ప్రాజెక్టు ఏదైనా జగన్ వైఖరి ఒక్కటే!

గాలేరు-నగరి సుజల స్రవంతి
పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు
ప్రాజెక్టు ఏదైనా! జగన్ ప్రభుత్వ వైఖరి ఒక్కటే!

 

-టి. లక్ష్మీనారాయణ

1. నేను, నా చిరకాల మిత్రులు, శాసనమండలి మాజీ సభ్యులు దేవగుడి నారాయణరెడ్డితో కలిసి ఈనెల 17న గండికోట జలాశయాన్ని మరియు ముంపు ప్రాంతాలను, అలాగే, ఆరు టియంసిల వినియోగం కోసం గండికోట ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన బాలిరెడ్డి పైడిపాలెం రిజర్వాయరును సందర్శించాను.

2. గండికోట జలాశయం యొక్క గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం మేరకు గత ఏడాది 26.85 టియంసి నిల్వ చేశారు. ఈ నీటిలో అత్యధిక భాగం కృష్ణా నది వరద నీరు. శ్రీశైలం జలాశయం నుండి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తరలించిన నీరు. గత సంవత్సరం పెన్నా నదికి కూడా వరదొచ్చింది. కాబట్టి కొంత మేరకు పెన్నా నీరు కూడా ఉండి ఉండవచ్చు. నేను వెళ్లినప్పుడు అక్కడ డ్యూటీలో ఉన్న వ్యక్తిని అడిగితే ప్రస్తుతం 22 టియంసి నిల్వ ఉన్నదని చెప్పారు. అంటే, చాలా పరిమితంగానే నీటి వినియోగం జరిగింది.

3. నీళ్లుండి, వినియోగించుకోలేని దౌర్భాగ్య పరిస్థితికి కారణాలేంటి? నీటి వినియోగానికి అవకాశం లేనప్పుడు ఎందుకు గరిష్టంగా నీటిని నిల్వ చేసినట్లు? నిర్వాసితులను నిర్ధాక్షిణ్యంగా ఖాళీ చేయించడానికేనా? పోనీ, నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాస పథకం ప్రకారం మరియు 2019 ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానం మేరకు నష్టపరిహారం చెల్లించకుండానే నీటిని నిల్వ చేయడంలోని ఆంతర్యం ఏమిటి?

3. గాలేరు – నగరి సుజల స్రవంతిలో అంతర్భాగంగా గండికోట ప్రధాన జలాశయం నిర్మించబడింది. శ్రీశైలం జలాశయం నుండి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 38 టియంసిలను తరలించి, గండికోట జలాశయంలో నిల్వచేసి, గాలేరు – నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా ప్రస్తుత కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలలో 2,60,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, ఆ మార్గంలో త్రాగునీరు అందించే లక్ష్యాన్ని సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డిపిఆర్)లో పేర్కొన్నారు.

4. 1989లో నాటి ముఖ్యమంత్రి యం.టి.రామారావుగారు రూపకల్పన చేసి, ఉద్ధిమడుగు మరియు కరకంబాడి వద్ద శంకుస్థాపనలు చేసిన గాలేరు – నగరి సుజల స్రవంతి నిర్మాణం ఈ దశలో ఉన్నది? నాడు 3,25,000 ఎకరాల ఆయకట్టుకు నీటి సరఫరాగా పేర్కొంటే దాన్ని 2,60,000 ఎకరాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలే కుదించాయి. ప్రాజెక్టు నిర్మాణాన్ని రెండు దశలుగా విడగొట్టారు. 35,000 ఎకరాల సాగుదలకు ఉపకరించే మొదటి దశ పరిధిలోని చిన్నపాటి రిజర్వాయర్స్ అయిన వామికొండ మరియు నర్రెడ్డి శివరామిరెడ్డి సర్వరాయసాగర్ ల నిర్మాణాలను పూర్తి చేసి, వాటిలోకి గత ప్రభుత్వమే నీటిని విడుదల చేసింది.

5. సర్వరాయసాగర్ రిజర్వాయర్ పరిధిలోని గడ్డంవారిపల్లి గ్రామస్తులిద్దరు ప్రొద్దుటూరులో ఒక పెళ్ళి రిసెప్షన్ లో కలిశారు. వాళ్ళు నాకు పాత మిత్రులే. సర్వరాయసాగరులో నీళ్ళు నింపారు కదా, రైతులకు మంచి ప్రయోజనం జరిగిందా? అని అడిగితే నీళ్ళు నింపారు. కానీ, పంట కాలువల వ్యవస్థ నిర్మించలేదు. నీటిని ఎలా వాడుకొంటాం? అని ఎదురు ప్రశ్న వేశారు. కనీసం, భూగర్భ జలాలు పెరిగి ఉంటాయి కదా! ఆ మేరకు ప్రయోజనం కలిగి ఉంటుంది కదా! అంటే, ఆ మేరకు ప్రయోజనం కలిగింది. నీళ్ళు భూ పైభాగంలోనే లభిస్తున్నాయన్నారు. అదీ! జరిగిన ప్రయోజనం.

6. గాలేరు – నగరి సుజల స్రవంతి ద్వారా నిర్దేశించుకున్న ఆయకట్టులో కడప, రాజంపేట, రైల్వే కోడూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, పుత్తూరు శాసనసభా నియోజకర్గాల పరిధిలోని 2,25,000 ఎకరాల ఆయకట్టుకు నీరందించే రెండవ దశ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించింది. వార్షిక బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. మరి! గండికోట జలాశయంలో గరిష్ట స్థాయిలో నీటి నిల్వ దేనికోసం?

7. గాలేరు – నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులో అంతర్భాగంకాని గండికోట – పైడిపాలెం ఎత్తిపోతల మరియు గండికోట – చిత్రావతి ఎత్తిపోతల పథకాలను కూడా గత ప్రభుత్వ కాలంలోనే పూర్తి చేసి, నీటిని సరఫరా చేయడం మొదలు పెట్టారు. నాడు నేను స్పందించి, “వైఎస్సార్ కలను నెరవేర్చిన చంద్రబాబు” శీర్షికతో ఒక వ్యాసం కూడా వ్రాసి సోషల్ మీడియాలో పెట్టాను. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఆ రెండు ఎత్తిపోతల పథకాలపైనే దృష్టిసారించి, గండికోట జలాశయం నుండి అడపాదడపా నీటిని తరలిస్తున్నది.

8. గండికోట జలాశయం నిర్వహణ పనులు చేయడానికి ఎనిమిదిని కాంట్రాక్టు పద్ధతిలో ప్రభుత్వం నియమించిందట. వారికి 15 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదట. వారిలో ఒక్కరు కూడా ఇంజనీర్ కాదు. ముద్దనూరు – కొండాపురం ప్రధాన రహదారి నుండి గండికోట జలాశయం వరకు దాదాపు 25 కి.మీ. దూరం ఉంటుంది. గుంతలు పడి రోడ్డు అధ్వాన్నంగా ఉన్నది. గండికోట జలాశయం వివరాలు వ్రాసి పెట్టిన బోర్డుపై ఉన్న అక్షరాల్లో ఒక్క అక్షరం కూడా చదవడానికి కనపడడం లేదు. బాలిరెడ్డి పైడిపాలెం రిజర్వాయరు దగ్గర పెట్టిన బోర్డు తిరగబడి పోయి ఉంది. నిర్వహణపై నీటి పారుదల శాఖకు ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థం చేసుకోవడానికి ఈ అంశాలు ప్రస్తావించాను.

9. ఇహ! పోలవరం గురించి ఈ సందర్భంగా రెండు మాటలు; i) పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు. 45.72 మీ. ఎత్తుతో నిర్మించుకోవడానికి బచావత్ ట్రిబ్యునల్ 1980లోనే అనుమతించింది. తదనుగుణంగా కేంద్ర జల సంఘం పోలవరం ప్రాజెక్టు డిపిఆర్ కు ఆమోదముద్ర వేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు.

10. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో 41.5 మీ. కాంటూరు వరకు మొదటి దశ అంటూ కొత్త పల్లవి ఎత్తుకొని ఆ పరిధి వరకే నీటిని నిల్వ చేస్తామని పదేపదే చెబుతున్నది. ఆ మేరకు నిర్మాణ పనులను పూర్తి చేయడానికి నిధులివ్వమని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మోడీ ప్రభుత్వం కూడా తలూపింది. అంటే, 41.5 మీ. కాంటూర్ వరకు పునరావాస పథకాన్ని అమలు చేసి, రెండవ దశగా చెప్పబడుతున్న 45.72 కాంటూర్ పరిధిలోకి వచ్చే నిర్వాసితులకు భూసేకరణకు నష్ట పరిహారం మరియు పునరావాస పథకాన్ని అమలు చేయకుండా ఎగ్గొట్టే కుట్రకు జగన్, మోడీ ప్రభుత్వాలు పూనుకొన్నాయి.

11. గండికోట జలాశయం నిర్వాసితులైనా, పోలవరం నిర్వాసితులైనా, మరొక ప్రాజెక్టు నిర్వాసితులైనా ప్రభుత్వాల దగాకోరు విధానాలకు బలైపోతున్నారు. ఇది చరిత్ర నేర్పిన గుణపాఠం.

(టి. లక్ష్మీనారాయణ,
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *