోటీలు పడి కొబ్బరి కాయల్ని కొట్టే వాళ్ళం. మా దృష్టి అంతా ఆ బిందె మీదే వుండేది. గ్లాసు గ్లాసు గా ఆ కొబ్బరి నీళ్ళు ఎప్పుడు తాగుతామా అని వుండేది. పెద్దవాళ్ళు చూడకుండా చిన్నచిన్న కొబ్బరి ముక్కల్ని నోట్లో వేసుకునే వాళ్ళం.
మా చిన్నతనాల్లో పెద్దల్తో సమానంగా కొబ్బరి కాయల్ని కొట్టడం ,కొబ్బరి నీళ్ళు తాగడం, కొబ్బరి ముక్కల్ని నమలడం ఎంతో సరదాగా వుండేది. కొబ్బరి కాయలు కొట్టే ప్రహసనం అయిన తరువాత కొబ్బరి చెక్కల్ని గుడ్డ తో తుడిచి, ఎండలో పెట్టేవారు.
చెక్కల్ని తుడవాలి లేకపోతే రంగు మారిపోతాయి.
కాకులు ఎత్తుకు పోకుండా వల కప్పేవారు. లేకపోతే తాడుకి రెండు నల్ల గుడ్డలు కట్టే వారు. అవి గాలికి కదులుతోంటే భయపడి కాకులు వచ్చేవి కావు. రెండుమూడు రోజులు ఎండిన తర్వాత చెక్కల లోంచి కొబ్బరిని వేరు చేసి సన్నగా ముక్కలుగా తరిగి మళ్ళీ ఎండపెట్టే వారు. ముక్కలు పెళుసుగా మారాక గానుగ కి పంపేవారు.
గానుగ
గానుగకి పంపేవరకూ మా చిరుతిండికి ఢొకా వుండేదికాదు. కాకుల కన్నా మేమే ఎక్కువగా కొబ్బరి ముక్కల్ని ఎత్తుకు పోయి తినేవాళ్ళం. “తినకండిరా వెధవల్లారా, తెగతింటే దగ్గు పట్టుకుంటుంది” అని పెద్దలు కేకలేసేవాళ్ళు.
గానుగ ఆడాక ఆ కొబ్బరి నూనె ఎంతో తాజాగా కమ్మని వాసన వేసేది.
రెండు మూడు రోజులు కొబ్బరి నూనెతోనే వంటలు చేసే వారు. నర్సాపురం లోని మా అత్తయ్యకీ, మా అమ్ముమ్మా వాళ్ళకీ కొబ్బరినూనె పంపించే వాళ్ళు. గానుగ ఆడాక వచ్చే ఆ కొబ్బరి పిండిని కూడా మేము వదిలే వాళ్ళం కాదు. సాధారణంగా ఆ పిండిని నానపెట్టి, పాలిచ్చే గేదెలు ఆవులు కీ పెట్టేవారు.
అసలు గానుగ అంటే ఏమిటో, అది ఎలావుంటుందో ఈ కాలం కుర్రకారుకి తెలుసా? ఆ మాటకి వస్తే అసలు బస్తీ భాయీలు ఎంత మంది గానుగని చూసి వుంటారు? నాకు సందేహమే సుమండి?!
కానీ మేము ప్రత్యక్షంగా చూసాం . మా చిన్నతనాల్లో మా సరదా కొద్దీ గానుగ దగ్గర గంటలకొద్దీ పడివుండేవాళ్ళం. ఎద్దు గుండ్రంగా తిరుగుతూంటే ఆ కాడ మీద కూచునే వాళ్ళం. అప్పటి మా అనుభవాలే వేరు. అలాంటి రోజులు మళ్ళీ రావు. గానుగ అన్నది ఒక పెద్ద చెక్క రోలు. దానికి ఒక పొడుగాటి చెక్క పొత్రం వుంటుంది.
పొత్రం చివర సూదిగా సన్నని భాగం, దాని చివర బోర్లాగా ఒక ఇనుప కప్పు వుంటుంది. దాని నుంచి ఒక ఇనుప రాడ్ కింద వున్న ఒక బల్ల కి కనెక్ట్ చేసి ఉండేది. ఆ బల్ల గానుగ రోలు వైపు Y ఆకారంలో ఉండి దానికి ఇంకొక వైపు ఎద్దును కట్టడానికి వీలుగా వుండేది.
ఆ రోలు నిండా కొబ్బరి ముక్కలు పోసేవారు.ఆ తర్వాత ఎద్దుని అదిలిస్తే అది ఆ పాకలో గుండ్రంగా తిరుగుతూంటే కొబ్బరి ముక్కలు రోకలి కింద బాగా నలిగి రోలులో వున్న రంధ్రం లోనుంచి కొబ్బరి నూనె ధారగా కింద బాల్చీలోకి కారేది. రోలులోవున్న మొదటి ధపా నలిగిన కొబ్బరి ముక్కల్ని అటూ ఇటూ తిప్పేవారు.అవికూడా నలిగి ముక్కల్లో ఇంకా మిగిలివున్న నూనె చుక్కలు చుక్కలుగా కింద వున్న పాత్రలో పడేది. బాగా నలిగిన కొబ్బరి పిండి రోలులో అచ్చుల్లా కట్టేది. ఆ అచ్చుల్ని బైటికి తీసి కొత్త కొబ్బరి ముక్కల్ని వేసి గానుగ తిప్పేవారు. ఇదీ టూకీగా గానుగ పనిచేసే విధానం. ఇప్పుడు ఎద్దులకు బదులు మోటారు అమర్చి గానుగల్ని నడుపుతున్నారు.

(ఈ పోస్టు నచ్చితే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి!)

ఇదే విధగా నువ్వుల్ని కూడా ఆడి నువ్వుల నూనె తీసేవాళ్ళు.రోలులో కట్టే అచ్చుల్ని తెలగ పిండి అంటారు.ఇదొక ముఖ్యమైన వంటకం కూడా. దీనిలో చాలా విలువైన పొషక పదార్థాలు వుంటాయి. ప్రొటీన్లు చాలాఎక్కువ. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు. తెలగపిండి రుచి ఎంతో కమ్మగా వుంటుంది. అనేక కూరల్ని తెలగ పిండితో కలిపి వండుతారు. ఆనపకాయ, బీరకాయ , పొట్లకాయ, గోరుచిక్కుడు కాయ తెలగపిండితో కలిపి వండుతారు. వాటి రుచే వేరు. తింటేకానీ ఆ రుచి తెలియదు. బాలింతలకు పాలు పడటానికి వెల్లుల్లి తో తెలగపిండి కూర పెడతారు. ఇతర రాష్ట్రాలలోని పట్టణ వాసులకు ఇవి అరుదైన వంటకాలనే చెప్పాలి.
చెన్నైలో మా పై ఫ్లాట్ లో కాపురం వుంటున్న తమిళ పొన్ను ని ఈ తెలగపిండి గురించి అడిగితే “అంకుల్, మేము ఎప్పుడూ రుచిచూడలేదు కానీ మా పాటి (బామ్మ) దీని గురించి చెబుతూ వుండేది. ఒకసారి దీనితో చేసిన పొరియల్ని(కూర)
తిన్నట్టు జ్ఞాపకం. అయినా ఇవన్నీ పల్లెటురివాళ్ళు తింటారు అంకుల్” అంది నవ్వుతూ .
తరవాణి అంటే ఏమిటో తెలుసా?
ఇది ఇలా వుండగా, పట్టణాల సంగతి పక్కన పెడితే , పల్లెటూళ్ళలో సైతం దాదాపుగా అంతరించి పోతున్న ఒక అరుదైన పానీయం గురించి మీకు జ్ఞాపకం చేయాలి. దానిపేరు
” తరవాణి”.
ఆ పేరు ఎప్పుడైనా విన్నట్టుగా అనిపిస్తోందా? మా చిన్నతనాల్లో దాదాపుగా అందరి ఇళ్ళల్లోనూ వేసవి కాలంలో తరవాణిని తయారు చేసేవారు. అదొక అద్భుతమైన పానీయం.
మండువేసవిలో ఇంటికి ఎవరైనా వస్తే కుండలోనుంచి చల్లటి తరవాణి ఇచ్చేవారు. నిప్పులు చెరిగే ఎండలో వచ్చిన వారికి తరవాణి అమృత ప్రాయంగా అనిపించేది. ఎక్కడి అలసట అక్కడ మాయమయ్యేది. అంత అద్భుత పానీయం ఈ తరవాణి.
ఇంతకీ ఈ తెలుగు వారి అమృత పానీయాన్ని ఎలా తయారు చేస్తారో, దాని గొప్పదనం ఏమిటో చెబుతాను.
వుడుకుతున్న అన్నం నుంచి వార్చిన గంజిని కుండలో పోసి, రుచి కోసం తగినంత వుప్పు కలిపి, సువాసన కోసం దబ్బాకులు వేసేవారు . మా పెరటిలో వంటింటి గుమ్మం పక్కనే ఓ దబ్బచెట్టు వుండేది. దాని ఆకుని నలిపి వాసన చూస్తే ఎంతో అద్భుతమైన సువాసన వేసేది. వేసవిలో చల్లటి మజ్జిగ లో కూడా ఈ దబ్బాకుల్ని తుంపి వేసేవారు. ఆ మజ్జిగ ఎంతో సువాసనలు వెదజల్లుతూ తాగుతూంటే ఎంతో బావుండేది. ఈ చెట్టు కు కాసే దబ్బ కాయలతో వూరగాయ పెడతారు. పెరుగు అన్నంలో ఆ దబ్బకాయ పెచ్చు నంచుకు తింటూంటే భలే రుచిగా వుండేది. అది ఎంతో పులుపు చిచ్చు. దబ్బకాయలో సి విటమిన్ పుష్కలంగా వుంటుంది.
మా చిన్నతనాల్లో దబ్బకాయతో పులిహోర కూడా చేసేవాళ్ళు. దాని రుచి ఎంతో మజాగా వుండేది. నేను తరవాణి తయారీ గురించి మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళి పోతున్నాను సారీ.
సరే ఆ కుండలో దబ్బాకులు వేసి వంటింట్లో ఓ మూల కుదురుమీద కుండ పెట్టి, దాన్ని మూతమూసి వాసెన కడతారు. కుండ లోపల వున్న గంజి క్రమేపీ పులుస్తుంది.ఫెర్మెంట్ అవుతుందన్నమాట.
తరవాణి, పూర్తిగా, విటమిన్లు ముఖ్యంగా బి విటమిన్ కలిగిన ఆహారం. బియ్యం కడిగిన నీళ్ళు అన్నం ఉడుకు తోండగా వార్చితే వచ్చే గంజి టూకీగా దీనికి కావలసిన పదార్థాలు.
బియ్యం పైపొర లో విటమిన్ బి ఉంటుంది.
తరవాణీ బహుశా ముందు గా మెదలు పెట్టేటప్పుడు కుండ లో ఒక వారం రోజులు కదపకుండా ఉంచేవారని విన్నాను. రాత్రి మిగిలిన అన్నాన్ని ఆ కుండలో వేసేవాళ్ళు.
మర్నాడు ఆ అన్నాన్ని గట్టిగా పిండి దానిలో ఏదో వూరగాయ లేదా పెరుగు కలుపుకుని చద్దెన్నం తినేవారు.ఆ తరువాత కుండలో పైకి తేరిన తేటని తాగేవాళ్ళు.ఆ పలుచని నీళ్ళలాంటి ఆ తేటే “తరవాణి”.
మండు వేసవిలో ఓ గ్లాసుడు ఈ తరవాణి తాగితే ఎంతో చలవ చేస్తుంది. ఆ తరవాణి కుండని అలా రోజుల తరబడి వుంచితే లోపల ద్రవం బాగా ఫెర్మెంట్ అవుతుంది.
 నాటి తరవాణి ఒకవిథంగా ఈనాటి బీర్ లాంటిది అని చెప్పవచ్చేమో. ఈసారి వేసవిలో నేను మావూరు కవిటం వెళ్ళినప్పుడు ఎవరైనా ఇళ్ళలో తరవాణి ని ఇంకా తయారు చేస్తున్నారేమో కనిపెట్టాలి.ఎవరింట్లోనైనా వుందని తెలిస్తే మాత్రం అస్సలు మొహమాట పడను సుమండీ! మీకు అంతగా దాని మజా తెలుసుకోవాలని వుంటే రండి మా వూరు కవిటం తీసుకు వెడతాను!

(పరకాల సూర్యమోహన్, సీనియర్ జర్నలిస్టు, సొంతవూరు కవిటం పశ్చిమగోదావరి జిల్లా, స్థిరపడింది చెన్నైలో)

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/top-stories/features/palmyra-fruits-teegalu-palmyra-wine-west-godavari-kavitam-memories/

16 thoughts on “ఆ రోజుల్లో వేసవిలో ప్రతి ఇంటా చల్లటి తరవాణి చేసేవారు… తరవాణి అంటే ఏమిటి?

  1. దీన్ని రాయలసీమలో కలి అని పిలుస్తారు. దీన్నుంచి వచ్చిందే ‘కలో గంజో తాగి బతకవచ్చ’నే నానుడి. కలి కష్టకాలంలో పేదలు కడుపు నిండా తాగే ‘ఆహారం. దీన్ని జొన్న సంగటిలో కొద్దిగా కలుపుతారు. అపుడు జొన్న సంగటి మల్లె పూవు లా తెల్లగా నిగనిగలాడుతుంది. జొన్న సంగటి మజ్జిగ కలుసుకుని జుర్రుకోండి.నా మటకు నాకు జొన్న అంబలితో ఉల్లిగడ్డ కొరకడం అలవాటు. అపుడు దాని రుచి అద్భతం. మిడిల్ క్లాసు వాళ్లు భేషజాలకు పోకుండా, వోట్స్ మానేసి జొన్న అంబలి కి మారితే ఇండియా స్వర్ణయుగంలోకి వస్తుంది. ఉదాహరణకు రోజు కోటి కేజీల జొన్నల డిమాండ్ పెరిగిందనుకోండి. ఎంత ప్రయోజనం. ఈ పంటకు నీళ్లవసరం లేదు, రైతులకు చేతినిండా పని. నీళ్లు సేవ్ అవుతాయి. ఆరోగ్యానికి మంచింది. వోట్స్ మనవి కాదు. వోట్స్ ఎక్కువ తింటే వాటిని ఇండియా మీద డంప్ చేస్తున్న అమెరికాకు లాభం. ఇపుడు కనీసం మీరు వరంగల్ కార్న్ ఫ్లేక్స్ కూడా తినలేరు. ఇపుడు అమెరికా సీడ్ కార్న్ ని ఇండియాలో డంప్ చేయబోతున్నది. భారత్ అంగీకారం చెప్పింది. అవి సీడ్ పేరుతో ఇండియా కు వస్తున్నాయ్. కార్న్ ఫ్లేక్స్, కార్న్ ఫ్లోర్, కార్న్ పకోడీ ఇలా మన ప్లేట్లలోకి రాబోతున్నాయి. అందుకే కెసిఆర్ కార్న్ పంట మానేయండని చెబుతున్నారు. ఒక సారి ఎవరైనా జొన్న అంబలి ట్రై చేయండి. వోట్స్ కి జొన్న అంబలికి తేడా ఉండదు. జొన్న జావా, జొన్న ఫ్లేక్స్ వోట్స్ బదులు వాడి చూడండి, ఏంతో రుచిగా ఉంటుంది. తెలుగువాళ్ల శరీరాలు కనీసం పదివేల యేళ్లుగా జొన్నలకు అలవాటు పడ్డాయి. శ్రీనాధుడు మంచి కవిత్వం రాసేందుకు కారణం, జొన్నఅంబలి అపుడపుడయినా తినడమే. ఇపుడు వాటిని మానేసి అంతా అమెరికా వాళ్లయిపోయి, వోట్స్ తినేసి, అమెరికాను బలీయం చేస్తున్నారు. తరవాణి జిందాబాద్, జొన్నఅంబలి జిందాబాద్.

  2. పరకాల గారు పెన్ను తిరిగిన రచయిత.నాకు బాగా పరిచయం కూడా.మా కాలమే వేరు.అన్ని రకాల అనందాలో,ఆహారం ఎంజాయ్ చేసిన తరం మాది.పరకాల గారిని నేను ఆప్యాయంగా బావా గారూ అని పిలుస్తుం టాను.ఆయన రెండు భాషల్లోనూ సవ్యసాచి.పాత రోజులను అనుభవాలను గుర్తు చేసినందుకు బావా గారి కి మరొక్కసారి రొంబ్ నండ్రి

  3. చిన్న నాటి విషయాలు తలుచుకుంటే బాగుంటాయి…
    చాలా బాగుంది తెలియజేసిన తీరు…
    శుభాభినందనలు …

  4. అధ్భుతహః….పాతరోజుల గుర్తుకొస్తున్నాయి… మీ మోహన రాగాలతో….మా అమ్మ కూడా తరవాణి… పెట్టేది… వేసవి లో అందరూ వచ్చి ఆస్వాదించేవారు..తయారు చేయడం గొప్ప కళ…అందరికీ కుదరదు…🙏🙏🙏🙏

  5. గోదావరి జిల్లాలలో తాటిచెట్ట్లుకొబ్బరి చెట్లకి కొదువ లేదు పూర్వం రోజుల్లో చాలామంది జీవనం వాటి తో ముడిపడి ఉండేది. ఆకులు పువ్వులు చివరికి తినేసిన ముంజిల పెంకులు దగ్గర్నుంచి వంటకి వాడుకునే వారు,
    ఇంక వానాకాలం లో పనులు లేనప్పుడు తాటిపండు, దాంతో చేసిన వంటకాలు
    తేగలు బుఱ్ఱ గుంజు చాలా మందికి కడుపులు నింపేవి.
    స్వచ్చమైన కోల్డ్ press కొబ్బరి నూనె, నువ్వు పప్పు నూనె,వెన్న నెయ్యి ఏ ఎరువులు లేకుండా,పసువుల పెంట తో పండిన పంటలు,ఏ కాలవలో,బోదెలలో, చెరువుల్లో నీళ్లు త్రాగినా తేడా చెయ్యని శరీరాలు… ఏరకమైన ఉరుకులు పరుగులు ఆరాటం లేని జీవితాలు.. ఆనాటి గ్రామాలు.

    పూర్వం జ్వరం వస్తే **చిట్టుడునీళ్ళని** అన్నం వుడుకుతోండగా నీళ్లు తీసి పట్టిచేవారు నీరసం రాకుండా, వాంతులు డీహైడ్రేషన్ లలో ఇది మంచి ఆహారం ఎంతమందికి తెలుసు?? ఇంక గంజి చాలా మందికి ఆహారం.. ఇంక తరవాణి కుండ క్రింద ముగ్గు వేసి మరీ పెట్టేవారు అంత గౌరవం గా చూసుకునేవారు
    .
    పనివారు ** ఆరోజుల్లో లచ్చించారు, లోకి మాగాయ ఊరగాయ అడిగేవారు**
    తరవాణి కి కూరగాయల ముక్కలు/ మునగకాడ/చేపలు/ప్రాన్/what not..కారం ఉప్పు ఉల్లిపాయ వెల్లుల్లి ముక్కలు వేసి కాస్తే అదే లచ్చించారు అని చెప్పేవారు…
    మన తెలుగు నేలల్లో గ్రామాల్లో ఒక్కొక్క ప్రదేశం లో ఒక్కొక్క ప్రత్యేకత నిండిన ఆహార పదార్థాలు తయారీ ఉండేది. నాగరికత అన్నీ నమిలి మింగేసింది.

    శ్రీ సూర్య మోహన్ లాంటి వారి లా మిగిలిన వారు కూడా స్పదించి వారివారి ప్రాంతంలో ఉన్న విశేషాలు జ్ఞాపకాల సౌరభాలు అందిస్తే చదివి/ఆచరించి ఆనందిస్తారు.
    రధాంగపాణి పరకాల

  6. వందేమాతరం. “తరవాణి” కథ బాగుంది. ఈ రోజుల్లో తారా సంస్కృతిలొ, దానికి SOUP అంటారు. కల్కూర,

  7. చిన్ననాటి జ్ఞాపకాలు మళ్లీ గుర్తుచేసినందులకు చాలా ధన్యవాదాలు సార్‌! గానుగ గురించి మీరు రాసినదంతా చదువుతుంటే ఆ కాడమీద కూర్చుని సంతోషంగా తిరగడం గుర్తుకు వచ్చింది. అలాగే తరవాణి, పెరుగు అన్నం- దబ్బకాయ కాంబినేషన్‌! థ్యాంక్యూ సూర్యమోహన్‌గారు!

  8. తరవాణి తెలుసు కానీ ఎపుడు తాగలేదండి అచ్చు అమ్మ చెప్పినట్లే రాస్తున్నారు ఇది ఒక తీపి జ్ఞాపకం

  9. తరవాణి తెలుసు కానీ ఎపుడు తాగలేదండి అచ్చు అమ్మ(రామక్క, ఏలూరులో) చెప్పినట్లే రాస్తున్నారు ఇది ఒక తీపి జ్ఞాపకం శుచి,శుభ్రత విషయంలో అమ్మ వారి స్వరూపం గా భావించేవారు

  10. మీ మోహన రాగాలు పాత రుచులు వాటి జ్ఞాపకాలతో అద్భుతంగా సాగుతోంది. Thank you so much.

  11. నేను కూడా మీ చెన్నై పొరుగమ్మాయి లాంటి ఒక పట్టణవాసిని. ఏదో పసితనంలో అమ్మమ్మ గారి ఊరు తప్ప పల్లెల అనుభవం లేని దానను. కన్యాశుల్కం, వేయిపడగలు, రామచంద్ర విజయం , గణపతి లాంటి నవలల్లో చదివిన కొన్ని విషయాలు ఊహకందేవి కాదు. వాటిలో కొన్ని విషయాలు మీరు ఈ వ్యాసాల ద్వారా వర్ణిస్తూ ఉంటే ఇప్పుడు ఆ నవలలు మళ్లీ చదివితే ఇంకా బాగా అర్థం అవుతాయనిపిస్తుంది. తరవాణీ, గుమ్మపాలు, గోకర్ణం, బల్ల కట్టు, ఆవిరి కుడుములు ఇలాంటివన్నీ మాకు వర్ణించినందుకు ధన్యవాదాలు పెదనాన్న గారూ _/\_

  12. మా చిన్నప్పుడు దీనినే కలు చారు అనేవాళ్లు సర్. దీనిలో పోపు వేసి కూడా చేసేవాళ్లు. అన్నంలో కలుపుకుని తింటుంటే, అదొక స్పెషల్ టేస్ట్. మీ ప్రతి స్టోరీ చదువుతుంటే.. మేం కూడా మా చిన్నతనంలోకి వెళ్లిపోతున్నాం. థాంక్యూ…

  13. Tharavani used to be prepared by my Ammamma which we enjoyed eating in our childhood days. Recollecting those days by the author is highly appreciated.

  14. చిన్నప్పటి పల్లె జీవితం లో ఉన్న మాధుర్యాలని తగిన విషయ పరిజ్ఞానము తో పాటుగా మంచి భాషా శైలిని జోడించి చక్కగా వ్రాసారు. చాల బాగుంది.

  15. Beautifully narrating all childhood experiences, wonderful sir, But all these experiences were felt by mostly Brahmin families who had huge agriculture with big sprawling houses like our grandfather at Ramachandrapuram, EG district, who was holding 100 acres at that time.
    Why don’t you compel all these posts and make a booklet? The oil cold crushing machine shown in this picture may not be old ‘GANUGA’ run by an ox 🐂.
    Anyway, all these articles took me to my childhood where my mother used to prepare’TARAVANI’ during summer and we used to have that rice with newly prepared mango 🥭 pickle which was awesome even still mouthwatering.
    Maybe because of all such types of food we had at that time we are at least maintaining this much of health at this age.
    I in fact experienced all your narrations in my childhood at RC Puram. Thank you sir 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *