మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం రాయలసీమ ప్రాంత అస్తిత్వానికి చిహ్నం. తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో విశ్వవిద్యాలయం అభివృద్ధి చెందింది. దాదాపు 1000 ఎకరాలు స్థలాన్ని టీటీడీ నామమాత్రపు ధరకు లీజుకు ఇవ్వడంతో పాటు ప్రతి ఏటా ఆర్థిక సాయం చేస్తోంది. యూనివర్సిటీ లోపలికి వెళితే భవనాలకు పెట్టిన పేర్లు నారాయణాద్రి, అంజనాద్రి, గరుడాద్రి ఇలా సప్తగిరులు గుర్తుకు వస్తాయి. ఎందరో మహనీయులను అందించిన విద్యాలయం. శేషాచల అడవుల సమీపంలో ఉన్న విద్యా కేంద్రం అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది. పక్కనే పశువైద్య విశ్వవిద్యాలయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, బాలాజీ కాలనీ దాటిన తర్వాత SV ఆర్ట్స్ కళాశాల తో ప్రారంభమయి మొత్తం విద్యాసంస్థలు వరుస క్రమంలో ఉంటూ తిరుపతికి అందాన్ని ఇచ్చాయి. తిరుపతి ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడానికి తిరుమల తిరుపతి దేవస్థానం పునాది అయితే SV విశ్వవిద్యాలయంతో పాటు పలు విద్యాసంస్థలు తిరుపతి ప్రతిష్టను ఇనుమడింప చేశాయి.
అలాంటి విశ్వవిద్యాలయంలో నేడు అలజడి. అంతర్గతంగా ఉన్న రహదారులను తిరుపతి – చంద్రగిరి , అలిపిరి – జూపార్కు ప్రధాన రహదారులతో అనుసంధానం చేస్తూ యూనివర్సిటీ అంతర్గత రహదారుల విస్తరణకు తిరుపతి నగరపాలక సంస్థ ప్రతిపాదనలు చేయడం అలజడికి మూలం. నగరాభివృద్ధిలో రహదారుల విస్తరణ, అనుసంధానం అత్యంత కీలకం అనడంలో సందేహం లేదు. తిరుపతి ఎమ్మెల్యే భూమన, మేయర్ డా.శిరీష నేతృత్వంలో ఉప మేయర్ అభినయ రెడ్డి స్వీయ పర్యవేక్షణలో మాస్టర్ ప్లాన్ రోడ్లు తిరుపతి అంతర్జాతీయ స్థాయి నగరంగా రూపాంతరం చెందుతోంది. అందుకు వారిని అభినందించాలి. తిరుపతి అంతర్గత ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా చంద్రగిరి – జూపార్కు ప్రధాన రహదారులకు విశ్వవిద్యాలయంలోని అంతర్గత రహదారులను అనుసంధానం చేసే ఆలోచన తిరుపతి నగరపాలక సంస్థ చేస్తోంది. జూపార్కు రోడ్డు కు అనుకుని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కంటి ఆసుపత్రి , క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేశారు. ఈ మధ్యనే భారీ బడ్జెట్ తో 7 నక్షత్రాల హోటల్ నిర్మాణానికి భూమిపూజ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు. సమీప భవిష్యత్తులో జూపార్కు రహదారి కీలక ప్రాంతంగా మారబోతుంది. ఆ రహదారితో తిరుపతికి అనుసంధానం చేస్తూ రహదారుల నిర్మాణం అవసరం. కానీ అందుకు విశ్వవిద్యాలయం మధ్యలో నిర్మాణం చేస్తే యూనివర్సిటీ అస్తిత్వం దెబ్బతింటుంది. ఇది అపోహ కాదు. ఉస్మానియా, నాగార్జున యూనివర్సిటీలలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. యూనివర్సిటీ మొత్తం ఒక గొడుగు కింద ఉండాలి. మధ్యలో అన్ని రకాల వాహనాల రాకపోకలకు అనువుగా రహదారుల ఏర్పాటు చేస్తే వాతావరణం పూర్తిగా దెబ్బ తింటుంది.
యూనివర్సిటీలో అలజడికి మరో కారణం కూడా ఉంది. ఒకప్పుడు 1000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న యూనివర్సిటీ నేడు సగానికి పడిపోయింది. ఒకానొక దశలో యూనివర్సిటీ ని సెంట్రల్ యూనివర్సిటీ స్థాయి కోసం ప్రయత్నాలు జరిగాయి. భవిష్యత్ లో అలాంటి అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే స్థలం సమస్యగా మారుతుంది. విశ్వవిద్యాలయం అస్తిత్వాన్ని, భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని పాలకులు నిర్ణయం తీసుకోవాలి.
అస్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి. యూనివర్సిటీలో ఏర్పడిన అలజడిని దృష్టిలో పెట్టుకొని రాయలసీమ మేధావుల ఫోరం నుంచి నేను, ఆచార్య జయచంద్రా రెడ్డి యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య రాజారెడ్డి గారిని కలిసి విశ్వవిద్యాలయ అస్తిత్వానికి నష్టం జరిగే ప్రతిపాదనలను అంగీకరించకూడదని కోరాం. అదే సమయంలో చంద్రగిరి జూపార్కు ప్రధాన రహదారికి అనుసంధానం కూడా కీలకం. కావున వెటర్నరీ ప్రహరీ గోడకు అనుకుని SV యూనివర్సిటీ చివరిలో రహదారి నిర్మాణం చేయడం, రహదారికి ఆనుకుని SV యూనివర్సిటీకి ప్రహరీ గోడ నిర్మాణం చేయాలి.
అలా రెండు యూనివర్సిటీల చివరిలో రహదారి నిర్మాణం చేస్తే రెండు యూనివర్సిటీలకు ఎలాంటి సమస్య ఉండదు. చంద్రగిరి జూపార్కు రహదారుల అనుసంధాన సమస్య పరిష్కారం అవుతుంది. రాయలసీమ మేధావుల ఫోరం చేస్తున్న ఈ ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలించాలి. ఏది ఏమైనా రాయలసీమకు కీలక యూనివర్సిటీగా ఉన్న SV విశ్వవిద్యాలయ మనగడను ప్రశ్నార్థకం చేసే ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వం మీద ఉంది.
(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి
సమన్వయ కర్త, రాయలసీమ మేధావుల ఫోరం, తిరుపతి)